అద్దెకు రాసిస్తున్నారు! | TGSRTC Staff Criticise Hired Bus Services in Telangana | Sakshi
Sakshi News home page

అద్దెకు రాసిస్తున్నారు!

Nov 13 2026 4:48 AM | Updated on Nov 13 2026 4:50 AM

TGSRTC Staff Criticise Hired Bus Services in Telangana

ఆర్టీసీలో గూడుపుఠాణి... అవసరం లేకున్నా గడువు తీరిన అద్దె బస్సుల పునరుద్ధరణ

పదేళ్ల పాటు నడుపుకొనేందుకు అనుమతి ఇచ్చే దిశగా అడుగులు

పెద్ద స్థాయిలో జోక్యంతో నిర్వాహకులతో సంస్థ భారీ ఒప్పందం... తెరవెనుక పెద్దయెత్తున బేరసారాలు!

అద్దె రూపంలో సాలీనా రూ.200 కోట్లు అనవసరంగా ఉఫ్‌

అ మొత్తంతో సొంతంగా 400కుపైగా కొత్త బస్సులు కొనొచ్చంటున్న కార్మీక సంఘాలు

అద్దె బస్సుల పునరుద్ధరణపై ముందుకెళితే ఉద్యమిస్తామని హెచ్చరిక

సాక్షి, హైదరాబాద్‌: ఆర్టీసీలో పెద్ద గూడు పుఠాణీ జరుగుతోంది. అద్దె బస్సులకు ‘ఆర్టీసీని రాసిచ్చేస్తాం’ అన్నట్టుగా బాగోతానికి తెరలేచింది. సొంత బస్సులు అందుబాటులోకి వస్తున్న తరుణంలో, అవసరం లేకున్నా వాటిని కొనసాగించే ప్రయత్నం జరుగుతోంది. ఏకంగా పదేళ్ల పాటు రాష్ట్రంలో దర్జాగా వాటిని తిప్పుకునేలా స్కెచ్‌ సిద్ధమయ్యింది. వీటి కోసం ఏడాదికి రూ.200 కోట్లకు పైగా అనవసరంగా చెల్లించాల్సి ఉన్నా పట్టించుకోవడం లేదు. 

నిత్యం నష్టాల పేరుతో బస్టాండ్లలో ప్రయాణికులకు కావాల్సిన కనీస వసతులు కూడా కల్పించని సంస్థ యాజమాన్యం బస్సు చార్జీల రూపంలో జనం నుంచి వసూలు చేసిన సొమ్మును ఇలా అద్దె బస్సుల కోసం దుబారా చేసేందుకు సిద్ధం కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ తతంగం వెనుక పెద్దయెత్తున బేరసారాలు సాగాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇటీవలే గుర్తింపు సంఘం ఎన్నికలు జరిగిన ఊపులో ఉన్న ఆర్టీసీ కార్మీక సంఘాలు ఈ బాగోతాన్ని ఆయుధంగా చేసుకుని దండెత్తేందుకు సిద్ధమవుతున్నాయి. అద్దె బస్సులు వద్దే వద్దని కార్మీక సంఘాలు ఎప్పట్నుంచో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. 

సొంత బస్సులు చాలక అప్పట్లో అలా... 
ఆర్టీసీలో తొలినాళ్లలో అన్నీ సొంత బస్సులే ఉండేవి. కానీ క్రమంగా సంస్థ నష్టాల్లో కూరుకుపోవటం, ప్రయాణికుల సంఖ్య పెరుగుతూ కొత్త బస్సులు ఎక్కువగా కొనాల్సి రావటంతో , అద్దె ప్రాతిపదికన ప్రైవేటు బస్సులు తీసుకోవటం ప్రారంభించారు. 

వీటి సంఖ్యను తొలుత 5 శాతం నుంచి ప్రారంభించి క్రమంగా 17 శాతానికి పెంచుతూ వచ్చారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత సంస్థ పూర్తిగా నష్టాల్లో చిక్కుకోవటంతో, అద్దె బస్సుల సంఖ్యపై ఉన్న సీలింగ్‌ ఎత్తేసి వాటిని ఇబ్బడి ముబ్బడిగా తీసుకుంటూ సొంత బస్సుల కొనుగోలును పరిమితం చేశారు. 

దీంతో ఆర్టీసీలో అద్దె బస్సుల సంఖ్య క్రమంగా 35 శాతాన్ని మించింది. ఇక అద్దె బస్సుల నిర్వాహకులకు కిలోమీటరుకు నిర్ధారిత మొత్తం చొప్పున ఆర్టీసీ ప్రతినెలా చెల్లిస్తోంది. వాటిల్లో ఆర్టీసీ నుంచి కండక్టర్, నిర్వాహకుల తరఫున డ్రైవర్‌ ఉంటున్నారు. 

అదే సొంత బస్సులను నడపాలంటే ఒక్కో బస్సుకు ఇద్దరు డ్రైవర్లు, ఇద్దరు కండక్టర్లు (రెండు షిఫ్టులు) చొప్పున ఉండాల్సి రావటంతో వారి రూపంలో భారీగా వేతనాల పద్దు పెరుగుతోంది. అద్దె బస్సులతో ఈ పద్దుతో పాటు బస్సుల కొనుగోలు వ్యయం కూడా తగ్గుతుండటంతో ఆర్టీసీ క్రమంగా అద్దె బస్సుల వైపు మొగ్గు చూపింది.  

ఎలక్ట్రిక్‌ బస్సుల రాకతో... 
    హైదరాబాద్‌ నగరంలో ఆర్టీసీ బస్సులన్నీ ఎలక్ట్రిక్‌వే ఉండాలని ప్రభుత్వం గతంలోనే నిర్ణయం తీసుకున్న సంగతి విదితమే. ఈ క్రమంలో పీఎం ఈ–డ్రైవ్‌ పథకం కింద రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 2,200 బస్సులు మంజూరు చేసింది. మరో 600 బస్సుల కేటాయింపు పరిశీలనలో ఉంది. 

ఆర్టీసీ దరఖాస్తు మేరకే ఈ కేటాయింపులు జరిగాయి. జనవరి నుంచి ఈ బస్సుల రాక మొదలుకానుంది. 2,200 ఎలక్ట్రిక్‌ బస్సులు సమకూరుతుండటంతో అంతే సంఖ్యలో నగరంలోని డీజిల్‌ బస్సులు జిల్లాలకు తరలుతాయి. అయితే వీటిల్లో 1,000 బస్సులు తుక్కుగా మారే అవకాశం ఉంది.

దీంతో మిగతా 1,200 బస్సులు జిల్లాల్లో తిరుగుతాయి. గడువు తీరిన 1,000 అద్దె బస్సులను వీటితో సర్దుబాటు చేసినా మరో 200 బస్సులు అదనంగా ఉంటాయి. కాగా ప్రస్తుతం సంస్థలో ఉన్న 3,300 అద్దె బస్సుల్లో 1,000 బస్సుల గడువు ముగుస్తోంది.  వచ్చే ఏడాది కాలంలో వీటిని తొలగించాల్సి ఉంది.

ఎలక్ట్రిక్‌ బస్సులు రాకతో హైదరాబాద్‌ నుంచి డీజిల్‌ బస్సులు జిల్లాలకు తరలటం, తాత్కాలిక సిబ్బంది అందుబాటులో ఉన్నందున గడువు తీరిన అద్దె బస్సుల స్థానంలో సొంత బస్సులను, సొంత సిబ్బందితో నడిపే వెసులుబాటు ఉంది. గడువు తీరిన అద్దె బస్సులను తొలగించినా ఇబ్బంది ఎదురుకాదు. వాటికయ్యే ఖర్చుతో పాటు వేతన భారమూ తగ్గుతుంది. 

తెరచాటు వ్యవహారం 
ఇక్కడే కొందరు చక్రం తిప్పారు. ఆ గడువు తీరుతున్న 1,000 బస్సులను అలాగే కొనసాగించేందుకు తెరచాటు వ్యవహారం నడిచింది. టెండర్ల ప్రక్రియ అంటూ ఏమీ లేకుండా, ప్రస్తుతం ఒప్పందంలో ఉన్న వ్యక్తులతోనే మళ్లీ ఒప్పందం చేసుకునేందుకు కూడా అంగీకారం కుదిరినట్టు తెలిసింది. పెద్ద స్థాయిలో జోక్యం చేసుకోవటంతో ఈ మేరకు భారీ బేరం కుదిరిందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఒక్కో బస్సుకు రూ.40 వేలు చొప్పున సమర్పించుకునేందుకు బేరసారాలు జరిగాయని, చివరకు ఓ అంకెతో ఓకే అయి ఒప్పందం చేసుకోవటమే తరువాయి అన్న ప్రచారం కార్మీక వర్గాల్లోనే జరుగుతోంది.

ఇది ఆర్టీసీ ఉనికినే హరించే దారుణం 
ఎలక్ట్రిక్‌ బస్సులను భారీగా అద్దె ప్రాతిపదికన సమకూర్చుకోవటం, డీజిల్‌ బస్సులను అద్దెకు తీసుకోవటం వెరసి క్రమంగా ఆర్టీసీలో సొంత బస్సులు 10 శాతానికి పరిమితమయ్యే ప్రమాదం ఉంది. ఇది ఆర్టీసీ ఉనికినే హరించే దారుణం. ఎలక్ట్రిక్‌ బస్సులను అనివార్యంగా తీసుకుంటున్నందున, సాధారణ అద్దె బస్సుల ఒప్పంద గడువు ముగిస్తే వాటిని పునరుద్ధరించకూడదు.

కానీ 1,000 అద్దె బస్సులను కొనసాగించాలనుకోవడం, నష్టాల ఆర్టీసీని మరింత ముంచేందుకు చేసే ప్రయత్నమే. కార్మీక సంఘాలుగా మేం దీన్ని ఎట్టి పరిస్థితిల్లోనూ అంగీకరించం. ఒప్పందం పునరుద్ధరిస్తే ఉద్యమిస్తాం.  
– మర్రి నరేందర్, ఎన్‌ఎంయూ ప్రధాన కార్యదర్శి  

సంస్థకు భారీ నష్టం..
గత ప్రభుత్వ హయాంలో 560 సూపర్‌ లగ్జరీ బస్సులు కొన్నారు. అవి 8 లక్షల కిలోమీటర్ల మేర తిరగాయి. మరో రెండు లక్షలు తిరిగాక వాటిని డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగుగా మారుస్తారు. వాటి స్థానంలో కొత్తగా సూపర్‌ లగ్జరీ బస్సులు కొంటారు. ఈ రూపంలో కూడా బస్సుల కొరత తీరుతుంది. అద్దె బస్సుల అవసరం మరింత తగ్గుతుంది. ప్రస్తుతం ఒక్కో అద్దె బస్సుకు నెలకు  రూ.లక్షన్నర వరకు అద్దె రూపంలో ఆర్టీసీ చెల్లిస్తోంది.

ఈ లెక్కన ఏడాదికి రూ.200 కోట్ల వరకు ఆర్టీసీ అద్దె రూపంలో దుబారా చేసినట్టవుతుంది. ఈ మొత్తంతో 400 వరకు కొత్త బస్సులు కొనొచ్చని కార్మీక సంఘాలు చెబుతున్నాయి. అసలే బస్సులకు కొరత ఉన్న ఆర్టీసీకి ఇది బాగా ఉపకరిస్తుంది. మరోవైపు ఇటీవల సొంత డ్రైవర్లు, కండక్టర్ల నియామక ప్రక్రియ మందగించటంతో ఆర్టీసీలో సిబ్బంది కొరత ఎదురైంది.

వేతన పద్దుకు జడిసి ప్రభుత్వం కూడా నియామక ప్రక్రియను  జాప్యం చేస్తోంది. ఫలితంగా ఔట్‌సోర్సింగ్‌ డ్రైవర్లు, కండక్టర్లను నియమించుకుంటున్నారు. ప్రస్తుతం 3 వేల మంది ఆ పద్ధతిలో పనిచేస్తున్నారు. పూర్తిస్థాయి ఉద్యోగులతో పోలిస్తే వీరికి చెల్లించే మొత్తం చాలా తక్కువ.  ఇప్పుడు సొంత బస్సు ఉన్నా, వేతన భారం తగ్గినందున అద్దె బస్సుల అవసరం తగ్గుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement