శబరిమల: తెల్లారి 3 గంటలకే పోటెత్తిన భక్తులు! | Sabarimala witnesses heavy rush as Mandala pilgrimage season begins | Sakshi
Sakshi News home page

శబరిమల: తెల్లారి 3 గంటలకే పోటెత్తిన భక్తులు!

Nov 17 2026 11:19 AM | Updated on Nov 17 2026 11:28 AM

Sabarimala witnesses heavy rush as Mandala pilgrimage season begins

శబరిమల: కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో వార్షిక మండల మకరవిళక్కు తీర్థయాత్ర ప్రారంభమైంది. మంగళవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయ ద్వారాలను తెరవడంతో రెండు నెలల పాటు కొనసాగే అయ్యప్ప దీక్షల సందడి మొదలైంది. ‘స్వామియే శరణం అయ్యప్ప’ నామస్మరణతో కొండ ప్రాంతాలు మార్మోగుతున్నాయి. వేలాది మంది భక్తులు ఇరుముడులతో స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు.

కొత్త మేళశాంతి (ప్రధాన అర్చకుడు) అరీక్కర సుబ్రమణియన్ శంకరన్ నంబూద్రి ఆలయాన్ని తెరిచి పూజలు ప్రారంభించారు. మాళికప్పురం ఆలయంలోనూ కొత్త ప్రధాన అర్చకుడు ఏ. దామోదరన్ నంబూద్రి పూజలు చేపట్టారు. ఇప్పటికే వర్చువల్ క్యూ ద్వారా 66 వేల మంది, స్పాట్ బుకింగ్ ద్వారా మరో 14 వేల మంది దర్శనానికి పేర్లు నమోదు చేసుకున్నారు. రోజుకు గరిష్ఠంగా 80 వేల మందికి దర్శనం కల్పించనున్నారు. పవిత్రమైన 18 మెట్లపై నిమిషానికి 75 మంది చొప్పున అనుమతించేలా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు.

నీలక్కల్, ఎరుమేలి, సత్రం ప్రాంతాల్లో స్పాట్ బుకింగ్ సౌకర్యం కల్పించారు. పంబాలో మాత్రం రద్దీ పెరిగే ప్రమాదంతో ఈ సదుపాయం లేదు. నీలక్కల్‌లో కృత్రిమ మేధస్సు కెమెరాలతో రద్దీని పర్యవేక్షించనున్నారు. 6 వేల మంది ఉండేందుకు తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేశారు. డిసెంబర్ 27న మండల పూజ, జనవరి 14న మకరవిళక్కు ఉత్సవం జరగనున్నాయి. జనవరి 20న ఆలయాన్ని మూసివేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement