మూడు టిమ్స్‌లు.. విస్తృత వైద్య సేవలు | CM Revanth Orders Three-Team Recruitment Plan for TIMS Hospitals: Telangana | Sakshi
Sakshi News home page

మూడు టిమ్స్‌లు.. విస్తృత వైద్య సేవలు

Nov 13 2026 4:58 AM | Updated on Nov 13 2026 4:58 AM

CM Revanth Orders Three-Team Recruitment Plan for TIMS Hospitals: Telangana

సమీక్షలో మాట్లాడుతున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో మంత్రి దామోదర రాజనర్సింహ

వచ్చే జూన్‌ 2 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి..

వైద్య, ఆరోగ్యశాఖ సమీక్షలో సీఎం రేవంత్‌రెడ్డి

ఏడాదిలో ఉస్మానియా నూతన ఆస్పత్రి ప్రారంభం 

వైద్యులు, సిబ్బంది నియామకాలకు ఏకీకృత విధానం

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో పడకల కొరత, శస్త్రచికిత్సల కోసం నిరీక్షణ, వైద్యులు–సిబ్బంది కొరత వంటి సమస్యలకు పరిష్కారం చూపే దిశగా వైద్యారోగ్య శాఖను సమాయత్తం చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వచ్చే ఏడాది జూన్‌ 2 నాటికి అల్వాల్, ఎల్‌బీనగర్‌ టిమ్స్‌ ఆస్పత్రులతోపాటు వరంగల్‌ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి, నిమ్స్‌ విస్తరణ పనులను పూర్తి చేసి ప్రజలకు పూర్తిస్థాయి వైద్య సేవలు అందుబాటులోకి తీసుకురావాలని స్పష్టం చేశారు.

ఉస్మానియా నూతన ఆస్పత్రి నిర్మాణాన్ని వచ్చే ఏడాది డిసెంబర్‌ నాటికి పూర్తి చేసి సేవలు ప్రారంభించాలని నిర్దేశించారు. నిర్మాణాలు పూర్తయిన తర్వాత వైద్యులు, సిబ్బంది, వైద్య పరికరాల కోసం ఎదురుచూడకుండా అన్ని ఏర్పాట్లను సమాంతరంగా పూర్తి చేయాలని సూచించారు. రేవంత్‌ గురువారం ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీలో వైద్య, ఆరోగ్య శాఖపై మంత్రి దామోదర రాజనర్సింహ, రాజ్యసభ సభ్యులు వేం నరేందర్‌ రెడ్డితో కలిసి సమీక్ష నిర్వహించారు.  

మూడు టిమ్స్‌లకు ఒకే నియామక విధానం 
సనత్‌నగర్, అల్వాల్, ఎల్‌బీనగర్‌ టిమ్స్‌ ఆస్పత్రుల్లో వైద్యులు, ఇతర సిబ్బంది నియామకాలకు ఏకీకృత విధానం అమలు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. వైద్య సేవల అవసరాలకు అనుగుణంగా మూడు ఆస్పత్రుల మధ్య వైద్యులు, సిబ్బందిని బదిలీ చేసుకునే వెసులుబాటు ఉండాలన్నారు. దీనివల్ల ఏ ఆస్పత్రిలోనైనా వైద్యుల కొరత ఏర్పడినప్పుడు మరో ఆస్పత్రి నుంచి సిబ్బందిని సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

ఆస్పత్రుల నిర్వహణ, పారిశుద్ధ్య పనుల కోసం అవసరమైన సిబ్బందిని ఔట్‌సోర్సింగ్‌ విధానంలో నియమించాలని సూచించారు. టిమ్స్‌ల పర్యవేక్షణకు గ్రూప్‌–1 అధికారులను నియమిస్తామని, పారిశుధ్య సిబ్బంది పనితీరును పర్యవేక్షించేందుకు విశ్రాంత సైనికాధికారుల సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. నిమ్స్‌లో శస్త్రచికిత్సలకు ఎక్కువ సమయం పడుతున్న నేపథ్యంలో సనత్‌నగర్‌ టిమ్స్‌ ఆస్పత్రిని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని చెప్పారు.

నిమ్స్‌లో పడకలు అందుబాటులో లేకపోయినా, శస్త్రచికిత్సలకు ఎక్కువ సమయం పడుతున్నా రోగులకు సనత్‌నగర్‌ టిమ్స్‌లో వైద్య సేవలు అందించాలని సూచించారు. ఇందుకోసం వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి, నిమ్స్, టిమ్స్‌ డైరెక్టర్లు నిరంతరం సమన్వయం చేసుకోవాలని చెప్పారు. టిమ్స్‌లలో పూర్తిస్థాయి వైద్యుల నియామకాలు జరిగే వరకు అవసరమైన వైద్యులను బయట నుంచి నియమించుకోవాలని, ఇందుకయ్యే నిధులను వెంటనే విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.  

ఎంతైనా ఇస్తాం... 
కొత్తగా నిర్మిస్తున్న 79 డయాలసిస్‌ కేంద్రాల పనులను సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది విధులకు హాజరయ్యే సమయం, విధుల నుంచి వెళ్లే సమయాన్ని కచి్చతంగా నమోదు చేయాలని చెప్పారు.

రోజువారీ ఓపీ వైద్య సేవలు పొందుతున్న రోగుల సంఖ్య 7 లక్షల నుంచి 9 లక్షలకు, ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్న వారి సంఖ్య 23 లక్షల నుంచి 24.30 లక్షలకు పెరిగినట్లు అధికారులు చెప్పగా, దీనిపై ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు.  ప్రజారోగ్యానికి ప్రాధాన్యమిస్తూ వైద్యారోగ్య శాఖకు అవసరమైన నిధులను ఎంత మొత్తమైనా విడుదల చేస్తామని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement