‘భర్త చనిపోతే బోట్టు, గాజులు ఎందుకు తీసెయ్యాలి?’ అంటూ ఇటీవల ప్రముఖ యాంకర్, నటి అనసూయ చేసిన వీడియో పోస్ట్ ఒకటి నెట్టింట బాగా వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందించారు. చాలా మంది అనసూయకు సపోర్ట్‌గానే పోస్టులు పెట్టారు. అలా బొట్టు, గాజులు తీసేయాలని ఏ శాస్త్రంలోనూ లేదని కామెంట్ బాక్సులో రాసుకొచ్చారు. మరికొంతమంది అనసూయను తప్పుపడుతూ పోస్టులు పెట్టారు. ఇదంతా పక్కన పెడితే.. అనసూయ బయటపెట్టిన సందేహాల మాదిరే.. కొన్నేళ్లుగా సమాజంలో పేరుకుపోయిన ఓ కట్టుబాటు వల్ల మహిళలు ఎదుర్కొనే సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ.. ఆ కట్టుబాటు తప్పు అని చాటి చెబుతూ ఓ సినిమా తెరకెక్కించారు. అదే వంద దేవళ్లు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఈ చిత్రం కథేంటి? ఇచ్చిన సందేశం ఏంటి? ఓ లుక్కేద్దాం.
(చదవండి: ‘ఇరుముడి’పై రష్మిక ఎమోషనల్ రివ్యూ)
భార్యభర్తల బంధమనేది అపూర్వం. ఆ అనుబంధమే కుటుంబ శ్రేయస్సుకు ఆధారం. జీవిత ప్రయాణంలో ఎక్కడైనా, ఏ రకంగానైనా ఆ బ్రహ్మముడి పొరపాటున చెరిగితే కుటుంబాలకు కుటుంబాలు కుదేలవుతాయి. అందుకే ఏడు జన్మల బంధం ఆ ఏడడుగుల సంబంధం అంటారు. భార్యభర్తలలో ఎవరో ఒకరు దూరమైతే మిగతా వారి బ్రతుకు భారమే. ఆ సమయంలో ఇటు దూరమైనవారి బాధ ఓ వైపైతే అటు సమాజం నుండి వచ్చే సెగ మరో వైపు. అయితే పోయినవారి కోసం కాకుండా ఉన్నవారి గురించి కన్నవారే ఆలోచిస్తే ఎలా ఉంటుందన్న ఇతివృత్తంతో వచ్చిన సినిమా నూరు దేవుళ్ళు. తమిళ సినిమా నూరు సామి దీనికి మాతృక.నిజానికి ఈ తరహా సినిమాలు ఇదివరకు ఎన్నో చూశాం. కాని ఈ సినిమాలో ఉన్న సహజత్వం, స్వచ్ఛత చాలా రోజుల తరువాత ప్రేక్షకులను పులకరిస్తూ పలకరిస్తుంది. ఇటీవల ప్రముఖ యాంకర్, నటి అనసూయ ఈ విషయంపై చేసిన పోస్ట్ కూడా తెగ వైరలవుతోంది.
ఈ సినిమాలో వర్ధమాన నటులు విజయ్ ఆంటోని, స్వాసిక తమ పాత్రల్లో జీవించారు. మరీ ముఖ్యంగా ఈ సినిమా క్లైమాక్స్ నరాలు తెగే ఉత్కంఠతతో నడుస్తుంది. సినిమా పూర్తయ్యాక చాలా మంది ఓ మంచి ఫీల్ గుడ్ సినిమా చూశామని సంబరపడతారు. అంతలా ఈ సినిమా కథలో ఏముందో ఓ సారి చూద్దాం. ఓ మారుమూల గ్రామంలో ఉన్న సెల్వి అనే వితంతువు కథ ఈ సినిమా. సెల్వికి ఇద్దరు చిన్నపిల్లలు. పెళ్ళైన అతి కొద్ది కాలంలోనే సెల్వి భర్త చనిపోతాడు. అసలే పేదరికంలో ఉన్న సెల్వి భర్త పోయిన బాధను దిగమింగుకోని కనిపించిన ప్రతి పని చేస్తూ పిల్లలను పెంచుతూ ఉంటుంది. కాలం గడుస్తూ పిల్లలకు యుక్తవయసు వస్తుంది. కాని అదే సమయంలో సెల్వికి రెండో పెళ్ళి చేసుకోవాలనిపించి పెద్ద కొడుకైన భాస్కర్ తో తన ఆలోచనను పంచుకుంటుంది. భాస్కర్ ఆ విషయం విన్నాక ససేమిరా అంటాడు. ఇక చేసేదిలేక సెల్వి పెళ్ళి ఆలోచనను విరమించుకుంటుంది.
కాని కొద్ది సమయంలోనే ఇద్దరు పిల్లలు తమ కోసం అష్టకష్టాలు పడుతున్న తల్లికి ఓ తోడుండాలనే నిర్ణయానికి వచ్చి మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని ఒత్తిడి తెస్తారు. పక్క గ్రామంలో భార్యను పోగొట్టుకున్న ఎజుమలై తమ తల్లికి సరైన తోడని వారిద్దరికీ పెళ్ళి చేయాలని నిశ్చయించుకుంటారు. అటు సెల్వి కూడా ఒప్పుకోవడంతో అంతా బాగుంది అనుకునే లోపల సెల్వి బంధువులు, ఆ గ్రామస్తులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు. మరి ఆ పిల్లలు ఆ తల్లి పెళ్ళి చేయగలరా లేదా అన్నది మాత్రం వంద దేవుళ్ళు సినిమాలోనే చూడాలి. ఏది ఏమైనప్పటికీ అవకాశం అందిపుచ్చుకోవడమే కాదు, ఆ అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే ధైర్యం కూడా ఉండాలి అని చెప్పే ఈ సినిమా ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి.


