నీటమునిగిన కారు
సీఎం ప్రారంభించి నీరొదిలిన తొలి రోజే అపశ్రుతి
ముంపు గ్రామం కలనూతల వద్ద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయిన కారు
ఇద్దరు గల్లంతు.. చెట్టెక్కి బిక్కుబిక్కుమంటున్న మరో ముగ్గురు
పెద్దారవీడు/మార్కాపురం రూరల్: వెలిగొండ టన్నెల్స్ నుంచి నల్లమల సాగర్‌కు నీరు విడుదల చేసిన తొలిరోజే తీవ్ర అపశ్రుతి చోటుచేసుకుంది. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా నీరు విడుదల చేయడం ఐదుగురి ప్రాణాల మీదకు తెచ్చింది. వీరిలో ఇద్దరు గల్లంతవ్వగా, మిగతా ముగ్గురు చెట్టుపైకి ఎక్కి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని దయనీయ పరిస్థితిలో ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తున్నారు. సోమవారం రాత్రి 7.30 గంటల సమయంలో పెద్దారవీడు మండలం కలనూతల సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికులను దిగ్భ్రాంతికి గురిచేయగా.. అధికార యంత్రాగాన్ని పరుగులు పెట్టించింది.
కలనూతలకు చెందిన నల్లబోతుల శ్రీనివాసులు మార్కాపురం పవర్ ఆఫీస్ వెనుక భాగంలో 3 నెలలుగా నివాసం ఉంటున్నాడు. సోమవారం మార్కాపురం పట్టణం 10వ వార్డుకు చెందిన మరో నలుగురు మిత్రులతో కలిసి వ్యాపారం నిమిత్తం కారులో అర్ధవీడు మండలం గన్నేపల్లికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో వెలిగొండ ప్రాజెక్టు జలాలను చూడాలన్న ఆసక్తితో కలనూతల–సుంకేసుల మార్గంలో వచ్చారు. కలనూతల దాటాక జెడ్పీ హైసూ్కల్ సమీపంలో వెలిగొండ నుంచి వదిలిన నీరు రోడ్డుపై ఉధృతంగా ప్రవహిస్తోంది. వీరి ముందు వెళ్తున్న టిప్పర్ సురక్షితంగా దాటడంతో, వీరు కూడా ధైర్యం చేసి కారును ముందుకు పోనిచ్చారు. అయితే నీటి ప్రవాహ తీవ్రత ఎక్కువగా ఉండటంతో కారు ఒక్కసారిగా కొట్టుకుపోయింది.
చెట్టెక్కి సెల్‌ఫోన్ లైట్లతో కేకలు
ప్రవాహంలో కొట్టుకుపోతున్న కారు సమీపంలోని చెట్టుకు బలంగా ఢీకొనడంతో ముగ్గురు యువకులు వెంటనే తేరుకుని ప్రాణభయంతో ఆ చెట్టుపైకి ఎక్కగా, మిగతా ఇద్దరు నీటిలో కొట్టుకుపోయారు. నీటి ప్రవాహం దాదాపు 100 అడుగుల వెడల్పున ఉధృతంగా ప్రవహిస్తుండటం, ఎప్పుడు ఏ క్షణాన చెట్టు కూలిపోతుందోనన్న భయంతో ముగ్గురు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. సెల్‌ఫోన్ టార్చ్‌లైట్లు వేస్తూ, కాపాడాలంటూ గట్టిగా కేకలు వేశారు. ప్రమాద సమయంలో కలనూతల వైపు 10 మంది.. సుంకేసుల మార్గం వైపు 10 మంది స్థానికులు ఉన్నప్పటికీ, నీటి ఉధృతి తీవ్రంగా ఉండటంతో వారెవరూ దగ్గరకు వెళ్లి రక్షించే సాహసం చేయలేకపోయారు. ప్రవాహం అంతకంతకూ పెరగడంతో స్థానికులు సైతం ప్రాణ భయంతో వెనక్కు పరుగులు తీశారు.
అధికారుల పర్యవేక్షణ లోపంపై ఆగ్రహం
ట్రయల్ రన్‌లో భాగంగా ఆదివారం వదిలిన నీరే కలనూతల, సుంకేసుల గ్రామాలను చుట్టుముట్టగా, సోమవారం ప్రాజెక్టు నుంచి సీఎం అధికారికంగా నీటిని విడుదల చేయడంతో ఉధృతి మరింత పెరిగింది. ఇంత పెద్దఎత్తున నల్లమల సాగర్‌కు నీరు వదులుతున్నప్పుడు పుచ్చకాయలపల్లి వద్ద బందోబస్తు ఏర్పాటు చేసి, రాకపోకలను నియంత్రించి ఉంటే ఈ ప్రమాదం జరిగేది కాదని స్థానికులు మండిపడుతున్నారు.
కాగా ప్రమాద సమాచారం అందుకున్న జేసీ శ్రీనివాసులు, ఓఎస్డీ నవజ్యోత్ మిశ్రా, మార్కాపురం డీఎస్పీ నాగరాజు, పెద్దారవీడు ఎస్సై సైదుబాబు, ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలపై సమీక్షిస్తున్నారు. ఎస్డీఆర్‌ఎఫ్ సిబ్బందిని రప్పించారు. అర్ధరాత్రి కావడం.. నీటి ఉధృతి తీవ్రంగా ఉండటంతో సహాయక చర్యల్లో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. విద్యుత్ స్తంభాలకు తాళ్లు కట్టేందుకు యత్నించి విరమించుకున్నారు. చివరకు భారీ క్రేన్‌తో పాటు, గజ ఈతగాళ్లను తీసుకొచ్చి ముగ్గురు వ్యక్తులను రక్షించే యత్నం చేస్తున్నారు. అర్ధరాత్రి వరకు కూడా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.


