మహిళాభివృద్ధితోనే వికసిత్‌ భారత్‌ | President Droupadi Murmu inaugurated the National Saras Mela in Vijayawada | Sakshi
Sakshi News home page

మహిళాభివృద్ధితోనే వికసిత్‌ భారత్‌

Oct 16 2026 4:25 AM | Updated on Oct 16 2026 4:25 AM

President Droupadi Murmu inaugurated the National Saras Mela in Vijayawada

సారస్‌ మేళాలో మహిళతో మాట్లాడుతున్న రాష్ట్రపతి ముర్ము, కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌

గ్రామీణ మహిళలే దేశాభివృద్ధికి చోదకశక్తులు

వినియోగదారుల అభిరుచుల మేరకు ఉత్పత్తులు ఉండాలి 

మధ్యవర్తుల వ్యవస్థను తొలగించాలి 

మహిళలు ఉద్యోగాలు కోరేవారిగా కాకుండా.. ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలి 

విజయవాడలో జాతీయ సారస్‌ మేళాను ప్రారంభించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

సాక్షి, అమరావతి: గ్రామీణ మహిళలు కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా మిగిలిపోకుండా సంపద సృష్టికర్తలుగా, దేశాభివృద్ధికి చోదకశక్తులుగా ఎదగాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు. స్వయం సహాయక సంఘాల్లోని ప్రతి మహిళ లక్షాధికారి స్థాయి నుంచి కోటీశ్వరురాలిగా ఎదగాలని ఆకాంక్షించారు. మహిళాభివృద్ధి ద్వారానే వికసిత్‌ భారత్‌ సాధ్యమని చెప్పారు. విజయవాడలో ఏర్పాటుచేసిన జాతీయ సారస్‌ మేళా–2026ను గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు ఉద్యోగాల కోసం వెదికేవారిగా కాకుండా, ఇతరులకు ఉపాధి కల్పించేస్థాయికి ఎదగాలని కోరారు. 

ఎస్‌హెచ్‌జీ ఉద్యమం గ్రామీణ ఆర్థికవ్యవస్థకు బలం ఇస్తోందని చెప్పారు. 12 ఏళ్లలో ఈ సంఘాలతో అనుసంధానమైన మహిళల సంఖ్య 10 కోట్లకు పైగా పెరగడం సంతోషదాయకమన్నారు. దేశంలో 90 లక్షలకు పైగా స్వయం సహాయక సంఘాలు పనిచేస్తున్నాయని, వీటిద్వారా మహిళలు ఆర్థికంగా ఎదగడంతో పాటు సామాజికంగా తమ స్థానాన్ని బలోపేతం చేసుకుంటున్నారని చెప్పారు. మహిళలు వ్యాపారాభివృద్ధితోపాటు స్వతంత్రంగా ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో వారి భాగస్వామ్యం పెరగడం దేశసమతుల్య, సమ్మిళిత అభివృద్ధికి అత్యంత అవసరమని పేర్కొన్నారు. మధ్యవర్తుల వ్యవస్థను తొలగించేలా మార్పులు తీసుకురావాలని సూచించారు.  

గ్రామీణ ఉత్పత్తులకు మార్కెట్‌ వేదికగా సారస్‌ మేళాలు  
జాతీయ సారస్‌ మేళాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే మార్కెట్‌ వేదికలుగా రూపుదిద్దుకుంటున్నాయని చెప్పారు. ఈ మేళాల ద్వారా తమ ఉత్పత్తులకు విస్తృత గుర్తింపుతో పాటు నేరుగా వినియోగదారులకు పరిచయం చేసుకునే అవకాశం లభిస్తోందని తెలిపారు. సారస్‌ మేళాల ద్వారా గ్రామీణ మహిళలకు, వినియోగదారులకు మధ్య ప్రత్యక్ష సంబంధాలు బలోపేతమవుతున్నాయ­న్నా­రు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా ఉత్పత్తులను అభివృద్ధి చేసుకోవాలని సూచించా­రు. 2047 నాటికి వికసిత భారత్‌ లక్ష్యసాధనలో స్వయం సహాయక సంఘాలు, జాతీయ సారస్‌ మే­ళాలు కీలకపాత్ర పోషించాలని రాష్ట్రపతి కోరారు. 

సంపద సృష్టికర్తలు మహిళలే: చంద్రబాబు 
ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ మహిళలను సంపద సృష్టికర్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముందుకెళుతున్నట్లు చెప్పారు. గ్రామీణ మహిళలు తయారుచేసే ఉత్పత్తులకు అంతర్జాతీయస్థాయిలో గుర్తింపు తీసుకొచ్చేందుకు స్వయం ఏపీ బ్రాండ్‌ను ప్రవేశపెట్టినట్లు తెలిపారు. రాష్ట్రంలో గత ఏడాది లక్షమంది స్వయం సహాయక సంఘాల సభ్యులు మహిళా పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని, ఈ ఏడాది ఐదులక్షల మందిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. మన ఎస్‌హెచ్‌జీలు సేవింగ్‌ మనీ స్థాయినుంచి మేకింగ్‌ మనీ స్థాయికి అభివృద్ధి చెందినట్లు పేర్కొన్నారు. 

ఈ ప్రదర్శన 14 రోజులకే పరిమితం కాకుండా గ్రామీణ మహిళల ఉత్పత్తులకు ఏడాది పొడవునా మార్కెట్‌ అవకాశాలు కల్పించేలా ఉండాలని ఆకాంక్షించారు. రాష్ట్రంలో 11 లక్షల స్వయం సహాయక సంఘాల్లో 1.10 కోట్లమంది సభ్యులున్నట్లు తెలి­పారు. ఈ సంఘాలు సమష్టిగా రూ.69 వేలకోట్ల వ్యాపార లావాదేవీలు నిర్వహిస్తున్నాయని, వాటి ఉత్పత్తులు సుమారు 3.5 కోట్ల మందికి చేరుతున్నా­యని చెప్పారు. సామాజిక మాధ్యమాలను ఉప­యోగించుకుని వ్యాపారాలను విస్తరించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్, కేంద్రమంత్రులు శివరాజ్‌సింగ్‌ చౌహా­న్, పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహననాయుడు, కమలేష్‌ పాశ్వాన్‌ తదితరులు పాల్గొన్నారు.   

రాష్ట్రపతి ముర్ముకు ఘనంగా వీడ్కోలు 
విమానాశ్రయం(గన్నవరం): విజయవాడ పర్యటన ముగించుకొని తిరిగి వెళ్తున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గన్నవరం విమానాశ్రయంలో గవర్నర్‌ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ సహా పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. విజయవాడ నుంచి ఆమె మధ్యాహ్నం 2.45 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆమెకు కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహన్, కేంద్ర సహాయ మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, కమలేష్‌ పాశ్వాన్‌ తదితరులు వీడ్కోలు పలికారు. అనంతరం రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో న్యూఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

లక్‌పతి దీదీతో కొత్త అవకాశాలు
గ్రామీణ మహిళల సాధికారతకు కేంద్రం అమలు చేస్తున్న లక్‌పతి దీదీ కార్యక్రమం కొత్త దిశా­ని­ర్దేశం చేసిందని రాష్ట్రపతి చెప్పారు. మహి­­ళల ఆదాయాన్ని పెంచడం, వారిని స్వయం ఉపాధి మా­ర్గాల్లో ప్రోత్సహించడం, కొత్త వ్యాపా­రాలను స్థాపించి విస్తరించుకునేందుకు అవకాశాలు కల్పించడం దీని ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆదాయ వినియోగం, ఆస్తుల నిర్వహణలో వారికి స్వేచ్ఛ, నిర్ణయాధికారం ఉండడం చాలా ముఖ్యమని చెప్పారు.

మహిళలు ఆర్థికంగా ఎదగడానికి అవసరమైన వనరులు, అవకాశాలు అందుబాటులో ఉంచేలా ప్రభుత్వాలు కృషిచేయాలన్నారు. డిజి­టల్‌ సేవలు, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో మహిళల భాగస్వామ్యం పెరిగితే కొత్త నైపుణ్యాల అభివృద్ధికి, ఆదాయ మార్గాలను విస్తరణకు అవకాశం ఏర్పడుతుందని చెప్పారు. మహిళలు తమ సమయాన్ని, శ్రమను పూర్తిగా వ్యాపారాభివృద్ధికి వినియోగించుకునే పరిస్థితులు ఏర్పడినప్పుడే మహిళల ఆర్థిక స్వాతంత్య్రం మరింత బలపడుతుందన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement