తాడేపల్లి : వెలిగొండ ప్రాజెక్టు అంశానికి సంబంధించి చంద్రబాబు ప్రారంభించి, పూర్తి చేసిన పని ఒక్కటీ లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. 1996 వెలిగొండ ప్రాజెక్టు శంకుస్థాపన చేసి తట్ట మట్టి కూడా తవ్వలేదని మండిపడ్డారు. ఒకవేళ చంద్రబాబు ప్రాజెక్టుకు ఏమైనా ఉంటే అప్పటి ఫోటోలు, వీడియోలు బయటపెట్టగలరా? అని నిలదీశారు. తీగలేరు కాలువ సుంకేశుల, కాకర్ల, గొట్టిపడియ గ్యాప్ పనులు చేసింది వైఎస్సార్ అని, వైఎస్ జగన్ వచ్చాక జంట సొరంగాలు పూర్తి చేశారన్నారు.
ఈరోజు(సోమవారం, ఆగస్టు 31వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన తాటిపర్తి చంద్రశేఖర్.. వైఎస్సార్, జగన్‌ల సంకల్పానికి చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేయాలన్నారు. ‘ నలమల రిజర్వాయర్ దగ్గరకు చంద్రబాబు ఎందుకు వెళ్లటం లేదు?, అక్కడికి వెళ్తే నిర్వాసితులు నిలదీస్తారని చంద్రబాబుకు భయం. రూ.6 లక్షల నుండి రూ.12 లక్షలకు పరిహారం పెంచింది జగన్ ప్రభుత్వం.
మరి చంద్రబాబు నిర్వాసితులకు ఏం చేశారు?, రెండున్నరేళ్లయినా మార్కాపురం కలెక్టర్ ఆఫీసు కట్టలేకపోయిన వ్యక్తి చంద్రబాబు. జగన్ కట్టించిన స్కూల్ లో చంద్రబాబు కలెక్టర్ ఆఫీసు పెట్టారు. అలాంటి వ్యక్తి వెలిగొండ ప్రాజెక్టు కట్టారంటే ఎవరైనా నమ్ముతారా?, నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా బలవంతంగా గ్రామాలు ఖాళీ చేయించారు.
వారికి ఇతర ప్రాంతాలలో ఇల్లు దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చెట్ల కింద తలదాచుకునే పరిస్థితిలో రోశమ్మ అనే మహిళ చనిపోయింది. బలవంతంగా ఊరు ఖాళీ చేయించటంతో మనస్థాపంతో రోశమ్మ మృతి చెందింది. నిర్వాసితులకు ఇచ్చే భూమితో టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అమరావతిలో భూములు ఇచ్చిన రైతులకు చేసిన న్యాయం వెలిగొండ రైతులకు ఎందుకు చేయరు?, వారికొక న్యాయం, వీరికొక న్యాయమా?, ప్రతి ఒక్కరికీ ఆర్ ఆండ్ ఆర్ ప్యాకేజీ కింద పరిహారం ఇవ్వాలి. చంద్రబాబు భజనలో ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నారు. రాజకీయ జీవితం ప్రసాదించిన వైఎస్సార్ ఫ్యామిలీపై వ్యాఖ్యలు సబబు కాదు. ఎంపీ మాగుంట నోరు అదుపులో పెట్టుకోవాలి’ అని హెచ్చరించారు.


