యువ క్రికెటర్ల పరుగుల వేట
నేటి నుంచి ముస్తాక్ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్ టోర్నీ
నాలుగు వేదికల్లో మ్యాచ్‌లు
బరిలో మొత్తం 32 జట్లు
డిసెంబర్ 6న నాగ్‌పూర్‌లో ఫైనల్
డిసెంబర్ 16న గోవాలో ఐపీఎల్ మినీ వేలం
ముంబై: రాత్రికి రాత్రే... కాసుల వర్షం కురిపించి... లక్షాధికారులను... కోటీశ్వరులను చేసే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీల్లో చోటు సంపాదించడమే లక్ష్యంగా దేశవాళీ యువ క్రికెటర్లు సిద్ధమయ్యారు. నేటి నుంచి మొదలయ్యే దేశవాళీ టి20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పరుగుల వరద పారించేందుకు ఆయా జట్లు రెడీ అయ్యాయి. దేశంలోని నాలుగు వేదికల్లో మొత్తం 32 జట్లు లీగ్ దశలో పోటీపడనున్నాయి. మొత్తం 32 జట్లను 4 గ్రూప్‌లుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో 8 జట్లకు చోటు కల్పించారు.
ముంబై వేదికగా గ్రూప్ ‘ఎ’లో డిఫెండింగ్ చాంపియన్ జార్ఖండ్, బెంగాల్, బరోడా, చండీగఢ్, కర్ణాటక, మిజోరం, రాజస్తాన్, ఉత్తరప్రదేశ్ జట్లు పోటీపడతాయి. ఇండోర్ వేదికగా గ్రూప్ ‘బి’లో తమిళనాడు, సౌరాష్ట్ర, రైల్వేస్, పంజాబ్, జమ్మూకశ్మీర్, హరియాణా, ఢిల్లీ, బిహార్ జట్లు ముఖాముఖిగా తలపడతాయి. మొహాలీ వేదికగా గ్రూప్ ‘సి’లో ఆంధ్ర, అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, కేరళ, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి, త్రిపుర జట్లు మ్యాచ్‌లు ఆడతాయి. కోల్‌కతా వేదికగా గ్రూప్ ‘డి’లో హైదరాబాద్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, ముంబై, ఒడిశా, ఉత్తరాఖండ్, విదర్భ జట్లు పోటీపడతాయి.
నవంబర్ 26 వరకు గ్రూప్ దశ లీగ్ మ్యాచ్‌లు జరుగుతాయి. అనంతరం నాలుగు గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన 8 జట్లు నాగ్‌పూర్ వేదికగా జరిగే ‘సూపర్ లీగ్’ దశకు అర్హత సాధిస్తాయి. ‘సూపర్ లీగ్’లో 8 జట్లను రెండు గ్రూప్‌లుగా (4 జట్ల చొప్పున) విభజిస్తారు. నవంబర్ 30 నుంచి డిసెంబర్ 4 వరకు ‘సూపర్ లీగ్’ మ్యాచ్‌లు జరుగుతాయి. ‘సూపర్ లీగ్’లో రెండు గ్రూప్‌లలో టాప్ ర్యాంక్‌లో నిలిచిన జట్లు డిసెంబర్ 6న నాగ్‌పూర్ వేదికగా జరిగే ఫైనల్లో తలపడతాయి. డిసెంబర్ 16వ తేదీన గోవాలో ఐపీఎల్–2027 కోసం మినీ వేలం జరగనుంది.
3 ఇప్పటి వరకు ముస్తాక్ అలీ ట్రోఫీ 18 సార్లు జరిగింది. తమిళనాడు జట్టు అత్యధికంగా 3 సార్లు విజేతగా నిలిచింది. బరోడా, కర్ణాటక, గుజరాత్, ముంబై జట్లు 2 సార్లు చొప్పున టైటిల్ సొంతం చేసుకున్నాయి. పంజాబ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఢిల్లీ, జార్ఖండ్, ఈస్ట్‌జోన్ జట్లు ఒక్కోసారి చాంపియన్‌గా నిలిచాయి.
గ్రూప్ ‘డి’లో ఉన్న హైదరాబాద్ జట్టు నేడు జరిగే తమ తొలి మ్యాచ్‌లో ముంబైతో ఆడుతుంది. అనంతరం హైదరాబాద్ 16న ఛత్తీస్‌గఢ్‌తో... 18న విదర్భతో... 20న గోవాతో... 22న ఉత్తరాఖండ్‌తో... 24న గుజరాత్‌తో... 26న ఒడిశాతో తలపడుతుంది.
గ్రూప్ ‘సి’లో ఉన్న ఆంధ్ర జట్టు నేడు జరిగే తమ తొలి మ్యాచ్‌లో త్రిపురను ‘ఢీ’ కొంటుంది. అనంతరం ఆంధ్ర జట్టు 16న హిమాచల్‌ప్రదేశ్‌తో... 18న కేరళతో... 20న మధ్యప్రదేశ్‌తో... 22న అస్సాంతో... 24న పుదుచ్చేరితో... 26న మహారాష్ట్రతో పోటీపడుతుంది.


