రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో సమావేశమైన ‘ఇండియా కూటమి’ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌గాందీ, మమతా బెనర్జీ, డి.రాజా, సుప్రియా సూలె, ఎంఏ బేబీ తదితరులు
మా ఆరోపణలను ఆమె ఖండించలేదు, ప్రశ్నించలేదు
రాష్ట్రపతి స్పందన మమ్మల్ని షాక్‌కు గురిచేసింది
సాక్ష్యాధారాలు ఇస్తే పరిశీలిస్తానన్నారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెల్లడి
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని రాష్ట్రపతికి విపక్షాల వినతి
న్యూఢిల్లీ: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో అవకతవకలకు బాధ్యుడైన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు విపక్ష ‘ఇండియా’ కూటమికి చెందిన 10 మంది నేతల బృందం విజ్ఞప్తి చేసింది. శుక్రవా రం రాష్ట్రపతి భవన్‌లో ఆమెను కలిసి ఈ మేరకు వినతి పత్రం సమర్పించింది. దాదాపు గంటసేపు రాష్ట్రపతితో విపక్ష నేతలు సమావేశమయ్యారు. అంతకుముందు ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ భవనం నుంచి రాష్ట్రపతి భవన్ వైపు ర్యాలీగా వెళ్తుండగా విజయ్ చౌక్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు.
దాంతో ఎంపీలు అక్కడే బైఠాయించి నిరసన తెలపగా, 10 మందితో కూడిన బృందం మాత్రమే రాష్ట్రపతిని కలిసేందుకు అను మతి లభించింది. ముర్ముతో సమావేశం అనంతరం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఓట్ల దొంగతనం, ఎన్నికల మోసంపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణలను రాష్ట్ర పతి ఏమాత్రం ఖండించలేదని, ప్రశ్నించలేదని చెప్పారు. తాము చెప్పిన విష యాన్ని ఆమె అంగీకరించడం షాక్‌కు గురిచేసిందని అన్నారు. సాక్ష్యాధారాలు సమర్పించాలని అమె కోరారని, ఈ విషయాన్ని పరిశీలిస్తానని హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షా, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ భారతదేశ ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారని రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. తమ వ్యాఖ్యలను ఆమె వ్యతిరేకించలేదని అన్నారు. ఓట్ల చోరీ గురించి దేశమంతటా తెలుసని, సాక్ష్యాధారాలను రాష్ట్రపతికి సమర్పించడానికి ప్రతిపక్షం సిద్ధంగా ఉందని రాహుల్ గాంధీ స్పష్టంచేశారు. అన్ని అంశాలను పరిశీలించి, విచారణ జరుపుతానని రాష్ట్రపతి ముర్ము తమకు హామీ ఇచ్చారని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తెలియజేశారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా చూడాలని రాష్ట్రపతిని కోరారు.
నరేంద్ర మోదీ, అమిత్ షా దేశ ప్రజాస్వామ్యాన్ని బలహీనపరిచేందుకు కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. తమ ఆందోళనను రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరిపి, తగిన చర్యలపై నిర్ణయం తీసుకుంటానని ఆమె హామీ ఇచ్చారని తెలిపారు. రాష్ట్రపతిని కలిసిన విపక్ష బృందంలో రాహుల్, ఖర్గే, మమతా బెనర్జీ, ఎం.ఎ.బేబీ, డి.రాజా, రాజీవ్ రాయ్, సుప్రియా సూలే, ఒమర్ అబ్దుల్లా, మనోజ్ ఝా, తిరుమావళవన్ తదితరులు ఉన్నారు.
మోదీ సర్కార్‌ను తొలగించడమే పరిష్కారం
రాష్ట్రపతిని కలవడానికి ముందు విపక్ష ఎంపీలు పార్లమెంట్‌లోని సెంట్రల్ హాల్‌లో భేటీ అయ్యారు. ఓట్ల చోరీపై ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి, జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించేలా ఒత్తిడి పెంచడానికి అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా ఎంపీలను ఉద్దేశించి రాహుల్ గాంధీ మాట్లాడారు. ప్రతిపక్షాల నిరసనలు ప్రభుత్వ పునాదులను కదిలించాయని పేర్కొన్నారు. జ్ఞానేశ్ కుమార్ కంటే చాలా లోతైన సమస్య ఒకటి ఉందన్నారు. మోదీ ప్రభుత్వాన్ని తొలగించడమే దీనికి పరిష్కారమని ఉద్ఘాటించారు.
వినతి పత్రంలో ఏముంది?
రాష్ట్రపతికి సమర్పించిన వినతిపత్రంలో విపక్ష నేతలు పలు అంశాలు ప్రస్తావించారు. రాష్ట్రపతి తన అధికారాన్ని ఉపయోగించి సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను పదవి నుంచి తప్పించాలని, ఎస్‌ఐఆర్ ప్రక్రియను నిలిపివేయాలని, గత రెండేళ్లలో జరిగిన అన్ని అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయాలని కోరారు. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్లకు జీవితకాల రక్షణ కల్పించే 2023 నాటి చట్టాన్ని రద్దు చేయాలని విన్నవించారు. ఇకపై అన్ని ఎన్నికల్లోనూ పేపర్ బ్యాలెట్ విధానాన్ని ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఐఆర్ ముసుగులో ఓటర్ల జాబితా నుండి అక్రమంగా తొలగించిన 13.3 కోట్ల మంది ఓటర్ల పేర్లను పునరుద్ధరించాలని పేర్కొన్నారు.
ఓట్ల చోరీకి సంబంధించి కచ్చితమైన ఆధారాలు లభించిన అసెంబ్లీ ఎన్నికలన్నింటినీ రద్దు చేయాలని స్పష్టంచేశారు. ఒకదాని తర్వాత మరొక ఎన్నికలో భారీ స్థాయిలో ఓట్ల దొంగతనం జరిగిందనడానికి తమ వద్ద తిరుగులేని ఆధారాలు ఉన్నాయని ప్రతిపక్ష కూటమి తేల్చిచెప్పింది. హరియాణా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, బీహార్, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను తారుమారు చేశారని ఆరోపించారు. మరికొన్ని అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో కూడా బీజేపీ ఈవీఎంలు, ఓటర్ల జాబితాల విషయంలో గోల్‌మాల్ చేసిందని ధ్వజమెత్తారు.
దేశంలో పట్టపగలే ప్రజాస్వామ్యం హత్యకు గురవుతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఓట్ల చోరీ అనేది దేశానికి వ్యతిరేకంగా జరుగుతున్న నేరమని ఉద్ఘాటించారు. ఈ నేరాన్ని కప్పిపుచ్చడానికి ప్రధాన ఎన్నికల కమిషనర్ సుప్రీంకోర్టుకు బహిరంగంగానే అబద్ధాలు చెబుతూ మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326లో పొందుపరిచిన ప్రాతినిధ్య ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు పునాది అని, ఎన్నికల కమిషన్ దానికి రాజ్యాంగబద్ధ సంరక్షకుడే తప్ప యజమాని కాదని స్పష్టం చేశారు.


