రవితేజ హీరోగా వచ్చిన లేటేస్ట్ మూవీ ఇరుముడి. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా రాణిస్తోంది. కేవలం రిలీజైన మూడు రోజుల్లోనే రూ.80 కోట్లకు పైగా కలెక్షన్స్‌తో దూసుకెళ్తోంది. హిట్ కావడంతో మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ ఈవెంట్‌కు ఇరుముడి టీమ్ కూడా హాజరైంది. ఈ సందర్భంగా ఇరుముడికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను మూవీ టీమ్ పంచుకుంది. ఈ ఈవెంట్‌లో బేబీ నక్షత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. బేబీ నక్షత్రపై డైరెక్టర్ శివ నిర్వాణ సైతం ప్రశంసలు కురిపించారు.
ఈ మూవీ సూపర్ హిట్ కావడంతో అందరి కళ్లు బేబీ నక్షత్రపై పడ్డాయి. ఈ చిత్రంలో రవితేజ కూతురిగా బేబీ నక్షత్ర మెప్పించింది. దీంతో ఈ అమ్మాయికి ఇరుముడి మేకర్స్ బంపరాఫర్ ఇచ్చారు. భవిష్యత్తులో హీరోయిన్ అవ్వాలనే ఆసక్తి ఉంటే తమ బ్యానర్‌లో హీరోయిన్‌గా అవకాశమిస్తామని ప్రకటించారు. ఈ సందర్భంగా నక్షత్ర అద్భుతంగా నటించారని కొనియాడారు. తన ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసే డైరెక్టర్ శివ నిర్వాణ ఈ అవకాశం ఇచ్చారని బేబీ నక్షత్ర వెల్లడించింది.
తండ్రి లేకపోయినా..
ఈ మూవీలో అందరినీ ఆకట్టుకున్న బేబీ నక్షత్ర గురించి డైరెక్టర్ శివ నిర్వాణ షాకింగ్ విషయాన్ని రివీల్ చేశారు. తండ్రి లేరనే విషయం తెలిసి చాలా బాధగా అనిపించిందని శివ నిర్వాణ వెల్లడించారు. తండ్రి లేని లోటును ఎదుర్కొంటూనే.. ఇంత చిన్న వయసులో ఆమె చూపిస్తున్న ధైర్యానికి నిజంగా అభినందనీయం తెలిపారు. ఈ సందర్భంగా ఆమె తల్లిని స్టేజ్‌పైకి తీసుకొచ్చి ఆమెను అభినందించారు. ఈ సందర్భంగా తన కూతురిని సపోర్ట్ చేసిన దర్శకుడు శివ నిర్వాణకు నక్షత్ర తల్లి ధన్యవాదాలు తెలిపారు.


