గూగుల్ ఇండియా వీపీ ప్రీతి
ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) గురించి వివిధ వర్గాల్లో కొంత ఆందోళన నెలకొన్నప్పటికీ, ‘ఆర్థిక సమానత్వం’ సాధించేందుకు ఉపయోగపడే శక్తివంతమైన టెక్నాలజీగా దీన్ని తాము భావిస్తున్నామని టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా వీపీ ప్రీతి లొబానా తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటూ, అత్యంత చిన్న సంస్థలకు కూడా గ్లోబల్ కంపెనీల స్థాయి ఇంటెలిజెన్స్, వేగం, సామర్థ్యాలు, భద్రత కల్పించేదే అత్యుత్తమ సాంకేతికత అవుతుందని ఆమె చెప్పారు. భారతదేశవ్యాప్తంగా వినియోగదారుల అలవాట్లలో ఏఐ పలు మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు.
గూగుల్ క్లౌడ్ డే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. 600 మంది పైగా వ్యాపార దిగ్గజాలు, ఎండీలు, టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌లు దీనికి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా వ్యాపార దిగ్గజాలతో తాను మాట్లాడినప్పుడు ఏఐ సామర్థ్యాల గురించి కొంత ఉత్సాహంతో పాటు రాబోయే రోజుల్లో తలెత్తే సంక్లిష్టతల గురించి కొంత ఆందోళన కనిపిస్తోందని ప్రీతి చెప్పారు. ఏఐ కోసం పెద్ద యెత్తున ఐటీ సిబ్బంది, భారీగా నిధులు అవసరమవుతాయని చాలా మటుకు సంస్థల్లో ఆందోళన నెలకొందని వివరించారు. కానీ గూగుల్ మాత్రం దీన్ని ఆర్థిక సమానత్వాన్ని సాధించేందుకు తోడ్పడే సాధనంగా పరిగణిస్తోందని పేర్కొన్నారు.
చిన్న సంస్థలకు ప్రయోజనం..
భారతదేశవ్యాప్తంగా వినియోగదారుల అలవాట్లలో ఏఐ పలు మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. చిన్న, మధ్యతరహా సంస్థల వాటా భారతదేశ జీడీపీలో దాదాపు మూడో వంతు, తయారీలో 35 శాతం పైగా ఉంటుందని, వికసిత భారత్ 2047 లక్ష్య సాధనకు ఇవి వృద్ధి చోదకంగా నిలుస్తున్నాయని ప్రీతి తెలిపారు. ఈ సంస్థలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను వినియోగించుకుంటే సరఫరా వ్యవస్థలు, ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో సానుకూల ప్రభావాలు కనిపిస్తాయని ఆమె వివరించారు. అభివృద్ధి, ఆకాంక్షలను సాధించుకోవడంలో దేశానికి సాధికారత కల్పించే సాంకేతికతను అందించాలనే నిబద్ధతతో భారత్‌లో రెండు దశాబ్దాలుగా తమ ప్రస్థానం సాగుతోందని ప్రీతి చెప్పారు. విశాఖలో ఏఐ హబ్ ఏర్పాటనేది ఇండియాఏఐ మిషన్‌కి దన్నుగా, దేశ డిజిటల్ వ్యవస్థకు వెన్నెముకగా ఉంటుందని ప్రీతి చెప్పారు. ఒకే ఒక్కరు నడిపే సంస్థ నుంచి 2 లక్షల మంది పైగా పని చేసే బడా సంస్థల వరకు అందరికీ ప్రపంచ స్థాయి కంప్యూట్ సామర్థ్యాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు.


