కోడి కూయకముందే తెల్లారినట్టు.. విడుదల కాకముందే ఓ చిత్రం కాసుల వర్షం కురిపిస్తుంది. అడ్వాన్స్ బుకింగ్‌లో సరికొత్త రికార్డు సృష్టిస్తోంది. అదే టాక్సిక్. కేజీఎఫ్ 2’ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ నటించిన ఈ చిత్రం రేపు(ఆగస్టు 26)న తెలుగు, తమిళ,కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో రిలీజ్ కాబోతుంది. పలు భాషల్లో రేపు ఉదయం 6 గంటలకే షోలు ప్రారంభం కానున్నాయి. అయితే విడుదలకు ముందే..అడ్వాన్స్ బుకింగ్ ద్వారా ఈ చిత్రం భారీ వసూళ్లును సాధించింది. కర్ణాటకలోనే కాకుండా తెలుగు, హిందీలోనూ ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. టాలీవుడ్‌లో అయితే ఈ రోజు బుకింగ్స్ ఓపెన్ కాగా.. హాట్ కేకుల్లా టికెట్స్ అమ్ముడు పోయాయి. హిందీ వెర్షన్ గానూ భారీగానే టికెట్స్ బుక్ అవుతున్నాయి. మొత్తంగా అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే ఈ చిత్రానికి రూ. 40 కోట్లకు పైగా వసూళ్లు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.
తెలుగులోనూ హవా..
తెలుగులో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నాడు. ఈ రోజు ఉదయం బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఏపీ, తెలంగాణలో తెల్లవారుజామున 6.30 గంటల నుంచే తొలి షోను ప్రదర్శించనున్నారు. మరోవైపు టికెట్లు ధరలను పెంచేందుకు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 4 వరకు మొత్తం 10 రోజుల పాటు సవరించిన ధరలు అమల్లో ఉండనున్నాయి. ప్రభుత్వాలు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్‌పై అదనంగా రూ.50, మల్టీప్లెక్స్‌లు, ప్రత్యేక థియేటర్లలో రూ.100 వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. తెలంగాణలో జీఎస్టీతో కలిపి సింగిల్ స్క్రీన్‌లో టికెట్ ధర రూ.227గా, మల్టీప్లెక్స్‌లు, ప్రత్యేక థియేటర్లలో రూ.395గా ఉండనుంది. ఏపీలో ఆగస్టు 26న ఉదయం 6 గంటల స్పెషల్ ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించారు. బుకింగ్స్ ఓపెన్ అయిన గంటలోనే టికెట్లన్నీ హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. హైదరాబాద్‌లోని పలు మల్టీప్లెక్స్‌ల్లో రేపటి షోలన్నీ హౌస్‌ఫుల్ అయ్యాయి.
(చదవండి: ‘టాక్సిక్’ కోసం యశ్ ఎంత తీసుకున్నాడు?)
ఫస్ట్‌డే.. 100 కోట్లు పక్కా..
ప్రస్తుతం ఉన్న ఊపుని బట్టి చూస్తే బాక్సాఫీస్ వద్ద టాక్సిక్ సరికొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ చిత్రానికి కర్ణాటక బాక్సాఫీసే అతి పెద్దది. యశ్ సొంత రాష్ట్రంలో రికార్డు స్థాయి కలెక్షన్స్ సాధించడం పక్కా. ఆ తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ చిత్రానికి భారీగా వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. తమిళ, హిందీ భాషలతో కలుపుకొని మొత్తంగా ఫస్ట్‌డే రూ. 100 కోట్లకు పైగా వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫస్ట్ షోకి హిట్ టాక్ వస్తే.. తొలి రోజే రూ. 150 కోట్లను కూడా సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు. మరి రిలీజ్ తర్వాత ఈ చిత్రం ఎన్ని రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.
కేవీఎన్ ప్రొడక్షన్స్, మోన్‌స్టర్ మైండ్ క్రియేషన్స్ బ్యానర్‌లపై వెంకట్ కే నారాయణ, యశ్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించారు. యశ్‌తో కలిసి ఆమె కథ, స్క్రీన్‌ప్లేను రూపొందించారు. నయనతార, కియారా అద్వానీ, హ్యుమా ఖురేషీ, తారా సుతారియా, రుక్మిణీ వసంత్‌లు హీరోయిన్లుగా నటించగా, అక్షయ్ ఒబెరాయ్, డారెల్ డిసిల్వ, సుదేవ్ నాయర్, సంజీదా షేక్, కైల్ పాల్, అమిత్ తివారీ, సుర్జీత్ గోపీనాథ్‌లు కీలకపాత్రలు పోషిస్తున్నారు. రాజీవ్ రవి సినిమాటోగ్రాఫర్‌గా, ఉజ్వల్ కులకర్ణి ఎడిటర్‌గా వ్యవహరించారు. రవి బస్రూర్ నేపథ్య సంగీతం అందించాడు.


