Hyderabad: నగరానికి నయా పోలీస్‌ బాస్‌ | Telangana IPS Transfers: Mahesh Bhagwat Is New Hyderabad CP | Sakshi
Sakshi News home page

Hyderabad: నగరానికి నయా పోలీస్‌ బాస్‌

Nov 13 2026 8:27 AM | Updated on Nov 13 2026 8:32 AM

Telangana IPS Transfers: Mahesh Bhagwat Is New Hyderabad CP

సాక్షి, హైదరాబాద్‌: నగర పోలీసు కమిషనరేట్‌కు 63వ పోలీసు కమిషనర్‌గా మహేష్‌ మురళీధర్‌ భగవత్‌ నియమితులయ్యారు. ఇక్కడ పని చేస్తున్న వీసీ సజ్జనర్‌ అగ్నిమాపక శాఖ డీజీగా బదిలీ అయ్యారు. నగర ట్రాఫిక్‌ విభాగం చీఫ్‌గా పని చేస్తున్న డి.జోయల్‌ డేవిస్‌ను కొత్తగా ఏర్పాటు చేసిన రోడ్డు భద్రత విభాగం టీ–మార్స్‌ సంయుక్త డైరెక్టర్‌ (జేడీ) నియమించిన సర్కారు.. ఇన్‌చార్జ్‌ ట్రాఫిక్‌ చీఫ్‌గా కొనసాగిస్తోంది. సిటీ సైబర్‌ క్రైమ్‌ డీసీపీగా ఉండి, డీజీపీ కార్యాలయానికి బదిలీ అయిన వి.అరవింద బాబును సిటీ ఐటీ విభాగం డీసీపీగా నియమించింది. కాగా.. 2023 డిసెంబర్‌–2026 నవంబర్‌ మధ్య నగర కమిషనరేట్‌కు ఐదుగురు సీపీలుగా పని చేశారు. వీరిలో సీవీ ఆనంద్‌ రెండుసార్లు ఈ బాధ్యతలు నిర్వర్తించారు.  

150 ఏళ్ల చరిత్ర.. 
నగర పోలీసు కమిషనరేట్‌కు దాదాపు 150 ఏళ్ల చరిత్ర ఉంది. హైదరాబాద్‌ సంస్థానం విలీనం తర్వాత నుంచి మొత్తం 62 మంది పోలీసు కమిషనర్లుగా పని చేశారు. కేవలం రెండు సందర్భాల్లోనే ఒకే ఏడాదిలో ముగ్గురు కమిషనర్లుగా పని చేశారు.  63వ సీపీగా మహేష్‌ భగవత్‌ రానున్నారు.

2014 నుంచి తొమ్మిది మంది.. 
మహేష్‌ భగవత్‌ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్‌కు పదో సీపీ అయ్యారు. 2014 నుంచి ఇప్పటి వరకు తొమ్మిది మంది మారగా.. వీరిలో ఆనంద్‌ రెండుసార్లు పని చేశారు. తొలి కొత్వాల్‌ ఎం.మహేందర్‌రెడ్డి 2017 నవంబర్‌ 11న బదిలీ కావడంతో ఆయన స్థానంలో వీవీ శ్రీనివాసరావు 2017 నవంబర్‌ 12న బాధ్యతలు తీసుకున్నారు. ఈయన నుంచి అంజనీకుమార్‌ 2018 నవంబర్‌ 12న చార్జ్‌ తీసుకోవడం ఇద్దరూ ఒకే తేదీన బాధ్యతలు స్వీకరించినవారయ్యారు. 2023 ఏడాది అక్టోబర్‌ 13న సందీప్‌ శాండిల్య కొత్వాల్‌గా బాధ్యతలు తీసుకోగా.. అదే ఏడాది డిసెంబర్‌ 13న కొత్తకోట శ్రీనివాసరెడ్డి స్వీకరించారు. 2025 సెప్టెంబర్‌ 8న ఆయన్ను బదిలీ చేసిన సర్కారు సీవీ ఆనంద్‌ను మరోసారి పోలీసు కమిషనర్‌గా నియమించింది. 2025 సెపె్టంబర్‌ 30న ఆనంద్‌ స్థానంలో సజ్జనర్‌ బాధ్యతలు తీసుకున్నారు. గడిచిన కొన్నేళ్లలో హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌గా అతితక్కువ కాలం పని చేసింది సందీప్‌ శాండిల్య, సజ్జనర్‌ కావడం గమనార్హం.  

పోలీస్‌ ‘గురువు’
మహేష్‌ భగవత్‌ స్వరాష్ట్రం మహారాష్ట్ర. వృత్తిరీత్యా పోలీసు అధికారి అయిన ఆయన ప్రవృత్తి రీత్యా ‘గురువు’. సివిల్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు ఇంటర్వ్యూ మెలకువల్లో శిక్షణ ఇస్తుంటారు. ఆయన సూచనలు, సలహాలతో ఎంతో మంది సివిల్స్‌కు ఎంపికయ్యారు. మహేష్‌ 1990లో ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉంటూనే సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యారు. 1993 జనవరిలో ఉద్యోగం వదిలి ముంబైలోని స్టేట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ అడ్మినిస్ట్రేటివ్ కెరియర్‌లో సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌లో చేరారు. అక్కడ ఆయనకు ప్రఖ్యాత క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌ తండ్రి రమేష్‌ టెండూల్కర్‌ మరాఠీ లిటరేచర్‌ను బోధించడం గమనార్హం. కాగా.. ఆ సమయంలో ఎందరో సీనియర్లు భగవత్‌ను ఆర్థికంగా ఆదుకోవడంతో పాటు మెలకువలు నేర్పారు. 

ఆ స్ఫూర్తి కొనసాగిన నేపథ్యంలో వారి రుణం తీర్చుకుంటున్నట్లు భావిస్తూ ప్రస్తుతం సివిల్స్‌కు ప్రిపేరయ్యే అభ్యర్థులకు మెలకువలు నేర్పుతున్నట్లు భగవత్‌ చెబుతుంటారు. 1995 బ్యాచ్‌కు చెందిన మహేష్‌ భగవత్‌ అనేక కీలక పోస్టుల్లో పని చేశారు. ఆదిలాబాద్, నల్లగొండ ఎస్పీగా, అల్వాల్‌ డీసీపీగా సేవలు అందించారు. నగర పోలీసు విభాగంలో స్పెషల్‌బ్రాంచ్‌ సంయుక్త సీపీగా పని చేసిన మహేష్‌ భగవత్‌.. రాచకొండ పోలీసు కమిషనరేట్‌కు తొలి సీపీ. ఆయన ఆ పోస్టులో దాదాపు ఆరేళ్ల పాటు సేవలు అందించి రికార్డు నెలకొల్పారు.     

ఇదీ చదవండి: మూడు టిమ్స్‌లు.. విస్తృత వైద్య సేవలు


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement