నరసరావుపేట రూరల్: గురుపౌర్ణమి సందర్భంగా ఈనెల 29వ తేదీ ప్రముఖ శైవక్షేత్రం కోటప్పకొండలో మేధాదక్షిణామూర్తి హోమం, గిరి ప్రదక్షిణ, అక్షరాభ్యాస కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఆలయ ఈవో డి.చంద్రశేఖరరావు శనివారం తెలిపారు. ఆలయ అవరణలో నిర్వహించే అక్షరాభ్యాసం, ఇతర కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయ వంతం చేయాలని కోరారు.
తెనాలిటౌన్: స్థానిక చినరావూరు ఐటీఐ ప్రాంగణాన్ని శనివారం గుంటూరు జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ పరిశీలించారు. తెనాలి పర్యటనలో భాగంగా ఐటీఐ కళాశాలను సందర్శించినట్లు చెప్పారు. ప్రాంగణంలోని మౌలిక వసతులు పరిశీలించి అధికారుల నుంచి సమాచారం తెలుసుకున్నారు. ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టి ప్రాంగణంలో మంచి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ ఆవరణంలో ఎంఎస్‌ఎంఈ పార్కు వంటి ఏర్పాట్లకు సాధ్యసాధ్యాలను పరిశీలించారు. ఆయన వెంట ఆర్డీవో కె.శ్రీరమణి, తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, మండల సర్వేయర్ ఎం.శ్రీనివాసరావు, ఐటీఐ ప్రిన్సిపల్ చిన వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.
తాడేపల్లిరూరల్ : ఉండవల్లి గుహల వద్ద రాష్ట్ర సృజనాత్మక సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో శనివారం తెలుగు మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తెలుగు, సంస్కృత అకాడమి చైర్మన్ ఆర్.డి.విల్సన్ మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా, సాంస్కృతిక శాఖ అధ్యక్షులు తేజస్వి, ఎడిమల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ చైర్మన్ శ్రీనివాస్, ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్, డీసీపీ సరిత, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గద్దె అనూరాధ, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.


