సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026 సీజన్ కోసం జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ 15 మంది సభ్యులతో కూడిన తమ జట్టును ప్రకటించింది. ఈ ఏడాది సీజన్‌కు కెప్టెన్ ఇషాన్ కిషన్‌తో పాటు స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కుమార్ కుశాగ్ర దూరమయ్యారు. ఇషాన్ కిషన్ ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో భారత జాతీయ జట్టు తరపున ఆడుతుండగా, కుమార్ కుశాగ్ర ఈ నెలలో జరగనున్న 'ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026' టోర్నీకి ఎంపికయ్యాడు.
దీంతో జార్ఖండ్ కెప్టెన్‌గా కోల్‌కతా నైట్ రైడర్స్ ఆల్‌రౌండర్ అనుకుల్ రాయ్‌ను సెలక్టర్లు అప్పగించారు. అనుకుల్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. రంజీ ట్రోఫీతో పాటు ఆస్ట్రేలియా-ఏ జట్టుపై బ్యాట్, బంతితో అతడు రాణించాడు. ఈ పేపథ్యంలోనే అతడికి జట్టు పగ్గాలను సెలక్టర్లు అప్పగించారు.
ఈ దేశవాళీ టీ20 టోర్నీలో అనుకుల్ రాయ్‌కు డిప్యూటీగా యువ ఆటగాడు శిఖర్ మోహన్ వ్యవహరించనున్నాడు. 21 ఏళ్ల శిఖర్ మోహన్ రంజీ ట్రోఫీ 2026-27 సీజన్ ఫస్ట్ హాప్‌లో వరుసగా రెండు సెంచరీలతో ఆకట్టుకున్నాడు. అదేవిధంగా జార్ఖండ్ టీ20 లీగ్‌లో సత్తాచాటిన ఆఫ్ స్పిన్నర్ హర్ష్ రాజ్‌కు కూడా ఈ జట్టులో సెలెక్టర్లు అవకాశం కల్పించారు. హర్ష్ రాజ్ 8 మ్యాచ్‌లలో 11 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు.
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ కోసం జార్ఖండ్ జట్టు: అనుకుల్ రాయ్ (కెప్టెన్), విరాట్ సింగ్, శిఖర్ మోహన్ (వైస్ కెప్టెన్), ఉత్కర్ష్ సింగ్, రాబిన్ మింజ్, రాజన్‌దీప్ సింగ్, పంకజ్ కుమార్, మహ్మద్ కౌనైన్ ఖురైషి, శుభ్ శర్మ, అమిత్ కుమార్, ప్రతీక్ రంజన్, ప్రత్యూష్ కుమార్, సుశాంత్ మిశ్రా, హర్ష్ రాజ్, సౌరభ్ శేఖర్


