ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న ఆషాఢ మాసోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శనివారం ఆలయ ట్రస్ట్ బోర్డు, ఉత్తరాంధ్ర నుంచి భారీగా భక్త బృందాలు అమ్మవారికి సారె సమర్పించారు. శనివారం ఉదయం ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ బొర్రా రాధాకృష్ణ, ట్రస్ట్ బోర్డు సభ్యులు, కుటుంబ సభ్యులు మహా మండపం నుంచి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ అమ్మవారి సన్ని ధికి చేరుకున్న బోర్డు సభ్యులకు ఈవో శీనానాయక్, అర్చకులు సాదరంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజల అనంతరం మహా మండపం ఆరో అంతస్తులో ఉత్సవమూర్తికి సారెను సమర్పించారు.
ఉత్తరాంధ్ర నుంచి భారీగా భక్త బృందాలు
విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, గజపతి నగరం, శ్రీకాకుళం నుంచి శనివారం భారీగా భక్తులు బృందాలుగా అమ్మవారికి సారె సమర్పించారు. భక్తులతో ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్ల కిటకిటలాడాయి. రద్దీ నేపథ్యంలో ఉదయం పది గంటల నుంచి అంతరాలయ దర్శనం, మధ్యాహ్నం 12 గంటల తర్వాత నుంచి అన్ని టికెట్ల విక్రయాలు నిలిపివేశారు. దీంతో భక్తులు బంగారు వాకిలి, రూ. 300, 100 టికెట్ క్యూలైన్లతో పాటు రెండు సర్వ దర్శనం క్యూలైన్ల ద్వారా అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
నేడు వీఐపీ దర్శనాలు రద్దు
తెలంగాణ నుంచి దుర్గమ్మకు ఆదివారం బంగారు బోనం, ఆషాఢ సారె నేపథ్యంలో అన్ని వీఐపీ, ప్రొటోకాల్ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు దుర్గగుడి ఈఓ శీనానాయక్ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ బోనం సమర్పణకు సుమారు మూడు వేల మంది కళాకారులు, ఉత్సవ కమిటీ సభ్యులు వస్తారని తెలిపారు. గత ఆదివారం ఒక్క రోజే సుమారు 85 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారని పేర్కొన్నారు. ఈ ఆదివారం కూడా భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని భావిస్తున్నామని వివరించారు. మరో వైపున కొండపైకి ఎటువంటి ప్రయివేటు వాహనాలను అనుమతించేది లేదని, దేవస్థానం బస్సులను పూర్తి స్థాయిలో నడుపుతామని తెలిపారు. దివ్యాంగులు, వృద్ధులు, చంటి బిడ్డల తల్లులు ఉదయం ఎనిమిది గంటల్లోపు, మధ్యాహ్నం మూడు నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు రావాలని సూచించారు. భక్తులందరూ సహకరించాలని ఆయన కోరారు.


