సాక్షి, యలమంచిలి: కూటమి పాలనలో దోపిడీకి హద్దు లేకుండాపోతోందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. అనకాపల్లి జిల్లాల్లో పంచ భూతాలను ఎంపీ సీఎం రమేష్ దోచుకుంటున్నారని అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహా పాపానికి కూటమి నేతలు ఒడిగట్టారు అంటూ మండిపడ్డారు.
అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలిలో పంచదారల కొండపై అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా గ్రామస్తులు రిలే నిరాహార దీక్షలకు దిగారు. వారి రిలే దీక్షలకు వైఎస్సార్‌సీపీ నేతలు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, దాడిశెట్టి రాజా, కరణం ధర్మశ్రీ, బొడ్డేడ ప్రసాద్ సంఘీభావం తెలిపారు. ఈ క్రమంలో రిలే నిరాహార దీక్షను సందర్శించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ..‘ఎంపీ సీఎం రమేష్ దోపీడీ పీక్ స్టేజ్‌కు చేరుకుంది. కొండలను పిండి చేస్తున్నారు. వందల లారీలతో గ్రావెల్ తరలిస్తున్నారు. పవిత్రమైన పంచదార్ల కొండను మింగేస్తున్నారు. మహా పాపానికి కూటమి నేతలు ఒడిగట్టారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఏమైపోయారు?. 1200 ఏళ్ల చరిత్ర కలిగిన పంచదార కొండను ధ్వంసం చేస్తున్నారు. ఈ పాపానికి పవన్ కళ్యాణ్ ఏం ప్రాయశ్చిత్తం చేస్తారు?’ అని ప్రశ్నించారు.
కురసాల కన్నబాబు మాట్లాడుతూ..‘దొంగలు దొంగలు ఉళ్లు పంచుకున్నట్లు దోపిడీకి కూటమి నేతలు పాల్పడుతున్నారు. కొండలను మాయం చేస్తున్నారు. పర్యావరణానికి విఘాతం కల్పిస్తున్నారు. కడప నుంచి సీఎం రమేష్ ప్రజా సేవకు వచ్చారు అనుకున్నాం. వారి కంపెనీల పేరు మీద పర్మిట్లతో కొండలను మింగేస్తున్నారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే నాయకులు తెల్లవారితే ఉమా ధర్మ లింగేశ్వర స్వామి దేవాలయానికి గుండు కొడుతున్నారు. ఇక్కడ జరుగుతున్న అన్యాయాన్ని వైఎస్ జగన్ దృష్టికి తీసుకువెళ్తాం. ఈ నెల 21వ తేదీన చలో పంచదార్ల కార్యక్రమం నిర్వహిస్తాం. 30 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పంచదార్ల కొండలను నో మైనింగ్ జోన్ గా ప్రకటించాలి. మైనింగ్ లీజులు సోమవారం లోపు రద్దు చేయాలి అని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి దాడి శెట్టి రాజా మాట్లాడుతూ..‘మహా పవిత్రమైనవి పంచదార్ల కొండలు. ఈ కొండ గురించి మహా భారతంలో ప్రస్తావన ఉంది. చోళుల కాలంలో ఉమా ధర్మ లింగేశ్వర స్వామి దేవాలయాన్ని నిర్మించారు. పంచదార్ల కొండపై జరుగుతున్న అక్రమ మైనింగ్ సనాతన వాదులకు కనిపించలేదా?. సంపద సృష్టి పేరుతో వారసత్వ సంపదను దోచుకుంటున్నారు. ఎక్కడ నుంచో వచ్చి ఉత్తరాంధ్ర సంపాదనను దోచుకుంటున్నారు అని మండిపడ్డారు.
కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ..‘పంచదార్ల కొండపై కూటమి అనకొండలు పడ్డాయి. కొండలను ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్యే సుందరపు విజయ కుమార్ గద్దల్లా దోచుకుంటున్నారు. అక్రమ మైనింగ్ పై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. 30 కిలో మీటర్ల పరిధిలో పంచదార్ల కొండలు విస్తరించి ఉన్నాయి. ప్రజలకు జీవనాధారం ఈ కొండలు’ అని చెప్పుకొచ్చారు.


