కొల్లంవాగులో 3 అడుగుల మేర గేట్లు ఎత్తిన అధికారులు
పెద్దదోర్నాల: మార్కాపురం జిల్లా పెద్దదోర్నాల మండలం కొత్తూరు వద్ద చేపట్టిన పూలసుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టుకు అధికారులు ట్రయల్ రన్ నిర్వహించారు. సోమవారం సీఎం చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభిస్తున్న నేపథ్యంలో అధికారులు ఆదివారం ట్రయల్ రన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ముందుగా సైరన్ మోగించి దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తం చేశారు. మధ్యాహ్నం ఇరిగేషన్ అధికారులు శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లోని కొల్లంవాగు వద్దనున్న హెడ్ రెగ్యులేటర్ గేట్లను 3 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. దీంతో వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన కొత్తూరు వద్దనున్న ఉమ్మడి సొరంగాల వద్దకు 3 గంటల సమయంలో కృష్ణా జలాలు చేరాయి.
అనంతరం గంటవానిపల్లె వద్ద ఏర్పాటు చేసిన రెగ్యులేటర్‌ల వద్దకు చేరిన నీటిని గంట పాటు నల్లమలసాగర్ రిజర్వాయర్ వైపునకు విడుదల చేసి ఆపై గంటవానిపల్లె వద్ద గేట్లను మూసివేశారు. అనంతరం అక్కడ నీటిని స్టోరేజి చేసి సోమవారం సీఎం చేతుల మీదుగా జలహారతికి అవసరమయ్యేలా నీటిని నిలిపి ఉంచారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ హర్షవర్ధన్‌రాజు పర్యవేక్షించారు. మంత్రులు కొలను పార్ధసారథి, ఆనం రామనారాయణరెడ్డి, గొట్టిపాటి రవికుమార్, నిమ్మల రామానాయుడు, డీబీవీ స్వామి తదితరులు పాల్గొన్నారు.


