కన్నడ భామ రుక్మిణి వసంత్ గురించి ఇప్పుడు పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఏకంగా మూడు పాన్ ఇండియా సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది. ఇప్పటికే ఆమె నటించిన కాంతార చాప్టర్-1 బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆమె కీలక పాత్రలో వస్తోన్న మరో పాన్ ఇండియా చిత్రం టాక్సిక్. యశ్ హీరోగా వస్తోన్న ఈ మూవీ ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. అంతేకాకుండా ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తోన్న డ్రాగన్‌లో రుక్మిణి వసంత్‌నే హీరోయిన్‌గా చేస్తోన్న సంగతి తెలిసిందే.
అయితే ఇదంతా కేవలం మూడేళ్ల గ్యాప్‌లోనే జరిగిందంటే మీరు నమ్ముతారా? అవునండి.. రుక్మిణి వసంత్ మూడేళ్లలోనే మూడు పాన్ ఇండియా మూవీస్‌లో ఛాన్స్ కొట్టేసింది. అంతకుముందు ఆమె ఎవరో కూడా కన్నడ ఇండస్ట్రీలో సరిగా తెలియదు. అలాంటి రుక్మిణి పేరు ఇప్పుడు పాన్ ఇండియా మొత్తం వినిపిస్తుందంటే దానికి కారణం ఓకే ఒక్క మేసేజ్. ఆమె పంపిన ఒక ఇన్‌స్టాగ్రామ్ డీఎమ్ ఆమె కెరీర్‌నే ఒక్కసారిగా మలుపు తిప్పింది. ఇదే విషయాన్ని రుక్మిణి గత ఇంటర్వ్యూలోనే వెల్లడించింది. ఇంతకీ ఆ వివరాలేంటో మనం కూడా తెలుసుకుందాం.
రక్షిత్ శెట్టి హీరోగా వచ్చిన ప్రేమకథా చిత్రం 'సప్త సాగరదాచే ఎల్లో'. ఈ మూవీకి హేమంత్ రావు దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పాత్ర కోసం ఎలా ప్రయత్నించిందో రుక్మిణి వెల్లడించింది. ఇది ఆమె రెండో ప్రాజెక్ట్ కావడం మరో విశేషం. ఈ రోల్ తనకు ఎలా దక్కిందన్న విషయాన్ని గత ఇంటర్వ్యూలో పంచుకుంది. ఈ సినిమా కోసం నటీనటులను ఎంపిక చేస్తున్నారన్న విషయం తెలిసి ఇన్‌స్టాలో నేరుగా దర్శకుడికి ఒక మేసేజ్ చేశానని తెలిపింది.
ఈ సినిమాలో ఛాన్స్ కావాలనే తన పట్టుదల గురించి రుక్మిణి చాలాసార్లు చెప్పింది. కేవలం సోషల్ మీడియాలోనే కాకుండా, ఈమెయిల్స్ ద్వారా పంపినట్లు వివరించింది. అలా ఈ చిత్ర బృందంలోని ఎవరైనా తనను గమనించి ఆడిషన్ ఇస్తారని ఆశించినట్లు తెలిపింది. ఈ మూవీ దర్శకుడు హేమంత్ రావు దాదాపు 10 రోజుల తర్వాత నా ఇన్‌స్టాగ్రామ్ మేసేజ్‌కు స్పందించారని వెల్లడించింది. అలా తనకు సప్త సాగరదాచే ఎల్లో మూవీలో ప్రియా అలియాస్ పుట్టి అనే పాత్ర దక్కేలా చేసిందని రుక్మిణి పేర్కొంది. ఈ మూవీ 2023 సెప్టెంబర్ 1న థియేటర్లలో విడుదలైంది.
అలా కేవలం ఒకే ఒక్క మేసేజ్ రుక్మిణి జీవితాన్నే మార్చేసింది. ఆ తర్వాత మూడేళ్లలోనే మూడు పాన్ ఇండియా చిత్రాల్లో ఛాన్స్‌లు కొల్లగొట్టింది. అయితే అంతకుముందే తెలుగులో 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' చిత్రంతో తెలుగులో అరంగేట్రం చేసింది. ఆ తర్వాత విజయ్ సేతుపతి 'ఏస్' చిత్రంతో తమిళ ఇండస్ట్రీలోనూ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా శివకార్తికేయన్ సరసన 'మదరాసి' చిత్రంలో కూడా నటించింది.


