breaking news
VP
-
ఆర్థిక సమానత్వానికి సాధనంగా ఏఐ
ముంబై: కృత్రిమ మేథ (ఏఐ) గురించి వివిధ వర్గాల్లో కొంత ఆందోళన నెలకొన్నప్పటికీ, ‘ఆర్థిక సమానత్వం’ సాధించేందుకు ఉపయోగపడే శక్తివంతమైన టెక్నాలజీగా దీన్ని తాము భావిస్తున్నామని టెక్ దిగ్గజం గూగుల్ ఇండియా వీపీ ప్రీతి లొబానా తెలిపారు. అందరికీ అందుబాటులో ఉంటూ, అత్యంత చిన్న సంస్థలకు కూడా గ్లోబల్ కంపెనీల స్థాయి ఇంటెలిజెన్స్, వేగం, సామర్థ్యాలు, భద్రత కల్పించేదే అత్యుత్తమ సాంకేతికత అవుతుందని ఆమె చెప్పారు. భారతదేశవ్యాప్తంగా వినియోగదారుల అలవాట్లలో ఏఐ పలు మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. గూగుల్ క్లౌడ్ డే కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విషయాలు చెప్పారు. 600 మంది పైగా వ్యాపార దిగ్గజాలు, ఎండీలు, టెక్నాలజీ ఎగ్జిక్యూటివ్‌లు దీనికి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా వ్యాపార దిగ్గజాలతో తాను మాట్లాడినప్పుడు ఏఐ సామర్థ్యాల గురించి కొంత ఉత్సాహంతో పాటు రాబోయే రోజుల్లో తలెత్తే సంక్లిష్టతల గురించి కొంత ఆందోళన కనిపిస్తోందని ప్రీతి చెప్పారు. ఏఐ కోసం పెద్ద యెత్తున ఐటీ సిబ్బంది, భారీగా నిధులు అవసరమవుతాయని చాలా మటుకు సంస్థల్లో ఆందోళన నెలకొందని వివరించారు. కానీ గూగుల్ మాత్రం దీన్ని ఆర్థిక సమానత్వాన్ని సాధించేందుకు తోడ్పడే సాధనంగా పరిగణిస్తోందని పేర్కొన్నారు. చిన్న సంస్థలకు ప్రయోజనం.. భారతదేశవ్యాప్తంగా వినియోగదారుల అలవాట్లలో ఏఐ పలు మార్పులు తీసుకొచ్చిందని తెలిపారు. చిన్న, మధ్యతరహా సంస్థల వాటా భారతదేశ జీడీపీలో దాదాపు మూడో వంతు, తయారీలో 35 శాతం పైగా ఉంటుందని, వికసిత భారత్ 2047 లక్ష్య సాధనకు ఇవి వృద్ధి చోదకంగా నిలుస్తున్నాయని ప్రీతి తెలిపారు. ఈ సంస్థలు డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లను వినియోగించుకుంటే సరఫరా వ్యవస్థలు, ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో సానుకూల ప్రభావాలు కనిపిస్తాయని ఆమె వివరించారు. అభివృద్ధి, ఆకాంక్షలను సాధించుకోవడంలో దేశానికి సాధికారత కల్పించే సాంకేతికతను అందించాలనే నిబద్ధతతో భారత్‌లో రెండు దశాబ్దాలుగా తమ ప్రస్థానం సాగుతోందని ప్రీతి చెప్పారు. విశాఖలో ఏఐ హబ్ ఏర్పాటనేది ఇండియాఏఐ మిషన్కి దన్నుగా, దేశ డిజిటల్ వ్యవస్థకు వెన్నెముకగా ఉంటుందని ప్రీతి చెప్పారు. ఒకే ఒక్కరు నడిపే సంస్థ నుంచి 2 లక్షల మంది పైగా పని చేసే బడా సంస్థల వరకు అందరికీ ప్రపంచ స్థాయి కంప్యూట్ సామర్థ్యాలు అందుబాటులోకి వస్తాయని వివరించారు. -
బుగ్గ తీశారు!
► స్వయంగా తొలగించిన సీఎం ఎడపాడి పళనిస్వామి ► అదే బాటలో మంత్రులు ► అందరికీ ఆదేశాలు ► సచివాలయంలో పళని బిజీ ► నీట్ మినహాయింపునకు లేఖ బుగ్గల సంస్కృతికి స్వస్తి పలుకుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో తన వాహనంపై ఉన్న సైరన్‌ను స్వయంగా ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి తొలగించారు. మంత్రులు అదే బాటలో ముందుకు సాగారు. అధికారులందరి వాహనాల్లో త్వరితగతిన తొలగించాలన్న ఆదేశాలను సీఎం జారీ చేశారు. ఇక, సీఎంగా పగ్గాలు చేపట్టి గురువారంతో రెండు నెలలు కావడంతో సచివాలయంలో పళనిస్వామి బిజీ అయ్యారు. సాక్షి, చెన్నై: ప్రజాస్వామ్య దేశంలో ఇక వీఐపీ, వీవీఐపీ అన్న సంస్కృతికి చోటు లేదన్నట్టుగా కేంద్రం బుధవారం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. వీఐపీ సంస్కృతిని సూచించే రీతిలో వాహనాల్లో ఉండే ఎర్ర బుగ్గలు(సైరన్) మే ఒకటి నుంచి ఉండబోవని కేంద్రం చేసిన ప్రకటనతో తమిళనాడు సీఎం ఎడపాడి పళనిస్వామి తక్షణం స్పందించారు. గురువారం ఉదయం సచివాలయంలోకి రాగానే, తన వాహనంపై ఉన్న బుగ్గను సీఎం తొలగించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు తాను స్పందించానని పేర్కొన్నారు. తన మంత్రులు వారి వారి వాహనాలపై బుగ్గలను తొలగించేందుకు నిర్ణయించారని, కొందరు తొలగించేశారని, మిగిలిన వారు త్వరితగతిన తొలగిస్తారని వివరించారు. అధికారులు అందరూ త్వరితగతిన తమ తమ వాహనాలపై బుగ్గలను తొలగించాలన్న ఆదేశాలు జారీ చేసినట్టు పేర్కొన్నారు. కేంద్రం ఈ నిర్ణయాన్ని తాజాగా తీసుకున్నా, తమఅమ్మ, దివంగత సీఎం జయలలిత అధికారంలో ఉన్నప్పుడు ఎన్నడూ ఎర్రబుగ్గ సైరన్ వాహనాన్ని ఉపయోగించ లేదన్న విషయాన్ని గుర్తెరగాల్సిన అవసరం ఉందని ఈసందర్భంగా వ్యాఖ్యానించారు. సీఎం బిజీ : రాష్ట్ర ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టి గురువారంతో పళనిస్వామికి రెండు నెలలు అయింది. అందుకే కాబోలు సచివాలయంలో బిజిబిజీ అయ్యారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికల రద్దు తదుపరి సచివాలయం వైపుగా సీఎం పెద్దగా దృష్టి పెట్టలేదు. అడపాదడపా కార్యక్రమాలకు హాజరైనా, తాజాగా మాత్రం రోజంతా బిజీగానే ఉండడం గమనార్హం. బల నిరూపణలో నెగ్గిన అనంతరం ఫిబ్రవరి 20వ తేదీన పళనిస్వామి సీఎంగా పగ్గాలు చేపట్టారు. తొలి సంతకంగా 500 టాస్మాక్‌ల మూత, అమ్మ పథకాల అమలు మీద దృష్టి పెట్టారు. ఈ రెండు నెలల కాలంలో మొత్తంగా ఆయన 1,520 ఫైల్స్ మీద సంతకాలు పెట్టినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఇందులో పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఉన్నట్టు, ఆరు వందల వరకు గతంలో ఉన్న పెండింగ్ ఫైల్స్ కూడా ఉండడం గమనార్హం. ఈ రెండు నెలల కాలంలో ప్రభుత్వ వ్యవహారాల మీద తొలి వారం పది రోజుల్లో తీవ్ర దృష్టి పెట్టినా, ఆర్కేనగర్ ఉప ఎన్నికల నగారాతో ఆయన పనితీరు కాస్త తగ్గిందని చెప్పవచ్చు. అందుకే పాలనా పరంగా ప్రభుత్వం విఫలమైందంటూ ప్రధాన ప్రతి పక్షం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. సీఎం సాయం : మంత్రులు, అధికారులతో వారి వారి శాఖల్లోని కేటాయింపులు, పనుల గురించి సీఎం సుదీర్ఘంగానే చర్చల్లో మునిగారు. తాగు నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు జరిగిన కేటాయింపులు, సాగుతున్న పనుల్ని సమీక్షించారు. అలాగే, వివిధ కారణాలు, ప్రమాదాల్లో మరణించిన విధి నిర్వహణలో ఉన్న పోలీసులు 14 మంది కుటుంబాల్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకున్నారు. తలా రూ. మూడు లక్షలు చొప్పున సాయం ప్రకటించారు. అలాగే, ఆర్మీలో సేవల్ని అందిస్తూ, వాహన ప్రమాదంలో మరణించిన తూత్తుకుడి జిల్లా ములక్కాడుకు చెందిన గుణశేఖరన్ కుమారుడు ముత్తుచందన్ మృతికి తన సంతాపం తెలియజేశారు. ఆకుటుంబానికి సానుభూతి తెలుపుతూ, ప్రభుత్వ సాయంగా రూ.20 లక్షలు ప్రకటించి, తక్షణం అందించేందుకు చర్యలు తీసుకోవడం విశేషం. ఇక, నీట్ పరీక్షా సమయం ఆసన్నం అవుతుండడం, తమిళ విద్యార్థుల్లో పెరుగుతున్న ఆందోళనను పరిగణలోకి తీసుకుని విద్యాశాఖ అధికారులతో సమావేశం అయ్యారు. నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఇక పలువురు వీఐపీల అపాయింట్మెంట్లతో సీఎం బిజీ అయ్యారు. ఇందులో పారాలింపిక్ విజేత మారియప్పన్ తంగవేల్ సీఎంను కలిసి తనకు కేంద్రం ప్రకటించిన పద్మశ్రీ బిరుదును సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. కాగా ‘నీతి ఆయోగ్’లో పాల్గొనేందుకు తగ్గ పర్యటన కసరత్తులు సాగాయి. ఆమేరకు శనివారం ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు.


