న్యూఢిల్లీ: పుష్కరకాలం తర్వాత దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న’ గ్రహీత లేకుండానే జాతీయ క్రీడా పురస్కారాల కార్యక్రమం జరిగింది. 2025 సంవత్సరానికిగాను జాతీయ క్రీడా పురస్కారాలు పొందిన ప్లేయర్లు భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడల మంత్రి మన్‌సుఖ్ మాండవీయ, క్రీడా కార్యదర్శి హరి రంజన్ తదితరులు పాల్గొన్నారు.
2014 తర్వాత ‘ఖేల్ రత్న’ పురస్కారానికి ఎవరూ ఎంపిక కాలేదు. 2025 ఏడాదికిగాను ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే ‘అర్జున’ అవార్డు కోసం 17 మందిని ఎంపిక చేశారు. ఈ జాబితాలో తెలంగాణ నుంచి బధిర షూటర్ ధనుశ్ శ్రీకాంత్... బ్యాడ్మింటన్ ప్లేయర్ పుల్లెల గాయత్రి ఉన్నారు. రాష్ట్రపతి చేతుల మీదుగా ధనుశ్ శ్రీకాంత్ ‘అర్జున’ పురస్కారం అందుకోగా... జపాన్ ఓపెన్ టోర్నీలో ఆడుతున్నందుకు పుల్లెల గాయత్రి, ట్రెసా జాలీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోయారు.

న్యూఢిల్లీలో శుక్రవారం జరిగిన జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ‘అర్జున అవార్డు’లు అందుకుంటున్న అఖిల్ షెరోన్ (షూటింగ్), తేజస్విన్ శంకర్ (అథ్లెటిక్స్), ప్రియాంక గోస్వామి (అథ్లెటిక్స్), లాల్‌రెమ్‌సియామి (హాకీ), విదిత్ (చెస్), దివ్య దేశ్‌ముఖ్ (చెస్) (ఎడమ నుంచి కుడి వైపు)


