● రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
సీతారామపురం: అతను కుమార్తెను బడిలో వదిలాడు. పనికి అవసరమైన సామగ్రి తీసుకుని ఇంటికి బయలుదేరాడు. అయితే విధి చిన్నచూపు చూడటంతో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. మండలంలోని సీతారామపురం – పోరుమామిళ్ల ఘాట్ రోడ్డు మార్గంలో ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో మార్కాపురం జిల్లా సీఎస్ పురం మండలం నల్లమడగల ఎస్సీ కాలనీకి చెందిన గుడిగుంట్ల నారాయణ (45) అనే వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల కథనం మేరకు.. నారాయణ ఆదివారం ఉదయం ఇంటి నుంచి తన కుమార్తెను మోటార్ బైక్‌పై వైఎస్సార్ కడప జిల్లాకు తీసుకెళ్లి ఓ పాఠశాలలో వదిలిపెట్టాడు. తిరుగు ప్రయాణంలో అత్తగారి గ్రామమైన సాయిశెట్టిపల్లెకు వెళ్లి అక్కడున్న బేల్దారి సామగ్రిని తీసుకుని స్వగ్రామానికి బయలుదేరాడు. దారిలో ఘాట్ రోడ్డులోని ఓ మలుపు వద్దకు వచ్చేసరికి బైక్ అదుపుతప్పి కింద పడటంతో తలకు బలమైన గాయమై మృతిచెందాడు. అటుగా వెళ్లే ప్రయాణికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉదయగిరి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.


