రాకింగ్ స్టార్ యశ్ హీరోగా నటించిన ప్రతిష్ఠాత్మక చిత్రం ‘టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్ (Toxic: A Fairy Tale for Grown-Ups)’ థియేటర్లలో రిలీజ్ కావడానికి ముందే.. చిత్ర బృందం ప్రేక్షకులను ఒక ప్రత్యేకమైన విజ్ఞప్తి చేసింది. ఈ సినిమా తమకు కేవలం ఒక మూవీ మాత్రమే కాదని, ఎన్నో సంవత్సరాల కష్టం, ప్రేమ, శ్రమతో రూపొందించిన సినిమా అని టీమ్ తెలిపింది.
సినిమా కోసం పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ఆర్టిస్ట్, నటీనటుడు, క్రూ మెంబర్ ఎంతో కష్టపడ్డారని, ప్రేక్షకులు కూడా ఈ సినిమాను థియేటర్‌లో చూడాలని కోరింది. ఇప్పటికే సినిమాపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమ, ఆసక్తి, అంచనాలు తమకు ఎంతో ఆనందాన్ని ఇస్తున్నాయని పేర్కొంది.
అయితే.. సినిమా చూసే సమయంలో ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలని టీమ్ కోరింది. థియేటర్లలో సన్నివేశాలను మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని విజ్ఞప్తి చేసింది. ముఖ్యంగా సినిమాలోని కీలక సన్నివేశాలు, ట్విస్టులు లేదా స్పాయిలర్లను ముందుగానే బయటకు చెప్పడం వల్ల సినిమా చూడబోయే వారికి అసలు అనుభూతి దూరమవుతుందని తెలిపింది.
ప్రతి ఒక్కరూ ఎలాంటి స్పాయిలర్ లేకుండా ‘Toxic’ ప్రపంచంలోకి అడుగుపెట్టి, తాము అనుభవించినట్లుగానే తర్వాతి ప్రేక్షకుడు కూడా సినిమాను ఆస్వాదించాలని చిత్ర బృందం కోరింది. అందుకే.. సినిమా నుంచి ఎలాంటి క్లిప్స్‌ను సోషల్ మీడియాలో షేర్ చేయకుండా సహకరించాలని అభిమానులను అభ్యర్థించింది.


