ఏపీ జేఏసీ చైర్మన్ ఎ.విద్యాసాగర్
సాక్షి, అమరావతి: తమ సమస్యల పరిష్కారం కోసం నిరీక్షిస్తున్న ఉద్యోగుల్లో సహనం నశిస్తోందని, సెప్టెంబర్ 5లోపు ఉద్యోగుల సమస్యలకు పరిష్కార మార్గాలను చూపకపోతే ఉద్యమ మార్గంలోకి వెళ్లక తప్పదని ఏపీ జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీవో అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.విద్యాసాగర్ స్పష్టం చేశారు. ఉద్యోగుల డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 5న 200కు పైగా ఉద్యోగ సంఘాలతో జరిగే రాష్ట్ర జేఏసీ సమావేశంలో భవిష్యత్ ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. విజయవాడలో ఆదివారం ఆయన మాట్లాడారు.
పీఆర్సీ, 5 డీఏలు, సరెండర్ లీవ్‌లు, ఇతర బకాయిలతో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఇకనైనా ప్రభుత్వం స్పందించి.. వెంటనే చర్చలకు పిలవాలని కోరారు. చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలన్నారు. గతంలో చర్చలు జరిగినా.. పీఆర్సీ, డీఏలు, ఇతర బకాయిలపై ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదన్నారు.
రాష్ట్రంలోనే ప్రధాన జేఏసీగా బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నామని, చర్చలు సామరస్య వాతావరణంలో జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వం సెపె్టంబర్ 5లోపు సమస్యల పరిష్కారానికి స్పష్టమైన మార్గాలను ప్రకటించాలని కోరారు. 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వం విడతల వారీగానైనా వాటిని చెల్లించాలని కోరారు. 2020 నుంచి సరెండర్ లీవ్‌ల చెల్లింపులు నిలిచిపోయాయని, వాటిని కూడా వెంటనే చెల్లించాల్సిన అవసరం ఉందన్నారు.
స్వయంగా చంద్రబాబే హామీలిచ్చారు
పీఆర్సీ, డీఏలు ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు స్వయంగా ప్రకటించారని, ఆ హామీలను అమలు చేయాలని ఉద్యోగులు కోరుతున్నారని విద్యాసాగర్ తెలిపారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను కూడా ప్రభుత్వం పరిష్కరించాల్సి ఉందన్నారు. ఏపీ జేఏసీ సెక్రటరీ జనరల్ కేఎస్‌ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ.. ఇప్పటికైనా ప్రభుత్వం చర్చలకు పిలిచి సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తున్నామన్నారు. ఈనెల 31లోపు చర్చలకు పిలవాలని కోరారు.
హెల్త్ కార్డులు, పెన్షనర్లకు ఎడిషనల్ క్వాంటం పెన్షన్.. కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయన్నారు. లక్షలాది మంది ఉద్యోగులు ఇప్పుడు ఏపీ జేఏసీ ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. సమావేశంలో ఏపీ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ నేత సాంబశివరావు, ఏపీటీఎఫ్ 257 నాయకుడు బసవ లింగేశ్వరరావు, పెన్షనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేశ్వర్లు, టీ అండ్ ఏ గెజిటెడ్ సర్వీసెస్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజు, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు జానీ బాషా పాల్గొన్నారు.


