అంబాపురంలో స్థల వివాదంలో ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

అంబాపురంలో స్థల వివాదంలో ఘర్షణ

Aug 31 2026 3:14 AM | Updated on Aug 31 2026 3:14 AM

కొనకనమిట్ల: మండలంలోని వాగుమడుగు పంచాయతీ అంబాపురంలో ఆదివారం జరిగిన ఘర్షణలో వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన పొడతరపు గంగయ్య ఇంటి స్థలాన్ని ఆయన బంధువులైన పొడతరపు శ్రీనివాసరావు, శివయ్యలు అక్రమంగా రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. దీనిపై గంగయ్య న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, కోర్టు ఆయనకే అనుకూలంగా తీర్పునిచ్చింది. అయినప్పటికీ ఆ స్థలాన్ని బ్యాంకులో తనఖా పెట్టి రుణం పొందేందుకు శ్రీనివాసరావు, శివయ్యలు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గుర్తించిన గంగయ్య బ్యాంకు అధికారులకు అసలు వాస్తవాలను వివరించారు. దీంతో కక్ష పెంచుకున్న శివయ్య, పొడతరపు శ్రీనివాసరావు, మల్లికార్జున్‌, వెంకటస్వామి కలిసి పొడతరపు గంగయ్య, కట్లా చక్రవర్తి, గురువర్థన, గురవమ్మలతో గొడవపడి వారిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడిలో నలుగురూ తీవ్రంగా గాయపడగా, వారిని వెంటనే పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వీరిలో చక్రవర్తి, గురువర్థన్‌ల తలలకు ఎనిమిదేసి కుట్లు పడ్డాయి. ఈ ఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి, మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు తనయుడు కృష్ణచైతన్య పొదిలి ప్రభుత్వ వైద్యశాలకు చేరుకుని బాధితులను పరామర్శించారు. ఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకుని వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఆయన వెంట ఎంపీపీ మోరుబోయిన మురళీకృష్ణ, మండల పార్టీ అధ్యక్షుడు మోరా శంకర్‌రెడ్డి తదితర పార్టీ నాయకులు ఉన్నారు.

వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడి..

నలుగురికి గాయాలు

బాధితులను పరామర్శించిన

మాజీ ఎమ్మెల్యే అన్నా తనయుడు కృష్ణచైతన్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement