చెదిరిన ఊళ్లు.. చెమర్చిన కళ్లు! | - | Sakshi
Sakshi News home page

చెదిరిన ఊళ్లు.. చెమర్చిన కళ్లు!

Aug 31 2026 3:14 AM | Updated on Aug 31 2026 3:14 AM

● ముంచెత్తిన ‘వేదన’
కన్నీటి వరదలో ‘వెలిగొండ’ ముంపు గ్రామాలు!

గొట్టిపడియ గ్రామాన్ని వీడలేక వీడుతున్న స్థానికులు

సాక్షి ప్రతినిధి, ఒంగోలు/మార్కాపురం రూరల్‌/

పెద్దారవీడు:

వెలిగొండ ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేశామని ప్రచారం చేసుకునే తాపత్రయమే తప్ప.. నిర్వాసితులకు న్యాయం చేయాలన్న కనీస మానవతా దృక్పథం చంద్రబాబు సర్కారులో లేశమంతైనా కానరావడం లేదు. నిర్వాసితులను బెదిరించి, గ్రామాల్లో భయోత్పాతం సృష్టించేందుకు అధికార బలాన్ని ప్రయోగిస్తున్న తీరు బాబు సర్కారు నిరంకుశత్వానికి నిదర్శనమని ప్రజా సంఘాలు విమర్శిస్తున్నాయి.

ప్రభుత్వం గతంలో ఇచ్చిన గెజిట్‌లో పేర్లు ప్రచురితమైనప్పటికీ, క్షేత్రస్థాయి ప్యాకేజీ జాబితాలోకి వచ్చేసరికి పేర్లు గల్లంతు కావడం వెనుక అధికారుల తీవ్ర బాధ్యతారాహిత్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఒకే కుటుంబంలో కొందరికి ప్యాకేజీ మంజూరు చేసి, మిగిలిన వారికి మొండిచేయి చూపుతూ వ్యత్యాసాలకు తెరలేపారు. గతంలో అధికారులు ఫొటోలు తీసే సమయంలో పొట్టకూటి కోసం పొరుగు ప్రాంతాలకు వెళ్లిన పేద రైతులు, కూలీల వివరాలను నమోదు చేయలేదు. ప్రస్తుతం వారి వద్ద ఆధార్‌, రేషన్‌ కార్డులు వంటి పక్కా ఆధారాలు ఉన్నప్పటికీ జాబితాలో చోటు కల్పించకుండా కార్యాలయాల చుట్టూ తిప్పుకొంటున్నారు. కనీసం నడవలేని స్థితిలో ఉన్న దివ్యాంగులకు సైతం పరిహారం అందకపోవడం బాబు సర్కారు నిరంకుశ వైఖరికి అద్దం పడుతోంది. గ్రామంలో ఉండగానే న్యాయం చేయని అధికారులు, ఊరు విడిచి బయటకు వెళ్లాక పరిహారం ఇస్తారని ఎలా నమ్మాలని, అప్పుడు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలని బాధితులు నిలదీస్తున్నారు.

ప్రాజెక్టులోకి నీటిని విడుదల చేస్తున్నామని ప్రచార ఆర్భాటం చేసుకోవడం కోసం అర్హులైన నిర్వాసితులకు అందాల్సిన ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీని నీరుగారుస్తున్నారనే అనుమానాలు బాధితుల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు తాగు, సాగునీరు అందించడానికి తాము ఎన్నడూ అడ్డు చెప్పలేదని, తమకు న్యాయబద్ధంగా రావాల్సిన పరిహారం, ఇంటి పట్టాలు ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టులోకి నీటిని పంపాలని గ్రామస్తులు స్పష్టం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాల్సింది పోయి త్వరలోనే గ్రామాలకు బస్సు రాకపోకలను, నివాస విద్యుత్‌ సరఫరాను పూర్తిగా నిలిపివేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు. గ్రామాల్లో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయడంతో ముంపు ప్రజలు తీవ్ర భయాందోళనల నడుమ కాలం వెళ్లదీస్తున్నారు.

అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో రైతులు భారీగా అప్పులు తెచ్చి మూడు నెలల క్రితం ఎకరాకు రూ.20 వేల ఖర్చుతో పత్తి, రూ.50 వేల పెట్టుబడితో మిరప సాగు చేశారు. గుండంచర్ల గ్రామంలో 500 ఎకరాల్లో పత్తి, 100 ఎకరాల్లో మిరప, కలనూతలలో 600 ఎకరాల్లో పత్తి, 150 ఎకరాల్లో మిరప, సుంకేసులలో మరో 800 ఎకరాల్లో పత్తి, మిరపతో పాటు ఆముదం, అరటి తోటలు సాగయ్యాయి. పైర్లన్నీ పూత, పిందె, కాయ దశకు చేరుకుని చేతికొచ్చే సమయంలో గ్రామాలు ఖాళీ చేయాలంటూ ఆదేశించడంతో రైతుల గుండెలు పగిలాయి. దీనికితోడు విద్యుత్‌ శాఖాధికారులు వ్యవసాయ మోటార్లకు కరెంట్‌ తొలగించి ట్రాన్స్‌ఫార్మర్లను తరలించుకుపోవడంతో, కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలు నీరందక కళ్లముందే నిలువునా ఎండిపోయాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో పచ్చటి పత్తి చేలల్లోకి గొర్రెలు, మేకలను తోలాల్సి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

కరువు సీమలో బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు, లక్షలాది గొంతుల దాహం తీర్చేందుకు.. తమ పురిటిగడ్డను, సర్వస్వాన్నీ త్యాగం చేసిన వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల ప్రజల బతుకులు నేడు కన్నీటి సుడిగుండంలో చిక్కుకున్నాయి. తరతరాలుగా తాము నమ్ముకున్న భూమిని, చిన్ననాటి జ్ఞాపకాలను, రక్తమాంసాలు ధారపోసి నిర్మించుకున్న ఇళ్లను ఖాళీ చేసి వెళ్లాల్సిన వేళ.. చంద్రబాబు ప్రభుత్వం నిర్వాసితులతో అత్యంత అమానవీయంగా వ్యవహరిస్తోంది. ఆర్‌అండ్‌ఆర్‌ పరిహారం పూర్తి స్థాయిలో అందించకుండా, పునరావాస కేంద్రాల్లో ఇంటి పట్టాలు కేటాయించకుండానే బాధితులను గ్రామాల్లో నుంచి బలవంతంగా గెంటేసేందుకు అధికారులు యత్నిస్తుండటం నిర్వాసితులను తీవ్ర ఆవేదనకు గురిచేస్తోంది. మార్కాపురం మండలం గొట్టిపడియ, పెద్దారవీడు మండలం గుండంచర్ల, కలనూతల, సుంకేసుల తదితర ముంపు గ్రామాల్లో ప్రస్తుతం నెలకొన్న హృదయవిదారక పరిస్థితులు ప్రభుత్వ నిర్లక్ష్యానికి, పాలకుల రాతి గుండెలకు నిదర్శనంగా నిలుస్తున్నాయి.

ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ, ఇంటి పట్టాలు పూర్తిగా ఇవ్వకుండానే నిర్వాసితులపై నిర్బంధం

గెజిట్‌లో పేర్లున్నా ప్యాకేజీ జాబితాలో గల్లంతు.. దివ్యాంగులకు అందని పరిహారం

పూత, పిందె దశలో ఉన్న పత్తి, మిరప పైర్లు.. రూ.లక్షల పెట్టుబడి వృథా

రూ.2 లక్షల మోటార్లు రూ.70 వేలకు, రూ.1.5 లక్షల ఎడ్లజత రూ.60 వేలకే విక్రయం

ముంపు గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం, బస్సులు నిలిపివేత.. భారీగా పోలీసుల మోహరింపు

పుట్టి పెరిగిన మట్టిని వీడలేక కన్నీటి పర్యంతమవుతున్న నిర్వాసిత కుటుంబాలు

సర్వస్వం త్యాగం చేసినా బాబు సర్కారు దగా..

చేతికొచ్చిన పంటలు బూడిదపాలు

నీటి విడుదల నెపంతో నిర్బంధం

అర్హుల పేర్లు గెజిట్‌లో గల్లంతు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement