సంక్రాంతికి సై | Upcoming Update Movies Releasing for Sankranti 2027: Tollywood | Sakshi
Sakshi News home page

సంక్రాంతికి సై

Aug 26 2026 4:20 AM | Updated on Aug 26 2026 4:20 AM

Upcoming Update Movies Releasing for Sankranti 2027: Tollywood

తెలుగు చిత్ర పరిశ్రమకు సంక్రాంతి సీజన్‌ అంటే చాలా ప్రత్యేకం అని చెప్పాలి. తెలుగు లోగిళ్లలో ముగ్గుల పండగ వేళ విందూ వినోదాల్లో కొత్త సినిమాలది కూడా ఒక భాగమే. ఇండస్ట్రీకే కాదు... తెలుగు ప్రేక్షకులకు కూడా ముఖ్యమైన పండగ అంటే సంక్రాంతి. ఆ సమయంలో కుటుంబ సమేతంగా సినిమాలకు వెళ్లి సరదాగా ఎంజాయ్‌ చేస్తుంటారు ఆడియన్స్‌. ఈ టైమ్‌లో వచ్చే మూవీస్‌లో చాలా వరకు కమర్షియల్‌ సక్సెస్‌లు అందుకుంటాయి. అందుకే హీరోలు, దర్శక– నిర్మాతలందరూ తమ సినిమాలని సంక్రాంతి రేసులో ప్రేక్షకుల ముందుకి తీసుకు రావాలని  ప్లాన్‌ చేస్తుంటారు.

 పైగా ఈ సమయంలో విడుదలయ్యే చిత్రాలకు మంచి వసూళ్లు రాబట్టుకోవచ్చన్నది మేకర్స్‌ ఆలోచన. పండగకి వచ్చే సినిమాల్లో ‘ఫలానా సినిమా’ బాగుందనే టాక్‌ వచ్చిందంటే ఇక బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీనే. అందుకే స్టార్‌ హీరోల దగ్గర నుంచి యువ హీరోల వరకూ సంక్రాంతి పోటీకి సై అంటుంటారు. 2027 సంక్రాంతి మరో నాలుగు నెలలు ఉండగానే పలు చిత్రాలు ఇప్పటికే విడుదల తేదీలను ఖరారు చేసుకున్నాయి.

మరికొన్ని ప్రాజెక్టులు కూడా సంక్రాంతి రేసులో ఉండేందుకు ముస్తాబవుతున్నాయి.  చిరంజీవి, వెంకటేశ్‌–కల్యాణ్‌ రామ్, రవితేజ, శర్వానంద్, సాయిదుర్గా తేజ్‌ వంటి హీరోలు ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు కర్చీఫ్‌ వేసేశారు. బాలకృష్ణ, నాగార్జున, రజనీకాంత్, సూర్య వంటి హీరోలు కూడా సంక్రాంతి పోటీలో నిలిచేందుకు సమాయత్తమవుతున్నారు.  మరి... సంక్రాంతి బరిలో నిలిచిన, నిలవనున్న సినిమాలేంటో చూద్దాం.  

13న కాకా రాక  
చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కాకా’. ‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్‌ ఫిల్మ్‌ తర్వాత హీరో చిరంజీవి, దర్శకుడు బాబీ (కేఎస్‌ రవీంద్ర) కాంబోలో రూపొందుతున్న సినిమా ‘కాకా’. ఈ చిత్రంలో నివేతా పేతురాజ్, అనశ్వరా రాజన్ , సునీల్, గెటప్‌ శ్రీను ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. కేవీఎన్‌ ప్రోడక్షన్స్ పై వెంకట్‌ కె. నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాని సంక్రాంతి సందర్భంగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆగస్టు 22న చిరంజీవి బర్త్‌ డే సందర్భంగా విడుదల చేసిన టైటిల్‌ గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చినట్లు యూనిట్‌ పేర్కొంది.

‘‘తండ్రీ కూతుళ్ల ఎమోషన్  నేపథ్యంలో ‘కాకా’ కథనం సాగుతుంది. చిరంజీవి తన స్క్రీన్‌ ప్రెజెన్స్ తో మెస్మరైజ్‌ చేస్తారు. చిరంజీవిని రెండు విభిన్నమైన లుక్స్‌లో ప్రజెంట్‌ చేస్తున్నారు బాబీ. మిడిల్‌ క్లాస్‌ అవతార్‌లో చిరంజీవి చాలా సహజమైన చార్మ్‌తో, యంగ్‌ వెర్షన్ లో తన యాటిట్యూడ్, ఎనర్జీతో ఆకట్టుకుంటారు. సినిమాటోగ్రాఫర్‌ విజయ్‌ కార్తీక్‌ కన్నన్‌ తన డైనమిక్‌ విజువల్స్‌తో గ్లింప్స్‌ను మరింత ఆసక్తికరంగా మలిచారు.

 ఎస్‌. తమన్‌ అందించిన బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ గ్లింప్స్‌ ఇంటెన్సిటీని మరింత పెంచింది. ‘గ్యాంగ్‌ లీడర్‌’ మూవీలోని ఐకానిక్‌ ‘గ్యాంగ్‌ గ్యాంగ్‌’ పాటను రీమిక్స్‌ చేసి ఉపయోగించడం నోస్టాల్జియాతో పాటు చిరంజీవి స్టైల్‌కు మరింత స్వాగ్‌ను జోడించింది. టైటిల్‌ గ్లింప్స్‌ తర్వాత ‘కాకా’ పై అంచనాలు పెరిగాయి’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది.

జనవరి 12 విడుదల  
వెంకటేష్‌–కల్యాణ్‌ రామ్‌ హీరోలుగా ఓ మల్టీస్టారర్‌ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. అనిల్‌ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ఈ సినిమాలో వెంకటేష్‌ సరసన కీర్తీ సురేష్, కల్యాణ్‌ రామ్‌ సరసన కృతీ శెట్టి నటిస్తున్నారు. సురేష్‌ ప్రోడక్షన్స్ , జీ స్టూడియోస్, అర్చన సమర్పణలో షైన్‌ స్క్రీన్స్  బ్యానర్‌పై సాహు గార పాటి నిర్మిస్తున్నారు. ఈ మూవీకి   ‘జనవరి 12 విడుదల’ (బావ బామ్మర్ది సౌజన్యంతో అన్నది ట్యాగ్‌లైన్‌) అనే టైటిల్‌ను ఖరారు చేసి, సినిమాని కూడా జనవరి 12 విడుదల చేయనున్నట్లు ఓ ఫన్నీ వీడియోను ఇటీవల  రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే.

 ‘‘దగ్గుబాటి, నందమూరి కుటుంబాల నుంచి వచ్చిన స్టార్స్‌ని కలిపి ‘జనవరి 12 విడుదల’ చిత్రాన్ని ఒక క్లీన్, టిపికల్‌ ఎంటర్‌టైనర్‌గా అందరికీ కనెక్ట్‌ అయ్యే కథాంశంతో రూపొందిస్తున్నారు అనిల్‌ రావిపూడి. అనిల్‌ ట్రేడ్‌ మార్క్‌ స్టయిల్, హ్యూమర్, ఎమోషన్్స, ఎంటర్‌టైన్‌మెంట్‌తో రూపొందుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులతో కనెక్ట్‌ అయ్యే కంప్లీట్‌ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది.

వెంకటేష్, కల్యాణ్‌ రామ్‌ ఫస్ట్‌ లుక్స్‌ ఇప్పటికే ఈ సినిమాపై ఆసక్తిని పెంచాయి. వెంకటేష్, కల్యాణ్‌ రామ్‌ మధ్య సినిమాలో ఉండే రిలేషన్ ను హైలెట్‌ చేస్తూ ‘బావ బామ్మర్ది సౌజన్యంతో’ అనే ఇంట్రెస్టింగ్‌ ట్యాగ్‌లైన్ ని పెట్టడం జరిగింది. మా సినిమా 2027 సంక్రాంతికి ఫెస్టివ్‌ ట్రీట్‌గా నిలవనుంది. జీవీ ప్రకాష్‌కుమార్‌ సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణగా నిలుస్తుంది’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు.  

దాగుడు మూతల దండాకోర్‌? 
‘ఇరుముడి’ సినిమాతో బ్లాక్‌బస్టర్‌ అందుకున్న రవితేజ ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఈ సక్సెస్‌ని ఎంజాయ్‌ చేస్తున్న ఆయన మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌కు సిద్ధమయ్యారు. రవితేజ హీరోగా నటించనున్న ఈ సినిమాకి హసిత్‌ గోలి దర్శకత్వం వహించనున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్   బ్యానర్‌పై  ‘దిల్‌’ రాజు, శిరీష్‌  నిర్మించనున్న ఈ 64వ సినిమాకి ‘ఎస్‌వీసీ 64’ అనే వర్కింగ్‌ టైటిల్‌ని ఖరారు చేశారు. ఈ కొత్త ప్రాజెక్ట్‌ని మంగళవారం ప్రకటించారు మేకర్స్‌. అంతేకాదు... ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు తెలి పారు.

‘‘రవితేజ, హసిత్‌ గోలి కలిసి ఓ హార్డ్‌కోర్‌ ఎంటర్‌టైనర్‌ మూవీ చేయనున్నారు. తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో కమర్షియల్‌ ఎంటర్‌టైనర్లను రవితేజ మరో స్థాయికి తీసుకెళ్తే... వైవిధ్యమైన కథలు, హ్యూమర్‌తో హసిత్‌ గోలి తనకంటూ గుర్తింపు తెచ్చుకున్నారు. హసిత్‌ గోలి రూపొందించనున్న ఈ కామెడీ డ్రివెన్‌ కాన్సెప్ట్‌లో రవితేజ సరికొత్తగా కనిపిస్తారు. ఈ సంక్రాంతికి రవితేజ నుంచి రానున్న ఈ ఫుల్‌ లెంగ్త్‌ ఎంటర్‌టైనర్‌ ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. ఈ చిత్రానికి సంబంధించిన మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను, టైటిల్‌ని త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్రబృందం తెలిపింది. ఇదిలా ఉంటే... ఈ చిత్రానికి ‘దాగుడు మూతల దండాకోర్‌’ అనే టైటిల్‌ని ఖరారు చేయనున్నారట మేకర్స్‌.  

14న జార్జ్‌ క్రిష్‌  
‘నారి నారి నడుమ మురారి’, ‘బైకర్‌’ వంటి చిత్రాలతో వరుస      విజయాలను అందుకున్న హీరో శర్వానంద్‌ తొలిసారిగా దర్శకుడు శ్రీను వైట్లతో కలిసి ఓ సినిమా చేస్తున్నారు. నిర్మాత అనిల్‌ సుంకర ఏటీవీ సమర్పణలో ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, అజయ్‌ సుంకర సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 16న ప్రారంభమైన ఈ సినిమాకి ‘జార్జ్‌ క్రిష్‌’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేయడంతో పాటు జనవరి 14 సంక్రాంతికి రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ తెలి పారు. ‘‘పూర్తి స్థాయి కుటుంబ కథా చిత్రంగా రూపొందుతున్న సినిమా ‘జార్జ్‌ క్రిష్‌’.

‘శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్‌ రాజా, నారి నారి నడుమ మురారి’ వంటి చిత్రాలతో పండుగ సీజన్ లో గుర్తుండిపోయే విజయాలను అందుకున్న శర్వాకు సంక్రాంతి సెంటిమెంట్‌ చాలా ప్రత్యేకమైనది. ఆ సెంటిమెంట్‌ను కొనసాగిస్తూ ‘జార్జ్‌ క్రిష్‌’ చిత్రాన్ని సంక్రాంతి పండుగ సీజన్ లో విడుదల చేస్తున్నాం. సంక్రాంతి సీజన్‌లో శర్వాకు ఉన్న విజయ వంతమైన ట్రాక్‌ రికార్డ్, కుటుంబ ప్రేక్షకులను అలరించే చిత్రాలకు శ్రీను వైట్లకు ఉన్న పేరు,  ఆసక్తిని రేకెత్తించేలా ఆకర్షణీయంగా రూపొందించిన టైటిల్‌... ఇలా వీటన్నింటితో ‘జార్జ్‌ క్రిష్‌’ పూర్తి స్థాయి పండగ వినోద చిత్రంగా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి కె.వి. గుహన్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తుండగా, అనూప్‌ రూబెన్స్  సంగీతం సమకూరుస్తున్నారు’’ అన్నారు మేకర్స్‌.  

8న మహాకాళి  
‘హను–మాన్‌’ మూవీ ఫేమ్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ వర్మ సినిమాటిక్‌ యూనివర్స్‌లో (పీవీసీయూ) భాగంగా రూపొందిన ఫీమేల్‌ సూపర్‌ హీరో సినిమా ‘మహాకాళి’. భూమిశెట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో అక్షయ్‌ ఖన్నా, రోహిత్‌ సరాఫ్, శ్రియా రెడ్డి, ఖుష్బూ సుందర్, రాకేష్‌ బేడీ, సముద్ర ఖని, జితిన్‌ గులాటి, రజత్‌ కపూర్, మురళీ శర్మ, నార్, బబ్లూ పృథ్వీరాజ్‌ ఇతర లీడ్‌ రోల్స్‌లో నటించారు.

ఈ మైథాలజీ సినిమాకు ప్రశాంత్‌ వర్మ కథ అందించగా, పూజ అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్కేడీ స్టూడియోస్‌ బ్యానర్‌పై ఆర్కే దుగ్గల్, రివాజ్‌ రమేష్‌ దుగ్గల్‌ నిర్మిస్తున్న ఈ మూవీని ప్రపంచవ్యాప్తంగా జనవరి 8న రిలీజ్‌ చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ‘‘మోస్ట్‌ అవైటెడ్‌ హిస్టారికల్‌ స్పెక్టకిల్‌ మూవీ ‘మహాకాళి’. ఈ చిత్రంలో శుక్రాచార్యుడిగా అక్షయ్‌ ఖన్నా పవర్‌ఫుల్‌ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌కి సూపర్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఇప్పటికే ఆయన ఫస్ట్‌ లుక్‌పై ఏర్పడిన క్యూరియాసిటీని ఈ గ్లింప్స్‌ మరింత పెంచింది.

ధర్మం, అధర్మం మధ్య జరిగే మహా సంగ్రామాన్ని ఈ గ్లింప్స్‌ ప్రజెంట్‌ చేస్తోంది. ఇది కేవలం మంచి–చెడు మధ్య జరిగే పోరాటం కాదని, ఓ ప్రపంచ భవిష్యత్తునే నిర్ణయించే స్థాయిలో యుద్ధం ఉండబోతుందనే ఆసక్తిని కలిగిస్తోంది. శ్రియా రెడ్డి కూడా పవర్‌ఫుల్‌ లుక్‌లో కనిపిస్తారు. ‘హను–మాన్‌’ మూవీతో పీవీసీయూకు బలమైన పునాది వేసిన ప్రశాంత్‌ వర్మ భారతీయ ఇతిహాసాలను మోడరన్‌ విజువల్‌ ట్రీట్‌మెంట్‌తో తెరపై ఆవిష్కరించే ప్రయత్నాన్ని         ‘మహాకాళి’తో మరింత భారీ స్థాయికి తీసుకెళ్తున్నారు’’ అని మేకర్స్‌ పేర్కొన్నారు.  

12న సంబరాలు  
సాయిదుర్గా తేజ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘ఎస్‌వైజీ’   (సంబరాల ఏటిగట్టు). ఈ సినిమా ద్వారా రోహిత్‌ కేపీ దర్శకునిగా పరిచయమవుతుండగా ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీలో జగపతిబాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల ఇతర పాత్రలు పోషించారు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్ మెంట్‌పై ‘హను–మాన్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ మూవీ తెరకెక్కించిన కె. నిరంజన్‌ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించారు. ఇటీవలే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమాని జనవరి 12 రిలీజ్‌ చేయనున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు.

‘‘యాక్షన్‌ డ్రామాగా రూపొందిన చిత్రం ‘ఎస్‌వైజీ’ (సంబరాల ఏటిగట్టు)’. ఇందులో సాయిదుర్గా తేజ్‌ పవర్‌ఫుల్‌ పాత్రలో కనిపిస్తారు. బలమైన భావోద్వేగ అంశాలతో పాటు అద్భుతమైన దృశ్యాలు, ఉత్కంఠభరితమైన సన్నివేశాలను మేళవించి ఈ చిత్రాన్ని ఒక ప్రతిష్టాత్మక యాక్షన్‌ డ్రామాగా తీర్చిదిద్దారు దర్శకుడు రోహిత్‌ కేపీ. ‘అసుర ఆగమన’ గ్లింప్స్, ఇతర ప్రమోషనల్‌ కంటెంట్‌కి వచ్చిన అద్భుతమైన స్పందనతో ఈ చిత్రం ఇప్పటికే భారీ అంచనాలను రేకెత్తించింది. షూ టింగ్‌ విజయవంతంగా ముగియడంతో ఆడియన్స్‌కి గొప్ప సినిమాటిక్‌ అనుభూతిని అందించడానికి పోస్ట్‌ ప్రోడక్షన్‌పై దృష్టి పెట్టాం’’ అని చిత్ర నిర్మాతలు పేర్కొన్నారు.

అక్కినేని నాగార్జున హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కింగ్‌ 100’. తన కెరీర్‌లో మైల్‌ స్టోన్‌ మూవీగా తెరకెక్కుతోన్న ఈ మూవీకి పా. రంజిత్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌పై అక్కినేని నాగార్జున నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా విడుదల ఎప్పుడు అనే విషయంపై చిత్రయూనిట్‌ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

ఈ మూవీని డిసెంబరులో విడుదల చేయనున్నారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిర్స్‌లో వినిపించింది. అయితే డిసెంబరులో తన తనయుడు నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘వృషకర్మ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తే... సంక్రాంతికి ‘కింగ్‌  100’ని విడుదల చేయాలన్నది మేకర్స్‌ ఆలోచన అట. పైగా సంక్రాంతి పండగ అంటే నాగార్జునకు బాగా కలిసి వస్తుందనే సెంటిమెంట్‌ కూడా ఉంది. జనవరి 14న రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ చేసే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. 

బాలకృష్ణ హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ నటిస్తున్న ఈ 111వ సినిమాకి ‘ఎన్‌బీకే 111’ అనే వర్కింగ్‌ టైటిల్‌ని ఫిక్స్‌ చేశారు. ‘వీరసింహా రెడ్డి’ వంటి హిట్‌ మూవీ తర్వాత బాలకృష్ణ–గోపీచంద్‌ మలినేని కాంబినేషన్‌లో రూపొందుతోన్న ‘ఎన్‌బీకే 111’ చిత్రంలో మంచు మనోజ్‌ విలన్‌ పాత్రలో నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాని డిసెంబరులో రిలీజ్‌ చేయాలనుకున్నారు మేకర్స్‌. అయితే బాలకృష్ణకు బాగా కలిసొచ్చిన సంక్రాంతికి విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉందట చిత్రయూనిట్‌.  

రజనీకాంత్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ధర్మన్ ’. ‘ది డెడ్లీ డాక్టర్‌’ అనేది ఉప శీర్షిక. అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సిమ్రాన్, రాశీఖన్నా ఇతర పాత్రలు పోషిస్తున్నారు. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్‌నేషనల్‌ పతాకంపై కమల్‌హాసన్, ఆర్‌. మహేంద్రన్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్‌ సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ‘ధర్మన్’ పొంగల్‌ (సంక్రాంతి) సందర్భంగా విడుదల కానుంది. 2027 పొంగల్‌కు రిలీజ్‌ చేస్తున్నామని పోస్టర్‌ కూడా రిలీజ్‌ చేశారు మేకర్స్‌. రజనీకాంత్‌ సినిమా అంటే తెలుగులోనూ రిలీజ్‌ కావడం ఖాయం. ఈ రకంగా ‘ధర్మన్‌’ కూడా సంక్రాంతికి తెలుగు తెరపై సందడి చేయనుంది.  

‘వీరభద్రుడు, విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ వంటి వరుస హిట్స్‌తో ఫుల్‌ జోష్‌లో ఉన్నారు హీరో సూర్య. ఆయన హీరోగా నటించిన 47వ చిత్రానికి ‘ఆవేశం’ మూవీ ఫేమ్‌ జిత్తు మాధవ్‌ డైరెక్టర్‌. ‘సూర్య 47’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రంలో నజ్రియా, ‘ప్రేమలు’ ఫేమ్‌ నస్లీన్  ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని హీరో సూర్య, ఆయన సతీమణి జ్యోతిక నిర్మించారు. ఈ సినిమాని పొంగల్‌కి (సంక్రాంతి) రిలీజ్‌ చేయాలనే ఆలోచనలో యూనిట్‌ ఉందని తెలిసింది. సూర్య చిత్రాలకు తెలుగులోనూ మంచి ఆదరణ ఉంటుంది. ఈ రకంగా ఈ మూవీ టాలీవుడ్‌లోనూ విడుదలవుతుందని ఊహించవచ్చు.  

– డేరంగుల జగన్‌ మోహన్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement