‘వెలిగొండ’లో క్రెడిట్‌ చోరీ | Chandrababu Govt Credit theft in Veligonda project | Sakshi
Sakshi News home page

తానే శంకుస్థాపన చేసి, తానే పూర్తి చేసినట్లు బాబు అబద్ధాలు..‘వెలిగొండ’లో క్రెడిట్‌ చోరీ

Aug 31 2026 5:26 AM | Updated on Aug 31 2026 5:26 AM

Chandrababu Govt Credit theft in Veligonda project

వెలిగొండ సొరంగాలను పూర్తి చేసి, ప్రారంభించిన నాటి సీఎం వైఎస్‌ జగన్‌ (ఫైల్‌)

జలయజ్ఞంలో భాగంగా 2004 అక్టోబర్‌ 27న వెలిగొండకు శంకుస్థాపన చేసిన నాటి సీఎం వైఎస్సార్‌

రూ.3,581.58 కోట్లు వ్యయం చేసి సింహభాగం పనులు పూర్తి చేయించిన మహానేత 

2014–19 మధ్య వెలిగొండను తన దోపిడీకి ప్రయోగశాలగా మార్చుకున్న చంద్రబాబు

ధరల సర్దుబాటు కింద రూ.630.57 కోట్లు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన వైనం

టీబీఎంల మరమ్మతుల కోసం రూ.66.44 కోట్లు కాంట్రాక్టర్లకు ఇచ్చేసి.. కమీషన్లు వసూలు

చంద్రబాబు దోపిడీని బహిర్గతం చేసిన ‘కాగ్‌’ నివేదిక

2019–24 మధ్య కోవిడ్‌లోనూ వెలిగొండ పనులను పరుగులెత్తించిన మాజీ సీఎం వైఎస్‌ జగన్‌

వైఎస్‌ జగన్‌కు పేరొస్తుందనే దుర్బుద్ధితో నిర్వాసితులకు పునరావాసంలో తీవ్ర జాప్యం

2014–19 మధ్య ఫీడర్‌ కెనాల్‌లో 5.2 కి.మీ. పొడవున గట్ల పనులు అత్యంత నాసిరకంగా చేసిన చంద్రబాబు సర్కార్‌

2024లో కురిసిన వర్షాలకు గట్లకు గండ్లు.. వాటి సాకుతో ఫీడర్‌ కెనాల్‌కు లైనింగ్, రిటైనింగ్‌ వాల్‌ పనులను రూ.456 కోట్లకు అస్మదీయ కాంట్రాక్టర్లకు కట్టబెట్టిన బాబు

సాక్షి, అమరావతి: చంద్రబాబు అధికారంలో ఉండగా వెలిగొండ సొరంగాల తవ్వకాల పనులు జరిగింది కేవలం 6.686 కి.మీ...దివంగత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వాల హయాంలో వెలిగొండ టన్నెళ్లలో తవ్వింది 30.901 కి.మీ...మరి ఎవరి హయాంలో వాయువేగంగా పనులు జరిగాయి? చంద్రబాబు క్రెడిట్‌ చోరీకి వేరే ఇంకేం సాక్షాలు కావాలి? ముఖ్యమంత్రి చంద్రబాబు నిస్సిగ్గుగా మరో క్రెడిట్‌ చోరీకి సిద్ధమయ్యారు! విశాఖలో డేటా సెంటర్‌.. భూముల సమగ్ర రీ సర్వే,.. గత ప్రభుత్వం చేపట్టిన ఇతర కార్యక్రమాలను తన ఖాతాలో వేసుకుంటున్న రీతిలోనే ఆయన దృష్టి తాజాగా ‘వెలిగొండ’ ప్రాజెక్టుపై పడింది. ఈ నెల 31న శ్రీశైలం ప్రాజెక్టు నుంచి జంట సొరంగాలు (ట్విన్‌ టన్నెల్స్‌) ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు విడుదల చేస్తున్నానని.. మూడు దశాబ్దాల కలను సాకారం చేస్తున్నానంటూ ‘ఎక్స్‌’ ద్వారా సీఎం చంద్రబాబు గొప్పగా అబద్ధాలు చెబుతుంటే.. ఎల్లో మీడియా తందానా అంటోంది. వాస్తవానికి వైఎస్సార్‌సీపీ హయాంలో రెండేళ్లు కరోనా ప్రతికూల పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ వెలిగొండలో అత్యంత సంక్లిష్టమైన, ఆసియా ఖండంలోనే అత్యంత పొడవైన జంట సొరంగాల(ట్విన్‌ టన్నెల్స్‌)ను రికార్డు సమయంలో పూర్తి చేసి.. 2024 మార్చి 6న నాటి సీఎం వైఎస్‌ జగన్‌ జాతికి అంకితం చేశారు. 

నల్లమలసాగర్‌లో ముంపునకు గురయ్యే 11 గ్రామాల్లోని 7,321 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పనకు 2024 నాటికే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కాలనీలను సిద్ధం చేసింది. వన్‌టైమ్‌ సెటిల్‌మెంట్‌ కింద నిర్వాసితులకు రూ.1,301.56 కోట్లతో పునరావాసం కల్పించడానికి శ్రీకారం చుట్టింది. 96 నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించి 2024 జనవరి నాటికే పునరావాసం కల్పించింది. మిగతా 7,225 నిర్వాసిత కుటుంబాలకు పునరావాసం కల్పించి.. 2024 సీజన్‌లో శ్రీశైలం ప్రాజెక్టులో నీటిమట్టం 841 అడుగులకు చేరగానే సొరంగాల ద్వారా కృష్ణా జలాలను నల్లమలసాగర్‌కు తరలించి, దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. అయితే వైఎస్‌ జగన్‌కు పేరొస్తుందనే నిర్వాసిత కుటుంబాలకు 26 నెలలుగా పునరావాసం కల్పించకుండా.. నల్లమలసాగర్‌కు కృష్ణా జలాల తరలింపుపై చంద్రబాబు సర్కార్‌ జాప్యం చేస్తూ వచ్చిందని సాగు నీటి రంగ నిపుణులు, రైతులు, రైతు సంఘాల నేతలు ఆక్షేపిస్తున్నారు. నిర్వాసిత కుటుంబాలకు రూ.1,301.56 కోట్ల పరిహారం చెల్లించాల్సి ఉండగా, కేవలం రూ.758 కోట్లను ఇటీవల బాబు సర్కార్‌ చెల్లించింది. బాబు సర్కారు జాప్యం వల్ల ప్రకాశం బ్యారేజీ మీదుగా 2024–25, 2025–26లో వరుసగా 848.96 టీఎంసీలు, 1,652.12 టీఎంసీల చొప్పున కృష్ణా వరద జలాలు సముద్రంలో కలిశాయని సాగునీటి రంగ నిపుణులు గుర్తుచేస్తున్నారు.  

టీడీపీ హయాంలో నాసిరకంగా ఫీడర్‌ కెనాల్‌ పనులు..
గత ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ప్రకారం నిర్వాసితులకు పునరావాసం కల్పించి ఉంటే.. 2024 ఖరీఫ్‌ సీజన్‌లోనే కృష్ణా వరద జలాలను వెలిగొండ జంట సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు విడుదల చేసే అవకాశం ఉండేదని రైతులు చెబుతున్నారు. జంట సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌ను అనుసంధానం చేసే ఫీడర్‌ ఛానల్‌ పనులు 2004 నుంచి 2014 మధ్య చేయగా, మిగిలిన 5.2 కి.మీ.లలో గట్లు (ఎంబాక్‌మెంట్‌) పనులను 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వం అత్యంత నాసిరకంగా చేసింది. దీంతో 2024లో కురిసిన వర్షాలకు టీడీపీ హయాంలో పనులు చేసిన ప్రాంతాల్లో ఫీడర్‌ చానల్‌ కోతకు గురైంది. ఫలితంగా ఇప్పుడు ఫీడర్‌ ఛానల్‌ బలహీనంగా ఉన్న చోట్ల రిటైనింగ్‌వాల్, మిగతా చోట్ల కాంక్రీట్‌ లైనింగ్‌ పనులను రూ.456 కోట్లతో చేపట్టి.. అస్మదీయ కాంట్రాక్టర్‌కు అధిక ధరలకు బాబు సర్కార్‌ కట్టబెట్టడం గమనార్హం.  ఈ వ్యవహారంలో మొబిలైజేషన్‌ అడ్వాన్సుల పేరుతో ముడుపులు వసూలు చేసుకున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి.

‘కొండంత’ స్వప్నాన్ని సాకారం చేసిన మహానేత వైఎస్సార్‌..
శ్రీశైలం ప్రాజెక్టుకు వరద వచ్చే 45 రోజుల్లో రోజుకు 85 క్యూమెక్కులు (3,001 క్యూసెక్కులు) చొప్పున తరలించే సామర్థ్యంతో 7 మీటర్ల వ్యాసం, 18.80 కి.మీ. పొడవుతో సొరంగం తవ్వి.. వెలిగొండ కొండల్లో నిర్మించే నల్లమలసాగర్‌కు తరలించి.. ప్రకాశం జిల్లాలో దుర్భిక్ష ప్రాంతాలకు సాగు, తాగునీళ్లు అందించాలని 1991–93లో డీపీఆర్‌ (సమగ్ర ప్రాజెక్టు నివేదిక) రూపొందించారు. కానీ.. 2004 వరకు ఈ ప్రాజెక్టు పనులను ఎవరూ చేపట్టలేదు. 
⇒ దివంగత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక నదీ జలాలను మళ్లించి తెలుగు నేలను సుభిక్షం చేయడానికి జలయజ్ఞం చేపట్టారు. ఈ క్రమంలో వెలిగొండ ప్రాజెక్టు డీపీఆర్‌ను సమూలంగా మార్చేశారు. కృష్ణా నదికి వరద రోజులు క్రమేణ తగ్గుతున్న నేపథ్యంలో.. శ్రీశైలానికి వరద వచ్చే 45 రోజుల్లోనే రోజుకు 11,584 క్యూసెక్కులు చొప్పున 43.50 టీఎంసీలను తరలించేలా జంట సొరంగాలు (మొదటిది 85 క్యూమెక్కుల సామర్థ్యం, రెండోది 243 క్యూమెక్కుల సామర్థ్యం) తవ్వి.. కొత్తగా 53.85 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించే నల్లమలసాగర్‌లో నిల్వ చేసేలా ప్రణాళిక సిద్ధం చేశారు. తద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో వర్షాభావ ప్రాంతాల్లో 4,47,300 (తీగలేరు కెనాల్‌ ద్వారా 62 వేల ఎకరాలు, తూర్పు ప్రధాన కాలువ ద్వారా 3,70,800, గొట్టిపడియ కాలువ ద్వారా 9,500 ఎకరాలు) ఎకరాల ఆయకట్టుకు నీళ్లందించడంతోపాటు.. ఆ మూడు జిల్లాల్లో 30 మండలాల్లోని 15.25 లక్షల మంది దాహార్తిని శాశ్వతంగా తీర్చాలనే లక్ష్యంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2004 అక్టోబర్‌ 27న పనులకు శంకుస్థాపన చేసి శ్రీకారం చుట్టారు. 
⇒ జలయజ్ఞంలో భాగంగా వెలిగొండ ప్రాజెక్టుకు రూ.3,581.58 కోట్లు ఖర్చు చేసి.. నల్లమలసాగర్‌తోపాటు సొరంగాల్లో చాలా వరకు పనులు పూర్తి చేయించారు. సొరంగాలను నల్లమలసాగర్‌కు అనుసంధానం చేసేలా 21.8 కి.మీల పొడవున 11,585 క్యూసెక్కులను తరలించేలా ఫీడర్‌ ఛానల్‌ పనులను చేపట్టారు. తీగలేరు కెనాల్, తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువ, గొట్టిపడియ కెనాల్‌ పనులను చేపట్టారు.

ఇంజినీరింగ్‌ అద్భుతం.. నల్లమలసాగర్‌  
వెలిగొండ శ్రేణుల్లో సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియ వద్ద కొండల మధ్య ఖాళీ ప్రదేశాల(గ్యాప్‌)ను కలుపుతూ మూడు డ్యామ్‌లు నిర్మించడంతో నల్లమల పర్వత శ్రేణులు, వెలిగొండ కొండల మధ్య 62.40 చదరపు కిలోమీటర్ల ప్రదేశంలో 53.85 టీఎంసీల నిల్వ సామర్థ్యంతో నల్లమలసాగర్‌ సహజ సిద్ధంగా రూపుదిద్దుకుంది. ఇదో ఇంజినీరింగ్‌ అద్భుతమని సాగునీటి రంగ నిపుణులు అభివర్ణిస్తున్నారు. నల్లమలసాగర్‌ పనులను మహానేత వైఎస్సార్‌ పూర్తిచేశారు.

హామీని నిలబెట్టుకున్న వైఎస్‌ జగన్‌..
వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తానని తన పాదయాత్రలో వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. మాట మేరకు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే వెలిగొండను పూర్తి చేయడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. రెండేళ్లు కరోనా మహమ్మారి ప్రభావం వల్ల పనులు చేయలేని పరిస్థితి. అయినా సరే.. మొదటి సొరంగం పనుల్లో మిగిలిన 2.883 కిలోమీటర్ల పనులను 2019 నవంబర్‌లో ప్రారంభించి.. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ 2021 జనవరి 13 నాటికి పూర్తి చేయించారు. 
⇒ 2014–19 మధ్య టీడీపీ హయాంలో మొదటి సొరంగం రోజుకు సగటున 2.41 మీటర్ల మేర తవ్వితే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో రోజుకు సగటున 4.12 మీటర్ల మేర తవ్వడం గమనార్హం. శ్రీశైలం రిజర్వాయర్‌ నుంచి మొదటి సారంగం ద్వారా నల్లమలసాగర్‌కు నీటిని విడుదల చేసే హెడ్‌ రెగ్యులేటర్‌ పనులను అదే ఏడాది (2021) పూర్తి చేయించారు. 
⇒ రెండో సొరంగంలో మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని 2019 ఎన్నికలకు ముందు భారీగా పెంచేసిన చంద్రబాబు.. వాటిని అధిక ధరలకు కట్టబెట్టి ప్రజాధనాన్ని దోచి పెట్టారు. వాటిని రద్దు చేసిన వైఎస్‌ జగన్‌.. రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించి, టీడీపీ సర్కార్‌ అప్పగించిన ధరల కంటే రూ.61.76 కోట్లు తక్కువకు పూర్తి చేసేందుకు ముందుకొచ్చిన సంస్థకు 7.698 కిలోమీటర్ల సొరంగం పనులను అప్పగించారు. తద్వారా చంద్రబాబు అక్రమాలను ప్రజల ముందు పెట్టారు.  

⇒ రెండో సొరంగంలో టీబీఎం (టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌)కు కాలం చెల్లడంతో రోజుకు ఒక మీటర్‌ పని జరగడం కష్టంగా మారింది. దాంతో 2022లో మనుషుల ద్వారా పనులు చేయించాలని అధికారులకు వైఎస్‌ జగన్‌ దిశా నిర్దేశం చేశారు. మొదటి సొరంగం నుంచి రెండో సొరంగంలోకి 17.8 కి.మీ, 16.555 కి.మీ, 14.5 కి.మీ, 13.5 కి.మీ, 12.5 కి.మీ వద్ద సొరంగాలను తవ్వి.. అక్కడ మనుషులతో సొరంగాన్ని తవ్వించేలా పనులు చేపట్టా­రు. తద్వారా రికార్డు సమయంలో 7.685 కి.మీల 
పొడవున సొరంగం తవ్వకం పనులను 2024 జనవరి 21 నాటికి పూర్తి చేయించారు. హెడ్‌ రెగ్యులేటర్‌ పనులు కూడా పూర్తి చేశారు. 
⇒ శ్రీశైలానికి వరద వచ్చేలోగా రెండో సొరంగం నుంచి టీబీఎంను బయటకు తీయడానికి ప్రణాళిక సిద్ధం చేశారు. 2014–19 మధ్య చంద్రబాబు హయాంలో రెండో సొరంగం రోజుకు సగటున 1.31 మీటర్ల మేర తవ్వితే.. వైఎస్‌ జగన్‌ ప్రభుత్వ హయాంలో రోజుకు 7.25 మీటర్లు (టీబీఎం ద్వారా 1.45, మనుషుల ద్వారా 6.80 మీటర్లు) తవ్వడం గమనార్హం. 
⇒ 2014–19లో టీడీపీ సర్కార్‌ చేపట్టకుండా నిర్లక్ష్యం చేసిన తీగలేరు కాలువను నల్లమల సాగర్‌కు అనుసంధానం చేసేలా సొరంగం, హెడ్‌ రెగ్యులేటర్, తూర్పు ప్రధాన కాలువను నల్లమలసాగర్‌కు అనుసంధానం చేసేలా సొరంగం తవ్వకం పనులను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించింది. శ్రీశైలంలోకి కృష్ణా వరద జలాలు వచ్చిన వెంటనే.. సొరంగాల ద్వారా నల్లమలసాగర్‌కు తరలించి.. ఆయకట్టుకు నీళ్లందించడానికి లైన్‌ క్లియర్‌ చేశారు. 

⇒ 2019–24 మధ్య కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ.. ఆర్థిక ఇబ్బందుల్లోనూ వెలిగొండ ప్రాజెక్టుకు రూ.1,046.46 కోట్లను వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాజెక్టు పనులకు పెట్టిన ప్రతి పైసా సద్వినియోగమయ్యేలా జాగ్రత్తలు తీసుకుని శరవేగంగా పూర్తి చేయించింది. 
⇒ వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేయడం ద్వారా ప్రకాశం, నెల్లూరు, వైఎస్సార్‌ కడప జిల్లాల్లో దుర్భిక్ష ప్రాంతాల్లోని 4.47 లక్షల ఎకరాలకు సాగునీటి సరఫరాకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మార్గం సుగమం చేసింది. ఆ మూడు జిల్లాల్లోని 30 మండలాల్లో 15.25 లక్షల మంది తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపింది. 
⇒ వెనుకబడిన ఉమ్మడి ప్రకాశం జిల్లా సమగ్రాభివృద్ధికి వైఎస్‌ జగన్‌ రూపొందించిన ప్రణాళికలో భాగంగా దొనకొండలో ఏర్పాటు చేసే మెగా ఇండస్ట్రియల్‌ హబ్‌కు 2.58 టీఎంసీలు, పామూరు నిమ్జ్‌ (నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ మాన్యుపాక్చరింగ్‌ జోన్‌)కు 1.27 టీఎంసీల సరఫరాకు లైన్‌ క్లియర్‌ చేశారు. దొనకొండ, పామూరు ప్రాంతాల్లో పారిశ్రామికాభివృది్ధకి ఊతం ఇవ్వడం ద్వారా యువతకు భారీగా ఉపాధి అవకాశాలను కల్పించేలా ప్రణాళిక రూపొందించారు.

అప్పుడూ ఇప్పుడూ  బాబు సర్కార్‌ దోపిడీ..
2014–19 మధ్య జరిగిన అక్రమాలను కడిగేసిన కాగ్‌
⇒ ఎన్టీఆర్‌కు 1995లో వెన్నుపోటు పొడిచి అధికారాన్ని చేజిక్కించుకున్నాక.. 1996 లోక్‌సభ ఎన్నికల రూపంలో ఎదురైన తొలి గండాన్ని గట్టెక్కేందుకు.. అదే ఏడాది మార్చి 5న గొట్టిపడియ వద్ద నాటి సీఎం చంద్రబాబు వెలిగొండకు హడావుడిగా శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత 1996 నుంచి 2004 వరకు ఈ ప్రాజెక్టు కోసం వెచ్చించింది కేవలం రూ.పది లక్షలే. అదీ శంకుస్థాపన సందర్భంగా నిర్వహించిన సభ ఏర్పాట్లు, ఖర్చుల కోసమే వ్యయం చేశారు. అప్పట్లో చంద్రబాబు పనులు చేపట్టి ఉంటే.. తెలుగుగంగ ప్రాజెక్టుకు కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌)–2 నీటిని కేటాయించినట్లే వెలిగొండ ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు చేసి ఉండేదని సాగు నీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

⇒ విభజన నేపథ్యంలో 2014లో మళ్లీ అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ప్రజాధనాన్ని దోచుకోవడానికి వెలిగొండ ప్రాజె­­క్టును ప్రయోగశాలగా మార్చుకున్నారు. 2014 నుంచి 2019 వరకు రూ.1,414.51 కోట్లు ఖర్చు చేసినా పనుల్లో ఏమాత్రం ప్రగతి కనిపించకపోవడమే చంద్రబాబు సర్కార్‌ దోపిడీకి నిదర్శనం. జీవో 22 (ధరల సర్దుబాటు), జీవో 63 (పనుల పరిమాణం ఆధారంగా బిల్లుల చెల్లింపు)ను వర్తింపజేసి కాంట్రాక్టర్లకు ఉత్తినే రూ.630.57 కోట్లు దోచిపె­ట్టారు. 2017 నాటికే వెలిగొండను పూర్తి చేస్తామని ప్రకటించి టీబీఎం (టన్నెల్‌ బోరింగ్‌ మెషీన్‌)ల మరమ్మతుల కోసం కాం­ట్రా­క్టర్లకు రూ.66. 44 కోట్లను ఇచ్చేసి, కమీషన్లు వసూలు చేసుకున్నారు. మరమ్మతులు చేయకపోవడం వల్ల టీబీ­ఎంలు ఎందుకూ పనికి రాకుండా పోవడమే అందుకు నిదర్శనం. 
⇒ 2017.. 2018.. 2019.. ఇలా ఎప్పటికప్పుడు వెలిగొండ పూర్తి చేస్తామంటూ హామీలు ఇస్తూ వచ్చిన చంద్రబాబు రెండో సొరంగం పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌ను తొలగించి, మిగిలిన పనుల అంచనా వ్యయాన్ని పెంచి.. వాటిని అధిక ధరలకు మరో కాంట్రాక్టర్‌కు కట్టబెట్టి, కమీషన్లు వసూలు చేసుకుని ప్రాజెక్టు పనులను గాలికి వదిలేశారు. వెలిగొండ ప్రాజెక్టులో ఈ దోపిడీని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) కడిగి పారేసింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement