breaking news
Palnadu District Latest News
-
వైఎస్సార్ సీపీ రాష్ట్ర విభాగంలో జిల్లా నేతలకు చోటు
నరసరావుపేట: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పల్నాడు జిల్లాకు చెందిన ఇరువురు నాయకులను పార్టీ రాష్ట్ర విభాగంలో నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఇరిగిదిండ్ల లాజర్‌ను రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ సంయుక్త కార్యదర్శిగా, పెదకూరపాడు అసెంబ్లీ నియోజకర్గానికి చెందిన షేక్ దస్తగిరిని రాష్ట్ర బీసీ విభాగ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. భట్టిప్రోలు: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ఆర్టీయూసీ విభాగం సంయుక్త కార్యదర్శిగా వేమూరుకు చెందిన బొల్లిముంత ఏడుకొండలును నియమిస్తూ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడుకొండలు నియామకం కోసం వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్‌బాబు కృషి చేశారు. ఏడుకొండలు నియామకంపై పలువురు హర్షం వ్యక్తం చేశారు. – జిల్లా కలెక్టర్ పి అరుణ్ బాబు నరసరావుపేట: మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్‌కు కాల్ చేయవచ్చునన్నారు. అర్జీదారులు వారి అర్జీలు నమోదు చేసుకోవడానికి మీకోసం డాట్ ఏపీ డాట్ జీవోవి డాట్ ఇన్ వెబ్సైట్లో వారి అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ సమస్యలకు పరిష్కారం పొందాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఈనెల 18వ తేదీన కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించటం జరుగుతుందని పేర్కొన్నారు. – దంపతులకు తీవ్ర గాయాలు యడ్లపాడు: రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో భార్యాభర్తలకు గాయాలైన సంఘటన మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...గుంటూరు నుంచి చిలకలూరిపేట వైపు బైక్‌పై భార్యాభర్తలు ప్రయాణిస్తున్నారు. అదే సమయంలో వెనుక నుంచి వేగంగా వస్తున్న ఒక స్కూటీ వీరి బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనాలు ధ్వంసం కావడంతోపాటు దంపతులిద్దరూ బైక్‌పై నుంచి కిందపడిపోయి తీవ్ర గాయాలపాలయ్యారు. స్థానికులు స్పందించి క్షతగాత్రులను చిలకలూరిపేట ఆసుపత్రికి తీసుకెళ్లారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం వారిని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది. ఇద్దరికి తీవ్రంగా..నలుగురికి స్వల్ప గాయాలు పిడుగురాళ్ల: ఆటోను వెనుక నుంచి లారీ ఢీకొన్న సంఘటనలో ఆరుగురికి గాయాలైన సంఘటన పిడుగురాళ్ల పట్టణంలోని కళ్లం టౌన్షిప్ వద్ద చోటుచేసుకుంది. సంఘటనకు సంబంధించి సేకరించిన వివరాల మేరకు... మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామం నుంచి ఐదుగురు నరసరావుపేటలోని ఇస్కాన్ ఆలయానికి ఆటోలో బయలుదేరారు. మార్గంమధ్యలో ఈశ్వరమ్మ, సారంగమ్మలు అయ్యప్పనగర్ వద్ద ఆటో ఎక్కారు. హైదరాబాద్ నుంచి గుంటూరు వెళ్తున్న కంటైనర్ లారీ ఆటోను ఢీకొంది. ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. తీవ్ర గాయాలైన ఈశ్వరమ్మ, సారంగమ్మలను 108 వాహనం ద్వారా, నామ్స్ ఎక్స్‌ప్రెస్ అంబులెన్స్‌లో పిడుగురాళ్ల పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. ఘటనకు కారణమైన లారీ డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలిపెట్టి పరారయ్యాడు. సమాచారం తెలుసుకున్న ఎస్ఐ మోహన్ సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రమాదంలో గాయపడిన ఈశ్వరమ్మ, సారంగమ్మ -
రిటైర్డ్ పోలీసు అధికారి వెంకటేశ్వర్లుకు సర్వీసు అవార్డు
బాపట్ల: రిటైర్డ్ పోలీసు అధికారి అద్దంకి వెంకటేశ్వర్లు శుక్రవారం విజయవాడలో నిర్వహించిన స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నుంచి పోలీస్ మెడల్ ఫర్ మెమోరియస్ సర్వీస్ అవార్డును అందుకున్నారు. పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేసిన వెంకటేశ్వర్లు ఒంగోలు పీటీసీలో ఎస్ఐగా ఉద్యోగ విరమణ చేశారు. బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం పులిగడ్డవారిపాలేనికి చెందిన ఆయన కానిస్టేబుల్‌గా 1983లో చేరి, అంచెలంచెలుగా ఎదిగారు. ఉద్యోగ సమయంలో 205 రివార్డులతోపాటు ఉత్తమ సేవా పతకం, సెంట్రల్ హోం మినిస్టర్ మెడల్, ఇండియన్న్పోలీస్ మెడల్ అందుకున్నారు. ముఖ్యంగా లాలాపేటలో దొంగనోట్ల కేసు, గోల్డ్ కుంభకోణం, ఎర్ర చందనం వంటి పలు కేసులను ఛేదించడంలో కీలకంగా పనిచేశారు. పల్నాడు ప్రాంతంలో పనిచేసిన కాలంలో నక్సలైట్ల కేసులో చురుకుగా పనిచేసి పలువురిని అరెస్ట్ చేశారు. పేద విద్యార్థులకు సాయం పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించి వారి భవిష్యత్‌కు వెంకటేశ్వర్లు బంగారు బాట వేశారు. పలువురు ఇప్పుడు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నారు. 2003లో మెట్టగౌడపాలేనికి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థిని దత్తత తీసుకుని పూర్తిగా ఆర్థిక సాయం అందించారు. 2012లో ఐలవరంలో ఇంటర్ విద్యార్థికి ఆర్థిక సాయం, భట్టిప్రోలులో ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో వెల్లటూరులో తండ్రి అప్పుల ఊబిలో చిక్కుకుని చనిపోతే కూతురుని చదివించారు. ప్రస్తుతం ఆమె పోలీస్ కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. 2018లో దాచేపల్లిలో ఓ బాలికను దత్తత తీసుకుని ఉన్నత చదువులు చదివించి, మానవత్వం చాటుకున్న పోలీస్‌గా నిలిచారు. -
ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు
● జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ బి.రవి ● దొడ్లేరు గ్రామంలో పర్యటన దొడ్లేరు(క్రోసూరు): ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యశాఖాధికారి డాక్టర్ బి.రవి అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరద ప్రభావిత ప్రాంతమైన మండలంలోని దొడ్లేరు గ్రామాన్ని శనివారం జిల్లా వైద్య శాఖాధికారి డాక్టర్ బి.రవి సందర్శించారు. జిల్లా మలేరియా అధికారి రవీంద్ర రత్నాకర్‌తో కలసి గ్రామంలో వరద ప్రభావిత ప్రాంతాల్లోని ఇళ్లను పరిశీలించారు. వరద ప్రభావిత ప్రాంతంలో నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులు, దోమల నివారణ చర్యలను, ఉచిత వైద్య శిబిరాన్ని పరిశీలించారు. అక్కడి ప్రజలతో మాట్లాడారు. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. వైద్య సిబ్బందికి తగు సూచనలు చేశారు. గర్భిణులు, పిల్లలకు తక్షణమే వైద్య సేవలు అందించాలన్నారు. వర్షాకాలం నేపథ్యంలో సిబ్బంది క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి అవసరమైన తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దోమల ఉధృతి పెరగకుండా మురుగు కాలువల్లో ఆయిల్ బాల్స్ వేయించారు. అనంతరం హసనాబాద్ రోడ్డులో నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవన నిర్మాణాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్, మలేరియా సబ్ యూనిట్ అధికారి మొగల్ సుభాన్బేగ్, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ భూలక్ష్మి, ఆరోగ్య కార్యకర్తలు ప్రేమరాజ్, ప్రహ్లాద్, అనుపమ, ఆశా కార్యకర్తలు త్రివేణి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. -
భవనం శిథిలం.. భద్రత శూన్యం
పెదకూరపాడు: పెదకూరపాడు సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులు, సిబ్బంది ప్రతి క్షణం భయం భయంగా గడుపుతున్నారు. పాత భవనం కావడంతో పెచ్చులూడుతూ, వర్షాలకు కారుతూ ప్రమాదకరంగా మారింది. చినుకు పడితే చాలు వారు గజగజ వణుకుతున్నారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు వైద్యశాలలోని ఫార్మసిస్ట్ గది, ఇన్ పేషెంట్లు గదులు, వరండాలు, శ్లాబు కారుతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పెదకూరపాడులో రూ.8 కోట్లతో నూతన సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు. గత ఏడాది ఫిబ్రవరిలోనే ఆ వైద్యశాలను ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటినా వైద్యశాలలో ఇతర సౌకర్యాలు కల్పించకపోవడంతో సిబ్బంది నేటికీ పాత భవనంలోనే విధులు నిర్వహిస్తున్నారు. భారీ వర్షాలు పడితే పాత భవనం కూలేలా ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలు చేసిన ప్రతిసారి వారు ఆందోళన చెందుతున్నారు. సంబంధిత అధికారులు నూతన ఇకనైనా తగిన చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందితోపాటు ప్రజలు కూడా వేడుకుంటున్నారు. -
ఘనంగా సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు
సర్దార్ గౌతు లచ్చన్నకు ఘన నివాళి నరసరావుపేట రూరల్: జిల్లా పోలీసు కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఎస్పీ మాట్లాడుతూ శ్రీకాకుళంలో జన్మించిన సర్దార్ గౌతు లచ్చన్న భారతదేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తరువాత సర్దార్ గౌరవం పొందిన ఏకై క వ్యక్తి అన్నారు. లచ్చన్న సాహసానికి, కార్యదక్షతకు ప్రజలిచ్చిన బిరుదు సర్దార్ అని తెలిపారు. జాతీయ నాయకులతో కలిసి స్వాతంత్య్ర పోరాటాలలో పాల్గొని అనేక సార్లు జైలుకు వెళ్లారని తెలిపారు. బడుగువర్గ పోరాట జీవిగా లచ్చన్న చరిత్రలో నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(పరిపాలన), ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీరెడ్డి, ఎంటీ ఆర్ఐ ఎస్.కృష్ణ, ఏఎన్ఎస్ ఆర్ఐ యువరాజ్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ -
రైతులు, కౌలురైతులను ఆదుకోవాలి
బాపట్ల: అకాల వర్షానికి పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులు, కౌలు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య పేర్కొన్నారు. బాపట్లలోని పుచ్చలపల్లి సుందరయ్య ప్రజాసంఘాల జిల్లా కార్యాలయంలో పార్టీ శాఖా కార్యదర్శులు, పట్టణ, మండల కమిటీ సభ్యుల జిల్లాస్థాయి తరగతులు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు టి కృష్ణమోహన్ అధ్యక్షతన శనివారం జరిగాయి. గంగయ్య మాట్లాడుతూ వారం రోజుల నుంచి కురుస్తున్న అకాల వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా వేల ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నదని తెలిపారు. దీనివల్ల రైతులు, కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. వ్యవసాయ శాఖ అధికారులు చొరవ తీసుకుని నష్టాన్ని అంచనా వేసి రైతులను ఆదుకోవాలని కోరారు. ఎక్కువ చోట్ల వరిని వెద పెట్టడం వల్ల నీట మునిగి నష్టపోయినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల మైక్రో ఫైనాన్స్ సంస్థల వేధింపులతో పేద ప్రజలు ఇబ్బందులు గురవుతున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం దృష్టి పెట్టి మైక్రో ఫైనాన్స్ సంస్థలపై నిఘా ఉంచి పేదలను దోపిడీ చేసిన వారిపై చర్య తీసుకోవాలని సూచించారు. ప్రజల సమస్యలపై పోరాటాలు చేయాలని కోరారు. పార్టీ జిల్లా నాయకులు సీహెచ్ మజుంధర్, ఎం వసంతరావు, ఎన్ బాబురావు, సీహెచ్ మణిలాల్ తదితరులు పాల్గొన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి సీహెచ్ గంగయ్య -
వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
నరసరావుపేట ఈస్ట్: శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జిల్లా వ్యాప్తంగా శనివారం వైభవంగా జరిగాయి. ముఖ్యంగా వైష్ణవాలయాలు ఉదయం నుంచే భక్తులతో కిటకిటలాడాయి. హరే కృష్ణ ... హరే కృష్ణ ... కృష్ణ కృష్ణ ... హరే హరే అంటూ భక్తులు కృష్ణ నామస్మరణ చేశారు. చిన్నారులు రాధాకృష్ణుల వేషధారణలో అలరించారు. సామూహిక గీతా పారాయణాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. బరంపేటలోని శ్రీరాధా గోవింద చంద్ర మందిరం ఇస్కాన్‌లో జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక అభిషేకాలు, పూజలు, అలంకరణలు చేశారు. అనంతరం భక్తులను దర్శనానికి అనుమతించారు. సాయంత్రం ఉట్లోత్సవం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. యడ్లపాడు: యడ్లపాడు మండలంలోని చెంఘీజ్‌ఖాన్‌పేటలో 363 ఏళ్ల నాటి శ్రీరాజ్యలక్ష్మి సమేత వేణుగోపాలస్వామి ఆలయంలో కొలువున్న వెన్నముద్దల బాలకృష్ణునికి శనివారం విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు పరుచూరి సత్యన్నారాయణ చార్యులు, రాఘవేంద్ర, జితేంద్ర ఆధ్వర్యంలో స్వామికి పూజలు చేశారు. బాలకృష్ణుని నిజరూపదర్శనం చేసుకున్న భక్తులు పులకించిపోయారు. అనంతరం నరసరావుపేట భజన సమాజం విశేష భజన కార్యక్రమాలు నిర్వహించగా, ఆలయ ప్రాంగణం కళకళలాడింది. ఏడాదికి ఒకసారి భక్తులకు అందించే మోడికారంతో పాటు స్వామివారి పూజల్లో ఉంచిన వెన్న, ఇతర ప్రసాదాలను పంపిణీ చేశారు. రాత్రి 7 గంటలకు తులువ వంశీయులచే ఆలయం వద్ద ఉట్టి మహోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈఓ నెమలిరెడ్డి భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షించారు.ఆలయాలు కిటకిటసత్తెనపల్లి: పట్టణంలోని ఆలయాల్లో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వడవల్లి ఆంజనేయస్వామి దేవాలయం ఎదుట గల శ్రీకృష్ణుడి దేవాలయం, ఐదు లాంతర్ల సెంటర్లోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలస్వామి దేవాలయం, గుంటూరు రోడ్‌లోని అయ్యప్ప స్వామి దేవాలయంలో వేడుకలు భక్తిశ్రద్ధలతో చేశారు. పెద్దసంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మనసారా స్వామి వారిని దర్శనం చేసుకున్నారు. ఉట్టి కొట్టే కార్యక్రమం ఉత్సాహంగా నిర్వహించారు. వడ్డవల్లి ఆంజనేయ స్వామి దేవాలయ ఎదుట గల శ్రీకృష్ణుడి దేవాలయంలో నిర్వహించిన వేడుకలకు సత్తెనపల్లి ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ హాజరయ్యారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
లాంచీస్టేషన్ ఆదాయం రూ.1,78,450
విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జునకొండకు శనివారం పర్యాటకులు లాంచీలలో తరలి వెళ్లడంతో లాంచీస్టేషన్‌కు రూ.1,78,450 ఆదాయం సమకూరినట్లు యూనిట్ అధికారులు పేర్కొన్నారు. కొండను సందర్శించిన పర్యాటకులు మహాస్తూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం, మ్యూజియంలోని తొమ్మిది అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, బుద్ధుని జీవిత చరిత్రకు సంబంధించిన శిలాఫలకాలను తిలకించారు. అనంతరం మాచర్ల మండలంలోని అనుపు, ఎత్తిపోతల జలపాతాన్ని వీక్షించారు. గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు మల్లికార్జునపేటలోని గంగా భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి ఆలయంలో శనివారం అమ్మవారిని లక్ష గాజులతో శోభాయమానంగా అలంకరించారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చంద్రశేఖర శర్మ, రామకృష్ణ భక్తులకు తీర్థ, ప్రసాదాలు అందించారు. మాచర్ల: మాజీ ఎంపీపీ బూడిద వెంకమ్మ కుమారుడు శ్రీనివాస్‌ను పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి, వివరాలు చెప్పకుండా తీసుకెళ్లారు. మాజీ ఎంపీపీ బంధువులు అందరూ మాచర్ల రూరల్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. శుక్రవారం రాత్రి బూడిద శ్రీనివాస్‌ను విజయపురి సౌత్ పోలీసు స్టేషన్‌కు సంబంధించిన కేసులో అరెస్టు చేసినట్లు పోలీసులు చూపించారు. శ్రీనివాస్‌కు మాచర్ల జూనియర్ సివిల్ జడ్జి కోర్టు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేశారు. తెనాలి రూరల్: గుంటూరు జిల్లా తెనాలి ఐతానగర్ చెందిన రౌడీషీటర్ వేము నవీన్‌పై పీడీ యాక్ట్ నమోదైంది. జిల్లా కలెక్టర్, మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు అతడిని అదుపులోకి తీసుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెనాలి టూటౌన్ సీఐ రాములనాయక్ శనివారం తెలిపారు. నవీన్‌పై గతంలో కొట్లాట, దోపిడీ, గంజాయి కేసులు నమోదయ్యాయి. ఇటీవల కానిస్టేబుల్ కన్నా చిరంజీవిపై దాడి కేసులో నవీన్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు శాంతి భద్రతల పరిరక్షణ, రౌడీషీటర్లపై తీసుకుంటున్న చర్యల్లో భాగంగా నవీన్‌పై పీడీ యాక్టు నమోదైందని సీఐ వివరించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కర్లపాలెం: కర్లపాలెంలో కాలువ వంతెనకు సైడ్‌వాల్స్ లేకపోవటంతో ఓ కారు కాలువలోకి బోల్తాపడింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు శనివారం కర్లపాలెంలోని బాపయ్య కొట్టు ఎదుట పాత ఇస్లాంపేటకు వెళ్లే ఇసుక చానల్ వంతెనపై నుంచి ఓ కారు కాలువలోకి బోల్తా పడింది. ప్రమాద సమయంలో కాలువలో నీరు ఉండటం వల్ల కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని స్థానికులు తెలిపారు. -
ఆటోవాలా బతుకు డీలా
ముప్పాళ్ళ: కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఆటోవాలాలు ఆందోళన చెందుతున్నారు. సీ్త్ర శక్తి పేరుతో ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం పథకం ప్రారంభించడంతో జీవనోపాధికి గండి పడుతోంది. అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసిన తాము ఉపాధి కోల్పోయి రోడ్డున పడటం ఖాయమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం కనీసం చర్చలు జరపడం లేదన్నారు. ‘వాహన మిత్ర’ తరహాలో తమకు ఆర్థికసాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం మొండిచేయి నెలకు వాహన కిస్తీ, ఇంధనం, నిర్వహణకోసం దాదాపు రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చు అవుతోందని డ్రైవర్లు చెబుతున్నారు. రవాణాశాఖ అధికారుల తనిఖీలో నమోదయ్యే కేసులు, ప్రతి ఏడాది బ్రేక్ ఫిట్నెస్ కోసం ఖర్చులు అదనమని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఆటో కార్మికులకు ఏటా రూ.15 వేలు ఇస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. సంక్షేమ బోర్డు ఏర్పాటు, తక్కువ వడ్డీకి రుణాలు ఇస్తామని నమ్మ బలికింది. అధికారం చేపట్టి 14 నెలలు కావస్తున్నా ఇవేమీ అమలు కాలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఆటో డ్రైవర్లకు వాహనమిత్ర పథకం ద్వారా ఏటా రూ.10 వేల సాయం అందించారు. వాహనాల తనిఖీలు, అక్రమ కేసులు నమోదు లేకుండా అండగా సర్కారు నిలిచింది. కానీ, వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్ మంజూరును ప్రయివేటు ఏజన్సీలకు అప్పగించేలా కూటమి సర్కారు చర్యలు చేపట్టింది. జీఓ నెంబర్ 21 పేరుతో ట్యాక్స్‌లు, జరిమానాలు భారీగా పెంచేందుకు సిద్ధం అవుతోంది. -
పేదింటిపైనా కూటమి కక్ష
పేదలందరికీ సొంత గూడు కల్పించాలని నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భావించారు. ఐదేళ్లలో లక్షల మందికి ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. ఇళ్ల నిర్మాణాలు కూడా ప్రారంభం అయ్యాయి. ఇళ్లు కాదు.. నూతనంగా ఊళ్లే ఏర్పాటయ్యాయి. నరసరావుపేటలోనూ వైఎస్సార్ జగనన్న కాలనీ వెలిసింది. 6 వేల మందికి స్థలాలు కేటాయించగా, వెయ్యి కుటుంబాలు ఇళ్లు కట్టుకుని నివాసం ఉంటున్నాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక కనీస అభివృద్ధి లేదు. సౌకర్యాలు కల్పించకపోవడంతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నరసరావుపేట రూరల్: నరసరావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పేదల కోసం ఉప్పలపాడు రోడ్డులో వైఎస్సార్ జగనన్న కాలనీని వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేశారు. పట్టణంలో నివసిస్తూ సొంత ఇళ్లు లేని 6 వేల మందికి పట్టాలు మంజూరయ్యాయి. లింగంగుంట్ల, ఇక్కుర్రు పరిధిలో 150 ఎకరాలను దీనికోసం సేకరించారు. కేంద్ర, రాష్ట్ర గృహనిర్మాణ పథకం ద్వారా పేదలు కూడా ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. రూ.కోట్ల వ్యయంతో... పేదల సొంతింటి కల తీర్చేందుకు నాటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఎంత ఖర్చయినా వెనుకాడలేదు. పట్టణానికి సమీపంలోని అత్యంత విలువైన 150 ఎకరాల భూమిని దాదాపు రూ.30 కోట్లు ఖర్చు చేసి రైతుల నుంచి సేకరించారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి దీనికోసం తీవ్రంగా శ్రమించారు. రైతులతో పలు దఫాలుగా చర్చించి, ఒప్పించారు. పట్టాల పంపిణీ అనంతరం కాలనీలో మౌలిక సదుపాయాలపై దృష్టి సారించారు. విద్యుత్ సబ్‌స్టేషన్ ఏర్పాటు చేయించారు. ఈ వసతికి దాదాపు రూ.4 కోట్లు ఖర్చు చేశారు. వినుకొండ–నరసరావుపేట హైవే నుంచి కాలనీ వరకు ప్రధాన రోడ్డును రూ.కోటితో నిర్మింపజేశారు. కాలనీలోని అంతర్గత రోడ్లు కోసం రూ.కోటి ఖర్చు పెట్టారు. ప్రభుత్వం సదుపాయాలు కల్పిస్తుందన్న నమ్మకంతో దాదాపు వెయ్యి కుటుంబాలు కాలనీలో గృహప్రవేశాలు చేశాయి. కూటమి పాలకుల దగా ఎన్నికల తర్వాత కూటమి అధికారంలోకి రావడంతో కాలనీ వాసులకు కష్టాలు ప్రారంభమయ్యాయి. గృహనిర్మాణాల ప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను దుండగులు ధ్వంసం చేశారు. ఇక అభివృద్ధి పనులు మచ్చుకై నా మొదలు పెట్టలేదు. దాదాపు 2 వేల ఇళ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. పాలకుల నిర్లక్ష్యంతో వాటి నిర్మాణం మధ్యలోనే నిలిచిపోయింది. -
లారీని ఢీకొట్టిన ట్రావెల్ బస్సు
గుడ్లూరు: ముందు వెళ్తున్న లారీని వెనుక వైపు నుంచి కావేరి ట్రావెల్ బస్సు ఢీ కొనడంతో బస్సులో ఉన్న క్లీనర్ మృతి చెందాడు. ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున తెట్టు ఓవరు బ్రిడ్జి దగ్గర జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఒంగోలు వైపు నుంచి నెల్లూరు వైపు వెళ్తున్న కావేరి ట్రావెల్ బస్సు అదే మార్గంలో ముందు వెళ్తున్న లారీని వెనుక నుంచి ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సు క్లీనరు ఉండ్రరాశి సంతోష్ (27) మృతి చెందాడు. మృతుడు సంతోష్‌ది కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలం పెద ఓగిరాల గ్రామం. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు గుడ్లూరు ఎస్ఐ వెంకట్రావు తెలిపారు. క్లీనరు మృతి -
గంజాయితో పాటు నగలు, నగదు స్వాధీనం
గంజాయి ముఠా సభ్యుల అరెస్ట్ చిలకలూరిపేట: గంజాయి విక్రయాలకు పాల్పడటంతోపాటు సేవిస్తున్న ముఠా సభ్యులను చిలకలూరిపేట రూరల్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో నరసరావుపేట డీఎస్పీ ఎం హనుమంతరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మత్తు పదార్థాలకు అలవాటు పడి గంజాయి అక్రమంగా రవాణా చేస్తూ యువత, విద్యార్థులను చెడు మార్గాల వైపు నడిపిస్తున్న ముఠాపై రూరల్ సీఐ బి సుబ్బానాయుడు ఆధ్వర్యంలో మూడు టీములు ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. ముఠాకు నాయకుడిగా వ్యవహరిస్తున్న గణపవరం రాజీవ్‌గాంధీ కాలనీకి చెందిన అన్నంరాజు ఈశ్వరసాయికుమార్తోపాటు నేలపాటి ఠాగూర్, షేక్ హుస్సేన్‌భాష, షేక్ బాజీ, పల్లపు నాగబాబు, కుంచాల రవితేజ, పల్లపు కళ్యాణ్‌కుమార్, తెప్పలి వెంకటేష్, గుద్దంతి సురేష్, సింగంశెట్టి ప్రవీణ్‌కుమార్, షేక్ జాన్బాష, సొంటినేని పవన్‌కళ్యాణ్, పులగం సాయివెంకటేష్, నక్కల ఏసుబాబు, నాగండ్ల ఆదిత్యలను అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రెండు కేజీల 440 గ్రాముల గంజాయి, రూ. 3500 నగదు, ఒక సెల్‌ఫోన్, 117 గ్రాముల బంగారం స్వాఽధీనం చేసుకున్నారు. ఇందులో ముఖ్యంగా అన్నంరాజు ఈశ్వరసాయికుమార్ తొలినుంచి గంజాయి కొనుగోలు చేస్తూ మిగిలిన వారితో విక్రయాలు చేయిస్తున్నాడు. ఈ నెల 11న ఒడిశాకు చెందిన వలస కార్మికుడు ఉత్తం రౌత్‌ను గంజాయి మత్తులో బీర్ సీసాతో పొడిచి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంకా ఈ ముఠాలో సభ్యులను గాలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. సమావేశంలో రూరల్ సీఐ బి సుబ్బానాయుడు, ఎస్ఐ జి అనిల్‌కుమార్, నాదెండ్ల ఎస్ఐ జి పుల్లారావు, ఏఎస్ఐలు డి రోసిబాబు, జీవీ సుబ్బారావు, పి రమేష్, కానిస్టేబుళ్లు కె దేవరాజు, జె శ్రీధర్, ప్రసాద్, అనిల్‌కుమార్, వెంకట్రావు, ఎం. ఇర్మియా తదితరులు పాల్గొన్నారు. -
దేశ అభివృద్ధిలో రైల్వేశాఖది కీలక పాత్ర
లక్ష్మీపురం: భారతీయ రైల్వేలు కేవలం రవాణా సాధనం కాదు, మన దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నాయని రైల్వే డీఆర్ఎం సుథేష్ఠ సేన్ అన్నారు. గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలోని నల్లపాడు మైదానంలో 79వ స్వాతంత్య్ర వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. తొలుత రైల్వే పోలీసులు నిర్వహించిన పరేడ్‌లో పాల్గొని జాతీయ పతాకాన్ని డీఆర్ఎం ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. గత ఆర్థిక సంవత్సరం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో డివిజన్ అనేక రకాల విజయాలను, లక్ష్యాలను సాధించిందన్నారు. కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో.. నగరంపాలెం: దేశ వ్యాప్తంగా అందరూ నిర్వర్తించుకునే వేడుక స్వాతంత్య్ర దినోత్సవమని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర వేడుకలు జరగ్గా, జాతీయ జెండాను జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ ఎగురవేశారు. జిల్లా ఏఆర్ ఏఎస్పీ హనుమంతు, ఏవో అద్దంకి వెంకటేశ్వరరావు, ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలరెడ్డి, ఎస్బీ సీఐ అళహరి శ్రీనివాస్, ఆర్ఐలు శ్రీహరిరెడ్డి, శివరామకృష్ణ, సురేష్, పోలీస్ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలు అదుపు మంగళగిరిటౌన్: అధునాతన సాంకేతిక పరిజ్ఞానం వినియోగంతో నేరాలను అదుపు చేస్తున్నామని ప్రొబెషన్ అండ్ ఎకై ్సజ్ రాష్ట్ర శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ అన్నారు. మంగళగిరి నగర పరిధిలోని ప్రొబెషన్ అండ్ ఎకై ్సజ్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించారు. శాఖ డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మతో కలసి కమిషనర్ నిశాంత్ కుమార్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. శాఖలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డైరెక్టర్ రాహుల్‌దేవ్ శర్మ, జాయింట్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, సూపరింటెండెంట్లు తదితరులు పాల్గొన్నారు. పెదకాకాని(ఏఎన్‌యూ): భారతదేశం విదేశీయుల పాలన నుంచి స్వేచ్ఛా స్వాతంత్య్రాలను సాధించేందుకు కృషిచేసి అశువులు బాసిన త్యాగధనుల పోరాటాలను నేటి యువత స్మరించుకోవాలని ఏఎన్‌యూ ఇన్చార్జి వీసీ ఆచార్య కె గంగాధరరావు అన్నారు. వర్సిటీలోని వ్యాయామ విద్య కళాశాల ఆధ్వర్యంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు వ్యాయామ విద్య కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య పిపిఎస్ పాల్‌కుమార్ అధ్యక్షత వహించారు. తొలుత జాతీయపతాకాన్ని ఎగురవేశారు. ఇన్చార్జి రెక్టార్ ఆచార్య కె రత్నషీలామణి, ఇన్చార్జి రిజిస్ట్రార్ ఆచార్య జి సింహాచలం, ప్రిన్సిపల్స్ ఆచార్య ఎం.సురేష్‌కుమార్, ఆచార్య వీరయ్య, ఆచార్య సిహెచ్ లింగరాజు, ఆచార్య ప్రమీళారాణి, అసిస్టెంట్ ప్రిన్సిపాల్ డాక్టర్ డి చంద్రమౌళి, డిగ్రీ, పీజీ పరీక్షల కోఆర్డినేటర్లు ఆచార్య కృష్ణారావు, ఆచార్య సుబ్బారావు, సీడీఈ డైరెక్టర్ ఆచార్య వెంకటేశ్వర్లు, పరీక్షల కోఆర్డినేటర్ రామచంద్రన్, విదేశీ విద్యార్థుల సెల్ డైరెక్టర్ ఆచార్య పద్మావతి, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి ఆచార్య దివ్యతేజోమూర్తి, సోషల్‌వర్క్ విభాగాధిపతి ఆచార్య యం త్రిమూర్తిరావు, సీఐ, ఏసిఇ, ఇంజనీర్, డిప్యూటీ ఇంజినీర్లు, అధ్యావకులు, గెస్ట్ ఫ్యాకల్టీ, నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు. అమరవీరుల త్యాగాల ఫలితంగానే స్వాతంత్య్రం కొరిటెపాడు(గుంటూరు): ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగానే స్వాతంత్య్రం వచ్చిందని, వాటి ఫలాలను పరిరక్షించు కోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని భారత పొగాకు బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్‌కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.విశ్వశ్రీ పేర్కొన్నారు. జీటీ రోడ్‌లోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర వేడుకలను నిర్వహించారు. జాతీయ పతాకాన్ని వారు ఆవిష్కరించారు. యశ్వంత్‌కుమార్, విశ్వశ్రీ మాట్లాడుతూ దేశంలో ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు ఉండాలని, మన దేశప్రగతిని, సాధించిన లక్ష్యాలను గుర్గుపెట్టుకొని మనమంతా ముందుకు సాడాలని కోరారు. కార్యక్రమంలో పొగాకు బోర్డు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర విపత్తుల కార్యాలయంలో.... తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని రాష్ట్ర విపత్తుల కార్యాలయంలో సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్‌జైన్ త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు, యోధులకు నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దీపక్, ఎన్డీఆర్ఎఫ్,ఫైర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మహనీయుల త్యాగాలు స్మరించుకోవాలి
నరసరావుపేట రూరల్: స్వేచ్ఛ, సమానత్వం కోసం మహనీయులు చేసిన త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు అన్నారు. జిల్లా పోలీసు కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని శుక్రవారం నిర్వహించారు. జాతీయ జెండాను జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు ఎగురవేసి గౌరవవందనం స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ భిన్నత్వంలో ఏకత్వం ఉట్టి పడే విధంగా కుల, మత, వర్గ, ఆర్థిక భేదాలు పక్కన పెట్టి దేశమంతా జరుపుకునే ఏకై క వేడుక స్వాతంత్య్ర దినోత్సవం అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, అదనపు ఎస్పీ(ఏఆర్) వి.సత్తిబాబు, అదనపు ఎస్పీ(క్రైమ్)లక్ష్మీపతి, ఏఆర్ డీఎస్పీ మహాత్మాగాంధీ రెడ్డి, ఎస్బీ సీఐలు బి.సురేష్‌బాబు, పి.శరత్‌బాబు, ఆర్ఐలు ఎస్.కృష్ణ, ఎల్.గోపినాథ్, ఎం.రాజా తదితరులు పాల్గొన్నారు. -
మాజీ ఎమ్మెల్యే బొల్లా
జాతీయ జెండాను అవమానించడం బాధాకరం గుంటూరు: వినుకొండలో జాతీయ జెండాకు అవమానం జరగటం బాధాకరమని మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. టీడీపీ సీనియర్ నాయకులు, ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి.ఆంజనేయులుకు జాతీయ జెండా కన్పించడం లేదా అని ప్రశ్నించారు. కోట్లాది మంది భారతీయులు దైవంగా భావించే జాతీయ జెండాను బూటు కాళ్లతో తొక్కడం బాధాకరమన్నారు. గతంలో వినుకొండలో ఉన్న ఒకే ఒక్క గాంధీ విగ్రహం ట్రాఫిక్‌కు అడ్డంగా ఉందని తొలగించారని పేర్కొన్నారు. నేడు జాతీయ జెండాను అవమానించారు. ఇప్పటికై నా తీరుమార్చుకోవాలని హితవు పలికారు. కోతకు గురైన బుగ్గువాగు బ్రిడ్జి మూడు రోజుల నుంచి రాకపోకలు బంధ్ స్పందించని అధికారులు పిడుగురాళ్ల: ఇటీవల కురిసిన వర్షాలకు పట్టణంలోని బుగ్గువాగు బ్రిడ్జి ఇరువైపులా కోతకు గురవ్వటంతో రాకపోకలు స్తంభించాయి. మూడు రోజుల నుంచి రాకపోకలకు త్రీవ అంతరాయం ఏర్పడింది. అటువైపు వెళ్లే ప్రజలు బైపాస్ రోడ్డుపై నుంచి పట్టణంలోనికి రావాల్సి ఉంది. ఈ ప్రాంతంలో సుమారు 200 గృహాల వారు నిసిస్తున్నారు. వారందరికి రాకపోకలకు పట్టణంలోకి వచ్చే అవకాశం లేకుండా ఈ బ్రిడ్జి కోతకు గురైంది. తప్పనిపరిస్థితుల్లో సుమారు రెండు కిలోమీటర్ల మేర పిడుగురాళ్ల పట్టణంలోకి రావాల్సి ఉంది. మున్సిపల్ అధికారులు స్పందించి తక్షణమే కోతకు గురైన రోడ్డును పూడ్చాలని, తరచూ వచ్చే వరదలకు కోతకు గురవుతుంది కాబట్టి శాశ్వత పరిష్కారం వైపు అధికారులు అడుగులు వేయాలని స్థానికులు కోరుకుంటున్నారు. -
వరదకు కొట్టుకుపోయిన పెదమద్దూరు రోడ్డు
నిలిచిపోయిన అమరావతి– విజయవాడ రాకపోకలు అమరావతి: కొద్ది రోజుల కింద వచ్చిన వరదకు పెదమద్దూరు రోడ్డు కొట్టుకుపోయింది. దీంతో అమరావతి నుంచి విజయవాడ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పెదమద్దూరు వద్ద సుమారు అర కిలోమీటరు మేర పూర్తిగా ధ్వంసమైంది. వైకుంఠపురం, పెదమద్దూరు గ్రామాల ప్రజలతోపాటుగా అమరావతి నుండి విజయవాడకు వెళ్లే వారికి విజయవాడ నుంచి అమరావతి వచ్చే యాత్రికులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని అమరావతి నుండి వైకుంఠపురం పెదమద్దూరు వెళ్లాలంటే నరుకుళ్లపాడు, ఎండ్రాయి, చావపాడు మీదుగా సుమారు 12కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సిందే. ప్రస్తుతం విజయ వాడ–అమరావతి బస్సులు పెదమద్దూరు వరకు వచ్చి అక్కడి నంండి వెనుతిరుగుతున్నాయి. గురువారం రాత్రి పెదమద్దూరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నప్పటికీ పోలీసు, రెవెన్యూ సిబ్బంది కాపాలా కాస్తున్న అమరావతికి చెందిన ట్రాక్టర్ అమరావతి నుంచి వైకుంఠపురం వైపు వెళ్ళటానికి ఈ రోడ్డు గుండా వచ్చి ప్రమాదవశాత్తు వాగులో పడి వరదనీటిలో మునిగిపోయింది. ట్రాక్టర్ డ్రైవర్‌కు ప్రాణాపాయం తప్పింది. వెంటనే ప్రజాప్రతినిధులు, సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి రోడ్డుకు కనీస మరమ్మతులు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
తెలుగు తమ్ముళ్ల కుమ్ములాట
చీరాల టౌన్: జెండా వందనం సాక్షిగా తోటవారిపాలెం తెలుగు తమ్ముళ్లు కుమ్ములాటకు దిగారు. చీరాల మండలంలోని తోటవారిపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద జరిగిన స్వాతంత్య్ర దిన వేడుకల్లో జెండా వందనం అనంతరం నిర్వహించిన గ్రామసభలో వారు బాహాబాహీకి దిగారు. ఒక వర్గానికి కుర్చీలు వేసి మరో వర్గానికి వేయకపోవడంతో వారు దాడులకు తెగబడ్డారు. దీంతో అటు అధికారులు, ప్రజలు విస్తుపోయారు. తోటవారిపాలెం పంచాయతీ వద్ద నిర్వహిస్తున్న జాతీయ జెండా ఆవిష్కరణ అనంతరం గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి ఎం.భారతి అధ్యక్షతన ఏర్పాటైన కార్యక్రమంలో గ్రామ ప్రజలు, సచివాలయాల ఉద్యోగులు పాల్గొన్నారు. టీడీపీలోని రెండు వర్గాల వారు కూడా హాజరయ్యారు. గ్రామసభ వేదికపై అధికారులకు మాత్రమే కుర్చీలు వేయాలి. పంచాయతీ కార్యదర్శి మాత్రం ప్రోటోకాల్ పదవులు లేని వారిని వేదికపై కూర్చోబెట్టారు.. మాజీ వైస్ ఎంపీపీ వర్గానికి చెందిన ఓ డీలర్ ... మాజీ వార్డు మెంబర్ ఆదాంపై వేదికపై ఉండటంతో ఆగ్రహానికి గురయ్యారు. ‘మేం అసలైన టీడీపీ నాయకులం... మేం చెప్పిన వారినే కుర్చీలో కూర్చోబెట్టాలి. టీడీపీ నాయకులకు అధికారులు ప్రోటోకాల్ ఇవ్వాలని’ పంచాయతీ అధికారులకు హుకుం జారీ చేశారు. గతంలో ఉన్న పాత గొడవల నేపథ్యంలో డీలర్ సురేష్.. మాజీ వార్డు మెంబర్ ఆదాంపై దాడి చేశారు. అందరూ చూస్తుండగానే టీడీపీ నాయకులు ఒకరిపై ఒకరు దాడులకు తెగపడటంతో అటు ప్రజలు, ఇటు అధికారులు విస్తుపోయారు. తరచూ ఆధిపత్య పోరు తెలుగు తమ్ముళ్ల ఆధిపత్య పోరు కారణంగా గ్రామాల్లో తరచుగా ఇలా గొడవలు, ఘర్షణలు జరుగుతున్నాయి. దీనిపై గ్రామ పంచాయతీ ప్రత్యేకాధికారి, ఈవోఆర్డీని రామకృష్ణను వివరణ కోరగా తోటవారిపాలెం గ్రామసభలో ఇరువర్గాల వారు తన్నుకున్నారని తెలిసిందన్నారు. దీని గురించి పంచాయతీ కార్యదర్శి భారతి వివరణ తీసుకుంటున్నామని తెలిపారు. కాగా, ఇరువర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేసిన జనసేన ఉమ్మడి ప్రకాశం జిల్లా కార్యదర్శి గూడూరి శివరామప్రసాద్పై కూడా దాడి చేసి కొట్టారు. పంచాయతీ కార్యదర్శి మేడికొండ భారతి తీరు వల్లే ఈ ఘర్షణ జరిగిందనే ప్రచారం సాగుతోంది. -
వైభవంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
పెదకాకాని: స్థానిక శివాలయంలో శ్రావణ మాసం పురస్కరించుకుని శుక్రవారం నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రతంలో మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. దేవస్థానంలోని కల్యాణ మండపంలో స్థానాచార్యులు పొత్తూరు సాంబశివరావు ఆధ్వర్యంలో అర్చకులు, వేద పండితులు శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన సామూహిక వరలక్ష్మీ వ్రత పూజలకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. వ్రతంలో పాల్గొన్న ముత్తయిదువులకు దేవస్థానం తరఫున అమ్మవారి ప్రసాదంగా పసుపుకుంకుమ, జాకెట్ ముక్క, అష్టలక్ష్మీ దేవి రూపు, కంకణం అందజేశారు. భ్రమరాంబ అమ్మవారు లక్ష గాజుల ప్రత్యేక అలంకారంలో భక్తులను అనుగ్రహించారు.భక్తులు పెద్దసంఖ్యలో భ్రమరాంబ మల్లేశ్వరస్వామి వార్లను దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు. ఏర్పాట్లను ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్ పర్యవేక్షించారు. -
గుంటూరు రేంజ్ కార్యాలయ ఆవరణలో వేడుకలు
నగరంపాలెం: గుంటూరు కలెక్టర్ బంగ్లా రోడ్డులోని గుంటూరు రేంజ్ ఐజీ కార్యాలయ ఆవరణలో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించారు. ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి జెండా ఎగురవేసి, గౌరవ వందనం చేశారు. అనంతరం కార్యాలయ, పోలీస్ సిబ్బందికి మిఠాయిలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా ఏఎస్పీ (ఏఆర్) హనుమంతు, ఆర్ఎస్ఐలు సంపంగిరావు, ప్రసాద్, అధికారులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఆటో బోల్తా..పలువురికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమం మేడికొండూరు : మండల పరిధిలోని గుండ్లపాలెం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలైన సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరిపురం గ్రామానికి చెందిన మహిళలు నల్లపాడు పరిధిలో ఓ వివాహానికి వెళుతూ పాటిబండ్ల నుంచి వస్తున్న ఆటో ఎక్కారు. మేడికొండూరు పోలీస్ స్టేషన్ దాటిన తర్వాత గుండ్లపాలెం వద్ద ఎదురుగా గేదె అడ్డు రావడంతో డ్రైవర్ సడన్ బ్రేక్ వేయడంతో ఆటో బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. సిరిపురం గ్రామానికి చెందిన మిరియాల లిల్లీ రాణి తీవ్రంగా గాయపడింది. ఆమెను ఆటో లాక్కొని వెళ్లడంతో పక్కటెముకలు దెబ్బతిన్నాయి. కుడి చేయితో పాటు ఒళ్లంతా గాయాలయ్యాయి. తలకు తీవ్ర గాయమై పరిస్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆమెను ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దుర్గమ్మకు కానుకగా బంగారు లక్ష్మీహారం ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు శుక్రవారం గుంటూరు జిల్లా వడ్లమూడికి చెందిన భక్తులు 82 గ్రాముల బంగారు లక్ష్మీహారాన్ని కానుకగా సమర్పించారు. వడ్లమూడికి చెందిన వి.శ్రవణ్‌కుమార్ కుటుంబం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. సుమారు రూ.8.50 లక్షల విలువైన 82 గ్రాముల బంగారం, పచ్చలతో తయారు చేయించిన లక్ష్మీహారాన్ని ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ ఏఈవో ఎన్. రమేష్‌బాబు, ఇతర అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందజేశారు. దుర్గమ్మ సన్నిధిలో భక్తుల రద్దీ ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రావణ మాసం నాల్గో శుక్రవారం, ఆగస్టు 15వ తేదీ సెలవుదినంతో పాటు, శనివారం శ్రీకృష్ణాష్టమి సెలవు, ఆదివారం ఇలా వరుసగా మూడు రోజుల సెలవుల నేపథ్యంలో ఇంద్రకీలాద్రికి భక్తుల రద్దీ పెరిగింది. సెలవులకు తోడు వివాహ సుముహూర్తాలు కూడా ఉండడంతో నూతన వధూవరులు కుటుంబ సమేతంగా ఇంద్రకీలాద్రికి తరలివస్తుండడంతో ఆలయ ప్రాంగణంలో పండుగ వాతావరణం కనిపించింది. రాత్రి 10 గంటల వరకు భక్తులను అమ్మవారి దర్శనానికి అనుమతించారు. -
మహనీయుల త్యాగఫలమే స్వాతంత్య్రం
నరసరావుపేట రూరల్: ఎందరో మహానుభావుల త్యాగఫలం వలనే దేశానికి స్వాతంత్య్రం వచ్చిందని వైఎస్సార్సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ కార్యాలయం, కోట సెంటర్లోని గాంధీ విగ్రహాల వద్ద నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగురవేశారు. మహాత్ముని విగ్రహాలకు పూలమాలలు వేసి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ.. దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలర్పించిన మహానీయులను ప్రతి ఒక్కరు స్మరించుకోవాలని అన్నారు. స్వాతంత్య్ర భారతావని నేడు అన్ని రంగాల్లో ముందుకు వెళుతోందని తెలిపారు. గాంధీ కలలు కన్న గ్రామస్వరాజ్యం దిశగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అడుగులు పడ్డాయని తెలిపారు. గ్రామ సచివాలయాలు నిర్మించి ప్రజల వద్దకే పాలన తీసుకువచ్చిన ఘనత వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. గ్రామ సచివాలయాలు, ఆరోగ్య కేంద్రాలు, ఆర్బీకేలను నాడు జగనన్న నిర్మించారని తెలిపారు. నేడు చంద్రబాబు ప్రభుత్వంలో గ్రామగ్రామాన బెల్ట్‌షాపులు పెట్టి మద్యాన్ని ఇంటింటికీ డోర్ డెలివరి చేయిస్తున్నారని విమర్శించారు. వరదల కారణంగా నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసారు. పంటతోపాటు ఇళ్లు కూడా దెబ్బతిన్నాయన్నారు. వరద నీటిలో రాజధాని నిర్మాణం సాధ్యమా? అమరావతి రాజధానిని చూస్తే బాధగా ఉందని, వరదలతో రాజధాని నదిలా మారిందన్నారు. వరదలు వచ్చిన ప్రతిసారి నీళ్లు తోడటం తప్ప నిర్మాణం చేసే పరిస్థితి అక్కడ కనిపించడం లేదని తెలిపారు. ఇప్పటికై నా చంద్రబాబు మేల్కొని రాజధానిని గుంటూరు–మంగళగిరి మధ్య ఏర్పాటు చేస్తే ప్రజలు హర్షిస్తారని తెలిపారు. అమరావతిలోనే రాజధాని కట్టాలనుకుంటే మరో ఏళ్లు అయినా అది పూర్తికాదని, అక్కడ అభివృద్ది జరగదన్నారు. ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల పదవీ కాలంలో దాదాపు రెండేళ్లు పూర్తికావచ్చిందని, మిగిలిన కొద్ది కాలంలో ఎలా నిర్మాణం చేయగలరో ఆలోచన చేయాలని చంద్రబాబుకు సూచించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి -
ముగిసిన పవిత్రోత్సవాలు
అమరావతి: ప్రసిద్ధ శైవ క్షేత్రమైన అమరావతి అమరేశ్వరాలయంలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న పవిత్రోత్సవాలు శుక్రవారం పూర్ణాహుతితో ముగిశాయి. దాతలు యార్లగడ్డ ఉపేంద్ర, విజయలక్ష్మిల సహకారంతో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలలో మూడోరోజున మండప పూజలు జరిగాయి. అనంతరం ఉపాలయాలలో పూజలు నిర్వహించారు. పూర్ణాహుతిలో ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. అనంతరం కలశానికి ఉద్వాసన చేసి కలశాలలోని పుణ్యజలాలతో స్వామివారికి అభిషేకం నిర్వహించారు. పవిత్రాలను తొలగించిన తర్వాత స్వామివారికి విశేషాలంకారం చేశారు. భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. మహిళల అభివృద్ధే ధ్యేయం నరసరావుపేట రూరల్: మహిళల అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు తెలిపారు. సీ్త్ర శక్తి పథకం కింద మహిళలకు ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించే కార్యక్రమాన్ని ఆర్టీసీ బస్డాండ్ ఆవరణలో శుక్రవారం ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, కలెక్టర్ అరుణ్‌బాబు, జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, ఆర్డీవో మధులతలు పాల్గొన్నారు. ఈ పథకాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఎంపీ లావు మాట్లాడుతూ మహిళల సాధికారితకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. సీ్త్ర శక్తి పథకం ద్వారా మహిళలు పురోగతి సాధిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ అజితకుమారి, డీఎం బి.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
చిన్నబాబుకు అధికారులు సెల్యూట్
గుంటూరు వెస్ట్: ఎందరో మహనీయుల త్యాగంతో సాధించుకున్న స్వాతంత్య్ర దినోత్సవాన్ని కూటమి ప్రభుత్వం అవహేళన చేసింది. గుంటూరు పోలీసు పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం జరిగిన 79వ స్వాతంత్య్ర వేడుకలు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కనుసన్నల్లోనే జరిగాయి. అధికారులు తమ హోదాలను మరిచి చిన్నబాబు సేవలో తరించారు. ఇతరులను అనుమతించకుండా తమ అనుకూల మీడియాకే అధికారం మొత్తం అప్పజెప్పారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై దాడి మంత్రి లోకేష్ ప్రసంగంలో రాజకీయాలకు, కులమతాలతకతీతంగా పాలన సాగిస్తామంటూనే గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలకే ప్రాధాన్యం ఇచ్చారు. తీవ్ర విమర్శలు గుప్పించారు. గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్లు అప్పులు చేసిందంటూ బురద జల్లారు. తమ ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన సుమారు రూ.2 లక్షల కోట్ల అప్పుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం విశేషం. స్వాతంత్య్ర వేడుకల్లో గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా జిల్లా ఇన్చార్జి మంత్రి అయినా, రాష్ట్ర మంత్రి అయినా జిల్లా అభివృద్ధి గురించి ప్రస్తావించేవారు. కానీ లోకేష్ ప్రసంగం గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంపై దాడిగా సాగింది. జిల్లా అభివృద్ధి గురించి పక్కన పెట్టారు. ప్రసంగాన్ని గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడంతోనే ప్రారంభించారు. లక్షల ఉద్యోగాలు, అద్భుతమైన ఇండస్ట్రీలు వచ్చేస్తాయంటూ త్రిశంకు స్వర్గాన్ని చూపించారు. లోకేష్ స్వోత్కర్షపై కొందరు అధికారులు ఇదేంటి అంటూ గుసగుసలాడారు. కార్యక్రమాన్ని కూడా అధికారులు ఒక నిర్దిష్ట పద్ధతిలో నిర్వహించాలి. అయితే, జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, ఎస్పీ సతీష్‌కుమార్, జిల్లా అధికారులు కూడా హుందాగా వ్యవహరించలేదు. పలుమార్లు మీడియా ప్రతినిధులు వెళ్లి ప్రశ్నించగా, వారిని గదమాయించే ప్రయత్నం చేశారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో అపశ్రుతులు పోలీసు పరేడ్ మైదానం రెండు రోజులుగా కురిసిన వర్షాలతో చిత్తడిగా మారింది. అధికారులు కూడా ఏర్పాట్టను అంతంత మాత్రంగానే నిర్వహించారు. ఆహూతులు కూర్చునే వేదికల్లో కూడా నీరు చేరింది. శకటాలు ప్రదర్శన సందర్భంగా కొన్ని బురదలో కూరుకుపోయాయి. క్రేన్‌తో వాటిని బయటకు తీయించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు చాలా వరకు తగ్గించేశారు. ప్రదర్శించిన కొందరు కూడా బురద కారణంగా అసౌకర్యానికి గురయ్యారు. పార్కింగ్ ఏర్పాట్లు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. లోకేష్ రాగానే ఆయన కాన్వాయిని రోడ్డుకు అడ్డంగా నిలిపి మొత్తాన్ని బారికేడ్లతో మూయించారు. -
తిరంగా.. ఎగిరె సగర్వంగా..
సాక్షి, నరసరావుపేట / నరసరావుపేట రూరల్: నరసరావుపేట రూరల్ మండలం లింగంగుంట్లలోని జిల్లా కలెక్టరేట్ వద్ద పరేడ్ గ్రౌండ్లో శుక్రవారం 79వ స్వాతంత్య్ర దిన వేడుకలు ఘనంగా జరిగాయి. జాతీయ పతాకాన్ని ముఖ్య అతిథిగా మంత్రి నాదెండ్ల మనోహర్ ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. స్వాతంత్య్రం సిద్ధించటానికి కృషి చేసిన సమరయోధుల సేవలను కొనియాడారు. అమరవీరులకు నివాళులు అర్పించారు. సమరయోధుడి కుమారుడు రామకృష్ణారెడ్డి, రమాదేవి దంపతులతోపాటు దేశం కోసం ప్రాణాలర్పించిన క్రోసూరు మండలం పీసపాడుకు చెందిన అమర జవాన్ నేతాజీ తల్లిదండ్రులు ఎన్.భాస్కరరావు దంపతులు, రొంపిచర్ల మండలం రామిరెడ్డిపాలెంకు చెందిన రమకాంత్‌రెడ్డి భార్య సావిత్రి సత్కారం పొందిన వారిలో ఉన్నారు. సమగ్ర ప్రగతికి చర్యలు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... పల్నాడు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. మహాత్ములు కలలుగన్న స్వాతంత్య్ర ఫలాలు, రాజ్యాంగ స్ఫూర్తితో అందరికి సమాన అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. పేదరిక నిర్మూలనకు పీ–4 కింద కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. వ్యవసాయరంగానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తోందన్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. వసతి గృహాలను మెరుగు పరుస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతినెలా ఒకటో తేదీన ఇంటి వద్దే పింఛన్ నగదు అందిస్తున్నట్లు గుర్తుచేశారు. సీ్త్ర శక్తి పేరుతో ఐదు రకాల బస్సులలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామన్నారు. జిల్లాలో అన్నా క్యాంటీన్ల ద్వారా నిత్యం 8,546 మందికి భోజనం అందిస్తున్నామని తెలిపారు. జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందికి మంత్రి అభినందనల తెలిపారు. జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, జిల్లా అదనపు కలెక్టర్ సూరజ్ గనోరే, అదనపు ఎస్పీ జేవీ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా ఘనంగా స్వాతంత్య్ర దిన వేడుకలు పోలీసు శాఖ ఆధ్వర్యంలో జాగిలాల ప్రదర్శన ఆహూతులను ఆకట్టుకుంది. ప్రభుత్వ శాఖల శకటాలు అలరించాయి. పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేకంగా నిలిచాయి. లింగంగుంట్ల శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్, విప్పర్ల రెడ్డిపాలెం, క్రోసూరు మోడల్స్ స్కూల్స్ విద్యార్థులు దేశభక్తి గేయాలకు నృత్యాలు చేశారు. శావల్యాపురం జెడ్పీ హైస్కూల్ విద్యార్థుల కోలాటం ప్రదర్శన ఆకట్టుకుంది. ఎత్తిపోతల గిరిజన రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థినులు ప్రదర్శించిన కోయ సంప్రదాయ నృత్య రూపకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో స్టాళ్లు ఏర్పాటు చేశారు. వీటిని మంత్రి, అధికారులు తిలకించారు. నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, డీఆర్వో మురళి, ఆర్డీవో మధులత తదితరులు పాల్గొన్నారు. -
పల్నాడు
శుక్రవారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 2025సాక్షి, నరసరావుపేట : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు గురువారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. పగటి పూట వర్షం పడకపోవడంతో రైతులు, ప్రజలు కొంత ఊపిరిపీల్చుకున్నారు. మంగళ, బుధవారాల్లో కురిసన భారీ వర్షాలకు జిల్లా వ్యాప్తంగా ప్రమాదకరంగా ప్రవహించిన వాగులు, వంకలు కొంతమేర శాంతించాయి. అయినప్పటికీ గురువారం కూడా చప్టాలపై వరదనీరు ఉధృతంగా ప్రవహించింది. పంట పొలాలలో నీరు తగ్గడంతో మొక్కలు మేట పడిన దృశ్యాలు కనిపించాయి. రాజుపాలెం మండలం బలిజేపల్లి దగ్గర చప్టాపై వర్షపునీరు ప్రవహించడంతో బలిజేపల్లి–ఉప్పలపాడు మధ్య రాకపోకలకు కొంత సమయం అంతరాయం కలిగింది. అమరావతి మండలం పెదమద్దూరు వద్ద లోలెవల్ బ్రిడ్జిపై ఐదు అడుగుల మేర వర్షపు నీరు ప్రవహించింది. దీంతో ఉదయం వాహనాల రాకపోకలకు ఇబ్బంది ఎదురైంది. గురజాల మండలం మాడుగుల వద్ద ఎద్దుల వాగు, చర్లగుడిపాడు జంగమేశ్వరపురం మధ్య నల్లవాగు, రెంటచింతల మండలంలో గోలివాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆయా ప్రాంతాల ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది పడ్డారు. మాచవరం మండలం శ్రీరుక్మిణిపురం వద్ద పిల్లేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో శ్రీరుక్మిణిపురం, పిల్లుట్ల, బెల్లంకొండ, పిడుగురాళ్ల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. పెదకూరపాడు మండలం పాటిబండ వద్ద వాగు ఉధృతంగా ప్రవహించండంతో ప్రజలు ఇబ్బందిపడ్డారు. చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్న ఓగేరు, కుప్పగంజి, దంతెనవాగు, నక్కవాగు, ఉప్పవాగు, కొండవాగు, వేదమంగళ వాగు ఇప్పటికే వరద నీటితో ఉధతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు కొనసాగితే ఈ వాగులు మరింత ఉగ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాల నేపథ్యంలో గురువారం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. బుధవారం ఉదయం నుంచి గురువారం ఉదయం వరకు జిల్లా వ్యాప్తంగా 120 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో వ్యాప్తంగా సగటున 4.32 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నకరికల్లు మండలంలో 9 సెంటీ మీటర్లు వర్షం పడగా, అత్యల్పంగా రెంటచింతలలో 0.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. వెల్దుర్తి, కారంపూడి, రాజుపాలెం మండలాల్లో 7 సెంటీమీటర్లకు పైగా వర్షం కురిసింది. ఆగస్టు మాసం 14వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 6.31 సెంటీమీటర్లు పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 17 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. క్రోసూరులో నీట మునిగిన పత్తి మొక్కలుఉధృతంగా ప్రవహిస్తున్న పిల్లేరు వాగుగురువారం తెల్లవారుజామున వరకు కొనసాగిన భారీ వర్షాలు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు రాజుపాలెం మండలంలో బలిజేపల్లి వద్ద ప్రమాదక స్థాయిలో వర్షపు నీరు వర్షాలకు దెబ్బతిన్న ముదురు పత్తి, కంది, వరి పంటలు 2,561 హెక్టార్లలో పంట నీట మునిగిందంటున్న వ్యవసాయశాఖ బొల్లాపల్లి : స్థానిక వెలుగు పథకం కార్యాలయంలో గురువారం ఆడిట్ నిర్వహించారు. 2024–25 ఆర్థిక సంవత్సరానికి నిధులకు సంబంధించి ఆడిట్ జరిగింది. వెల్లటూరు(భట్టిప్రోలు): వెల్లటూరులోని ముత్యాలమ్మ, కట్లమ్మ, మహాలక్ష్మమ్మ అమ్మవార్లకు గురువారం చద్ది సమర్పించారు. భక్తులు పూజలు జరిపారు. భారీ వర్షాలవల్ల పంట పొలాలలో వర్షపునీరు భారీగా చేరి పంటలు నీట మునిగాయి. అమరావతి, క్రోసురు, పెదకూరపాడు, రెంటచింతల మండలాల పరిధిలో పత్తి, కంది, వరి పంటలు నీట మునిగినట్టు వ్యవసాయశాఖ అధికారులు గురువారం ప్రకటించారు. మొత్తం 2,561 హెక్టార్లలో పంట నీటమునగగా అందులో 2,530 హెక్టార్లలో పత్తి, 20 హెక్టార్లలో వరి, 11 హెక్టార్లలో కంది పంట నీటమునిగింది. వర్షాలు కొనసాగి, వర్షపునీటిలో మొక్కలు మునిగితే నష్టం అపారంగా ఉండనుంది. జిల్లాలో ఉద్యానపంటల సాగు పూర్తిస్థాయిలో మొదలుకాకపోవడం వల్ల పంటలకు పెద్దగా నష్టం లేదని అధికారులు తెలిపారు. -
● మహనీయులకు ఇచ్చే గౌరవం ఇదేనా!
బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం అనేక మంది ప్రాణత్యాగం చేశారు. అలాంటి మహనీయుల విగ్రహాలను ఏర్పాటుచేసుకుని ప్రతి ఏటా వారిని స్మరించుకుంటాం. ఆ మహనీయులకు తీరని అవమానం జరిగింది. పిడుగురాళ్లలోని రైల్వేస్టేషన్‌రోడ్డులో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల(జమునా స్కూల్) ఆవరణలో జాతిపిత మహాత్మాగాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, పొట్టి శ్రీరాములు, లాల్ బహుదూర్ శాస్త్రి విగ్రహాలను ఏర్పాటుచేశారు. మూడేళ్ల కిందట పాఠశాల పునఃనిర్మాణం చేపట్టారు. విగ్రహాలను తీసి పక్కన పెట్టారు. విగ్రహాలను పునఃప్రతిష్ట చేయలేదు. – పిడుగురాళ్ల -
ఇక్కడే తాగండి
ఎక్కడో ఎందుకు..వైన్ షాపుల్లో పర్మిట్ రూములు ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి మద్యం ప్రియులు ఇప్పటి వరకు చెట్ల కింద, రోడ్ల వెంట తాగుతూ భయపడుతున్నారు. ఇకపై ఆ భయం అవసరం లేదు. ఎందుకంటే వైన్ షాపుల్లోనే సకల సౌకర్యాలు కల్పించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మద్యం దుకాణంలో ఒక ఫుల్ బాటిల్ తీసుకుంటే.. ఉత్తరం గదిలో గ్లాసులు, మంచింగ్, దక్షిణం గదిలో టేబుళ్లు ఏర్పాటుచేస్తున్నారు. మద్యాన్ని ప్రభుత్వం ఆదాయ వనరుగా మార్చుకుంది. పర్మిట్ రూముల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది. నరసరావుపేటటౌన్: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం మద్యం నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. ప్రైవేటు పెత్తనాన్ని పక్కకు నెట్టేసి ప్రభుత్వమే మద్యం దుకాణాలు నిర్వహించింది. ఇదే సమయంలో ప్రజలను మద్యానికి దూరం చేయాలనే సంకల్పంతో కొన్ని బ్రాండ్ల విక్రయాన్ని నిలిపేసింది. మరో వైపు పేదలకు అందుబాటు ధరలో ఉంచకుండా చర్యలు తీసుకుంది. ఇలా మద్యం నియంత్రణకు తీవ్రంగా కృషి చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం చంద్రబాబు నాయుడు సరికొత్త మద్యం పాలసీని ప్రవేశపెడుతున్నామని చెబుతూనే.. గత వైఎస్సార్ సీపీపై విపరీతమైన విమర్శలు గుప్పించారు. మద్యంతో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడారని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక మద్యం నియంత్రణతోపాటు డ్రగ్ ఎడిక్షన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పించారు. కానీ అధికారం చేపట్టిన వెంటనే మద్యం వ్యాపారాన్ని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి తీసుకెళ్లారు. వేళాపాళా లేకుండా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారు. దీంతో రాత్రి వేళ మద్యం మత్తులో రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. మరో వైపు అర్ధరాత్రి ఘర్షణలు జరుగుతున్నాయి. గత ఏడాదిగా క్రైమ్ రేటు పరిశీలిస్తే మద్యం మత్తులోనే ఎక్కువగా నేరాలు జరిగినట్లు తెలుస్తోంది. ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వం వచ్చాక మద్యం ఏరులై పారుతోంది. నియంత్రించాల్సిన ఎకై ్సజ్ అధికారుల కళ్లకు మామూళ్ల మత్తు కమ్మడంతో అడ్డూఅదుపూ లేకుండా పోయింది. ఈ క్రమంలో మద్యం దుకాణాల వద్ద ఘర్షణలు పెరిగిపోయాయి. వీటిపై దృష్టి సారించి మందుబాబులను కట్టడి చేయాల్సిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం.. తాజాగా పర్మిట్ రూములకు పర్మిషన్ ఇచ్చేసింది. ఎక్కడో ఎందుకు.. ఇక్కడే తాగండి.. తాపించండి.. అంటూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 129 మద్యం దుకాణాలు ఉండగా వాటికి అనుబంధంగా పర్మిట్ రూమ్‌లు రానున్నాయి. పర్మిట్ రూమ్‌లకు ప్రభుత్వం రెండు కేటగిరీలుగా విభజించింది. ఇందులో 5 లక్షల జనాభాలో లోపు ఉన్న మద్యం దుకాణాలకు పర్మిట్ రూమ్‌లకు వార్షిక ఫీజు రూ.5లక్షలుగాను, 5 లక్షల నుంచి 7.5 లక్షల జనాభా గల మద్యం దుకాణాలకు వార్షిక ఫీజు రూ.7.5 లక్షలుగాను నిర్ణయించారు. జిల్లాలో రూ.5 లక్షల పరిధిలో వచ్చే పర్మిట్ రూమ్‌లు 33 ఉండగా, రూ.7.5 లక్షల ఫీజు చెల్లించాల్సిన దుకాణాలు 96 ఉన్నాయి. వీటి ద్వారా ఏడాదికి ఎకై ్సజ్ శాఖకు రూ.8.85 కోట్ల ఆదాయం రానుంది. మందుబాబులకు మద్యంతోపాటు సకల సౌకర్యాలు ఇప్పటికే నియంత్రణ లేక ఛిద్రమవుతున్న కుటుంబాలు పర్మిట్ రూములతో మరింత పెరిగే అవకాశం తీవ్రంగా మండిపడుతున్న ప్రజా, మహిళా సంఘాలు -
మద్యంతోనే అనర్థాలన్నీ...
చంద్రబాబు మొదటి సారి సీఎం అవ్వగానే అప్పటి వరకు ఎన్టీఆర్ అమలు చేసిన సంపూర్ణ మద్య నిషేధానికి తూట్లు పొడిచాడు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు వీలైనంతగా మద్యం విక్రయాలను తగ్గించి దశలవారీగా మద్యనిషేధానికి చర్యలు చేపట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మద్యాన్ని ఆదాయ వనరుగా మార్చింది. పర్మిట్ రూమ్‌లకు అనుమతి ఇవ్వడమంటే పరోక్షంగా నేరాలను ప్రోత్సహించడమే. ప్రభుత్వం ఇచ్చిన జీవోపై పునరాలోచించి తక్షణమే రద్దు చేయాలి. –ఈదర గోపీచంద్, గాంధేయవాది, నరసరావుపేట -
వేడుకలకు ముస్తాబు
స్వాతంత్య్ర ● వేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొననున్న రాష్ట్ర మంత్రి నాదెండ్ల ● ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్ అరుణ్‌బాబు, ఎస్పీ శ్రీనివాసరావు నరసరావుపేట రూరల్: 79వ స్వాతంత్య్ర వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. వేడకలు నిర్వహించే ప్రాంగణాన్ని తివర్ణ పతాకాలతో అలంకరించారు. అతిథుల కోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేశారు. వీఐపీల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేశారు. దీంతోపాటు పరేడ్‌ను ప్రజలు తిలకించేందుకు వీలుగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేడుకలకు రాష్ట్ర పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహార్ ముఖ్య అతిథిగా హాజరై ఉదయం 9గంటలకు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. పోలీసు, ఎన్సీసీ దళాల అనంతరం ముఖ్య అతిథి రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహార్ సందేశం అందిస్తారు. తరువాత మువ్వన్నెల బెలూన్లు ఎగురవేయడం, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం, శకటాల ప్రదర్శన ఉంటుంది. 10.15గంటలకు విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఉంటాయి. 11.41గంటలకు విధి నిర్వహణలో ఉత్తమ సేవలు అందించిన వారికి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేస్తారు. ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను అతిథులు సందర్శించిన అనంతరం జాతీయ గీతాలాపనలో కార్యక్రమం ముగుస్తుంది. ఏర్పాట్లు పరిశీలన.. పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావులు గురువారం పరిశీలించారు. ప్రధాన వేదిక, వీవీఐపీ, వీఐపీల గ్యాలరీలు, స్టాల్స్‌ను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, డీఆర్వో మురళీ, ఆర్డీఓ మధులత, అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
నదిలో గల్లంతైన యువకుల కోసం గాలింపు
సాయంత్రానికి ఒక యువకుడి మృతదేహం లభ్యం మేడికొండూరు : మేడికొండూరు మండల పరిధిలో దారి దోపిడీ పక్కా పథకం ప్రకారమే జరిగిందని తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ అన్నారు. మేడికొండూరు పోలీస్ స్టేషన్లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కేసుకు సంబంధించి డీఎస్పీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 4న రూ.70 లక్షల నగదు, కారును అపహరించుకు వెళ్లినట్లు విజయవాడలో నివాసం ఉంటున్న జగదీష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన మేడికొండూరు పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. జగదీష్ స్నేహితుడు రంజిత్ ఈ నెల 4న బంగారపు మట్టి (లంకె బిందెలు లాంటివి) ఉందని జగదీష్‌ను నమ్మించి కేజీ రూ. 50 లక్షలు చొప్పున రెండు కేజీలు ఉందని చెప్పగా అందుకు జగదీష్ తన వద్ద రూ.70 లక్షలు మాత్రమే ఉన్నాయని, మిగతావి రెండు రోజుల తర్వాత ఇస్తానని చెప్పడంతో అందుకు రంజిత్ అంగీకరించాడు. జగదీష్ తన కారులో సత్తెనపల్లి వచ్చి అక్కడ ఉన్న రంజిత్ మరో ఇద్దరు వ్యక్తులతో మాట్లాడి బంగారపు మట్టిని పరిశీలించాడు. అనంతరం ఎవరి కారులో వాళ్ళు విజయవాడ బయలుదేరారు. మేడికొండూరు సమీపంలోకి రాగనే ఇద్దరు వ్యక్తులు జగదీష్ కారును అడ్డగించారు. పోలీస్ దుస్తులలో ఉన్న వారు విజిలెన్‌న్స్ అధికారులం అంటూ, జగదీష్ కారులో ఉన్నఐ రూ.70 లక్షల నగదు, కారు తీసుకొని పరారయ్యారు. వెంటనే జగదీష్ తన స్నేహితులకు ఈ విషయం తెలిపి, సత్తెనపల్లి వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు పోలీసులు బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. 13వ తేదీన పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో సోరియాసిమ్ కంపెనీ వద్ద కార్లను తనిఖీ చేస్తుండగా ఈ కేసులో నిందితులైన అంకుష్, మహాదేవులు వారి వాహనంతో వస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. కారులో 40 లక్షల రూపాయల నగదు, ఆరు లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. స్నేహితుడిని నమ్మించి మోసగించిన ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజమండ్రికి చెందిన రంజిత్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులను చాకచక్యంగా పట్టుకోవడంలో ప్రతిభ చూపిన మేడికొండూరు సీఐ నాగూర్ మీరాసాహెబ్, ఎస్ఐ సుబ్బారావు, కానిస్టేబుల్ జాన్ సైదా, బాజీ సాహెబ్‌లను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
పొంగిపొర్లుతున్న వాగులు
చిలకలూరిపేటటౌన్/యడ్లపాడు: రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నియోజకవర్గంలో ఉన్న ఓగేరు, కుప్పగంజి, దంతెనవాగు, నక్కవాగు, ఉప్పవాగు, కొండవాగు, వేదమంగళ వాగు ఇప్పటికే వరద నీటితో ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు కొనసాగితే ఈ వాగులు మరింత ఉగ్రరూపం దాల్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. వరద నీరు రోడ్లపై ప్రవహించే సమయంలో వాహనాలను నడపవద్దని, లోతట్టు గ్రామాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాగులు, వంకల వద్దకు ఎవరూ వెళ్లరాదని పోలీసులు హెచ్చరించారు. లో–లెవెల్ వంతెనల వద్ద నీరు ప్రవహించే ప్రదేశాలలో ప్రజలు వెళ్లకుండా ముందస్తు జాగ్రత్తగా పోలీసులు పహారా ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఈ వరద ముప్పు నుంచి తమను తాము రక్షించుకోవడానికి ప్రజలు అధికారుల సూచనలను తప్పకుండా పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. పొంగిన వాగులు – నిలిచిన రాకపోకలు నాదెండ్ల: భారీ వర్షాలకు వాగులు పొంగిపొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లోని వరద నీరు లోతట్టు ప్రాంతాలను ముంచెత్తింది. గణపవరం–చిలకలూరిపేట డొంక రోడ్డులోని కుప్పగంజివాగు లోలెవల్ చప్టాపై నాలుగడుగుల మేర వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు స్తంభించాయి. రెవెన్యూ సిబ్బంది రాకపోకలను నిలిపివేయించారు. తహసీల్దార్ ఎస్. చంద్రశేఖర్, ఎస్సై జి. పుల్లారావు వరద ఉధృతిని పరిశీలించారు. గణపవరం కుప్పగంజివాగు పరిసర ప్రాంతాల్లోని పంటపొలాలు నీట మునిగాయి. అమీన్‌సాహెబ్‌పాలెం, గొరిజవోలు రోడ్లపై వరదనీరు ప్రవహించింది. మరో రెండు రోజుల పాటు వర్షాల ప్రభావంతో వరద కొనసాగే అవకాశం ఉండటంతో అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. -
తటాకం కాదు మైదానం!
ఈ చిత్రం చూసి, ప్రభుత్వ పాఠశాలలో ఎంత మంచి స్విమ్మింగ్ పూల్ ఉంది.. అనుకుంటే బురదలో కాలేసినట్లే.. వారు అలా ఈత కొడుతుంది ఎటూపోయే మార్గంలేక నిలిచిపోయిన వర్షం నీటిలో.. బెల్లంకొండ జెడ్పీ హైస్కూల్ మైదానంలో రెండు రోజులుగా భారీవర్షాలు కురవడంతో వర్షపు నీరు పాఠశాల మైదానంలో నిలిచిపోయింది. మోకాళ్ల లోతు నీళ్లు ఉండడంతో చిన్నారులు గురువారం ఇలా ఈత కొడుతూ కనిపించారు. వర్షం పడిన ప్రతిసారి పాఠశాలలో ఇదే పరిస్థితి ఉందని విద్యార్థులు చెబుతున్నారు. కొద్దిపాటి వర్షం కురిసినా నీరు రోజుల తరబడి నిలిచి ఉంటుందని పేర్కొన్నారు. – బెల్లంకొండ -
నేడు పాఠశాలలకు సెలవు
నరసరావుపేట ఈస్ట్: నిరంతరం కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో గురువారం పల్నాడు జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాశాలలకు సెలవు ప్రకటిస్తూ జిల్లా విద్యా శాఖ అధికారి చంద్రకళ బుధవారం తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విద్యార్థుల భద్రత దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. జిల్లా పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యం పాఠశాలలకు ప్రకటించాలని కోరారు. వరద ఉధృతిని పరిశీలించిన కలెక్టర్ దొడ్లేరు(క్రోసూరు): భారీ వర్షాలకు పొంగుతున్న వాగులు, వంకలతో వచ్చిన వరదలను బుధవారం జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు, ఎస్పీ కంచి శ్రీనివాసరావు, సత్తెనపల్లి ఆర్డీవో రమణాకాంత్ రెడ్డి పరిశీలించారు. గ్రామంలో హసనాబాద్ రోడ్డు లో లోలెవల్చప్టా పై పొంగి ప్రవహిస్తున్న వరదనీరు, పిడుగురాళ్ల రోడ్డులో లోలెవల్ చప్టాపై పొంగుతున్న నీరు, ముస్లిం కాలనీలో వరద పరిస్థితి పరిశీలించారు. వర్షాలు కురుస్తున్నందున వరద ప్రవాహాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తహసీల్దార్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రజలు ఎవరైనా ఇబ్బందులు ఎదురైతే వెంటనే కంట్రోల్ రూంకు సమాచారం అందించాలని కోరారు. అనంతరం ఊటుకూరు, బయ్యవరం మీదుగా అమరావతి వెళ్లారు. వారి వెంట తహసీల్దార్ వి.వి.నాగరాజు, ఎస్ఐ పి.రవిబాబు ఉన్నారు. అమరేశ్వర స్వామి పవిత్రోత్సవాలు ప్రారంభం అమరావతి: స్థానిక అమరేశ్వరాలయంలో బుధవారం నుంచి శుక్రవారం వరకు నిర్వహించే పవిత్రోత్సవాలను అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా ప్రారంభించారు. తొలిరోజు బుధవారం ఉదయం 5గంటల నుంచి ఆలయ ఆవరణను శుద్ధిచేసి భక్తులకు 9 గంటలకు స్వామివారి దర్శనాన్ని కల్పించారు. రెండవరోజు గురువారం పవిత్రో త్సవాలలో మండప పూజలు, దీక్షాహోమాలు, మూలమంత్ర హవనములు, రుద్రహోమం, పవిత్రారోపణం, చండీహోమం నిర్వహిస్తామని ఆలయ ఈవో రేఖ తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. నంబూరు చప్టాలో పడి విద్యార్థి మృతి పెదకాకాని: ఓ విద్యార్థిని చప్టాలో ప్రవహిస్తున్న నీరు మృత్యు రూపంలో మింగేసింది. ఈ ఘటన నంబూరు గ్రామంలోని విజయభాస్కర్నగర్లో బుధవారం జరిగింది. పెదకాకాని మండలం నంబూరు విజయభాస్కర్ నగర్‌కు చెందిన నేలపాటి సురేష్‌బాబు, ఎస్తేరురాణి దంపతులకు యోహాన్, షారోన్‌లు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు యోహాన్ 8వ తరగతి, చిన్న కుమారుడు షారోన్ 5వ తరగతి చదువుతున్నాడు. నంబూరు గ్రామాన్ని వరదనీరు చుట్టుముట్టడంతో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. పిల్లలతో పాటు బయట ఆడుకుంటున్న యోహాన్ మరికొందరు కాజ రోడ్డులో ఉన్న చప్టాపైపు వెళ్ళారు. మురుగు చెరువు నీటి ఉధృతికి యోహాన్ కాలుజారి చప్టాలో పడి కొట్టుకుపోయాడు. సమాచారం అందుకున్న స్థానికులు గాలించారు. అప్పటికే నీట మునిగిన యోహాన్ (14) మరణించాడు. ఆడుకునేందుకు బయటకు వెళ్లిన కొడుకు నిమిషాల వ్యవధిలోనే మృతి చెందడంతో తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు స్థానికుల హృదయాలను కలచివేసింది. -
చిరస్మరణీయులు ‘ఉన్నవ’
యడ్లపాడు: భారత స్వాతంత్య్ర సంగ్రామంలో జాతిపిత మహాత్మాగాంధీ కీలక పాత్ర పోషించారు. అహింస అనే ఆయుధంతో తెల్లదొరల పాలనకు ముగింపు పలికి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారు. దేశ ప్రజలను చైతన్యవంతులను చేయడానికి, వారిలో స్వాతంత్య్ర స్ఫూర్తిని రగిలించడానికి గాంధీజీ దేశవ్యాప్తంగా పర్యటించారు. హిందీలో ఆయన చేసిన ఉపన్యాసాలు లక్షలాది ప్రజలను కదిలించాయి. అయితే ఆంధ్ర ప్రజల హృదయాల్లో గాంధీ సందేశాన్ని నింపిన ఒక మహనీయుడు ఉన్నారు. ఆయనే ఉన్నవ రాజగోపాలకృష్ణయ్య. యడ్లపాడు మండలం ఉన్నవ గ్రామానికి చెందిన రాజగోపాలకృష్ణయ్య హిందీ భాషలో మంచి ప్రావీణ్యం ఉన్న వ్యక్తి. గాంధీజీ ఉపన్యాసాలను తెలుగులోకి తర్జుమా చేసి, ప్రజల్లో దేశభక్తిని పెంపొందించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. హిందీ అనువాదం... ఆయన ఉపన్యాసాలు హిందీలో ఉన్నప్పటికీ, వాటిని తెలుగులోకి అనువదించి, ఆంధ్ర ప్రజలకు దేశభక్తిని, స్వాతంత్య్ర పోరాట స్ఫూర్తిని అందించిన గొప్ప వ్యక్తి ఉన్నవ రాజగోపాలకృష్ణయ్య. గాంధీజీ ఆంధ్రదేశానికి వచ్చినప్పుడల్లా ఆయన ఉపన్యాసాలను అద్భుతంగా తెలుగులోకి అనువదించేవారు. గాంధీజీ సైతం ఆయన భాషా నైపుణ్యాన్ని గుర్తించి, తన పక్కనే ఉంచుకుని అనువాదం చేయించుకునేవారు. రాజగోపాలకృష్ణయ్య కేవలం అనువాదకుడిగా మాత్రమే కాకుండా, ఒక గొప్ప దేశభక్తుడిగా కూడా చరిత్రలో నిలిచిపోయారు. ఎడ్లబండ్లపై భారీ ప్రదర్శన... గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన ఆయన, అప్పట్లో ఉన్నవ గ్రామంలో మహాత్ముని విగ్రహాన్ని ఎడ్లబండిపై ఉంచి, కాంగ్రెస్ జెండాలు, గాంధీ టోపీలతో 62 బండ్లతో ఒక భారీ ఊరేగింపు నిర్వహించారు. నాడు ఈ ఊరేగింపు యువతలో ఉత్తేజాన్ని నింపి, గొప్ప దేశభక్తిని రగిలించింది. 1946 ఫిబ్రవరి 5న ఖమ్మంలో జరిగిన బాపు చివరి బహిరంగ సభలో కూడా రాజగోపాలకృష్ణయ్య గాంధీజీ ఉపన్యాసాన్ని తెలుగులోకి అనువదించారు. గాంధీజీ ఆలోచనలను, సందేశాలను తెలుగు ప్రజల గుండెల్లోకి చేర్చడంలో ఆయన చేసిన కృషి అమోఘం, అనిర్వచనీయం. అందుకే ఆయన్ని గాంధీజీ ఉపన్యాసాలకు ‘అనువాద బ్రహ్మ’ అని పిలుస్తారు. రాజగోపాలకృష్ణయ్య వంటి నిస్వార్థ దేశభక్తులు తమ త్యాగాల వల్ల రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా నిలిచారు.గాంధీ ఉపన్యాసాలకు తెలుగు అనువాదకులు ఉన్నవ రాజగోపాలకృష్ణయ్య -
పల్నాడు జిల్లాను ముంచెత్తిన వాన
దెబ్బతిన్న పత్తి పంటకృష్ణమ్మ ఉగ్రరూపంజిల్లాలో ముందస్తు ఖరీఫ్‌లో భాగంగా వేసిన ముదురు పత్తి పంట భారీ వర్షాలకు దెబ్బతింది. పత్తి విరుపులు స్తంభించిపోతున్నాయి. పగిలిన పత్తి తడిసిపోయింది. అలాగే పక్వానికి వచ్చిన కాయలు బాగా తడవడం వల్ల కుళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. లేత పత్తికి వర్షం వల్ల పెద్దగా ఇబ్బంది లేదు. భారీ వర్షాలకు నారుమళ్లు దెబ్బతింటున్నాయి. వరదనీటితో నారుమళ్లు కోతకు గురవుతున్నాయి. మళ్లీ నారుపోసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వర్షాలు మరో రెండు రోజులు కొనసాగితే పంటలకు తీవ్ర నష్టం సంభవించే అవకాశాలున్నాయని వ్యవసాయశాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. భారీవర్షాలకు రైల్వేశాఖ అప్రమత్తమైంది. పిడుగురాళ్ల – బెల్లంకొండ మధ్య భారీ వర్షాల కారణంగా బ్రిడ్జి నెంబర్ 59 వద్ద నీరు ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తుండటంతో రైల్వేశాఖ అప్రమత్తమైంది. రైళ్ల వేగాన్ని గంటకు 30 కిలోమీటర్లకు తగ్గించారు. సాక్షి, నరసరావుపేట: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో పల్నాడు జిల్లావ్యాప్తంగా మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు ఎడతెరిపిలేని వర్షాలు కురిసాయి. జిల్లావ్యాప్తంగా మంగళవారం నుంచి బుధవారం సాయంత్రం దాకా సుమారు 190 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లావ్యాప్తంగా పదుల సంఖ్యలో గ్రామాలకు బుధవారం ఉదయం రాకపోకలు స్తంభించాయి. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాస్థాయిలో పల్నాడు జిల్లా కలెక్టరేట్లో 08647052999 నెంబర్‌తో కంట్రోల్ రూమ్ నెంబర్‌ను ఏర్పాటు చేశామని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు తెలిపారు. క్రోసురు మండలంలోని దొడ్లేరు గ్రామాన్ని భారీ వదరనీరు చుట్టిముట్టిన నేపథ్యంలో బుధవారం సాయంత్రం పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు, సత్తెనపల్లి ఆర్డీఓ రమణాకాంత్ రెడ్డిలు పర్యటించారు. గ్రామంలో హసనాబాద్ రోడ్డులో లోలెవల్ చప్టాపై పొంగి ప్రవహిస్తున్న వరదనీరు, పిడుగురాళ్ల రోడ్డులో లోలెవల్ చప్టాపై పొంగుతున్న నీరు, ముస్లిం కాలనీలో వరద పరిస్థితి పరిశీలించారు. జిల్లాలో 189 సెం.మీ వర్షపాతంనరసరావుపేట రూరల్: జిల్లాలో బుధవారం రికార్డు స్ధాయి వర్షపాతం నమోదు అయింది. గడిచిన 36 గంటల్లో జిల్లాలో 189 సెం.మీ వర్షపాతం నమోదు అయినట్టు జిల్లా అధికారులు తెలిపారు. బుధవారం ఉదయం 8 గంటల వరకు 169 సెం.మీ, అప్పటినుంచి సాయంత్రం 4గంటల వరకు 20 సెంమీ వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా పెదకూరపాడులో 19 సెం.మీ, బెల్లంకొండలో 14సెం.మీ, దాచేపల్లి రూ.14సెం.మీ, అచ్చంపేటలో 13 సెం.మీ, మాచవరం 11 సెం.మీల వర్షం కురిసింది. అలాగే కారంపూడి, రాజుపాలెం, పిడుగురాళ్ల, సత్తెనపల్లిలో భారీ వర్షం నమోదు అయింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మంగళవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం జిల్లాలోని 28 మండలాల్లో భారీ వర్షాలు నమోదు లోతట్టు ప్రాంతాలు జలమయం పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు వర్షాలు ఇలాగే కొనసాగితే ముదురు పత్తి, నారుమళ్లకు తీవ్ర నష్టం పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ నిలిచిన రాకపోకలు భారీ వర్షాలకు వరదనీరు పోటెత్తడంతో జిల్లాలో పలు ప్రాంతాలకు రాకపోకలకు అంతరాయం కలిగింది. పిడుగురాళ్ల – జూలకల్లు, గుత్తికొండ, దాచేపల్లి – కారంపూడి మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. పెదకూరపాడు మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి పలు గ్రామాల్లో బ్రిడ్జిలు, చపాట్లు కూలిపోయ్యియి. పాటిబండ్ల– పెదకూరపాడు మధ్య ఉన్న చిన్న బ్రిడ్జి వరద ఉధృత్తికి కూలిపోయింది. 75 త్యాళ్లూరు గ్రామంలోని జెడ్పీ పాఠశాలకు వెళ్లే రహదారిలో చప్టా కోతకు గురైంది. 75 త్యాళ్ళూరు – కాశిపాడు వద్ద ఉన్న లోలెవెల్ చప్టా పూర్తిగా కోతకు గురైంది. దీంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. యడ్లపాడు మండలం సొలస గ్రామంలో నక్కవాగు పొంగి లోలెవల్ చప్టామీదుగా వరద నీరు ప్రవహించింది. దీంతో సొలస– కొత్తసొలస గ్రామాల మధ్య బీటీరోడ్డు సైతం నీటమునిగింది. చిలకలూరిపేట – ఫిరంగిపురం వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఆటోల రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. మధ్యాహ్నం తర్వాత కొద్దిసేపు వర్షం ఆగడంతో నీటి ప్రవాహం తగ్గిపోయింది. గురజాల – కారంపూడి రహదారిలో చర్లగుడిపాడు వద్ద లో లెవల్ చప్టా ఉండటం వలన వర్షపు నీరు నిలిచి రోడ్డుపైకి చేరింది. మాచర్ల – గుంటూరు రహదారిపై రాజుపాలెం మండలం అనుపాలెం గ్రామం సమీపంలో వాగు రోడ్డుపై గుండా పొంగి ప్రవహించింది. దీంతో మాచర్ల – గుంటూరు మధ్య అన్నివాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐ వేణుగోపాల్, సిబ్బంది అనుపాలెం చేరుకొని ప్రమాదం వాటిల్లకుండా వాహనాలను క్రమబద్దీకరించారు. గణపవరం–బలిజేపల్లి గ్రామాల మధ్య ఎద్దువాగు పొంగి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీని ప్రభావంగా రాకపోకలు నిలిచిపోయాయి. కష్ణానది పరివాహక ప్రాంతాలైన కర్ణాటక, మహారాష్ట్రలలో కురుస్తున్న భారీ వర్షాలకు కష్ణమ్మ పోటెత్తింది. ఎగువనగల శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్ జలాశయానికి 2,30,540 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. నాగార్జునసాగర్ జలాశయం నుంచి 26 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 22గేట్లు 5 అడుగులు, 4 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు స్పిల్‌వే మీదుగా 2,34,850 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 28,339 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దిగువన గల కష్ణానదిలోకి మొత్తం 2,63,189 క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేస్తున్నారు. సత్రశాల వద్ద నున్న నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ విద్యుత్ ప్రాజెక్టు రిజర్వాయర్ 16 క్రస్ట్‌గేట్లు ద్వారా 2,75,166 క్యూసెక్కుల నీటిని పులిచింతలకు విడుదల చేస్తున్నారు. టెల్పాండ్ ప్రాజెక్టు రిజర్వాయర్ 10 క్రస్ట్‌గేట్లు 3.5 మీటర్లు, 6 క్రస్ట్‌గేట్లు మూడు మీటర్లు ఎత్తు ఎత్తి 2,75,166 క్యూసెక్కుల వరదనీటిని దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టుకు బుధవారం రాత్రి 8 గంటల సమయంలో 3,50,841 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదైంది. ప్రాజెక్టు నుంచి నదిలోకి 3,64,082 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. కృష్ణానది ఉధృతంగాప్రవహిస్తున్న నేపథ్యంలో పరివాహక ప్రాంతాల్లో జిల్లా అధికార యంత్రాంగం అలెర్ట్ జారీ చేసింది. -
తెరిపివ్వని వాన..పొంగుతున్న వాగులు
సొలస గ్రామంలో లోలెవల్ చప్టాపై నీరు ప్రవహించడంతో రాకపోకలు బంద్ యడ్లపాడు: యడ్లపాడు మండలం పరిధిలో అన్ని గ్రామాల్లోనూ వానలు కురిశాయి. మంగళవారం రాత్రి మొదలైన ఈ వర్షం బుధవారం కూడా చిరుజల్లుల రూపంలో వర్షిస్తూనే ఉంది. దీంతో 26.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ప్రత్యేకంగా కంట్రోల్‌రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు మండలంలోని గ్రామాల్లో ప్రజలకు, పశువులకు, అలాగే ఆస్తినష్టం వంటివి ఏమీ లేవని తహసీల్దార్ జెట్టి విజయశ్రీ తెలిపారు. వర్షం, వాగుల నుంచి వరద పూర్తిగా తగ్గేవరకు సెల్‌నంబర్: 9849904026, 88862 70330 ప్రత్యేక నంబర్లు ఏర్పాటు చేశామన్నారు. అలాగే వీఆర్వోలు, వీఆర్ఏలు గ్రామాల్లోనే ప్రజలకు అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. అవాంఛనీయ సంఘటనలు ఉత్పన్నమైతే తక్షణమే గ్రామస్థాయి అధికారులకు లేదా కంట్రోల్ రూం నంబర్లకు సమాచారం అందించాలన్నారు. ఎగువ నుంచి వాగుల ద్వారా వచ్చే వరద నీరు అధికమైతే నక్కవాగు పొంగే అవకాశం ఉంటుందని, లోతట్టు గ్రామాలైన జాలాది, దింతెనపాడు, గణేశునివారిపాలెం, తుర్లపాడు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇప్పటి వరకు కురిసిన వానలకు, ఇలాగే కొనసాగినా పంటలకు ఎలాంటి నష్టం ఉండదని ఏవో ఎ హరిప్రసాద్ తెలిపారు. మంగళవారం రాత్రి వీచిన గాలులకు పలుచోట్ల విద్యుత్‌తీగలు తెగిపోవడంతో లింగారావుపాలెం, సొలస, ఉన్నవ గ్రామాల్లో సరఫరా నిలిచిందని, సమాచారం అందుకున్న వెంటనే సిబ్బందిని బృందాలుగా అప్రమత్తం చేసి తిరిగి పునరుద్ధరణ చేసినట్లు విద్యుత్ ఏఈ జెస్సీ జయకర్ తెలిపారు. అక్కడ రాకపోకలు బంద్... వానలకు మండలంలోని వాగులు ఎగువ నుంచి వచ్చే వరద నీటితో నిండుగా ప్రవహిస్తున్నాయి. సొలస గ్రామంలో నక్కవాగు పొంగి లోలెవల్ చప్టామీదుగా వరద నీరు ప్రవహించింది. దీంతో సొలస– కొత్తసొలస గ్రామాల మధ్య బీటీరోడ్డు సైతం నీటమునిగింది. చిలకలూరిపేట –ఫిరంగిపురం వెళ్లే ఆర్టీసీ బస్సులు, ఆటోల రాకపోకలు పూర్తిగా నిలిచి పోయాయి. మధ్యాహ్నం తర్వాత కొద్దిసేపు వర్షం ఆగడంతో నీటి ప్రవాహం తగ్గిపోయింది. -
పొంగిన వాగులు.. స్తంభించిన రాకపోకలు
రాజుపాలెం: భారీవర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లాయి. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గుంటూరు–మాచర్ల రహదారిపై వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. ఎద్దువాగు పొంగడంతో 8 గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. జనజీవనం స్తంభించింది. మాచర్ల–గుంటూరు రహదారిపై అనుపాలెం గ్రామం సమీపంలో వాగు రోడ్డుపై నుంచి పొంగి ప్రవహించింది. దీంతో మాచర్ల–గుంటూరు మధ్య అన్ని వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. భారీగా వాహనాలు నిలిచిపోయాయి. ఎస్ఐ వేణుగోపాల్, సిబ్బంది అనుపాలెం చేరుకొని ప్రమాదం వాటిల్లకుండా వాహనాలను క్రమబద్ధీకరించారు. గణపవరం–బలిజేపల్లి గ్రామాల మధ్య ఎద్దువాగు పొంగి ఉధృతంగా ప్రవహిస్తుంది. దీని ప్రభావంగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇనిమెట్ల, ఉప్పలపాడు, బలిజేపల్లి, రామిరెడ్డిపేట, లక్ష్మీపురం చల్లాపల్లితండా– గణపవరం, రెడ్డిగూడెం, బీర్లవల్లిపాయ గ్రామాల మధ్య రాకపోకలు స్తంభించాయి. వాగుల సమీప ప్రాంతాల్లో పొలాలు నీటమునిగాయి. మెట్టపైర్లు సాగుచేస్తున్న రైతులు నష్టపోవాల్సివస్తుందని ఆందోళన చెందుతున్నారు. బలిజేపల్లి గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడ్డారు. తహసీల్దార్ సరోజిని మాట్లాడుతూ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని వీఆర్వోలను ఆదేశించామన్నారు. అంచులవారిపాలెం, అనుపాలెం, గణపవరం ప్రాంతాల్లోని వాగుల వద్ద వీఆర్వోల ఆధ్వర్యంలో భధ్రతా చర్యలు చేపట్టామన్నారు. వర్షప్రభావానికి సహాయక చర్యల కోసం 24 గంటలు కార్యాలయంలో అందుబాటులో ఉంటామని, అత్యవసర సహాయం కోసం 9949098622 నంబరుకు ఫోన్ చేయవచ్చన్నారు. గణపవరం–బలిజేపల్లి గ్రామాల మధ్య పొంగిపొర్లిన ఎద్దువాగు 8 గ్రామాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు అనుపాలెం సమీపంలో మాచర్ల – గుంటూరు రహదారిపై పొంగిన మరో వాగు మాచర్ల–గుంటూరు మధ్య నిలిచిపోయిన రాకపోకలు బలిజేపల్లిలో నిలిచిన విద్యుత్ సరఫరా -
త్రిశక్తి దుర్గాపీఠం వార్షిక బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
సత్తెనపల్లి: త్రిశక్తి స్వరూపిణులైన మహాలక్ష్మి, దుర్గా, సరస్వతి అమ్మవార్ల త్రిశక్తి దుర్గా పీఠం 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం భక్తిశ్రద్ధలతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఉదయం మంగళ వాయిద్యాలతో బ్రహ్మోత్సవాలు అంకురార్పణ చేశారు. మహా సరస్వతి సమేత దుర్గామాతకు దశవిధాభిషేకాలు చేశారు. 108 కళాశాలతో అభిషేకాలు నిర్వహించారు. అమ్మవార్లకు పసుపు, కుంకుమ సమర్పణ చేశారు. త్రిశక్తి దుర్గాపీఠం మహిళా శక్తి సభ్యుల ఆధ్వర్యంలో లలిత సహస్రనామ పారాయణం, అమ్మవార్లకు అర్చన, హారతి, మంత్రపుష్పం, ప్రసాద వితరణ, సామూహిక కర్పూర హారతి నిర్వహించారు. అర్చకుడు కలవకొలను సీతారామశాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించిన పూజల్లో భక్తులు పెద్ద సంఖ్యలో హాజర య్యారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా త్రిశక్తి దుర్గా పీఠం పీఠాధిపతులు వెలిదండ్ల హనుమత్ స్వామి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
మాదకద్రవ్య రహిత సమాజాన్ని నిర్మిద్దాం
అడిషనల్ ఎస్పీ సంతోష్ నరసరావుపేట రూరల్: మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి అందరూ నడుం బిగిద్దామని జిల్లా అడిషనల్ (అడ్మిన్) ఎస్పీ జేవీ సంతోష్ తెలిపారు. నషా ముక్త్ భారత్ అభియాన్‌పై కేసానుపల్లిలోని ఎంఏఎం ఫార్మసీ కళాశాలలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సంతోష్ పాల్గొని మాట్లాడారు. మాదకద్రవ్యాలు, మద్యం వంటి వ్యసనాలు, వ్యక్తిగత ఆరోగ్యానికి మాత్రమే కాకుండా కుటుంబానికి, సమాజానికి, దేశానికి హానికరమని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ఐదేళ్ల క్రితం ప్రారంభించిందని, యువతను మాదక ద్రవ్యాలు, మద్యం వంటి వ్యసనాల నుంచి దూరంగా ఉంచేందుకు విద్యా సంస్థలు, స్వచ్ఛంద సంస్ధలు భాగస్వామ్యం కావాలని కోరారు. కళాశాలలో విద్యార్థుల ప్రవర్తన, నడవడిక, చదువు తదితర అంశాలపై ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు కూడా అవగాహన కలిగి ఉండాలన్నారు. మాదక ద్రవ్యాల వినియోగం రవాణా వలన ఏర్పడే చట్టపరమైన పరిణామాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులతో మత్తు పదార్థాల వ్యసన నిర్మూలనపై ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం కళాశాల ఆవరణలో అడిషనల్ ఎస్పీ మొక్కలు నాటారు. కార్యక్రమంలో మహిళా డీఎస్పీ ఎం.వెంకటరమణ, ఎస్బీ–2 సీఐ పి.శరత్‌బాబు, ఈగల్ సెల్ ఎస్ఐ జె.శ్యామ్యూల్ రాజీవ్‌కుమార్, రూరల్ ఎస్ఐ కిషోర్, ఫాతిమా, కళాశాల చైర్మన్ ఎం.రామశేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు. -
గుంటూరు ఆర్డీగా డాక్టర్ శోభారాణి
గుంటూరు మెడికల్: గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ)గా డాక్టర్ జి.శోభారాణిని నియమిస్తూ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్ మంజుల డి. హోస్మణి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫుల్ అడిషనల్ చార్జి (ఎఫ్ఏసీ) ఆర్డీగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆర్డీవోగా పనిచేస్తున్న డాక్టర్ కె.సుచిత్రను డైరెక్టర్ ఆఫ్ హెల్త్‌కు సరెండర్ చేసి, అక్కడ రిపోర్టు చేయాల్సిందిగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా డాక్టర్ జి.శోభరాణి గుంటూరు వైద్య కళాశాల ఆవరణంలోని రీజనల్ పబ్లిక్ హెల్త్ లేబొరేటరీలో సివిల్ సర్జన్ బ్యాక్టీరియలిస్టుగా పనిచేస్తున్నారు. గతంలో డాక్టర్ శోభరాణి గుంటూరు ఆర్డీగా పనిచేశారు. -
పరవళ్లు తొక్కుతున్న శింగరేశ్వర జలపాతం
బెల్లంకొండ: గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో బెల్లంకొండ మండలం వెంకటాయపాలెం గ్రామంలోని శింగరేశ్వర జలపాతం పరవళ్లు తొక్కుతుంది. శ్రీ కొండ శింగరేశ్వర స్వామి వద్ద గల కొండల మీద నుంచి భారీగా వస్తున్న నీటితో ప్రకృతి ప్రేమికులను పరవశింపజేస్తుంది. దాదాపు100 అడుగుల ఎత్తు కొండల మీద నుంచి పాల నురగల్లా జాలు వారుతున్న నీటిధారలతో జలపాతం అబ్బురపరుస్తుంది. బుధవారం వర్షం పడుతున్నప్పటీకీ పలు ప్రాంతాల నుంచి వచ్చిన పర్యాటకులు జలపాతంలో తడుస్తూ సందడి చేశారు. -
నూతన మూల్యాంకన విధానం పెనుభారం
ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కోటేశ్వరరావు చిలకలూరిపేట: ప్రభుత్వం రూపొందించిన నూతన మూల్యాంకన విధానం విద్యార్థులకు, ఉపాధ్యాయులకు పెనుభారంగా మారిందని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కే కోటేశ్వరరావు, రాష్ట్ర డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావు విమర్శించారు. పట్టణంలోని ఎస్టీయూ ప్రాంతీయ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్ష పేపర్ ద్వారా నిర్వహించటం దానిని మరలా బుక్‌లెట్‌లో నమోదు చేయించడం వలన సమయం వృధా అవుతుందని తెలిపారు. ఎస్సీఈఆర్టీ ముద్రించిన పుస్తకాలను సకాలంలో పాఠశాలకు చేర్చలేకపోవడం వలన ఆ వివరాలు నమోదు చేసుకోవడానికి ఒక రోజు పూర్తి టైం సరిపోతుందని వాపోయారు. మండల విద్యా వనరుల కేంద్రం నుంచి పాఠశాలకు తెప్పించుకోవడం పాఠశాల నుంచి తరగతి, సబ్జెక్టుల వారీగా వేరు చేసుకుని విద్యార్థుల వివరాలు నమోదు చేయడం తలకు మించిన భారం అవుతుందని వెల్లడించారు. ఇప్పటికే అనేక యాప్‌లతో ఇబ్బందులు పడుతున్న ఉపాధ్యాయులకు పరీక్షల నిర్వహణ ఇబ్బందిగా మారిందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ బుక్లెట్లను ఉపసంహరించుకోవాలని కోరారు. సమావేశంలో ఎస్టీయూ పట్టణ అధ్యక్షుడు మేకల కోటేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి వి.జయప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
కూలిన పాటిబండ్ల చిన్న బ్రిడ్జి
పెదకూరపాడు: పెదకూరపాడులో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు పలు గ్రామాల్లో బ్రిడ్జిలు, చప్టాలు కూలిపోయాయి. పాటిబండ్ల– పెదకూరపాడు మధ్య ఉన్న చిన్న బ్రిడ్జి వరద ఉధృతికి కూలిపోయింది. 75త్యాళ్ళూరు గ్రామంలోని జెడ్పీ పాఠశాలకు వెళ్లే రహదారిలో చప్టా కోతకు గురైంది. 75 త్యాళ్ళూరు – కాశిపాడు వద్ద ఉన్న లోలెవెల్ చప్టా పూర్తిగా కోతకు గురైంది. దీంతో ఆయా గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పాటిబండ్ల వద్ద బ్రిడ్జిని సత్తెనపల్లి ఆర్డీవో రమకాంత్‌రెడ్డి, పెదకూరపాడు తహసీల్దార్ ధనలక్ష్మీ, ఎంపీడీవో సోమయాజులు పరిశీలించారు. సంబంధిత ఇంజనీరులకు ఫోన్ చేసి యుద్ధప్రతిపాదికన పనలు చేయాలని ఆదేశించారు. పాటిబండ్ల రోడ్డు పలు చోట్ల కోతకు గురైంది. పాటిబండ్ల బ్రిడ్జి కూలేందుకు సిద్ధం అంటూ గత నెల 29న సాక్షి దినపత్రికలో కథనం ప్రచురితమైంది. కోతకు గురైన చప్టాలు రాకపోకలకు తీవ్ర అంతరాయం పలు చోట్ల కోట్టుకు పోయిన రోడ్లు ముందే హెచ్చరించిన ‘సాక్షి’ -
వినుకొండ ఫొటోగ్రాఫర్‌కు గోల్డ్‌మెడల్
వినుకొండ: ఇండియా ఇంటర్నేషనల్ ఫొటో గ్రాఫిక్ కౌన్సిల్, ఫొటోగ్రఫీ అకాడమి ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆగస్టు 19న ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా 186వ వరల్డ్ ఫొటోగ్రఫీ డే కాంటెస్ట్ నిర్వహించారు. ఈ కాంటెస్ట్‌లో ఫొటో ట్రావెల్ విభాగంలో వినుకొండ పట్టణానికి చెందిన వంగపల్లి బ్రహ్మయ్య తీసిన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం రథోత్సవం ఫొటో అవార్డుకు ఎంపికై ంది. ఈ నెల 18వ తేదీన ఉదయం 11గంటలకు విజయవాడలో బాలోత్సవ భవన్లో ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ, ఏపీ సృజనాత్మక సంస్కృతి సమితి సీఈవో, డైరెక్టర్ ఆర్ .మల్లికార్జునరావు చేతుల మీదుగా అవార్డును అందుకోనున్నట్లు తెలిపారు. -
ప్రజాస్వామ్యం అపహాస్యం
పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల తీరుపై డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజం నరసరావుపేట రూరల్: రాష్ట్రంలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు జరిగిన తీరు ప్రజాస్వామ్యానికి మాయనిమచ్చగా మిగులుతుందని వైఎస్సార్ సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పులివెందులలో టీడీపీని గెలిపించడానికి ఎన్నికల సంఘం, పోలీసు శాఖ ఇంతగా దిగజారాలా అని ప్రశ్నించారు. దేశ చరిత్రలో ఇంత దారుణంగా ఎన్నికల జరిగిన ఘటనలు లేవన్నారు. స్థానిక గుంటూరు రోడ్డులోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. పోలింగ్ కేంద్రాలు రెండు కిలోమీటర్లలోపు ఉండాలని ఎన్నికల సంఘం నిబంధనలు ఉన్నప్పటికీ నాలుగు కిలోమీటర్ల దూరంలోని మరో గ్రామంలోకి మార్చారన్నారు. దాదాపు నాలుగు వేల మంది ఓటింగ్‌లో పాల్గొనకూడదనే కుట్రతోనే ఎన్నికల కమిషన్ ఈ చర్యకు పాల్పడిందన్నారు. నిస్వార్ధంగా, నిష్పక్షపాతంగా పనిచేయాల్సిన ఎన్నికల సంఘం అధికారపార్టీకి వత్తాసు పలకడం దారుణమన్నారు. ప్రజలు ఓటు వేయరని తెలిసే అక్రమాలు తెల్లవారుజామున కడప ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, సతీష్‌రెడ్డిలను అరెస్ట్ చేసిన పోలీసులు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవిలను స్వేచ్ఛగా తిరగనిచ్చారన్నారు. వారు గ్రామాల్లో తిరుగుతూ పోలింగ్‌బూత్‌లలోకి ప్రవేశించి భయబాంత్రులకు గురిచేసారని తెలిపారు. ఒంటిమిట్ట పరిధిలోని పోలింగ్‌బూత్‌లో రాంప్రసాద్‌రెడ్డి వీరంగం సృష్టించి వైఎస్సార్ సీపీ పోలింగ్ ఏజెంట్‌పై దాడికి పాల్పడ్డారన్నారు. జమ్మలముడుగు, ఇతర నియోజకవర్గాల నుంచి దొంగ ఓటర్లను తీసుకువచ్చి ఓటింగ్ జరిపించి ఎన్నికల ప్రక్రియను అపహాస్యం చేశారన్నారు. వైఎస్సార్ సీపీ ఏజెంట్లను పోలీసులే బయటకు పంపడం విడ్డూరన్నారు. ఇంతకన్నా జెడ్పీటీసీ సభ్యులుగా టీడీపీ వ్యక్తులను ప్రకటించుకుంటే సరిపోయేదన్నారు. పులివెందుల ప్రజలు తమకు ఓట్లు వేయరని అంచనాకు వచ్చిన కూటమి నాయకులు ఈ అక్రమాలకు పాల్పడ్డారని తెలిపారు. ఎన్నికల సంఘంపై దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్న సమయంలో రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ వ్యవహరించిన తీరు బాధకరమని తెలిపారు. ప్రజాస్వామ్యవాదులు ఈ తరహా ఎన్నికల నిర్వహణను వ్యతిరేకించాలని కోరారు. -
నాగార్జునసాగర్ డ్యామ్‌పై హర్ ఘర్ తిరంగా ర్యాలీ
విజయపురిసౌత్: ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ భద్రతా దళాల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. సీఆర్పీఎఫ్ ఇన్స్పెక్టర్ గిరీష్ భట్ ఆధ్వర్యంలో భద్రతా బలగాలతో పాటు విద్యార్థులు జాతీయ జెండాలు చేతబట్టుకొని సాగర్ డ్యామ్‌పై భారత్ మాతాకీ జై అంటూ నినాదాలు చేశారు. ర్యాలీగా విజయపురిసౌత్ కాలనీలో జరిగింది.అనంతరం మానవ హారంగా ఏర్పడ్డారు. గిరీష్ భట్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పించిన అమరులను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్కె మహమ్మద్‌బాష, ఎన్సీసీ కెప్టెన్ కె. విజయకుమార్, జువాలజీ అధ్యాపకుడు టి. రాజశేఖర్, నాగార్జునకొండ సీఏ వెంకటయ్య, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. హాస్టళ్లలో సమస్యలు పరిష్కరిస్తాం దాచేపల్లి: సంక్షేమ వసతి గృహాల్లో సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా జాయింట్ కలెక్టర్ గనోజ్ సూరజ్ అన్నారు. నారాయణపురంలోని ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. ఇటీవల ఈ హాస్టల్ లో జూనియర్ విద్యార్థిపై సీనియర్ విద్యార్థులు దాడి చేసి గాయపరిచిన విషయం తెలిసిందే. ఘటన జరిగిన తీరును అక్కడున్న విద్యార్థులతోమాట్లాడి జేసీ తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. జేసీ వెంట ఆర్డీఓ మురళీకష్ణ, తహసీల్దార్ శ్రీనివాస్ యాదవ్, బీసీ వెల్ఫేర్ అధికారి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. బీసీ హాస్టల్‌ను సందర్శించిన ఎమ్మెల్యే నారాయణపురం ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహాన్ని గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కూడా సందర్శించారు. నేటి నుంచి త్రిశక్తి దుర్గాపీఠం వార్షిక బ్రహ్మోత్సవాలు సత్తెనపల్లి: త్రిశక్తి స్వరూపిణులైన మహాలక్ష్మి, దుర్గ, సరస్వతి అమ్మవార్ల త్రిశక్తి దుర్గాపీఠం 19వ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈనెల 13 నుంచి 15 వరకు వైభవంగా జరగనున్నాయని పీఠాధిపతులు వెలిదండ్ల హనుమత్ స్వామి మంగళవారం తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా 108 కళాశాలతో అభిషేకాలు జరుగుతాయన్నారు. ప్రసన్నాంజనేయ స్వామి వారికి లక్ష నాగవల్లి దళాలతో (తమల పాకులు) విశేష పూజలు, శ్రీ జగన్నాథ భజన మండలి సభ్యుల కోలాటంతో అమ్మవార్ల ప్రభ ఉంటుందన్నారు. ముగింపు రోజు ముఖ్య శిష్యులచే గురుపూజ, అన్నప్రసాద వితరణ జరుగుతుందన్నారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని కోరారు. ఘనంగా వినాయకునికి సంకటహర చతుర్ధి పూజలు అమరావతి: స్థానిక అమరేశ్వరాలయంలోని విఘ్నేశ్వరస్వామి ఉపాలయంలో మంగళవారం సంకటహర చతుర్ధి పూజలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకస్వామి జగర్లపూడి శేషసాయిశర్మ విఘ్నేశ్వర స్వామి వారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. స్వామి వారికి వివిధ రకాల ఫుష్పాలు, గరికతో విశేషాలంకారం చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి ఉండ్రాళ్ళను సమర్పించుకున్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
ఇదేంది రొయ్యో..!
సాక్షి ప్రతినిధి, బాపట్ల: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన సుంకం బూచి చూపి ఎగుమతి దారులు, కంపెనీలు రొయ్యల ధరలను అమాంతం తగ్గించడంతో రైతులు లబోదిబో మంటున్నారు. ధరలు పతనం కావడంతో జిల్లాలో 60 శాతానికి పైగావున్న కౌలు రైతులు మరింతగా నష్టపోతున్నారు. పెట్టుబడి రాని పరిస్థితిలో ఆందోళన చెందుతున్నారు. నెల రోజుల క్రితం వనామీ 100 కౌంట్ ధర రూ. 270 ఉండగా ప్రస్తుతం రూ.225కు తగ్గింది. టైగర్ రొయ్య 20 కౌంట్ ధర నెల రోజుల క్రితం రూ. 680 ఉండగా ప్రస్తుతం 570కి తగ్గింది. ఈ లెక్కన నెలరోజుల్లో వనామీ ధర రూ. 45, టైగర్ ధర రూ. 100 తగ్గింది. దీనివల్ల లాభాల సంగతి దేవుడెరుగు పెట్టు బడులు కూడా రావని రైతులు గగ్గోలు పెడుతున్నారు. పెట్టుబడులు వచ్చే పరిస్థితి లేదు రొయ్యల సాగు పెట్టుబడులు ఏడాది కేడాదికి పెరుగుతున్నాయి. విద్యుత్ బిల్లులు రెట్టింపవగా, జీవ రసాయన మందుల ధరలు అయాంతం పెరిగాయి. పెరిగిన వర్కర్స్ జీతాలు దీనికి తోడయ్యాయి. దీంతో ఎకరం రొయ్యల సాగుకు రూ.4లక్షల నుంచి 5 లక్షల ఖర్చవుతోంది. ఈ లెక్కన పెట్టుబడులు రావాలంటే వనామీ 100 కౌంట్ కౌలు రైతు అయితే రూ. 250 అమ్మాలి. సొంత రైతు అయితే రూ.225 అమ్మాలి. కానీ ప్రస్తుతం ధరలు అంతకు మించి తగ్గాయి. దీంతో లాభాల సంగతి దేవుడెరుగు పెట్టుబడులు వచ్చే పరిస్థితి కానరావడంలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎకరాకు రూ.లక్షపైనే నష్టం రొయ్యల ఉత్పత్తి బాగా ఉంటే ఎకరానికి 2 టన్నులు దిగుబడి ఉంటుంది. ప్రస్తుతం సగటున ఎకరానికి 1.50 టన్నులకు మించి దిగుబడి రావడంలేదు. ఈ లెక్కన వున్న ధరతో ఎకరాకు రూ. 3.50 లక్షలకు మించి రాబడి వుండడంలేదు. దీంతో ఎకరాకు సొంత రైతుకు రూ.లక్షకు తగ్గకుండా, కౌలు రైతు రూ. 1.50 లక్షల నుంచి 2 లక్షల వరకు నష్టపోవాల్సి వస్తోంది. ఎకరం కౌలు చెరువులనుబట్టి రూ. 50 వేల నుంచి రూ. 1లక్ష ఉంది. కౌలు రైతులకు వడ్డీలు అదనపు భారంగా మారనున్నాయి. దీంతో రొయ్య రైతులు లబోదిబోమంటున్నారు. ట్రంప్ సుంకాల బూచి చూపి.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన సుంకాల బూచి చూపి ఎగుమతి దారులు, కంపెనీలు రైతులను నిలువునా ముంచుతున్నాయి. వాస్తవానికి 100 కౌంట్ రొయ్య అమెరికాకు వెళ్లదు. కేవలం 20, 30, 40, 50 కౌంట్ రొయ్యలు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి. జిల్లాలో వనామీలో అధికంగా 100 కౌంట్ రొయ్యల విక్రయాలు మాత్రమే సాగుతున్నాయి. వనామీ 100 కౌంట్ రొయ్య చైనా, గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతోంది. అమెరికాకు రొయ్య ఎగుమతి కాకుండానే ఎగుమతి దారులు, వ్యాపారులు ట్రంప్ సుంకాల పేరుతో ఇబ్బడి ముబ్బడిగా ధరలు తగ్గించి రొయ్య రైతును దోపిడీ చేస్తున్నారు. పట్టించుకోని ప్రభుత్వం రొయ్య రైతులను ఎగుమతి వ్యాపారులు, కంపెనీలు ట్రంప్ సుంకాల పేరుతో వంచిస్తున్నా కూటమి సర్కారుకు చీమకుట్టినట్లు కూడా లేదు. ఆది నుంచి రైతులంటే గిట్టని బాబు సర్కార్ రొయ్య రైతులను పట్టించుకోకుండా గాలికి వదిలేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ధరలు స్థిరంగా ఉండేలా చూసి నష్టపోకుండా చర్యలు తీసుకున్నారు. వారికి సబ్సిడీతో విద్యుత్ అందించారు. ఇప్పడు కూటమి ప్రభుత్వం ఇబ్బడి ముబ్బడిగా విద్యుత్ చార్జీల భారాన్ని మోపి రొయ్య రైతులను ఇబ్బందులను గురిచేస్తోంది. రొయ్య రైతుకు ధరాభారం ట్రంప్ సుంకాల బూచి చూపి ధరల తగ్గింపు అమెరికాకు 100 కౌంట్ రొయ్యల ఎగుమతి లేకపోయినా ధర తగ్గింపు జిల్లాలో 21 వేల ఎకరాల్లో రొయ్యలసాగు 70 శాతం వనామీ, 30 శాతం టైగర్ సాగు సాగు దారుల్లో 60 శాతం మంది కౌలు రైతులే.. ఎగుమతి కంపెనీలు, వ్యాపారులు కలిసి వంచిస్తున్నారంటూ రైతుల గగ్గోలు -
బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025
సాక్షి, నరసరావుపేట: ఖరీఫ్ సీజన్లో సమృద్ధిగా వానలు కురిసాయి. నాగార్జున సాగర్ నీటిమట్టం పూర్తిస్థాయికి చేరి జూలై చివర వారంలోనే నీటిని కిందకు వదిలారు. దీంతో పల్నాడు జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాగు పూర్తిస్థాయిలో ఉంటుందని అంతా అనుకున్నారు. అయితే ఖరీఫ్ సాగు ప్రారంభమై రెండున్నర నెలలైనా జిల్లాలో ఇప్పటివరకు సాధారణ లక్ష్యంలో కనీసం 30 శాతం కూడా పంటలు సాగుకాలేదు. ముఖ్యంగా పల్నాడు రైతులు ఎక్కువగా ఆధారపడే తెల్లబంగారమైన పత్తి పంట సంగతి సరే సరి. పత్తి సాగుకు రైతన్నలు ముందుకు రావడం లేదు. గిట్టుబాటు ధర లేకపోవడమే... పత్తి పంట సాగు తగ్గిపోవడానికి ప్రధాన కారణం పత్తి సాగు ఖర్చు పెరగడం, పంటలకు చీడపీడల ప్రభావం అధికంగా ఉండటం. గులాబీ రంగు పురుగుతో రైతులకు మందుల ఖర్చు అధికంగా అవుతోంది, మరోవైపు గులాబీ రంగు పురుగుతో దిగుబడి రాను రాను తగ్గిపోతోంది. ఓ వైపు పెట్టుబడి పెరిగి దిగుబడి తగ్గుతున్న క్రమంలో గిట్టుబాట ధర లేకపోవడం శాపంగా మారుతోంది. ఏటా తీవ్ర నష్టాలు చవిచూస్తున్న రైతులు పత్తిపంట సాగుకు విముఖత చూపుతున్నారు. దీంతో రైతులు ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టిపెడుతున్నారు. గత కొన్నేళ్లుగా పల్నాడు ప్రాంతంలో పత్తిసాగు చేసిన రైతులు తీవ్ర నష్టాలను చవిచూడటంతో మొక్కజొన్న సాగుతోనైనా తమ వెతలు తీరుతాయని రైతులు భావిస్తున్నారు.పిడుగురాళ్ల రూరల్ మండల పరిధిలో పత్తిసాగున్యూస్రీల్ సాగర్ నిండినా, సమృద్ధిగా వర్షాలు కురుస్తున్న ముందుకు సాగని ఖరీఫ్ పత్తి సాగుకు గడువు ముగుస్తున్నా ముందుకురాని రైతులు 91,566 హెక్టార్ల సాధారణ సాగుకు గాను 35,958 హెక్టార్లలోనే.. గులాబీ రంగు పురుగు ఉధృతితో పెరుగుతున్న పెట్టుబడి, తగ్గుతున్న దిగుబడులు ప్రభుత్వ ‘మద్దతు’ కూడా లేని వైనం మొక్కజొన్న, అపరాల పంటల వైపు మొగ్గుచూపుతున్న కర్షకులు లక్ష్యంలో సగమైనా లేదు జిల్లా సాధారణ లక్ష్యం ఈ ఖరీఫ్‌లో 91,566 హెక్టార్లు కాగా ప్రస్తుతానికి కేవలం 35,958 హెక్టార్లలో సాగైంది. పత్తి పంట సాగుకు అనువైన సమయం దాదాపుగా పూర్తయిందని రైతులు అభిప్రాయపడుతున్నారు. ఇక మీదట సాగు చేసే పత్తి పంటకు చివర్లో గులాబీ రంగు పురుగుల బెడద అధికంగా ఉండి తీవ్రంగా నష్టపోతామంటున్నారు. దీంతో ఈ ఏడాది ఖరీఫ్‌లో పత్తి పంట సాగు 40 వేల హెక్టార్లు కూడా దాటే పరిస్థితి లేదంటున్నారు.గిట్టుబాటు ధర లేదు గతంలో పత్తి, మిర్చి పంటలను అధికంగా సాగుచేసేవాడిని. కానీ అధిక వర్షాలు, గులాబీ రంగు పురుగు ఉధృతితో పాటు, గిట్టుబాటు ధర లేక పత్తి పంట సాగు గణనీయంగా తగ్గించుకున్నాను. రైతులు గత కొంత కాలంగా కంది, మొక్కజొన్న వంటి ప్రత్యామ్నాయ పంటల వైపు దృష్టిసారిస్తున్నారు. ఈ పంటలకు పెట్టుబడి తక్కువ ఉండటం, అధిక ఆదాయం ఉండటం కలసి వస్తుంది. – వెంకట్రామిరెడ్డి, రైతు, రెడ్డిపాలెం, రొంపిచర్ల మండలం -
నేర రహిత సమాజానికి కృషి చేయాలి
సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి.విజయ్ కుమార్ రెడ్డి సత్తెనపల్లి: రాజీ మార్గమే రాజ మార్గమని, నేర రహిత సమాజ కోసం అందరూ కృషి చేయాలని సత్తెనపల్లి మండల న్యాయసేవాధికార కమిటీ చైర్మన్, సత్తెనపల్లి సివిల్ జడ్జి (సీనియర్ డివిజన్) వి.విజయ్‌కుమార్‌రెడ్డి అన్నారు. వచ్చే నెల 13వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ క్రిమినల్ కేసులు రాజీ చేయాలని, దీనిపై పోలీస్ అధికారులతో పట్టణంలోని మార్కెట్ యార్డు ఆవరణలో ఉన్న సీనియర్ సివిల్ జడ్జి కోర్టు హాల్లో సత్తెనపల్లి న్యాయస్థానాల పరిధిలో ఉన్న ఆయా పోలీస్స్టేషన్ల ఎస్హెచ్ఓలతో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ముందుగా ఆయా స్టేషన్లలో ఉన్న రాజీ పడదగిన సెక్షన్లు ఉన్న కేసులు ఎన్ని ఉన్నాయనే వివరాలు తెలుసుకున్నారు. ఆయా స్టేషన్లు పరిధిలో ఉన్న కాంపౌండబుల్ నేరాల కేసులు అన్నీ వచ్చే నెల 13న జరిగే లోక్ అదాలత్ పరిష్కారమయ్యే విధంగా చూడాలన్నారు. సమీక్షలో న్యాయమూర్తులు తౌషిద్ హుస్సేన్, జె.సృజిన్కుమార్, సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు, సత్తెనపల్లి రూరల్ సీఐ కిరణ్, ఆయా పోలీస్స్టేషన్ల ఏస్హెచ్ఓలు, కోర్టు కానిస్టేబుళ్లు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు. -
ఎద్దువాగు
ఉధృతంగా నకరికల్లు నుంచి శివాపురం తండా, ఉదయ్నగర్లకు నిలిచిన రాకపోకలు నకరికల్లు: మండల కేంద్రమైన నకరికల్లు నుంచి శివాపురం తండా, ఉదయ్‌నగర్ కాలనీలకు వెళ్లే రోడ్డుపైకి వాగునీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గత రెండుమూడు రోజులుగా కురుస్తున్న భారీవర్షాలకు నకరికల్లు రిజర్వాయర్‌కు ఆనుకొని ఉన్న ఎద్దువాగు పొంగి ప్రవహిస్తుంది. స్థానిక చెరువు వద్ద నుంచి ఇనిమెట్ల, ఉప్పలపాడు వరకు ప్రవహించే ఈ వాగు పొంగినప్పుడల్లా రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు నకరికల్లు నుంచి శివాపురం తండా, ఉదయ్‌నగర్ కాలనీలకు వెళ్లే రోడ్డుపైకి నడుములోతు నీరు వచ్చిచేరడంతో రాకపోకలు స్థంభించిపోయాయి. వాహనదారులు నర్శింగపాడు మీదుగా నకరికల్లు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాదచారులు చేసేదిలేక నడుములోతు వాగులో నుంచి నడుచుకుంటూ వస్తున్నారు. గతంలో కూడా భారీవర్షాలకు రోడ్డుపై వాగునీరు చేరడంతో రాకపోకలు స్థంభించిపోయాయి. రెండుగ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నా అధికారులు చూస్తూ మిన్నకుండిపోతున్నారు. వాగును పరిశీలించిన ఏఐకెఎఫ్ పల్నాడు జిల్లా కార్యదర్శి తూమాటి మణికంఠ మాట్లాడుతూ వాగుపై కల్వర్టు నిర్మాణం చేసి రెండుగ్రామాల ప్రజల అవస్థలు తీర్చాలని కోరారు. పీసపాడు వద్ద... పీసపాడు(క్రోసూరు): ఎగువన బెల్లంకొండ, పిడుగురాళ్ల వైపు కురిసిన భారీ వర్షాలకు వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని పీసపాడు గ్రామంలో ఎద్దువాగు బ్రిడ్జి ఎత్తులో నీళ్లు పొంగి ప్రవహిస్తున్నాయి. వరద నీరు జోరుగా ఇతర అందుకూరు, బాలెమర్రు, బయ్యవరం గ్రామాల వాగులు గుండా ప్రవహించి కృష్ణానదిలో కలుస్తాయి. 2016, 2017లో పీసపాడు ఎద్దువాగు మీద ఉన్న హైలెవల్ బ్రిడ్జి మీదుగా వరద పొంగింది. -
ఈ–పంట నమోదు ప్రారంభం
సత్తెనపల్లి: జిల్లా వ్యాప్తంగా 330 రైతు సేవా కేంద్రాల పరిధిలో ఖరీఫ్ సీజన్‌కు అవసరమైన ఈ–పంట నమోదు ప్రారంభమైంది. అధికారులు గ్రామాల్లోకి వచ్చి పంట వివరాలు నమోదు చేస్తున్నారు. రైతులకు ముందస్తు సమాచారం కూడా ఇవ్వాల్సి ఉంది. వెబ్‌ల్యాండ్ ఆధారంగా జిల్లాలో 10.06 లక్షల ఎకరాల్లో భూములు ఉండగా 99.96 ఎకరాల్లో పంటల సాగు అవుతున్నట్లు రికార్డుల్లో ఉంది. దీనిలో ఇప్పటివరకు 3,985 ఎకరాల్లో ఈ–పంట నమోదు చేశారు. వ్యవసాయ పంటలకు మండల వ్యవసాయ అధికారి, ఉద్యాన పంటలకు ఉద్యాన శాఖ అధికారి, ప్రభుత్వ/వ్యవసాయతర భూములకు తహసీల్దారులకు నమోదు పర్యవేక్షణ బాధ్యతను అప్పగించారు. ఇప్పటివరకు గ్రామాల్లో సాగు చేసే పంటలను మాత్రమే ఈ–పంట నమోదు చేస్తుండే వారు. అయితే కొత్తగా ప్రభుత్వభూములు, వ్యవసాయేతర భూములు, బీడు భూములు, పశువుల పాకలను కూడా ఈ–పంట నమోదు చేయాలన్న ఆదేశాలు వ్యవసాయ అధికారులకు అందాయి. దీంతో ఏయే పంటల సాగు చేస్తున్నారనే వివరాలతో పాటు అదనంగా వ్యవసాయేతర భూములు కూడా నమోదు చేయనున్నారు. షెడ్యూల్ ఇలా.. పంట నమోదుకు గడువు : సెప్టెంబర్ 15 వరకు గ్రామ సభల నిర్వహణ : సెప్టెంబర్ 19–24 వరకు ఫిర్యాదుల స్వీకరణ : 25 నుంచి 28 వరకు తుది జాబితా ప్రచురణ : సెప్టెంబర్ 30 -
మెరుగైన విద్యుత్ సరఫరాకు కృషి
ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి మాచర్ల: రాష్ట్రంలో మెరుగైన విద్యుత్ సరఫరాతో పాటు, ఉత్తమ సేవలందించాల్సిన బాధ్యత విద్యుత్ శాఖ ఇంజినీర్లపై ఉందని ఏపీ సీపీడీసీఎల్ సీఎండీ పి.పుల్లారెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని విద్యుత్ శాఖ డివిజినల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన డివిజినల్ పరిధిలోని ఇంజినీర్లు, అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భవిష్యత్తులో కరెంట్ బిల్లుల వసూళ్ల విధానం మారిపోతుందని, బకాయిలు పేరుకుపోకుండా చూసుకోవాలని సూచించారు. బకాయిలు ఉన్న ప్రభుత్వ శాఖల అధికారులను కలిసి బకాయిలు క్లియర్ చేయకపోతే చర్యలు తప్పవని సూచించాలని తెలిపారు. టెక్నికల్ ఎలక్ట్రికల్ డైరెక్టర్ మురళీ కృష్ణ యాదవ్, విజయ్‌కుమార్, ఈఈ ఎన్.సింగయ్యతో పాటు పలువురు డీఈలు, ఏఈలు పాల్గొన్నారు. స్మార్ట్ మీటర్లు బిగించుకోండి.. రాష్ట్ర ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుందని సీఎండీ పి.పుల్లారెడ్డి అన్నారు. మాచర్లలోని కేసీపీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో పలు ప్రయోజనాలు ఉన్నాయన్నారు. -
అర్జీల పరిష్కారమే ధ్యేయం కావాలి
జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు నరసరావుపేట రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన ఆర్జీల పరిష్కారంలో బాధితుల సంతృప్తే ధ్యేయంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు తెలిపారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజాసమస్యల పరిస్కార వేదిక నిర్వహించారు. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి 131 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలన్నారు. ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తామని భరోసా కల్పించాలని తెలిపారు. నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అచ్చంపేట మండలం వేల్పూరుకు చెందిన మహిళలకు వితంతు పెన్షన్ మంజూరు కాలేదు. దీనిపై గ్రామానికి చెందిన శిఖా రమాదేవి, ఆవుల శివపార్వతి, ముత్యాల గంగమ్మలు ఆవేదన వ్యక్తం చేశారు. సచివాలయంలో అడిగితే కొత్త పెన్షన్లు ఇంకా ఇవ్వడం లేదని చెప్పారన్నారు. కలెక్టర్‌ను కలిసి అర్జీ పెట్టుకుందామని వచ్చినట్లు వివరించారు. శిఖా ప్రియాంక అనే మహిళ దివ్యాంగ పింఛను కోసం అర్జీ ఇచ్చారు. ప్రస్తుతం నరసరావుపేట మండలం లింగంగుంట్ల రాజుపాలెంలో ఉంటున్నాను. మాకు రేషన్ కార్డు మాచర్ల మండలంలో ఉంది. కార్డును రాజుపాలెంకు మార్చాలని సచివాలయంలో అడిగినా మార్చడం లేదు. కొత్త రేషన్ కార్డు ఇవ్వడం లేదు. కనీసం సరకులు ఇవ్వాలని కోరినా రాజుపాలెంలో డీలర్ నిరాకరిస్తున్నారు. – తాళ్లూరి సామ్రాజ్యం, రాజుపాలెం -
పొగాకు కొనాలని రైతుల ధర్నా
నరసరావుపేట రూరల్: రైతుల వద్ద ఉన్న పొగాకు నిల్వలను ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈపూరు మండలం అగ్నిగుండాల గ్రామానికి చెందిన రైతులు సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఐటీసీ సంస్థ సహకారంతో గత మూడు సంవత్సరాలుగా వైట్‌బర్లీ పొగాకు పంటను సాగు చేస్తున్నట్టు రైతులు తెలిపారు. గత ఏడాది పంట చేతికొచ్చే సమయానికి ఐటీసీ సంస్థ పంట కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డామని వివరించారు. ఈ ఏడాది పొలాలను కౌలుకు తీసుకొని షెడ్లు నిర్మించి పంట సాగుకు సిద్ధమయ్యామని తెలిపారు. ప్రభుత్వంతో పాటు ఐటీసీ సంస్థ పొగాకు సాగుచేయొద్దంటూ రైతులను అడ్డుకుంటుందని తెలిపారు. దీనివలన పెట్టుబడి పెట్టిన రైతులు తీవ్రంగా నష్టపోతారన్నారు. రైతుల వద్ద ఉన్న పొగాకు నిల్వలను వెంటనే కొనుగోలు చేయడంతో పాటు ఈ ఏడాది పంట సాగుకు ఐటీసీ సంస్థ ద్వారా బాండ్లు ఇప్పించి సహకరించాలని కోరారు. ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబుకు వినతిపత్రం అందజేశారు. రైతుల వద్ద ఉన్న పొగాకును కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ హామీ ఇచ్చారు. పీడీఎం నాయకులు వై.వెంకటేశ్వరరావు, గిరిజన సంఘ నాయకులు వి.కోటనాయక్, పీడీఎం జిల్లా అద్యక్షుడు షేక్ మస్తాన్‌వలి, కార్యదర్శి జి.రామకృష్ణ, రైతులు వెంకటకోటిరెడ్డి, దూదేకుల చిరంజీవి, గంటా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ఓబీసీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలి
నెహ్రూనగర్: దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఓబీసీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని అఖిల భారత ఓబీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు అంగిరేకుల వరప్రసాద్ యాదవ్ కోరారు. ఈ మేరకు సోమవారం ఢీల్లీలోని జాతీయ బీసీ కమిషన్ కార్యాలయంలో చైర్మన్ హన్స్‌రాజ్ గంగరామ్ అహీర్ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వరప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 63 కేంద్ర ప్రభుత్వ శాఖల్లో బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి తగిన చర్యలు తీసుకోవడంతో పాటు, విద్యా, ఉపాధి రంగాల్లో ఓబీసీలకు రిజర్వేషన్ల పరిరక్షణకు తగిన చొరవ చూపాలన్నారు. గత 3, 4 సంవత్సరాలుగా వివిధ రాష్ట్రాలలో నీట్ సీట్ల భర్తీ విషయంతో తీవ్ర అన్యాయం జరుగుతుందని దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. దేశంలో 52శాతానికి పైగా జనాభా కలిగిన ఓబీసీల సాధికారిత కోసం ఓబీసీ సబ్ ప్లాన్ చట్టాన్ని రూపొందించేందుకు కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని సూచించారు. కేంద్రంలో ఓబీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయడంతో పాటు ఓబీసీల్లోని అన్ని కులాల విద్యార్థులకు ఓవర్సీస్ స్కాలర్షిప్ పథకం అమలు చేసేలా చూడాలని కోరారు. ఆయనవెంట ఏపీ బొందిలి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుజాన్ సింగ్, ఓబీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి కృష్ణంరాజు, సంఘ నాయకులు ఉరిటి అశోక్‌కుమార్, ముంగమూరి హైమారావు, ఖాసీం పాల్గొన్నారు. -
దళిత, గిరిజనులకు నేటికీ స్వాతంత్య్రం రాలేదు
మంగళగిరి టౌన్: భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా నేటికీ దళిత, గిరిజనులను స్వాతంత్య్రం రాలేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళగిరి నగర పరిధి టిప్పర్ల బజారులోని కేవీపీఎస్ (కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం) గుంటూరు జిల్లా 6వ మహాసభ ఆదివారం రాత్రి నిర్వహించారు. సామాజిక న్యాయం అంశంపై జరిగిన సెమినార్లో శ్రీనివాసరావు మాట్లాడుతూ దళితులు ఎదుర్కొంటున్న ఆర్థిక రాజకీయ సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా దళిత ఉద్యమానికి కంచుకోట అని అన్నారు. స్వాతంత్య్రానికి పూర్వమే గుంటూరు జిల్లాలో అంటరానితనానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయని గుర్తుచేశారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అసమానతలు, దళితులపై దాడులు నిత్యకృత్యమయ్యాయన్నారు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ఉన్నప్పటికీ దళిత, గిరిజనులకు న్యాయం జరగడం లేదన్నారు. ఈ చట్టం అమలు చేయడంలో పాలకులు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని విమర్శించారు. డాక్టర్ అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని అమలు చేసే పరిస్థితుల్లో పాలకులు లేరన్నారు. గిరిజన ప్రాంతాల్లో అదానీకి భూములు అప్పగించడానికి కుట్రలు జరుగుతున్నాయని మండిపడ్డారు. పీ–4 పథకం ఓ చెత్త పథకమన్నారు. అనంతరం 15 మందితో కూడిన కేవీపీఎస్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా వై.కమలాకర్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా నవీన్ ప్రకాష్, ఉపాధ్యక్షులుగా వెంకటేశ్వర్లు, లూదర్ పాల్, సహాయ కార్యదర్శులుగా దుర్గారావు, రమేష్‌లను ఎన్నుకున్నారు. -
జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు
నరసరావుపేట రూరల్: పీజీఆర్ఎస్ ఫిర్యాదులకు ప్రథమ ప్రాధాన్యత ఇచ్చి త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సూచించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక(పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహించారు. జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు కార్యక్రమంలో పాల్గొని ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ, ఆస్తి, మోసం తదితర సమస్యలపై 90 అర్జీలు అందాయి. పీజీఆర్ఎస్ అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, క్రైం అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతి, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ వెంకటరమణ పాల్గొన్నారు. -
చిన్నారులపై ఔదార్యం చూపండి
గుంటూరు వెస్ట్: సమాజంలో ఏ పాపం చేయకపోయినా అనాధలుగా జీవించే వారిపట్ల ఔదార్యం ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి కోరారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఏ.భార్గవ్ తేజ, డీఆర్వో ఖాజావలి, ఆర్డీఓ కె.శ్రీనివాసరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఎం.గంగరాజు, లక్ష్మీ కుమారితో కలిసి కలిసొచ్చే కాలానికి – నడిచొచ్చే పిల్లలు పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని తీసుకొచ్చిందన్నారు. సమాజంలో ఎవరైనా చిన్నారులను పెంచుకోవాలి అనుకున్న వారికి హోమ్స్‌లో ఉన్న 6–18 సంవత్సరాల వయస్సున్ను వారిని తాత్కాలికంగా తొలి 6 నెలలు తమ ఇంటికి తీసుకెళ్లి పెంచుకోవచ్చన్నారు. ఇద్దరికీ నచ్చితే మరో ఆరు నెలలు ఇలా 2 సంవత్సరాల వరకు పెంచుకుని ఆ తర్వాత పూర్తి స్థాయిలో దత్తత తీసుకునే వీలుంటుందని వెల్లడించారు. దీనికిగాను బిడ్డ ఖర్చులకు కేంద్ర ప్రభుత్వం ప్రతి నెలా రూ.4000 ఉచితంగా అందజేస్తుందన్నారు. దీనివలన ఎంతో మంది అనాధలకు తల్లిదండ్రులు, గార్డియన్స్ లభిస్తారని, పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఔత్సాహికులు ముందుకు వచ్చి సంప్రదించాలని కోరారు. ఐసీడీఎస్ పీడీ ప్రసూన మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఏడుగురు కమిటీ సభ్యులు దత్తత కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ జ్యోతిబసు, హౌసింగ్ పీడీ ప్రసాద్, సీపీఓ శేషశ్రీ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
తాళం వేసిన ఇంట్లో చోరీ
వెండి, బంగారు ఆభరణాలు, నగదు మాయం పిడుగురాళ్ల: వరుసగా మూడు రోజులు సెలవులు రావటంతో ఇంటికి తాళం వేసి ఊరెళ్లిన ఒకరి ఇంట్లో చోరీ జరిగిన ఘటన పిడుగురాళ్ల పట్టణంలోని బస్టాండ్ వెనుక ప్రాంతంలో చోటు చేసుకుంది. బాధితుడు వి.ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం... వరుసగా ప్రభుత్వ సెలవులు రావటంతో బంధువుల ఇంటికి కుటుంబ సభ్యులతో తామెళ్లామని, తిరిగి సోమవారం ఉదయం రావటంతో ఇంటి తాళాలు పగలగొట్టి ఉన్నాయని, తలుపులు తీసి చూస్తే, బీరువాలోని దుస్తులన్నీ కింద పడవేసి ఉన్నాయని, బీరువా లాకర్ పగలగొట్టి ఉందని తెలిపారు. బీరువాలోని నగదు, బంగారు నగలు, వెండి వస్తువులు కనిపించకపోవటంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించామని తెలిపారు. పిడుగురాళ్ల పట్టణ ఎస్ఐ మోహన్ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కూ్‌ల్స్ టీమ్‌కు సమాచారం అందించారు. దీంతో కూ్‌ల్స్ టీమ్ ఎస్ఐ రహీమ్, ఏఎస్ఐ సురేంద్రల బృందంతో దొంగతనం జరిగిన విధానాన్ని, దొంగలు ఏమైనా ఆధారాలు విడిచిపెట్టారనే విషయాన్ని, వేలిముద్రలను సేకరించారు. బాధితుడు ఆంజనేయులు బీరువాలో రూ. 50 వేల నగదు, సుమారు రూ. 15 లక్షల విలువ చేసే బంగారు అభరాణాలు, వెండి వస్తువులు చోరీకి గురయ్యాయని తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ శివనాగరాజు తెలిపారు. -
జాతీయ సమైక్యతను చాటాలి
నరసరావుపేట రూరల్: జాతీయ పతాకాన్ని ప్రతి భారతీయుడు ఇంటిపై ఎగురవేసి దేశభక్తిని, జాతీయ సమైక్యతను చాటాలని పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా సోమవారం పట్టణంలో ఘర్ తిరంగా అభియాస్ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీని జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు ప్రారంభించారు. పల్నాడు బస్టాండ్ నుంచి గాంధీ పార్క్ వరకు భారీ జాతీయ పతాకంతో విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు. కార్యక్రమంలో డిఆర్వో మురళీ, ఆర్డీవో మధులత తదితరులు పాల్గొన్నారు.బీసీ బాలుర వసతి గృహం వార్డెన్ సస్పెన్షన్ దాచేపల్లి : నారాయణపురం ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహం వార్డెన్ డి.దీపిక సస్పెండ్ అయ్యారు. అలాగే హాస్టల్ నైట్‌వాచ్‌మన్ సంజేశ్వరావును విధుల నుంచి తొలగిస్తూ జిల్లా కలెక్టర్ పి. అరుణబాబు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో జూనియర్ విద్యార్థిపై ఆరుగురు సీనియర్ విద్యార్థులు దాడి చేసి కరెంట్ షాక్ ఇచ్చి హతమార్చేందుకు ప్రయత్నించారు. సంక్షేమ హాస్టల్లో విద్యార్థులకు రక్షణలేని అంశాలపై సాక్షి దినపత్రిక ఈనెల 11న సంక్షేమం ప్రశ్నార్థకం శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్ దీపికను సస్పెండ్ చేయగా, నైట్ వాచ్‌మన్ సంజేశ్వరావుని విధుల నుంచి తొలగించారు. బీసీ బాలురు వసతి గృహానికి వార్డెన్‌గా గంగాధర్‌రావును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇదిలా ఉండగా హాస్టల్లో జూనియర్ విద్యార్థిపై దాడి చేసిన ఆరుగురు విద్యార్థులపై దాచేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి స్టేషన్ బెయిలు మంజూరు చేశారు. -
ప్రకృతి సేద్యం ప్రపంచానికి ఆదర్శం
యడ్లపాడు: ఆదాయం.. ఆరోగ్యంతో పర్యావరణాన్ని పరిరక్షించే ప్రకృతి వ్యవసాయ విధానం వైపు ప్రతి రైతు దృష్టి సారించాలని అమెరికా కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రతినిధుల బృందం యడ్లపాడు మండలం కొత్తపాలెం గ్రామంలో సోమవారం పర్యటించింది. బృందం సభ్యులైన చంద్రశేఖర్ బ్రీడర్, సిద్ధార్థ సచ్దేవ్, వేదసుంకర, అనుశెట్టి గ్రామంలో ప్రకృతి వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతుల పద్ధతులు, పంటల వైవిధ్యాన్ని పరిశీలించారు. రసాయన క్షేత్రాలకు, ప్రకృతి సాగు క్షేత్రాలకు వ్యత్యాసాల అధ్యయనంపై వీరు వచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక రైతులతో కలిసి బృందం మునగ తోట, దొండ పందిరి, సొర, కాకర, బీర వంటి అంతర పంటలు, కనకాంబరం, లిల్లీ పూల రకాల సాగును ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రకృతి సేద్యం విధానాలను చూసి మంత్ర ముగ్ధులయ్యారు. రైతులు తక్కువ ఖర్చుతో నాణ్యమైన పంటలు పండించడం, అంతర పంటల ద్వారా ఒక ఎకరంలోనే ఐదు ఎకరాల పంట తీసుకోవడం వంటివి అద్భుతమని కొనియాడారు. ముందుగా గ్రామంలోని శివాలయం వద్ద ప్రాజెక్ట్ మేనేజర్ కె. అమల కుమారి ప్రకృతి వ్యవసాయ 9 సార్వత్రిక సూత్రాల చక్రాన్ని, ఇన్పుట్స్ తయారీ విధానాన్ని వివరించారు. విత్తన గుళికల తయారీ డెమోను చేసి చూపించారు. అనంతరం కొత్తపాలెంలోని శ్రీనివాస గ్రామైక్య సంఘంలో మహిళా సంఘాల సభ్యులతో ప్రత్యేక సమావేశం జరిగింది. ప్రకృతి సేద్యం రైతులు శ్రీకాంత్, భానుచంద్ర, పల్నాటి తిరుపతిరావు, బద్దేటి కోటేశ్వరమ్మ, మలమంటి గణేష్ తమ సేద్యం విధానం, నీటి యాజమాన్యం, దిగుబడి, మార్కెటింగ్ తదితర అంశాలను వివరించారు. ఈ కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ గుంటూరు ఏడీఏ వాణిశ్రీ, యంగ్ప్రాజెక్ట్లీడ్ సౌమ్య, డీపీపీ భవానీరాజ్, నందకుమార్, వెంకటేశ్వరరావు, తిరుపతిరావు, ఐలయ్య, శివయ్య, కోటేశ్వరమ్మ పాల్గొన్నారు. -
సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలకు వేళాయె..!
సత్తెనపల్లి: విద్యా సంవత్సరంలో విద్యార్థి అభ్యాసన మదింపునకు విద్యాశాఖ ఏటా ఫార్మేటివ్, సమ్మెటివ్ అసెస్మెంట్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఫార్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను గత ఏడాది నుంచి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్ 1, 2, 3, 4గా వ్యవహరిస్తున్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో నాలుగు సెల్ఫ్ అసెస్మెంట్, రెండు సమ్మెటివ్ పరీక్షలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో తొలి సెల్ఫ్ అసెస్మెంట్ మోడల్ పేపర్–1 (శాంప్) ఈ నెల 11 నుంచి నిర్వహించనున్నారు. విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు నిర్వహిస్తున్న సెల్ఫ్ అసెస్మెంట్ పరీక్షలను 2022–23 విద్యా సంవత్సరం నుంచి ప్రయోగాత్మక విధానంలో ‘క్లాస్ రూమ్ బేస్డ్ అసెస్మెంట్’ ను ప్రవేశపెట్టారు. ఇదే విధానాన్ని ప్రస్తుత విద్యా సంవత్సరంలోనూ కొనసాగిస్తున్నారు. గత విద్యా సంవత్సరం 1–8 తరగతుల వరకు సీబీఏ విధానం అమలు చేయగా, ఈ ఏడాది 9వ తరగతికి కూడా సీబీఏ విధానాన్ని తీసుకొచ్చారు. కేవలం 10వ తరగతి విద్యార్థులకు మాత్రమే ఫార్మేటివ్–1 పరీక్షలను జరపనున్నారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం... ప్రస్తుత విద్యా సంవత్సరం జూన్ 12 నుంచి ప్రారంభమైంది. ముందుగా పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన అకడమిక్ క్యాలెండర్ ప్రకారం పరీక్షలు ఈనెల 4 నుంచి నిర్వహించాల్సి ఉండగా, అసెస్మెంట్ బుక్లెట్స్ జిల్లాకు చేరుకోవడం ఆలస్యం కావడంతో ఈనెల 11 కు వాయిదా వేశారు. జూన్, జూలై సిలబస్ కు సంబంధించి విద్యార్థుల అభ్యసనా సామర్థ్యాల మదింపునకు సీబీఏ, ఫార్మేటివ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సిలబస్ తో పాటు, 6వ తరగతికి రెడీనెస్ ప్రోగ్రాం పై పరీక్ష ఉంటుంది. ఈ పరీక్షల ద్వారా అభ్యాసన లోపాలను గుర్తించడంతోపాటు, పక్కా బోధనతో వారిలో సామర్థ్యాలను వెలికి తీయడం సీబీఏ పరీక్షల ప్రధాన ఉద్దేశం. 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు సెల్ఫ్ అసెస్మెంట్–1,3, ఎస్ఏ 2కు ఫార్మేటివ్ బదులుగా సీబీఏ విధానంలో నిర్వహిస్తుండగా, ఎఫ్ఏ 2, 4, ఎస్ఏ 1 పాత విధానంలోనే నిర్వహించనున్నారు. 10వ తరగతికి నాలుగు ఎఫ్‌ఏలు, రెండు సమ్మెటివ్ పరీక్షలు పాత విధానంలో అమలు చేస్తారు. నేటి నుంచి ఈ నెల 14 వరకు నిర్వహణ విద్యార్థి అభ్యసన మదింపునకు ప్రక్రియ డీసీఈబీ నుంచి మండలాలకు ప్రశ్నపత్రాలు బైలింగ్విల్ ప్రశ్న పత్రాలు.. సీబీఏ విధానంలో నిర్వహిస్తున్న పరీక్షలకు విద్యార్థులకు ఇచ్చే ప్రశ్నపత్రం బైలింగ్విల్ విధానంలో ఉంటుంది. విద్యార్థికి ఇంగ్లిషులో ప్రశ్నపత్రం అర్థం కాకుంటే తెలుగులో చదివి అర్థం చేసుకునేందుకు 2023–24 విద్యా సంవత్సరం నుంచి బైలింగ్విల్ ప్రశ్నపత్రాలను ప్రవేశపెట్టారు. ప్రశ్న పత్రంలోని 10 ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో, ఐదు ప్రశ్నలు రాతపూర్వక విధానంలో ఇస్తారు. మొత్తం 15 ప్రశ్నలకు 20 మార్కులు కేటాయిస్తారు. మెకానికల్ .. అండర్ స్టాండింగ్ .. అప్లికేషన్ (ఎంయూఏ) ప్రశ్న పత్రం ఉంటుంది. ఓఎంఆర్ పత్రాల్లో జవాబులు నింపి జిల్లాకు పంపించాల్సి ఉంటుంది. సీబీఏ విధానంలో పరీక్షలు రాసే విద్యార్థులు ప్రశ్నలకు సమాధానాలను ఓఎంఆర్ షీట్లలో నింపాల్సి ఉంటుంది. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు మాత్రం రాతపూర్వక సమాధానాలు రాస్తే సరిపోతుంది. -
ఈ ఏడాదికి కొత్త బ్రిడ్జి లేనట్లేనా...!
ముప్పాళ్ల: సత్తెనపల్లి–నరసరావుపేట ప్రధాన రహదారిలో గుంటూరు బ్రాంచి కాలువపై శిథిలావస్థకు చేరిన వంతెన స్థానంలో నూతన బ్రిడ్జి నిర్మాణం ఈ ఏడాదికి లేనట్టే. గత ఏడాది డిసెంబర్ 6వ తేదీన ఆర్భాటంగా ప్రారంభించిన నిర్మాణం పనులు ఆరంభ శూరత్వంగానే మిగిలిపోయాయి. సుమారు రూ.120 లక్షల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణం పనులకు జిల్లా ఇన్చార్జి మంత్రి శంకుస్థాపన చేశారు. అనంతరం కాల్వలకు నీటి విడుదల ఆగిపోయిన తర్వాత మార్చి, ఏప్రిల్ నెలలో పనులు ప్రారంభించి పూర్తి చేయాల్సి ఉంది. అయినప్పటికీ రెండు నెలలు కాలం గడిపి తీరా కాల్వలకు నీటి విడుదల చేసే సమయంలో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేశారు. ఆ మేర కాల్వలో దోనెలు ఏర్పాటు చేసి అప్రోచ్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. కాల్వలకు నీరు విడుదల చేయటంతో నిర్మించిన అప్రోచ్ రోడ్డును తొలగించారు. కాల్వలకు నీటిని నిలిపివేస్తే తప్ప పనులు ప్రారంభించడానికి వీలు లేదు. మరో ఏడాదిపాటు శిథిలావస్థకు చేరిన వంతెనపై రాకపోకలు చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే ఆందోళన వాహనదారుల్లో నెలకొంది. -
వెటర్నరీ అసిస్టెంట్ అసోసియేషన్ కార్యదర్శిగా వేమారెడ్డి
రొంపిచర్ల: ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ అసిస్టెంట్ అసోసియేషన్ కార్యదర్శిగా పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం వి.రెడ్డిపాలెం గ్రామానికి చెందిన దుద్దుకుంట వేమారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఆదివారం విజయవాడలో నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ వెటర్నరీ అసిస్టెంట్ అసోసియేషన్ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఎన్నికల అధికారిగా వ్యవహరించిన ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ జె.జగదీశ్‌రావు నుంచి నియామాక ఉత్తర్వులు అందుకున్నారు. వేమారెడ్డి గతంలో జిల్లా అసోసియేషన్‌లో పలు పదవులు నిర్వహించారు. రాష్ట్ర వెటర్నరీ అసిస్టెంట్ అసోసియేషన్ కార్యదర్శిగా ఎంపికై న వేమారెడ్డిని సహచర ఉద్యోగులు, ఆ గ్రామ పెద్దలు అభినందించారు. 12 సొసైటీలకు త్రీమెన్ కమిటీల నియామకం నరసరావుపేట: పల్నాడు జిల్లాలోని 12 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు ప్రభుత్వం ఆదివారం త్రిసభ్య కమిటీ నియామకం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 821 పీఏ సీఎస్‌లకు కమిటీలను నియామకం చేసింది. కాగా పల్నాడు జిల్లాలోని వీరాపురం సొసైటీకి వై. శివన్నారాయణను చైర్ పర్సన్‌గా నియమించగా, పెదఅగ్రహారం సొసైటీకి పి. మరియమ్మ, మాచవరం సొసైటీకి పసుపులేటి పూర్ణయ్య, మాచర్ల సొసైటీకి జి. సత్యనారాయణరెడ్డి, దుర్గి సొసైటీకి కటకం రామ్మోహన్రావు, నందిరాజుపాలెం సొసైటీకి ఓర్చు ఆనందరావు, ధూళిపాళ ఏబీఎఫ్ఎస్సీఎస్కు కె.సుబ్బారావు, ముప్పాళ్లకు జెట్టి నాగమల్లేశ్వరరావు, మాదల సొసైటీకి చిమటా పోల్రాజు, మర్రిపాలెం సొసైటీకి కుర్రా రత్తయ్య, యడ్లపాడు సొసైటీకి ఎం. వెంకట సుబ్బారావు, బొల్లాపల్లి సొసైటీకి పి.వెంకటనారాయణను చైర్ పర్సన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. వీరితో పాటు సొసైటీకి ఇరువురు చొప్పున పర్సన్ల నియామకం చేసింది. వీరు ఈ పదవుల్లో 2026 జనవరి 30వ తేదీ వరకు కొనసాగుతారు. గుండెపోటుతో హెడ్ కానిస్టేబుల్ మృతి జె.పంగులూరు: మండలంలోని రేణింగవరం పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న పర్వతరెడ్డి వెంకటస్వామి (52) గుండెపోటుతో ఆదివారం మృతి చెందారు. వెంకటస్వామి రేణింగవరం పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. అతని స్వగ్రామం చిన్నగంజాం మండలం సోపిరాల. ఆయన అస్వస్థతకు గురికావడంతో ఒంగోలు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. వెంకటస్వామికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వారివురికి వివాహం చేశాడు. వెంకటస్వామి భౌతికకాయాన్ని రేణింగవరం ఎస్సై వినోద్‌బాబు, సిబ్బంది సందర్శించి నివాళులర్పించారు. -
పోరాటానికి, క్రమశిక్షణకు మారుపేరు యూటీఎఫ్
యూటీఎఫ్ సీనియర్ నాయకుడు జోజయ్య గుంటూరు ఎడ్యుకేషన్: పోరాటానికి, క్రమశిక్షణకు యూటీఎఫ్ మారుపేరుగా నిలిచిందని యూటీఎఫ్ సీనియర్ నాయకుడు కె.జోజయ్య అన్నారు. ఆదివారం బ్రాడీపేటలోని యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో సంఘ 52వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొని యూటీఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించిన జోజయ్య మాట్లాడుతూ యూటీఎఫ్ నిజాయతీకి, త్యాగానికి నిలయం అన్నారు. ఆవిర్భావం మొదలు క్రమశిక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, సంఘాన్ని బలోపేతం చేసుకోవడంతో పాటు, పోరాటాల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. ●మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు మాట్లాడుతూ ప్రభుత్వ విద్యారంగ సంస్కరణల రూపకల్పనలో అకడమిక్ అంశాలతో పాటు, ఉపాధ్యాయుల కృషి, సమాజ భాగస్వామ్యంలో రావలసిన మార్పులపై దృష్టి పెట్టాలని అన్నారు. ●మరో సీనియర్ నాయకుడు జి.ప్రభుదాస్ చెన్నుపాటి విగ్రహానికి పూలమాల వేసి మాట్లాడుతూ యూటీఎఫ్‌లో పని చేయడం ఎంతో గర్వకారణమన్నారు. ఉద్యోగ విరమణ అనంతరం కార్యకర్తల్లో ఆ స్ఫూర్తి ఉంటుందన్నారు. కార్యక్రమంలో సంఘ జిల్లా సహధ్యక్షుడు జి.వెంకటేశ్వర్లు, సీపీఎస్ కన్వీనర్ సీహెచ్ ఆదినారాయణ, జిల్లా కార్యదర్శులు ఎండీ షకీలా బేగం, కె.రంగారావు, బి. ప్రసాదు ఆడిట్ కమిటీ సభ్యులు కె.ప్రేమ్ కుమార్ రాష్ట్ర కౌన్సిలర్ బి.ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
అదుపుతప్పి ఆటో బోల్తా
క్రోసూరు: ఊటుకూరు–కస్తల మధ్యలో ఆదివారం అదుపు తప్పి ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలయ్యాయి. ఎస్ఐ పి.రవిబాబు తెలిపిన వివరాలు.. బెల్లంకొండ మండలం నాగిరెడ్డిపాలేనికి చెందిన 10 మంది అచ్చంపేట మండలం కస్తలలోని తమ బంధువుల ఇంటిలో జరిగే పుష్పాలంకరణ వేడుకకు ఆటోలో బయలుదేరారు. క్రోసూరు మండలం ఊటుకూరు మీదగా కస్తల వెళ్లి తిరిగి వస్తూ ఊటుకూరు పరిధిలో అదుపు తప్పి ఆటో పొలాల్లోకి దూసుకెళ్లింది. ఆటోలో ఐదుగురు మహిళలు, ఆరుగురు పురుషులు, డ్రైవర్‌తో కలిపి 11 మంది ప్రయాణిసున్నారు. ఈ ప్రమాదంలో వృద్ధుడు చావలి వెంకటేశ్వర్లు(66) అక్కడిక్కడే మృతిచెందాడు. మిగిలిన వారికి స్వల్ప గాయాలు కాగా సత్తెనపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఒకరు మృతి 11 మందితో వెళ్తుండగా ప్రమాదం -
తొలితరం తెలుగు రచయిత్రులు పుస్తకావిష్కరణ
నగరంపాలెం: స్థానిక బృందావన్‌గార్డెన్‌న్స్ శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయం పద్మావతి కల్యాణవేదికపై ఆదివారం ప్రముఖ సాహితీవేత్త, ఆచార్య సీహెచ్.సుశీలమ్మ రచించిన తొలితరం తెలుగు రచయిత్రులు అభ్యుదయ కథల పుస్తకావిష్కరణ నిర్వహించారు. కేంద్ర సాహితీ అకాడమి అనువాద పురస్కార గ్రహీత పి.సత్యవతి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని అన్నమయ్య గ్రంథాలయ వ్యవస్థాపకులు లంకా సూర్యనారాయణకు అంకితం చేసి సత్కరించారు. అభ్యుదయ రచయితల సంఘం జాతీయ అధ్యక్షులు, కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ అధ్యక్షత వహించారు. సభలో గ్రంథాన్ని విశ్లేషిస్తూ కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ ప్రసంగించారు. ఈ పుస్తకంలో వితంతు, సీ్త్రల బాధలను, వాటి వెనుకనున్న సామాజిక దుర్మార్గాన్ని, అస్పృశ్యత, అంటరానితనం, అగ్రవర్గ దురహంకారం వంటి అనేక విషయాలను ప్రస్తావించడం విశేషమని అన్నారు. ఈ పుస్తకంలో 1902 నుంచి 1955 వరకు రచించిన కథ, రచన చేసిన 25 మంది కథారచయిత్రుల రచనలను పరిచయం చేయడంతో పాటు రచయిత్రుల జీవన రేఖలను అందించడం మంచి విశేషమని కేంద్ర సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత పెనుగొండ లక్ష్మీనారాయణ అన్నారు. పుస్తకావిష్కరణ సత్యవతి, సుశీల, రచయిత్రి అతిథులను సత్కరించారు. -
రజక దివ్యాంగురాలిపై దాడి
పర్చూరు(చినగంజాం): దివ్యాంగురాలైన ఓ రజక యువతిపై కర్రలు, రాడ్లతో దాడి చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తీవ్ర గాయాలపాలైన ఆ యువతి ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. ఈ విషయమై కారంచేడు ఎస్ఐ ఖాదర్ బాషా, బంధువులు, ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు.. కారంచేడు గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ యార్లగడ్డ శ్రీకృష్ణ, సుజాతలు నివాసముంటున్న అదే ప్రాంతంలో రజక సామాజిక వర్గానికి చెందిన కుటుంబం నివాసముంటోంది. ఈనెల 8వ తేదీ ఉదయం సుజాత ఇంటి ముందు ముగ్గు వేస్తున్న సమయంలో ఆమెను చూసి నవ్వారనే సాకుతో రజక కుటుంబంతో వివాదానికి దిగారు. అంతేగాకుండా నగదు అప్పు తీసుకొని ఇవ్వలేదనే కోపంతో రజక కుటుంబానికి చెందిన కృష్ణకుమారి, కోటిరత్నం, సునీత, నాగేశ్వరరావులపై సుజాత ఆమె భర్త శ్రీకృష్ణలు దాడికి దిగారు. కర్రలతో దాడి చేసి వారిని తీవ్రంగా గాయపరచారు. అంతటితో ఆగక ఇనుపరాడ్లతో అదే కుంటుంబానికి చెందిన మూగ, చెవిటి యువతి పొదిలి దేవికపై అమానుషంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచడమే కాకుండా కులం పేరుతో దూషించి అసభ్యంగా వ్యవహరించారు. ఆ సంఘటనలో దివ్యాంగురాలు స్పృహ కోల్పోగా చీరాల ఏరియా వైద్యశాలలో చేర్పించారు. ఆమెకు ఆస్పత్రిలో ఆక్సిజన్ అందించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడిందని సమాచారం. ఆస్పత్రి వైద్యులు అందించిన నివేదిక మేరకు కేసు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ తెలిపారు. దాంతోపాటు దాడికి పాల్పడిన శ్రీకృష్ణ కూడా రజక కుటుంబంపై ఫిర్యాదు చేయగా రెండు కేసులు నమోదు చేస్తున్నట్లు ఎస్ఐ ఖాదరబాషా తెలిపారు. న్యాయం చేయాలి రజక సామాజిక వర్గానికి చెందిన చెవిటి, మూగ యువతి పొదిలి దేవికపై అగ్రవర్ణాలకు చెందిన యార్లగడ్డ శ్రీకృష్ణ అతని భార్య దాడి చేసి గాయపరచిన సంఘటనకు సంబంధించి ప్రజాసంఘాలు, రజక వర్కర్స్ అసోసియేషన్ ప్రతినిధులు తీవ్రంగా స్పందించారు. ఆదివారం రాత్రి చీరాల ఎన్జీ ఓ కార్యాలయంలో సమావేశమయ్యారు. రజక కుటుంబంపై దాడి చేసి మూగ, చెవిటి యువతి దేవికను రాడ్లతో కొట్టి తీవ్రంగా గాయపరచిన సంఘటనపై జిల్లా కలెక్టర్‌ను, ఎస్పీని కలిసి ఫిర్యాదు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర నాయకులు పెద్దిడపు కొండయ్య, ఎస్సీ సెల్ రాష్ట్ర నాయకులు కంచర్ల చిట్టిబాబు, రాష్ట్ర చేనేత నేత మాచర్ల మోహనరావు, సీఐటీయూ నాయకులు పి.వసంతరావు, రజక కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి.జనార్దన్, కొండవీటి శ్రీనివాసరావు, పొదిలి సూర్య పాల్గొన్నారు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న బాధితురాలు కలెక్టర్, ఎస్పీలను కలవనున్న ప్రజాసంఘాలు, రజక వర్కర్స్ అసోసియేషన్ నాయకులు -
రాష్ట్ర స్థాయి ఆట్యా–పాట్యాలో ప్రథమస్థానం
నకరికల్లు: రాష్ట్రస్థాయి ఆట్యా–పాట్యా క్రీడాపోటీల్లో పల్నాడు జిల్లా జట్లకు ప్రథమస్థానం దక్కింది. ఒంగోలులో ఈ నెల 9, 10వ తేదీలలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీలలో పల్నాడు జిల్లా బాలికల, బాలుర జట్లు ప్రథమ స్థానంలో నిలిచాయి. నకరికల్లు ఉన్నతపాఠశాల విద్యార్థులు 11 మంది, దేచవరం ఆదర్శపాఠశాల విద్యార్థులు ముగ్గురు పల్నాడు జిల్లా జట్టులో స్థానం సంపాదించారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులకు నకరికల్లు ఉన్నత పాఠశాలలోనే శిక్షణ ఇచ్చారు. బాలికల జట్టు కోచ్‌గా నకరికల్లు ఉన్నతపాఠశాల ఫిజికల్ డైరెక్టర్ జి.ఝాన్సీరాణి, బాలుర జట్టుకు కోచ్‌గా ఫిజికల్ డైరెక్టర్ చింతా పుల్లయ్య, మేనేజర్‌గా పి.తిరుపతిరావు వ్యవహరించారు. క్రీడాకారులను ఏపీ ఆట్యా–పాట్యా సీఈఓ రంభ.ప్రసాద్, కార్యదర్శి శ్రీ చరణ్, అధ్యక్షుడు జాబేబ్, జిల్లా అధ్యక్షురాలు చింతా సామ్రాజ్యం తదితరులు అభినందించారు. -
మాదక ద్రవ్యాలకు బానిసలు కావద్దు
సత్తెనపల్లి: మాదక ద్రవ్యాలు, డ్రగ్స్, మద్యం, మత్తు పదార్థాలకు బానిసలు కావద్దని సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు అన్నారు. సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు గ్రామంలో ఆదివారం కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ చదువుకుంటున్న తమ బిడ్డలు హాస్టళ్ళల్లో, రూముల్లో ఏం చేస్తున్నారో తెలుసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. తల్లి దండ్రు లు కాయా కష్టం చేసి డబ్బు పంపుతుంటే కొందరు యువత చెడు అలవాట్లకు బానిసలై అర్థంతరంగా తమ జీవితాలను ముగించుకుంటున్నారన్నారు. యువకులు బాగా చదువు కొని ఉన్నతంగా ఎదగాలనే ఉద్దేశంతో తల్లిదండ్రులు తమ కష్టాలను సైతం పక్కనపెట్టి ఖర్చు అయినప్పటికీ చదివిస్తున్నారన్నారు. తల్లిదండ్రుల పర్యవేక్షణ కొరవడటంతో యువత మాదక ద్రవ్యాలు, మద్యం, మత్తు పదార్థాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు. విద్యార్థులు యువతీ,యువకులు తప్పు దోవ పట్టకుండా ఉండాలంటే తల్లిదండ్రులు పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలన్నారు. తల్లిదండ్రుల్లో కూడా కొంత మార్పు రావాలని, బిడ్డల ముందు మద్యం తాగడం లాంటివి మానుకోవాలన్నారు. ఈ సందర్భంగా మాదకద్రవ్యాల జోలికి వెళ్ళబోమని వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఐకమత్యంతో జరుపుకోవాలి... ఈ నెల 27న వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఎలాంటి గొడవలు లేకుండా ఐక్యమత్యంతో పండుగ నిర్వహించుకోవాలన్నారు. వినాయక విగ్రహలకు అనుమతులు తీసుకోవాలని, డీజేలు పెట్టడం, పార్టీ నాయకుల ఫ్లెక్సీలు, రెచ్చగొట్టే పాటలు వంటివి పెట్టి లేనిపోని గొడవలు సృష్టించవద్దన్నారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి వ్యవహరిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటా మని హెచ్చరించారు. ఈ సందర్భంగా కార్డెన్ సెర్చ్‌లో భాగంగా ఇంటింటికి తనిఖీలు చేపట్టి కాగితాలు సక్రమంగా లేని 37 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలతో పాటు 3 గొడ్డళ్లు, 2 బరిశలు స్వాధీన పరుచుకున్నారు. కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్లు కిరణ్, ఎంవి సుబ్బారావు, సురేష్, శ్రీనివాసరావు, సత్తెనపల్లి రూరల్ ఎస్ఐ షేక్ అమినుద్దీన్, మరో నలుగురు ఎస్ఐలు, నలుగురు ట్రైనీ ఎస్ఐలు, 80 మంది పోలీసులు పాల్గొన్నారు. గొడవలు లేకుండా వినాయక చవితి వేడుకలు నిర్వహించుకోవాలి సత్తెనపల్లి డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు లక్కరాజుగార్లపాడు గ్రామంలో కార్డెన్ సెర్చ్ -
ఘనంగా దివ్యబలిపూజ
విజయపురి సౌత్: ప్రతి ఒక్కరూ దేవునిపై విశ్వాసంతో జీవించాలని సాగర్మాత ఆలయ విచారణ గురువులు పామిశెట్టి జోసఫ్ బాల సాగర్ ఉద్బోధించారు. ఆదివారం సాగర్మాత దేవాలయంలో జరిగిన దివ్యబలిపూజ కార్యక్రమంలో ఆయన భక్తులనుద్దేశించి ప్రసంగించారు. తోటివారిని ప్రేమించటం క్రైస్తవ్యంలో ప్రధానమన్నారు. ఏసుక్రీస్తు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. ఏసుప్రభువును ఈ ప్రపంచానికి అందించిన దివ్యమూర్తి మేరిమాత అని కొనియాడారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో జరిగిన తేరు ప్రదక్షిణలో భక్తులు పాల్గొన్నారు.దుర్గమ్మ ఆలయానికి విరాళాలుఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్ర కీలాద్రిపై ఉన్న కనక దుర్గమ్మ ఆలయానికి ఆదివారం పలువురు భక్తులు విరాళాలు అందజేశారు. నెల్లూరు జిల్లా వెంకటగిరికి చెందిన శీల రమ్య కుటుంబం అమ్మవారి నిత్యాన్నదాన పథకానికి రూ. 5,01,116 విరాళాన్ని ఆలయ అధికారులకు ఇచ్చారు. గుంటూరు పట్టాభిపురానికి చెందిన విజయ్ శైలేంద్ర అమ్మవారి ఉచిత ప్రసాద పంపిణీకి రూ. 90 వేలు విరాళాన్ని అందజేశారు. డోనర్ సెల్‌కు రూ.10 వేల విలువైన బీరువాను అందించారు. తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్‌కు చెందిన బాలా ప్రగడ ఎన్ఎస్ కామేశ్వరి కుటుంబం దుర్గగుడి అభివృద్ధి పనులకు రూ.1,07,900 విరాళాన్ని అందజేసింది.కేంద్ర మంత్రి ఆకస్మిక తనిఖీతెనాలి: కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్ర శేఖర్ ఆదివారం తెనాలిలోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పచ్చ కామెర్లకు చికిత్స తీసుకుంటున్న రోగితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ 30–40 మంది రోగులతో మాట్లాడానని, వారంతా ఆసుపత్రిలో వైద్యసేవలతో సంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి చెప్పారు. రోగనిర్ధారణకు వినియోగించే సీటీ స్కాన్ చెడిపోయి చాలా కాలమైనా కొత్త పరికరం ఏర్పాటు చేయకపోవటం తన దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై తగిన చర్యలు తీసుకుంటానని చెప్పారు. -
నాగార్జునకొండను సందర్శించిన శ్రీలంక బౌద్ధుల బృందం
విజయపురిసౌత్: ప్రపంచ పర్యాటక కేంద్రమైన నాగార్జున కొండను ఆదివారం శ్రీలంక దేశానికి చెందిన 45 మంది బౌద్ధుల బృందం సందర్శించింది. వీరు నాగసిరి లాంచీలో నాగార్జున కొండకు చేరుకొని అక్కడి మ్యూజియంలో ఉన్న 9 అడుగుల బుద్ధుని పాలరాతి విగ్రహం, బుద్ధుని పుట్టుకకు సంబంధించిన శిలా ఫలకాలు, రాతి సామగ్రి, సింహాళ విహార్‌లోని మహాస్తూపం, అశ్వమేధ యాగశాల, స్నానఘట్టం తిలకించి బౌద్ధ గురువు దలైలామా నాటిన బోధి వృక్షం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పచ్చని కొండల మధ్య ఉన్న అనుపు, యాంపీ స్టేడియం, 60 అడుగుల ఎత్తు నుంచి జాలువారే ఎత్తిపోతల జలపాతాన్ని తిలకించారు. పర్యాటకులు లాంచీలలో నాగార్జునకొండకు వెళ్లిన నేపథ్యంలో పర్యాటక శాఖకు 72 వేల రూపాయల ఆదాయం చేకూరినట్లు అధికారులు తెలిపారు. లాంచీ స్టేషన్‌ను సందర్శించిన జీఎం విజయపురిసౌత్: పర్యాటక శాఖ జీఎం చందన నాంచారయ్య ఆదివారం లాంచీస్టేషన్‌ను పరిశీలించారు. మరమ్మతులకు గురైన లాంచీని రెండు రోజుల్లో అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. పర్యాటకులకు సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. హరిత రిసార్ట్స్ ఉద్యోగులకు సూచనలు చేశారు. లాంచీ యూనిట్ మేనేజర్ వినయతుల్లా, విజయవాడ అసిస్టెంట్ మేనేజర్ రవికుమార్, రిసార్ట్స్ మేనేజర్ మస్తాన్ రావు, పులుసు వీరారెడ్డి తదితరులు ఉన్నారు. -
సంక్షేమ హాస్టళ్లలో నిరుపేద విద్యార్థులు ఉండి చదువుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వారికి మౌలిక వసతులు ఎలాగూ కల్పించడం లేదు. దీనికితోడు కనీస రక్షణ కూడా లేకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సిబ్బంది కొరత వల్ల ఉన్న కొద్దిమందే
దాచేపల్లి: ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు అడ్డగోలు వ్యవహారాలకు అడ్డాగా మారుతున్నాయి. కనీస రక్షణ సౌకర్యాలు లేని హాస్టళ్లలో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ గడపాల్సిన పరిస్థితి ఉంది. ప్రభుత్వ వసతిగృహాలలో బయట వ్యక్తుల ప్రమేయాలు ఎక్కువ అయ్యాయి. వారు దందాలు చేస్తూ విద్యార్థులను తీవ్ర భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. తాజాగా దాచేపల్లి ప్రభుత్వ బీసీ బాలుర వసతి గృహంలో ఓ జూనియర్ విద్యార్థిపై బయట చదువుకుంటున్న ఓ సీనియర్ విద్యార్థి దాడి చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనతో సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు కనీస రక్షణ సౌకర్యాలు లేవనే విషయం మరోసారి స్పష్టమైంది. ప్రైవేటు వ్యక్తుల హల్చల్ ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో ప్రైవేట్ వ్యక్తులు దందాలు సాగిస్తున్నారు. తమ వ్యక్తిగత కార్యకలాపాలతోపాటుగా అక్కడి విద్యార్థుల పట్ల అమానుషంగా వ్యవహరిస్తున్నారు. దాచేపల్లి బీసీ హాస్టల్లో జరిగిన ఘటనే ఇందుకు ఉదాహరణ. హాస్టలుకు సంబంధం లేని ఓ విద్యార్థి తన వ్యక్తిగత విషయంపై మరో విద్యార్థిని అక్కడి తన స్నేహితుల వద్దకు పిలిచి చితకబాదాడు. హాస్టల్లో తన స్నేహితులు ఉండటం వల్ల వారి అండతో చితకబాది హత్య చేసేందుకు ప్రయత్నాలు చేయటం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. సదరు సీనియర్ విద్యార్థి ఇదే హాస్టల్లో ఉంటున్న ఎంతోమంది విద్యార్థులను వివిధ రకాలుగా వేధింపులకు గురిచేసినట్లు కొందరు బాధితులు చెబుతున్నారు. అతడితోపాటు హాస్టల్లో ఉంటున్న మరో ఇద్దరు సీనియర్ విద్యార్థులపైనా వార్డెనుకు ఫిర్యాదులు అందాయి. ఎటువంటి చర్యలు తీసుకోకపోవటంతో వారి ఆగడాలు కొనసాగుతున్నాయి. దాచేపల్లితోపాటు ఇతర ప్రాంతాల్లోని హాస్టళ్లలో కూడా జూనియర్లకు, సీనియర్లకు మధ్య గొడవలు జరుగుతున్నాయి. తరచూ బయట వ్యక్తులు వచ్చి యథేచ్ఛగా దందాలు అడ్డగోలు వ్యవహారాలకు నిలయాలుగా మారిన వైనం తాజాగా దాచేపల్లి హాస్టల్ లో విద్యార్థిపై దుర్మార్గంగా దాడి హాస్టళ్లలో ఉండేందుకు భయపడుతున్న విద్యార్థులు కనీస రక్షణ ఏర్పాట్లు లేని సంక్షేమ వసతి గృహాలువేధిస్తున్న సిబ్బంది కొరత వసతి గృహాలలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. దీంతో వీటి నిర్వహణ బాధ్యత కత్తి మీద సాములా మారింది. దాచేపల్లిలో రెండు హాస్టళ్లకు మాచర్లలో హాస్టల్ వార్డెన్‌గా ఉన్న వ్యక్తి ఇన్చార్జిగా ఉన్నారు. బాలుర వసతి గృహానికి కూడా సదరు మహిళా వార్డెనే ఇన్చార్జిగా ఉండటంతో విద్యార్థులపై నియంత్రణ కొరవడింది. ఇక్కడ బీటెక్, డిగ్రీ విద్యార్థులు కూడా ఉండటం వలన సీనియర్లకు చెప్పేందుకు మహిళా వార్డెన్ చొరవ తీసుకోవడం లేదని ఆరోపణలు ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న వసతి గృహాల్లోనూ సిబ్బంది కొరత ఉన్నట్లు సమాచారం. కొన్నిచోట్ల వార్డెన్, కుక్, కమాటి, వాచ్ మెన్లలో ఒకరుంటే ఒకరు లేరు. అవుట్ సోర్సింగ్ ద్వారా సిబ్బందిని తీసుకుంటున్నా కొరత ఎక్కువగానే ఉంది. ఇకనైనా కూటమి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ధరల దరువు.. ఎరువు బరువు
ముప్పాళ్ళ: వ్యవసాయంలో ప్రధానమైన ఎరువుల ధరలు అమాంతం పెరిగాయి. రసాయన ఎరువుల వాడకం తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు నామమాత్రం కావటంతో ఎరువుల వాడకం మరింత పెరిగింది. గతంలో ఎరువుల ధరలను పెంచే అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండేది. ఉత్పత్తి వ్యయానికి అనుగుణంగా ధరలు పెంచుకునే వెసులుబాటును కేంద్ర ప్రభుత్వం ఫర్టిలైజర్ కంపెనీలకు ఇవ్వడంతో ధరలు ఏడాదిలో రెండు, మూడు సార్లు పెంచేస్తున్నారు. ధరల పెరుగుదలను నియంత్రించే అవకాశం ఉన్నప్పటికీ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న పాపాన పోలేదు. దీంతో కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుకుంటూ పోతున్నాయి. రైతన్నలకు సాగు మరింత భారంగా మారుతోంది. కంటితుడుపు చర్యలతో సరి మండలంలో ఏడాదికి దాదాపు 4 వేల టన్నుల రసాయన ఎరువులు వినియోగిస్తుంటారని వ్యవసాయశాఖ అధికారులు అంచనా. ఒక్కో బస్తా (50 కేజీలు)పై కనిష్టంగా రూ.50–గరిష్ఠంగా రూ.300 వరకు పెరిగింది. టన్నుపై కనిష్టంగా రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.4 వేల వరకు ధర పెరగడం ఆందోళన కలిగిస్తోంది. సాగును ప్రోత్సహించేందుకు కంటితుడుపు చర్యలే తప్ప కూటమి ప్రభుత్వంలో రైతుకు ప్రోత్సాహకాలు అందటం లేదు. పెరుగుతున్న వాడకం వర్షాలతో ఖరీఫ్ సీజన్ కూడా ముందుగానే మొదలైంది. మోతాదుకు మించి రసాయన ఎరువుల వినియోగంతో వ్యయం విపరీతంగా పెరిగింది. ప్రకృతి వ్యవసాయంపై రైతులు ఆసక్తి చూపకపోవటంతో సాగు భారంగా మారింది. ఖరీఫ్‌లో సాగు చేసే పత్తి, మిరప, పసుపు, మొక్కజొన్న పంటలకు యూరియాతోపాటు డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారు. వీటితో పాటుగా 14–35–14, 20–20–0–13, 10–26–26 ఎరువులను వాడుతున్నారు. ఎకరాకు కనీసం 10 నుంచి 16 బస్తాల వరకు వినియోగిస్తున్నారు. ఆ మేర నిల్వ చేసుకుంటారు. దరలు పెరగటంతో రైతులకు శాపంగా మారింది. ఒక్కో రైతుపై రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు భారం పడనుంది. వైఎస్సార్సీపీ హయాంలో మేలు 2014–19 వరకు టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అప్పట్లో కూడా నాలుగైదు సార్లు రసాయన ఎరువుల ధరలు పెరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2019–24 కాలంలో రసాయన ఎరువుల ధరలు ఒక్కసారిగా కూడా పెరిగిన దాఖలాలు లేవు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన 14 నెలల్లోనే రైతుల నడ్డి విరిచేలా మూడు దఫాలుగా ధరలు పెంచడం గమనార్హం. పైగా రైతు భరోసా కేంద్రాల నేరుగా రైతులకు గ్రామంలోనే ఎరువులు అందించారు. నేడు వాటి కోసం రైతులు పట్టణాలకు, మండల కేంద్రాలకు పరుగులు తీయాల్సిన పరిస్థితి నెలకొంది.ముప్పాళ్ళ సొసైటీ గోదాములో నిల్వ ఉన్న యూరియా బస్తాలు అమాంతం పెరిగిన ఎరువుల ధరలు మూడు సార్లు పెంచిన కంపెనీలు నోరు మెదపని కూటమి ప్రభుత్వం ఒక్కో రైతుపై రూ.4 వేల అదనపు భారం గిట్టుబాటు ధరలు లేక తీవ్ర నష్టాలు పెట్టుబడి భారం పెరగడంతో కష్టాలు పెరిగిన ఎరువుల ధరలు (రూ.లలో) ఎరువు రకం పాతధర కొత్త ధర 20–20–0–13 (గ్రోమోర్) 1,300 1,350 20–20–0–13 (ఫ్యాక్ట్) 1,300 1,425 20–20–0–13 (పీపీఎల్) 1,300 1,400 10–26–26 1,470 1,800 14–35–14 (గ్రోమోర్) 1,700 1,800 సూపర్‌పాస్ఫేట్ 580 640 పొటాష్ 1,535 1,700 16–20–0–13 1,250 1,300మూడు నెలలకోసారి పెంపు నేను ఏటా పది ఎకరాల్లో పసుపు, మొక్కజొన్న, వరి, అరటి పంట సాగు చేస్తుంటాను. మూడు నెలలకొకసారి ఎరువుల ధరలు పెంచుకుంటూ పోతున్నారు. దీంతో పెట్టుబడి భారీగా పెరిగిపోతోంది. అదే రీతిలో పంటలకు గిట్టుబాటు ధర కూడా పెంచితే సాగు చేసేందుకు రైతు ఆసక్తి చూపుతాడు. గిట్టుబాటు ధర మాత్రం ఏడాది ఒకసారి మొక్కుబడిగా పెంచుతారు. – లోకసాని నర్సిరెడ్డి, రైతు, ముప్పాళ్ళ గిట్టుబాటు ధరలూ పెంచాలి పెరిగిన ఎరువుల ధరలతో ఎకరాకు రూ.4 వేల నుంచి రూ.5 వేల వరకు అదనపు భారం పడుతోంది. ఇప్పటికే పండిన పంటలకు గిట్టుబాటు ధర అందక సాగులో కష్టాలు పెరిగాయి. అయినప్పటికీ ఫర్టిలైజర్ కంపెనీలు మాత్రం ఇష్టానురీతిలో ధర పెంచుకుంటూ పోతున్నాయి. ఎరువులపై సబ్సిడీ అందించి రైతులను ప్రోత్సహించాలి. –బత్తుల శ్రీనివాసరావు, రైతు, చాగంటివారిపాలెం -
అంతిమ ప్రయాణం
రహదారి ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం పుట్టెంట్రుకలు తీయడానికి ఆలయానికి వెళ్తుండగా చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృత్యువాత పడ్డారు. చాగల్లు వద్ద ట్రాలీని తుఫాన్ వాహనం ఢీకొట్టడంతో వారి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఇద్దరు మృతి చెందగా, ఆస్పత్రికి తరలిస్తుండగా ఒకరు, వైద్యశాలలో చికిత్స పొందుతూ శనివారం మరో ఇద్దరు మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన వారు ఇలా చనిపోవడంతో తీవ్ర విషాదం నెలకొంది. ఉలవపాడు/మాచవరం: పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడుకు చెందిన నంబుల చిన వెంకటేశ్వర్లు, సుభాషిణి దంపతుల కుమారుడు తేజస్విని అభినయ్కృష్ణకు పుట్టెంట్రుకలు తిరుమలలో తీయించాలని నిర్ణయించారు. కుటుంబ సభ్యులతో కలిసి 11 మంది తుఫాన్ వాహనంలో బయలుదేరారు. ప్రకాశం జిల్లా ఉలవపాడు దాటి చాగల్లు సమీపంలో ముందు వెళుతున్న ట్రాలీ లారీని ఓవర్టేక్ చేసే క్రమంలో ఢీకొంది. తర్వాత వారి వాహనం బోల్తాకొట్టింది. కుటుంబం కకావికలం... చిన వెంకటేశ్వర్లు, సుభాషిణిలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కష్టపడి సచివాలయంలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు. పిడుగురాళ్లలో చిన వెంకటేశ్వర్లు వెల్ఫేర్ అసిస్టెంట్‌గా, సుభాషిణి డిజిటల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. ఇద్దరూ సంతోష జీవితం గడపాల్సిన సమయంలో ప్రమాదం ఆ కుటుంబాన్ని కకావికలం చేసింది. చిన వెంకటేశ్వర్లు తన కుమారుడు, భార్య, తల్లిని పోగొట్టుకున్నారు. సుభాషిణి తండ్రి కూడా ప్రాణాలు కోల్పోయాడు. చిన వెంకటేశ్వర్లు వదిన కూడా చనిపోయింది. రైలులో వెళ్లాలని భావించినా.. ముందు తిరుపతికి రైలులో వెళ్లాలనుకుని ప్లాన్ చేసుకున్నారు. రైలు అయితే ఇబ్బందులు ఉండవని చిన వెంకటేశ్వర్లుకు సోదరుడు చెప్పాడు. కానీ చిన్న పిల్లలు ఇబ్బంది పడతారని, కారులో ప్రశాంతంగా నిద్రపోతారు కదా.. అని పేర్కొనడంతో పిడుగు రాళ్లకు చెందిన గంగరాజు తుఫాన్ వాహనాన్ని బాడుగకు మాట్లాడుకున్నారు. 9 గంటలకు బయలుదేరారు. మధ్యలో టీ తాగేందుకు ఆగారు. మళ్లీ బయలుదేరిన అరగంటలోపే ప్రమాదం జరిగింది. రైలులో వెళ్లి ఉంటే ఈ ప్రమాదం తప్పి ఉండేదని మిగతా కుటుంబసభ్యులు, బంధువులు వాపోతున్నారు. మృతదేహాలు అప్పగింత... ఉలవపాడు సీహెచ్‌సీ వైద్యశాలలో వెంకట నరసమ్మ, సుభాషిణి, తేజస్విని అభినయ్ కృష్ణ మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. గ్రామం నుంచి బంధువులు వచ్చి మృతదేహాలను చూసి చలించిపోయారు. నెల్లూరులో యర్రం శ్రీనివాసరావు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. రుక్మిణమ్మ గుంటూరులో సాయంత్రం చికిత్స పొందుతూ మృతి చెందింది. ఇంకా పోస్టుమార్టం నిర్వహించలేదు. ఉలవపాడు వైద్యశాలలో వారి బంధువులు కన్నీటి పర్యంతమయ్యారు. మృతులందరూ ఒక్క కుటుంబానికి చెందిన వారే బాలుడి పుట్టెంట్రుకలు తీయడానికి వెళ్తుండగా దుర్ఘటన ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి కూడా మృత్యువాత ఘోర ప్రమాదంతో కకావికలమైన కుటుంబం మృతుల వివరాలివీ... ప్రమాద స్థలిలోనే చిన వెంకటేశ్వర్లు తల్లి వెంకట నరసమ్మ (55), భార్య సుభాషిణి (30)లు మృతి చెందారు. చిన వెంకటేశ్వర్లు కుమారుడు తేజస్విని అభినయ్‌కృష్ణ (3)ను కావలి ఏరియా వైద్యశాలకు తరలిస్తున్న సమయంలో మృతి చెందాడు. ఆయన వదిన రుక్మిణమ్మ (35) గుంటూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. మామ యర్రం శ్రీనివాసరావు (58) నెల్లూరులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. శ్రీనివాసరావు స్వస్థలం గణేశునిపాడు పక్కనే ఉన్న అగ్రహారం గ్రామం. -
మృత్యువులోనూ వీడని బంధం
పెదకాకాని: ఆత్మహత్య చేసుకున్న స్నేహితుడి అత్యక్రియలకు వెళ్లి ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి ఓ యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. గుంటూరు అరుంధతీనగర్‌కు చెందిన షేక్ సాధిక్ (21) గడ్డిపాడు సమీపంలోని మహేంద్ర షోరూంలో పని చేస్తున్నాడు. ఈనెల 6న స్నేహితుడు రమణను బైక్‌పై ఎక్కించుకుని గుంటూరు నుంచి తెనాలి వయా నందివెలుగు మీదుగా బయలు దేరారు. మార్గమధ్యలో తక్కెళ్లపాడు శివారులోకి చేరుకునే సరికి ఎదురుగా వెళుతున్న లారీ సడన్ బ్రేక్ వేయడంతో దాన్ని ఢీకొట్టారు. ఈ ఘటనలో బైక్ నడుపుతున్న షేక్ సాదిక్‌తో పాటు వెనుక కూర్చున్న రమణకు తీవ్ర గాయాలయ్యాయి. ఇద్దరినీ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న వారిలో షేక్ సాధిక్(21) పరిస్థితి విషమించి శుక్రవారం మరణించాడు. మరో యువకుడు రమణ పరిస్థితి విషమంగా ఉంది. అంత్యక్రియలకు వెళ్లి వస్తూ .. ప్రేమో, శారీరక ఆకర్షణో తెలియదు గానీ పట్టుమని 18 ఏళ్లు కూడా నిండని గుంటూరు ఆర్టీసీ కాలనీకి చెందిన కొండూరు శివశంకర్ నందివెలుగు రోడ్డులో ఉన్న రైల్వే ట్రాక్ పైకి చేరుకుని, సోదరుడికి ఫోన్ చేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు మాట్లాడుతూనే రైలు కింద పడటంతో శరీరం ముక్కలైంది. ఈనెల 6న కుటుంబసభ్యులు శివశంకర్ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు తెనాలి బయలు దేరారు. మిత్రుడి పోస్టుమార్టం పూర్తయ్యే వరకూ సాధిక్, రమణలు అక్కడే గడిపారు. మృతదేహం వెంట తెనాలి బయలు దేరారు. ఇంతలోనే లారీ రూపంలో వెంటాడిన మృత్యువు సాధిక్‌ను కబళించింది. ఆత్మహత్య చేసుకున్న స్నేహితుడిని చూసేందుకు వెళ్లి గాయపడిన ఇద్దరు యువకులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఒకరి మృతి మరొకరి పరిస్థితి విషమం -
మాజీ సర్పంచ్‌పై కానిస్టేబుల్ దాడి
బెల్లంకొండ: వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో బైక్ ఆపలేదనే కోపంతో మాజీ సర్పంచ్‌పై ఓ కానిస్టేబుల్ లాఠీ ఝులిపించారు. ఈ ఘటన శనివారం సాయంత్రం మండలంలోని నాగిరెడ్డిపాలెం సమీపంలో చోటు చేసుకుంది. బాధితుడు నాగిరెడ్డిపాలెం మాజీ సర్పంచ్ కొజ్జా శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంకొండ క్రాస్ రోడ్డు నుంచి బైక్‌పై నాగిరెడ్డి పాలెం వస్తుండగా గంగమ్మ గుడి సమీపంలో కానిస్టేబుళ్లు వాహనాల తనిఖీ చేపడుతున్నారు. బైక్ ఆపకుండా ముందుకు వెళ్లడంతో తనిఖీ చేస్తున్న కానిస్టేబుళ్లలో ఒకరు శ్రీనివాసరావుపై లాఠీ విసిరారు. దీంతో ముఖంపై గాయమై రక్తస్రావం అయింది. వెంటనే ఊర్లోకి గాయంతో వచ్చిన శ్రీనివాసరావును చూసి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు నాగిరెడ్డిపాలెం ప్రధాన రహదారిపై నిరసనకు దిగారు. రెండు గంటలపాటు రోడ్డుపై బైఠాయించారు. దీంతో విషయం తెలుసుకున్న క్రోసూరు, సత్తెనపల్లి సీఐలు ప్రత్తిపాటి సురేష్, కిరణ్‌లు నాగిరెడ్డిపాలెం వచ్చి బాధితుడికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. కాగా దాడి చేసిన కానిస్టేబుల్ రావాలని, కొట్టడానికి గల కారణం చెప్పాలని బాధితుడి కుటుంబ సభ్యులు భీష్ముంచుకుని కూర్చున్నారు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయని, పోలీస్ స్టేషన్లో మాట్లాడదామని సీఐలు సర్ది చెప్పారు. దీంతో బాధితుడు కుటుంబ సభ్యులు, గ్రామస్తులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. దాదాపుగా గంటపాటు వారితో పోలీసులు మంతనాలు సాగించారు. అనంతరం బాధితుడిని వైద్యశాలకు పంపారు. కాగా ఘటనపై పెదకూరపాడు సీఐ సురేష్‌ని వివరణ కోరగా కానిస్టేబుళ్లు ఎవరిపై దాడి చేయలేదని, బైక్ ఆపమని చెప్పగా, శ్రీనివాసరావు ఆపకుండా వేగంగా వెళ్లిపోయినట్లు పేర్కొన్నారు. బాధితుడిని, సిబ్బందిని విచారించి పూర్తి వివరాలు వెల్లడిస్తామని సీఐ తెలిపారు. తనిఖీలలో బైక్ ఆపలేదనే కోపంతో నాగిరెడ్డిపాలెం మాజీ సర్పంచ్‌పై లాఠీ విసిరేసిన కానిస్టేబుల్ బాధితుడి తలకు గాయమై తీవ్ర రక్తస్రావం దాడికి నిరసనగా రహదారిపై బాధితుడి కుటుంబ సభ్యుల బైఠాయింపు -
ఇద్దరు చైన్ స్నాచర్స్ అరెస్టు
సత్తెనపల్లి: చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ఇరువురుని పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణ పోలీస్ స్టేషన్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో డీఎస్పీ మేదరమెట్ల హనుమంతరావు వివరాలను వెల్లడించారు. చైన్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల్లో ఇద్దరిని పట్టణ పోలీసులు అరెస్టు చేశారన్నారు. పార్కు రోడ్లో ఒంటరిగా ఉన్న ఓ వృద్ధ మహిళను కొట్టి గాయపరిచి ఆమె మెడలో రూ.3.42 లక్షలు విలువ చేసే 36.3 గ్రాముల బంగారు గొలుసు అపహరించి రెండు వేర్వేరు ప్రాంతాల్లో విక్రయించడం జరిగిందన్నారు. పలు సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా చైన్‌స్నాచింగ్ చేసే దొంగలను పట్టుకున్నామన్నారు. వారి వద్ద నుంచి పూర్తి బంగారం రికవరీ చేశామని, రెండు మొబైల్ ఫోన్లు, హీరో ఫ్యాషన్ ప్లస్ బైక్ స్వాధీన పరుచుకున్నామన్నారు. ఇరువురిని కోర్టుకు హజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారన్నారు. మరొకడిని పట్టుకోవాల్సి ఉందన్నారు. ఈ కేసులో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి త్వరితగతిన కేసు ఛేదించిన పట్టణ సీఐ ఎన్. నాగమల్లేశ్వరరావు, పట్టణ ఎస్ఐ పవన్‌కుమార్, ఇతర పోలీస్ సిబ్బందిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. వారికి ఈ నెల 15న జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో అవార్డు లు అందించటం జరుగుతుందన్నారు. సమావేశంలో పట్టణ సీఐ ఎన్. నాగమల్లేశ్వర రావు, పట్టణ ఎస్ఐ పవన్‌కుమార్, సిబ్బంది ఉన్నారు. -
కృష్ణా జిల్లాలో నరసరావుపేట యువకుడు మృతి
నిడమానూరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం నరసరావుపేట టౌన్: నరసరావుపేట యువకుడు కృష్ణా జిల్లాలోని జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడ్డాడు. ఇస్లాంపేటకు చెందిన షేక్ మహ్మద్ హరీస్(25) ఏలూరులోని స్టేట్ బ్యాంక్ క్రెడిట్ కార్డు విభాగంలో ఉద్యోగం చేస్తున్నాడు. ద్విచక్ర వాహనంపై ఏలూరు నుంచి విజయవాడ బయలుదేరాడు. మార్గమధ్యంలోని నిడమానూరు జాతీయ రహదారిపై గుర్తు తెలియనివాహనం ఢీకొంది. సంఘటనలో అక్కడికక్కడే మృతి చెందాడు. హరీస్ తండ్రి దరియావలి ఇస్లాంపేటలో రేషన్ డీలర్‌గా వ్యవహరిస్తుంటాడు. చేతికి అందివచ్చిన ఒక్కగానొక్క కుమారుడు చనిపోవటంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కుటుంబ కలహాల నేపథ్యంలో వ్యక్తి బలవన్మరణం చిలకలూరిపేట టౌన్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలో జరిగింది. నాదెండ్ల మండలం గణపవరం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ ప్రత్తిపాటి రమేష్(33) కొంత కాలంగా చిలకలూరిపేట పట్టణంలోని ఆదిఆంధ్రా కాలనీలో ఉంటున్నారు. రమేష్ భార్యను మద్యం నిమిత్తం డబ్బులు ఇవ్వాలంటూ కోరాడు. అయితే అందుకు ఆమె నిరాకరించడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత భర్తకు టిఫిన్ తీసుకువచ్చేందుకు భార్య రాహేలు బయటకు వెళ్లి తిరిగి రాగా తలుపు వేసి ఉండటంతో తెరిచి చూడగా భర్త సీలింగ్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించాడు. వెంటనే పట్టణంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. దీంతో పోలీసులు అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్నారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నేడు మంగళగిరిలో కేవీపీఎస్ జిల్లా మహాసభ మంగళగిరి టౌన్: కేవీపీఎస్ గుంటూరు జిల్లా ఆరవ మహాసభ ఆదివారం సాయంత్రం మూడు గంటలకు మంగళగిరి పట్టణంలోని టిప్పర్ల బజారులోని కార్యాలయంలో జరుగుతుందని పట్టణ కార్యదర్శి వై. కమలాకర్ శనివారం తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు...సామాజిక న్యాయం అంశంపై సదస్సు కూడా జరుగుతుందని తెలిపారు. ప్రధాన ఉపన్యాసకులుగా డి.ఎస్.ఎం.ఎం. జాతీయ కార్యదర్శి వి.శ్రీనివాసరావు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి సామ్యేల్ ఆనందకుమార్, కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి వై. నేతాజీ, కేవీపీఎస్ జిల్లా నాయకులు బి. వెంకటేశ్వర్లు పాల్గొని ప్రసంగిస్తారని కమలాకర్ తెలిపారు. -
ఘనంగా ఆదివాసీ దినోత్సవం
నరసరావుపేట రూరల్: గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వాలు చేపడుతున్న పథకాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు తెలిపారు. జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గుర్రం జాషువా సమావేశ మందిరంలో శనివారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా పట్టణంలోని రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు, అధికారులు పాల్గొన్నారు. సంఘ నాయకులు మాట్లాడుతూ గిరిజన భవన్ నిర్మాంచాలని కోరారు. గిరిజనులకు అధార్‌కార్డు, ఇళ్ల స్థలాలు ఇప్పించాలని కోరారు. జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు మాట్లాడుతూ గిరిజన భవన్ నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. గిరిజనులకు ఆధార్‌కార్డులు, ఇళ్ల స్థలాలు మంజూరుకు చర్యలు తీసుకోవాలని గిరిజన సంక్షేమ అధికారిని ఆదేశించారు. భారత ప్రభుత్వం పీఎం జన్ మన్ పథకంలో తొమ్మిది ప్రభుత్వ శాఖల సహకారంతో 11 స్కీమ్‌ల ద్వారా గిరిజనుల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. ఈ పథకం ద్వారా చెంచుగూడెంలో అర్హులైన వారికి ఇళ్లు కట్టించడం, రోడ్లు వేయడం, తాగునీటి వసతి కల్పిచండం, అంగన్వాడీ సెంటర్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. అనంతరం 2024–25 విద్యా సంవత్సరం 10వ తరగతిలో 550మార్కులు పైగా సాధించిన గిరిజన విద్యార్థులు బి.సాయితేజనాయక్, కె.సంపత్నాయక్లకు రూ.5వేల నగదు ప్రోత్సాహకాన్ని జిల్లా కలెక్టర్ అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి జోస్న, గిరిజన సంఘం నాయకులు కోటా నాయక్, పాండునాయక్, విష్ణునాయక్, మేడా పోతురాజు, శ్రీరావుల కొండలు, కె.దాసు తదితరులు పాల్గొన్నారు. -
బహుముఖ ప్రజ్ఞాశాలి వెంకటనర్సిరెడ్డి
నరసరావుపేట ఈస్ట్: రాజకీయ, సాహిత్య, గ్రంథాలయ రంగాలలో విశిష్ట సేవలు అందించిన యన్నం వెంకటనర్సిరెడ్డి బహుముఖ ప్రజ్ఞాశాలి అని పలువురు వక్తలు కొనియాడారు. మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో శనివారం వెంకటనర్సిరెడ్డి సహస్ర చంద్రదర్శన మహోత్సవాన్ని నిర్వహించి అభినందన సంచికను విడుదల చేసారు. సంచికను కాసు కుటుంబ సభ్యులు డాక్టర్ కాసు ప్రసాదరెడ్డి, కాసు వెంకట రాజగోపాలరెడ్డి ఆవిష్కరించారు. అభినందన సభలో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కాసు మహేష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్.లక్ష్మణరావు, సాహితీవేత్తలు డాక్టర్ అక్కిరాజు సుందరరామకృష్ణ, మాశర్మ తదితరులు మాట్లాడుతూ, ఆయా రంగాలలో నర్సిరెడ్డి చేసిన కృషిని వివరించారు. గ్రంథాలయ ఉద్యమకారుడు అయ్యంకి వెంకట రమణయ్యతో కలసి గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేశారని తెలిపారు. గుంటూరు నగరం నడిబొడ్డున కేంద్ర గ్రంథాలయ భవన నిర్మాణం నర్సిరెడ్డి గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా చేపట్టారని వివరించారు. ఎందరో సాహితీవేత్తలు, రాజకీయ నాయకులు, విద్యావేత్తలతో అనుబంధం కలిగి ఉన్నారని తెలిపారు. ఉప్పలపాడు గ్రామ సర్పంచ్‌గా మూడున్నద దశాబ్దాలు పనిచేసి ప్రజల అభిమానాన్ని చూరగొన్నారని తెలిపారు. అలాగే జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా, టుబాకో బోర్డు సభ్యునిగా, పీసీసీ సభ్యునిగా సేవలు అందించారని వివరించారు. -
ప్రజలకు అందుబాటులో ఆలూరి బైరాగి సమగ్ర సాహిత్యం
తెనాలి: మహాకవి ఆలూరి బైరాగి సాహిత్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవడమే ఆయనకిచ్చే నిజమైన నివాళిగా మాజీ ఎంపీ, విశ్వహిందీ పరిషత్ జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అన్నారు. బైరాగి సాహిత్యాన్ని సమగ్ర సంకలనం తెస్తామని చెబుతూ, బైరాగి రచనలన్నింటినీ అంతర్జాలంలో చేర్చే బాధ్యతను తీసుకోవాలని తెనాలి రచయిత ముత్తేవి రవీంధ్రనాథ్ను కోరారు. హిందీ, తెలుగు సాహిత్య ధృవతార ఆలూరి బైరాగి శతజయంతి సందర్భంగా కమిటీ ఆధ్వర్యంలో బైరాగి కాంస్య విగ్రహాన్ని ఆయన స్వస్థలమైన తెనాలి అయితానగర్‌లో ఏర్పాటు చేశారు. మాజీమంత్రి, ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్ శనివారం ఆ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహదాత ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ తానీరోజున ఈ స్థాయిలో ఉండటానికి కారణం బైరాగి అన్నారు. ఆయన రాసే కవిత్వం కోసం జనం అప్పట్లో ఎదురు చూశారని సోదాహరణంగా చెప్పారు. తెలుగు స్వతంత్ర పత్రిక ప్రతి సంచిక మొదటి పేజీలో బైరాగి కవితతోనే వచ్చిందన్నారు. తెలుగులో ఎంతగొప్ప కవిత్వాన్ని సృజించారో, హిందీలోనూ అంతే గొప్పగా కవిత్వం రచించిన ఏకై క కవి బైరాగిగా చెప్పారు. బైరాగి శత జయంతి సందర్భంగా సదస్సులు నిర్వహించి ఆయన్ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తన ప్రసంగంలో బైరాగి తెనాలిలో జన్మించడం గర్వకారణమన్నారు. ‘అరసం’జాతీయ అధ్యక్షుడు పెనుగొండ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెనాలి ప్రాంతం వివిధ సాంస్కృతిక, సామాజిక ఉద్యమాలకు కేంద్రమని చెప్పారు. ప్రపంచంలో ఇంత చిన్న పట్టణంలో వేలాది రచయితలు, కవులు, కళాకారులు ఉండటం అరుదైన అంశమన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత బండ్ల మాధవరావు తన ప్రసంగంలో బైరాగి స్మారకంగా ఆయన సాహిత్యాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని సూచించారు. కృష్ణాజిల్లా రచయితల సంఘం ఇస్తున్న ఆలూరి బైరాగి అవార్డును ఇటీవల తనకు ప్రదానం చేయటం అదృష్టమన్నారు. మరో ప్రముఖ రచయిత వెన్నా వల్లభారావు మాట్లాడుతూ దివంగత ప్రధాని వాజ్‌పేయి, ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్రమోడీ సహా బైరాగి కవిత్వం విని, మెచ్చుకున్నవారేనని చెప్పారు. మాజీ మంత్రి నన్నపనేని రాజకుమారి, ప్రముఖ రచయిత మత్తేవి రవీంధ్రనాథ్, గోళ్ల నారాయణరావు, ప్రజాసాహితి ప్రధాన సంపాదకుడు కొత్తపల్లి రవిబాబు, డీఎల్ కాంతారావు, ఈదర శ్రీనివాసరావు, కనపర్తి బెన్హర్, రైతునేత ఈదర పూర్ణచంద్, గుత్తా వెంకటరత్నం, నల్లూరి వెంకటేశ్వరరావు, తాడిబోయిన హరిప్రసాద్ పాల్గొన్నారు. ఆలూరి బైరాగి శత జయంతి కమిటీ అధ్యక్షుడు ఈదర వెంకట పూర్ణచంద్, ప్రధాన కార్యదర్శి చెరుకుమల్లి సింగారావు పర్యవేక్షించారు. అప్పుడే ఆ మహాకవికి నిజమైన నివాళి విగ్రహావిష్కరణలో ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ -
ఆర్వోబీ నిర్మాణంలోహైకోర్టు ఆదేశాల ఉల్లంఘన
గుంటూరు ఎడ్యుకేషన్: నగరంలోని శంకర్ విలాస్ ఫ్లయ్ ఓవర్ నిర్మాణానికి సంబంధించిన కేసు హైకోర్టులో విచారణలో ఉండగానే కూల్చివేత పనులు ప్రారంభించిన అధికార యంత్రాంగం కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తోందని బెటర్ శంకర్‌విలాస్ ఫ్లయ్ ఓవర్ సంయుక్త కార్యాచరణ సమితి (జేఏసీ) కన్వీనర్ ఎల్ఎస్ భారవి అన్నారు. శనివారం అరండల్‌పేటలోని ఓ హోటల్లో జరిగిన మీడియా సమావేశంలో భారవి మాట్లాడుతూ.. పనుల్లో నగరపాలక సంస్థ, ఆర్ అండ్ బీ అధికారులు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. సేతు బంధన్ ప్రాజెక్టు కింద బ్రిడ్జి నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసిన కేంద్రం విధించిన నిబంధనలను పాటించకుండా, ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గాలను చూపకుండా కూల్చివేత పనులు చేపట్టారని అన్నారు. ప్రజా రవాణాకు ఇబ్బందులు లేకుండా ఇరువైపులా 12 అడుగులతో కూడిన రోడ్లను అందుబాటులోకి తీసుకువస్తామని హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన అధికారులు కోర్టును సైతం తప్పుదారి పట్టించారన్నారు. హైకోర్టు స్టే ఎత్తివేసిందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అరండల్‌పేట, బ్రాడీపేటలను కలుపుతూ మార్గాలను ఏర్పాటు చేయాలని చెప్పినా పట్టించుకోవడం లేదన్నారు. ముందుగానే రైల్వేగేటు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నియమించిన కన్సల్టెన్సీ చేసిన సూచనలు బుట్టదాఖలు చేశారన్నారు. జేఏఈ కో–కన్వీనర్ ఎన్వీ కమల్‌కాంత్ మాట్లాడుతూ ఈ నెల 20న న్యాయస్థానం విచారణ జరిపి, తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో పనులు ప్రారంభించేశారని చెప్పారు. సమావేశంలో జేఏసీ ప్రతినిధి వల్లూరి సదాశివరావు, అరండల్‌పేట, బ్రాడీపేట షాప్ ఓనర్ల అసోసియేషన్ అధ్యక్షుడు బెల్లంకొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
అతివేగం, నిర్లక్ష్యం వల్లే...
రోడ్డు ప్రమాదాల నివారణకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ప్రమాదాలు జరుగుతున్న ప్రదేశాలు, సమయం, కారణాలు, తీసుకోవాల్సిన చర్యలపై శాసీ్త్రయంగా అధ్యయనం చేసి, చర్యలు చేపడుతున్నాం. అతివేగం, మద్యం సేవించడం, జంక్షన్ల వద్ద రోడ్డు క్రాస్ చేస్తున్న సమయంలో ప్రమాదాలు అధికంగా సంభవిస్తున్నాయి. అటువంటి చోట్ల సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం. మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా, వారికి ప్రమాదాల గురించి స్పష్టమైన అవగాహన కల్పించాలి. – కంచి శ్రీనివాసరావు, జిల్లా ఎస్పీ, పల్నాడు -
బిహార్‌లో ఎస్ఐఆర్ను వ్యతిరేకించండి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): కేంద్ర ఎన్నికల సంఘం అప్రజాస్వామికంగా బిహార్‌లో నిర్వహిస్తున్న ఎస్.ఐ.ఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)ను ప్రజాస్వామికవాదులు అంతా వ్యతిరేకించాలని, ఇది కేవలం బిహార్ రాష్ట్రానికే పరిమితం కాదని, దేశవ్యాప్తంగా ఈ ప్రక్రియను నిర్వహించి బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసే వారిని ఓటర్ల జాబితా నుంచి తొలగించే కుట్రలో భాగమని శాసన మండలి మాజీ సభ్యులు కె.ఎస్.లక్ష్మణరావు అన్నారు. గుంటూరు అంబేద్కర్ సెంటర్ (లాడ్జి సెంటర్)లో కేంద్ర ఎన్నికల సంఘం బిహార్‌లో నిర్వహిస్తున్న ఎస్.ఐ.ఆర్కు వ్యతిరేకంగా సీపీఐ(యం) ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ 2024 ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గెలవకపోవటంతో బిహార్ రాష్ట్రంలో ఎలాగైనా తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని అక్రమ పద్ధతులకు ఒడికట్టిందని విమర్శించారు. ఓటర్లు నమోదు చేసుకునేందుకు ఆధార్ కార్డు, రేషన్‌కార్డు, ఓటరు కార్డులు గుర్తింపు కార్డులుగా చూపించవచ్చని, కానీ బిహార్‌లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియలో ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు తాత, ముత్తాతల నాటి గుర్తింపు కావాలని ఎన్నికల సంఘం చెపుతుందని, ఇది రాజ్యాంగ విరుద్ధమన్నారు. స్వతంత్రంగా వ్యవహరిచాల్సిన కేంద్ర ఎన్నికల సంఘాన్ని పావుగా వాడుకొని అప్రజాస్వామిక పద్ధతుల్లో ప్రధానంగా వలస కార్మికులు, మైనార్టీల సుమారు 70 లక్షల ఓట్లు తొలగించారన్నారు. ఇది కేవలం ఒక్క బిహార్ రాష్ట్రానికే పరిమితం కాదని, దేశం మొత్తం ఈ పద్ధతిని అనుసరిస్తారని, దీనిని ప్రజాస్వామికవాదులు, ప్రజలు వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. పార్టీ నగర కార్యదర్శి కె. నళినీకాంత్, ప్రత్యేక హోదా సాధనా సమితి నాయకులు అవధానుల హరి, సీనియర్ నాయకులు నాగేశ్వరరావు, వ్యవసాయ శాస్త్రవేత్త, ప్రొఫెసర్ ఎన్. వేణుగోపాలరావు, రేట్ పేయర్స్ అసోసియేషన్ నాయకులు సదాశివరావు, సీపీఎం జిల్లా, నగర కమిటీ సభ్యులు తదితరులు పాల్గొని ప్రసంగించారు. మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు గుంటూరులో నిరసన -
ఇన్చార్జి నియామకంపై జాప్యం
గుంటూరు మెడికల్: వైద్య ఆరోగ్య శాఖలో మూడు జిల్లాల ఉద్యోగులకు కీలకమైన అధికారి పోస్టు ఖాళీగా ఉండటంతో ఫోకల్ జోన్‌గా ఉన్న గుంటూరు కార్యాలయం చుట్టూ ఉద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులకు పదోన్నతులు, బదిలీలు, సెలవులు మంజూరు, ఇతర ఉద్యోగ కార్యకలాపాల బాధ్యతలన్నీ గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని మెడికల్ అండ్ హెల్త్ రీజనల్ డైరెక్టర్ (ఆర్డీ) పర్యవేక్షిస్తారు. ఆర్డీ సంతకం లేకుండా ఉమ్మడి మూడు జిల్లాల ఉద్యోగుల ఫైల్స్ ఒక అంగుళం కూడా ముందుకు వెళ్లవు. అలాంటి కీలక రీజనల్ డైరెక్టర్‌ను గతనెల ప్రభుత్వానికి సరెండర్ చేశారు. ఆ స్థానంలో నూతనంగా ఎవరిని నియమించలేదు. కనీసం ఇన్చార్జి బాధ్యతలు కూడా అప్పగించలేదు. దీంతో ఎవరు వస్తారు, ఎప్పుడు వస్తారనే విషయం తెలియక మూడు జిల్లాలకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగులు ప్రదక్షిణలు చేస్తున్నారు. కొంత మంది ప్రమోషన్లు, మరికొంత మంది సెలవు మంజూరు జాప్యం అవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరచుగా సెలవులు... ఫైల్స్ పెండింగ్ గుంటూరు ఆర్డీగా డాక్టర్ కె.సుచిత్ర గత ఏడాది ఆగస్టులో బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి అనారోగ్య కారణంతో తరచూ సెలవులు పెట్టేవారు. నెలల తరబడి సెలవులు పెట్టడం, ఒక్కోసారి కార్యాలయానికి వచ్చినప్పటికీ అనారోగ్య కారణంతో ఫైల్స్‌పై సంతకాలు పెట్టకుండా కూర్చుండిపోవడం వల్ల మూడు జిల్లాలకు చెందిన ఉద్యోగులు తమ ఫైల్స్ పెండింగ్ ఉంటున్నాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టు ఫైల్స్‌కు సంబంధించి కూడా సంతకాలు చేయడంలో జాప్యం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆర్డీ కార్యాలయం ఉద్యోగులు, అధికారులు, అందరూ మూకుమ్మడిగా రాష్ట్ర ఉన్నతాధికారులకు ఆర్డీని మార్చాలని లిఖిత పూర్వకంగా కోరారు. తరచూ తమపై దాడి చేసిందంటూ ఉద్యోగులు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆర్డీ కూడా తనకు కార్యాలయంలో ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని, ఉద్యోగులు తనపై దాడి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. గత నెలలో రెండు వారాల పాటు సెలవు పెట్టిన ఆర్డీని రాష్ట్ర ఉన్నతాధికారులు సరెండర్ చేశారు. దీంతో ఈ నెల 1 నుంచి ఆర్డీ కార్యాలయంలో ఫైల్స్‌పై సంతకాల కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. 2,500 మందికి పైగా ఉద్యోగులు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఆర్డీ కార్యాలయం పరిధిలో 2,500 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. స్టాఫ్ నర్సులు, హెడ్‌నర్సులు, గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్లు, మల్టీపర్పస్ హెల్త్ సూపర్వైజర్లు, ఎంపీహెచ్ఈఓలు, సీహెచ్‌ఓలు, రేడియోగ్రాఫర్లు, ఫార్మాశిస్టులు, ల్యాబ్ టెక్నీషియన్లు, సీనియర్ అసిస్టెంట్లు, ఆఫీస్ సూపరింటెండెంట్లు, ఇలా పలు కేడర్లకు చెందిన పారా మెడికల్, మినిస్టీరియల్ ఉద్యోగులు ఆర్డీ కార్యాలయం పరిధిలో ఉన్నారు. వీరిలో 25 కేడర్లకు చెందిన ఉద్యోగుల పదోన్నతులకు సంబంధించిన ఫైల్స్ పెండింగ్‌లో ఉన్నాయి. పలువురు ఉద్యోగులకు వ్యక్తిగత, మెడికల్ సెలవులు, ఇంక్రిమెంట్లు, ఇతర అలవెన్సులకు సంబంధించిన ఫైల్స్ వందకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. కోర్టు ఫైల్స్ది అదే పరిస్థితి. ఆర్డీ కోసం ఎదురు చూపులు వైద్య ఆరోగ్య శాఖ రీజనల్ డైరెక్టర్ పోస్టు ఖాళీ ఆర్డీని ప్రభుత్వానికి సరెండర్ చేసిన అధికారులు కొత్త ఆర్డీని నియమించకపోవడంతో కష్టాలు ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల వైద్య ఉద్యోగుల ఎదురు చూపులు గతంలో రెగ్యులర్ ఆర్డీ దీర్ఘకాలిక సెలవులో వెళ్లినా, పదవీ విరమణ చేసినా, బదిలీ అయినా, మరో రెగ్యులర్ ఆర్డీ విధుల్లో చేరే వరకు తాత్కాలికంగా వేరొకరిని నియమించేవారు,. తాత్కాలిక, ఆర్డీని ఎఫ్ఏసీ హోదాలో నియమించేందుకు ఏమైనా ఆటంకాలు ఏర్పడితే ఆర్డీ పోస్టు ఖాళీగా ఉండకుండా, కనీసం గుంటూరు డీఎంహెచ్ఓను ఇన్చార్జి ఆర్డీగా నియమించి, ఆర్డీ కార్యాలయం కార్యకలాపాలు సజావుగా జరిగేలా ఉన్నతాధికారులు చర్యలు తీసుకునేవారు. నేడు వీటిల్లో ఏ ఒక్కటి జరగకపోవడం, కనీసం ఆర్డీ కార్యాలయానికి అధికారిని కూడా నియమించకపోవడంతో ఉద్యోగులకు ఎదురు చూపులు తప్పడం లేదు. రాష్ట్ర ఉన్నతాధికారులు ఇప్పటికై నా స్పందించి ఇన్చార్జి ఆర్డీని నియమించి ఫైల్స్ పెండింగ్ లేకుండా చూడాలని పలువురు బాధితులు కోరుతున్నారు. -
బ్యాంకుల్లో పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలి
నరసరావుపేట రూరల్: బ్యాంకులు పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. బ్యాంకులు, ఆర్థిక సంస్థల భద్రతా ప్రమాణాలపై జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం బ్యాంకు మేనేజర్లు, సెక్యూరిటీ అధికారులతో జిల్లా ఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సీసీ టీవీ కెమెరాల వినియోగం, సెక్యూరిటీ గార్డుల పనితీరు, అలారం సిస్టమ్స్, డబుల్ లాక్ విధానం వంటి సాంకేతిక చర్యలతో పాటు అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన చర్యలపై ఆయన సూచనలు చేశారు. బ్యాంక్ ప్రాంగణంలో రాత్రి సమయాల్లో లైటింగ్ సౌకర్యం, సెక్యూరిటి గార్డుల పహారా, నగదు రవాణా సమయంలో జాగ్రత్తలపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో పోలీసుకంట్రోల్ రూమ్‌కు సమాచారం అందించాలని, ప్రజల భద్రత కోసం బ్యాంకు, పోలీసుల మధ్య సమన్వయం నిరంతరం కొనసాగాలని తెలిపారు. అలాగే జిల్లాలో పెరుగుతున్న సైబర్ నేరాలపై చర్చించారు. ఆన్లైన్ మోసాలు, ఫిషింగ్ కాల్స్, కృతిమ వెబ్సైట్ల ద్వారా జరుగుతున్న మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించడం అత్యవసరమని పేర్కొన్నారు. బ్యాంక్ ఖాతాదారుల డేటా భద్రత, అనుమానాస్పద లావాదేవీలను గుర్తించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. సైబర్ నేరాలకు సంబంధించి ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్ 1930 గురించి సోషల్ మీడియాలో ప్రచారం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) జేవీ సంతోష్, యూనియన్ బ్యాంక్ ఎల్డీఎమ్ కె.రాంప్రసాద్, ఎస్బీ సీఐ పి.శరత్‌బాబు, పలు బ్యాంకుల మేనేజర్లు, సెక్యూరిటి అధికారులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు బ్యాంకుల భద్రత, సైబర్ నేరాలపై సమావేశం -
ఇక సెలవు..!
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు నగరానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన శంకర్ విలాస్ ఆర్వోబీ ఇక చరిత్రగా మిగిలిపోనుంది. 70 ఏళ్ల పాటు ప్రజా రవాణాలో కీలకపాత్ర పోషించిన బ్రిడ్జి శాశ్వతంగా కనుమరుగు కానుంది. పెరుగుతున్న ప్రజా రవాణా అవసరాలకు అనుగుణంగా శంకర్‌విలాస్ ఆర్వోబీ స్థానంలో నాలుగు లైన్లతో నూతన ఆర్వోబీని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించిన ప్రభుత్వం గత రెండు నెలలుగా భారీ వాహనాలను దారి మళ్ళింపు చేసింది. లారీలు, బస్సులను శంకర్‌విలాస్ ఆర్వోబీపైకి వెళ్లకుండా ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లిస్తున్నారు. ఈ విధంగా గత నెల రోజులకు పైబడి బ్రిడ్జిపై బైక్‌లు, కార్లు, ఆటోలు మినహా ఇతర వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రెండు వైపులా పిల్లర్ల నిర్మాణాలు చేపట్టడంతో ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోల రాకపోకలు సాగిస్తుండగా, నిర్మాణ పనుల్లో భాగంగా శనివారం నుంచి అన్ని వాహనాల రాకపోకలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు జిల్లా కలెక్టర్, ఎస్పీ ప్రకటించారు. దీంతో ఇక శంకర్‌విలాస్ ఆర్వోబీ కనుమరుగు కానుంది. 70 ఏళ్ల పాటు సేవలందించిన మహా నిర్మాణం ఇక చరిత్రగా మిగిలిపోనుంది. గుంటూరుకు ప్రత్యేక గుర్తింపు గుంటూరు తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలకు అనుసంధానంగా ఉన్న శంకర్‌విలాస్ బ్రిడ్జి ఒక ప్రత్యేకత సంతరించుకుంది. గుంటూరు నగరంలో ముఖ్యమైన కూడలిగా మారడంతో పాటు 10 లక్షలకు పైగా జనాభా ఉన్న గుంటూరు నగరంలో ప్రతి ఒక్కరు రోజులో ఒక్కసారి కచ్చితంగా తలచుకునే అత్యంత కీలకమైన ప్రాంతంగా మారింది. విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగస్తులు, వ్యాపారుల నిత్య జీవితంలో అంతర్భాగమై సేవలు అందించిన శంకర్ విలాస్ నగర ప్రజల జీవితాల్లో ఒక భాగమైంది. శంకర్ విలాస్ ఆర్వోబీ చరిత్ర నగరానికి నడిబొడ్డున కోస్తా జిల్లాల ప్రజలందరికీ వైద్య సేవలు అందించేందుకు బ్రిటీషు పాలకులు 1848లో 11 ఎకరాల విస్తీర్ణంలో జీజీహెచ్‌ను నిర్మించారు. తరువాత కాలంలో దానికి అనుబంధంగా 1946లో ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రారంభమైంది. నిత్యం ప్రభుత్వ వైద్యశాలకు వెళ్లే ప్రజలు, ఇప్పటి బ్రిడ్జి స్థానంలో ఉన్న రైల్వే గేటు వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితి నెలకొనడంతో దీనిని గమనించిన స్వాతంత్య్ర సమరయోధుడు, నాటి మునిసిపల్ చైర్పర్సన్ నడింపల్లి నరసింహారావు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి 1958లో శంకర్ విలాస్ బ్రిడ్జి నిర్మించారు. తద్వారా ప్రజల ఇక్కట్లను తొలగించి, ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. -
యాసిడ్ లోడ్‌తో వెళ్తున్న ట్రక్ ఆటో బోల్తా
మహిళ దుర్మరణం హనుమాన్‌జంక్షన్ రూరల్: చైన్నె–కోల్‌కతా జాతీయ రహదారిపై హనుమాన్‌జంక్షన్ బైపాస్‌రోడ్డులో యాసిడ్ లోడుతో వెళ్తున్న ట్రక్ ఆటో బోల్తా కొట్టిన ఘటనలో ఓ మహిళ దుర్మరణం చెందింది. గుంటూరుకు చెందిన ఆటోడ్రైవర్ షేక్ అల్లాభక్షు శుక్రవారం యాసిడ్ లోడుతో ఏలూరు బయలుదేరాడు. తోడుగా ఉంటుందని తన భార్య షేక్ షంషాద్(47)ను వెంట తీసుకెళ్లాడు. హనుమాన్‌జంక్షన్ బైపాస్‌రోడ్డు వద్దకు రాగానే ట్రక్కు ఆటో ఒక్కసారిగా అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో డ్రైవర్ క్యాబిన్లో ఉన్న షంషాద్ రోడ్డుపైకి పడిపోయింది. ట్రక్కులో ఉన్న యాసిడ్ డ్రమ్ములు కిందకు ఒరిగి షంషాద్‌పై యాసిడ్ పడటంతో అక్కడికక్కడే మృతి చెందింది. అలాభక్షు కంటిలో యాసిడ్ పడటంతో పాటుగా శరీరంపై పలుచోట్ల గాయాలయ్యాయి. రహదారిపై యాసిడ్ పడి ప్రమాదకరంగా మారడంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న హనుమాన్‌జంక్షన్ ఫైర్ ఆఫీసర్ వి.అమరేశ్వరరావు సిబ్బందితో రహదారిపై పడిన యాసిడ్‌ను శుభ్రం చేయించారు. క్రేన్ సాయంతో ట్రక్కు ఆటోను రహదారిపై నుంచి పక్కకు తొలగించారు. ఘటనపై పెదపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆటోడ్రైవర్ షేక్ అల్లాభక్షును చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా, అక్కడి వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. షంషాద్ మృతదేహానికి ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. -
రాష్ట్రంలో బలహీనవర్గాలకు రక్షణ లేదు
వైఎస్సార్ సీపీ వడ్డెర విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు దేవళ్ల రేవతి దాచేపల్లి: కూటమి ప్రభుత్వం అండ చూసుకొని ఆ పార్టీ నేతలు చేస్తున్న భౌతిక దాడులు ప్రజాస్వామ్యాన్ని అవహేళన చేస్తున్నాయని, రాష్ట్రంలో లోకేష్ రెడ్ బుక్ పాలన అమలు చేస్తూ బలహీనవర్గాలను అణచివేస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వడ్డెర విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు, వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ దేవళ్ల రేవతి అన్నారు. బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆర్.రమేష్ యాదవ్‌పై జరిగిన దాడిని గురువారం ఆమె తీవ్రంగా ఖండించారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో కూటమి నేతలు నిలబెట్టిన అభ్యర్థి ఓడిపోతారని తెలిసే వైఎస్సార్ సీపీ అభ్యర్థి విజయాన్ని అడ్డుకునేందుకు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడికి తెగబడ్డారని చెప్పారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలను జరగనివ్వకుండా కూటమినేతలు దాడులకు తెగబడుతూ ప్రతిపక్ష పార్టీలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆమె ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై జరిగిన దాడిని తమ పార్టీ తీవ్రంగా పరిగణిస్తుందని, దీనిపై తమ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఉద్యమం చేపడతామని వెల్లడించారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేక కూటమి ప్రభుత్వం చేతులెత్తేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పై దాడులు చేస్తూ నీచమైన పాలన కొనసాగిస్తుందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో దాడులకు పాల్పడిన వారిపై జగన్ 2.0 లో చర్యలు తప్పక ఉంటాయని, కూటమి నేతల దాడులకు వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులు భయపడకుండా ధైర్యంగా ఎదురుకోవాలని, వచ్చేది మన ప్రభుత్వమేనన్నారు. -
ఉంగరం మింగిన ఐదు నెలల చిన్నారి
గొంతులో అడ్డుపడిన ఉంగరాన్ని బయటకు తీసిన వైద్యులు నరసరావుపేట రూరల్: వెండి ఉంగరాన్ని మింగి ఐదు నెలల పాప తీవ్ర అస్వస్థతకు గురవడంతో వైద్యులు సకాలంలో స్పందించి ఉంగరాన్ని బయటకు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. వివరాల్లోకి వెళితే.. ఫిరంగిపురం మండలం మునగపాడు గ్రామానికి చెందిన షేక్ సుభాని ఐదు నెలల కుమార్తె సిద్రహా చేతివేళ్లను నోటిలో పెట్టుకొని ఆడుకుంటున్న సమయంలో వేలికి ఉన్న వెండి ఉంగరం నోటిలోకి జారింది. కొంతసేపటికి చిన్నారి అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు సిద్రహాను హుటాహుటిన నరసరావుపేట శంకుతల జనరల్ గ్రాస్ట్రో లివర్కేర్ ఆసుపత్రికి తరలించారు. గొంతులో అడ్డుపడిన ఉంగరాన్ని డాక్టర్ ఐలా శ్రీనివాస్, సిబ్బంది ఎండోస్కోపి విధానంలో బయటకు తీశారు. సకాలంలో స్పందించి ఆసుపత్రికి తీసుకురావడంతో చిన్నారికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు తెలిపారు. -
ఘనంగా భూ వరాహ స్వామి జయంతి వేడుకలు
తాడేపల్లిరూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై భూ వరాహస్వామి జయంతి వేడుకలు రెండో రోజైన గురువారం వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళా శాసనాలతో భూ వరాహస్వామి జయంతి మహోత్సవాల్లో భాగంగా ఉదయం 10 గంటలకు కల్యాణ మహోత్సవం నిర్వహించామని తెలిపారు. వివాహ యోగ్యత, దాంపత్యాభివృద్ధి, మంచి సంతానం పొందుటకు ఈ కల్యాణ మహోత్సవం దోహదపడుతుందని తెలిపారు. కల్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు. పీజీ కోర్సుల ఫలితాలు విడుదల పెదకాకాని: ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రిల్ జరిగిన పలు పీజీ కోర్సుల 4వ సెమిస్టర్ ఫలితాలను సీఈ ఆలపాటి శివప్రసాదరావు గురువారం విడుదల చేశారు. సోషల్ వర్క్ 16కి 16మంది, ఎంఏ అప్లయిడ్ లింగ్వి ట్రానన్స్లేషన్ స్టడీస్‌లో 10కి 10మంది, మాస్టర్ ఆఫ్ ఒకేషనల్ ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్ కోర్సులో 21కి 18 మంది, మాస్టర్ ఆఫ్ ఒకేషనల్ హార్టీకల్చర్ అండ్ ల్యాండ్ స్కేపింగ్‌లో 16 మందికి 11మంది ఉత్తీర్ణత సాధించారు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తులను 18లోగా ఒక్కొక్క పేవరుకు రూ.1860, పర్సనల్ వెరిఫికేషన్‌కు రూ.2190 చెల్లించాలని ఆయన సూచించారు. 9,10 తేదీల్లో రాష్ట్ర స్థాయి జూడో పోటీలు గుంటూరు వెస్ట్(క్రీడలు): గుంటూరు జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 9, 10 తేదీల్లో రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాల బాలికల జూడో చాంపియన్‌షిప్ 2025–26 పోటీలు నిర్వహిస్తామని అసోసియేషన్ అధ్యక్షులు అప్పికట్ల శ్రీహరినాయుడు తెలిపారు. గురువారం స్థానిక జేకేసి కళాశాల రోడ్డులో పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను తాడికొండ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్‌కుమార్, శ్రీహరి నాయుడు, గుంటూరు జిల్లా జూడో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కిరణ్‌కుమార్‌రెడ్డి, పల్నాడు జూడో అసోసియేషన్ అధ్యక్షులు పసుపులేటి వెంకటేశ్వరరావులు ఆవిష్కరించారు. శ్రీహరి నాయుడు మాట్లాడుతూ పెదపరిమిలోని మువ్వా చిన్న బాపిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ప్రాంగణంలో నిర్వహిస్తామన్నారు. సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ నరసరావుపేటటౌన్: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 13వ తేదీ జాతీయ లోక్ అదాలత్ నిర్వహస్తున్నట్లు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.సత్యశ్రీ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అదాలత్‌లో రాజీ పడదగ్గ క్రిమినల్ కేసులతో పాటు సివిల్ కేసులు పరిష్కరించబడతాయన్నారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాలని కోరారు. వెలుగులోకి రేషను డీలర్ మోసం తాడికొండ: గురువారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘అధికారమే అండగా డీలర్ల దందా’ కథనంతో అధికారులు తర్జనభర్జన పడ్డారు. ఎట్టకేలకు నింద తమపై వేసుకోకుండా హడావుడిగా ఆర్డీవో జారీ చేసిన సిఫార్సు లేఖను వెలుగులోకి తీసుకొచ్చి చేతులు దులుపుకొనే ప్రయత్నం చేశారు. ఒకే డీలరుకు రెండో పాయింట్ కేటాయించేందుకు చెప్పిన కారణాలు చూసి సాటి డీలర్లే ముక్కున వేలేసుకుంటున్నారు. అర కిలోమీటరు లేని దూరానికి ఒకటిన్నర కిలోమీటరుగా చూపిస్తూ రెండో పాయింట్ ఏర్పాటుకు అనుమతులిచ్చారు. కాలనీకి కేవలం 200 మీటర్లలోపు దూరంలో ఉన్న డీలరును పాడుబడిన భవనంలోకి వెళితేనే సరుకు కేటాయిస్తామంటూ దబాయించి తరిమేయడం మరో అంశం. ఆ పాయింట్ ఏ ఇంటివద్ద నిర్వహించాలి అనే డోర్ నంబర్ లేదా ఇతర అడ్రస్సు ఏమీ పొందుపరచకపోవడం చూస్తుంటే సదరు డీలరుపై ఎంత ప్రేమో అర్థం అవుతోంది. -
జిల్లాలో సమృద్ధిగా ఎరువుల నిల్వలు
సత్తెనపల్లి: జిల్లాలో సమృద్ధిగా ఎరువుల నిల్వలు ఉన్నాయని రైతులెవ్వరూ ఆందోళన చెందాల్సిన పని లేదని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఎం.జగ్గారావు చెప్పారు. సత్తెనపల్లి సహాయ వ్యవసాయ సంచాలకుల కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు డీఏఓ మాట్లాడుతూ జిల్లాలో ఆగస్టు నాటికి యూరియా 18,596 టన్నులు అవసరం కాగా 33 వేల టన్నులు వచ్చిందన్నారు. దీనిలో ఇప్పటివరకు 11 వేల టన్నులు విక్రయించగా ఇంకా 22 వేల టన్నుల నిల్వలు ఉన్నాయన్నారు. డీఏపీ ఆగస్టు నాటికి 10,700 టన్నులు అవసరం కాగా 13 వేల టన్నుల డీఏపీ జిల్లాకు వచ్చిందన్నారు. దీనిలో ఇప్పటి వరకు 4 వేల టన్నులు విక్రయంచగా ఇంకా 9 వేల టన్నుల డీఏపీ నిల్వలు ఉన్నాయన్నారు. పట్టణంలోని ఎరువుల దుకాణాలు, సొసైటీలలో ఎరువుల నిల్వలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సత్తెనపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటుచేసిన నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రం నందు పొగాకు కొనుగోలు వివరాలు తెలుసుకున్నారు. డిజిటల్ క్రాప్ సర్వే వేగవంతం చేయాలి ఈ–పంట డిజిటల్ క్రాప్ సర్వే వేగవంతం చేయాలని, ఖరీఫ్ సీజన్లో ప్రస్తుతం సాగు చేసినటువంటి పంటలను ఈ–పంట నమోదు ద్వారా క్రాప్ నమోదు చేపట్టాలని డీఏఓ ఎం.జగ్గారావు అన్నారు. దీనికి సంబంధించి ఈ–క్రాప్ నిబంధనలో మార్పు జరిగిందన్నారు. గతంలో రూపొందించిన యూనిఫైడ్ డిజిటల్ ఫ్లాట్ ఫారం (యుడీపీ) యాప్‌ను రద్దుచేసి జాతీయ సమాచార కేంద్రం (ఎన్ఐసీ) ద్వారా ఈ– పంట డిజిటల్ క్రాప్ సర్వే పేరుతో కొత్త యాప్‌ను రూపొందించడం జరిగిందన్నారు. ఈ ఏడాది వరితో పాటు ఉద్యాన పంటలనూ నమోదు చేయాలన్నారు. ముందుగా వీఏఏలు, వీహెచ్‌ఏలు, ఎంపీఈఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయనతో పాటు సత్తెనపల్లి ఏడీఏ బోయపాటి రవిబాబు, ఏఓ బి.సుబ్బారెడ్డి, తదితరులు ఉన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జగ్గారావు -
బీసీలపై పథకం ప్రకారమే టీడీపీ దాడులు
నరసరావుపేట రూరల్: రాష్ట్రంలో బీసీలపై టీడీపీ శ్రేణులు పథకం ప్రకారమే దాడులు చేస్తున్నాయని వైఎస్సార్సీపీ జిల్లా బీసీ విభాగ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ విభాగ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై జరిగిన దాడిని వారు తీవ్రంగా ఖండించారు. కూటమి నాయకులు తీరు మార్చుకోకపోతే బీసీల తిరుగుబాటును చవిచూడాల్సి వస్తుందని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో గురువారం పార్టీ బీసీ విభాగం ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. బీసీలను రాజకీయంగా లొంగదీసుకోవాలి, లేదంటే అణచివేయాలనే కుట్రతో దాడులు చేస్తున్నారని నేతలు ఆరోపించారు. బీసీ మహిళలను సైతం వేధిస్తున్నారని, కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికపై దాడి ఇందుకు నిదర్శనమని తెలిపారు. మాజీ మంత్రి విడదల రజినిపై సైతం టీడీపీ నాయకులు ట్రోలింగ్ చేసి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించారని విమర్శించారు. మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్ తురకా కిషోర్‌పై అక్రమ కేసులు పెట్టి ఎనిమిది నెలలుగా వేధింపులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్, వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో భయానక వాతావరణం కల్పించి బూత్‌ల ఆక్రమణకు పాల్పడేందుకు టీడీపీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలే కారణమని తెలిపారు. వారిని హత్య చేసేందుకు దాడిలో పలువురు మారణాయుధాలతో పాల్గొన్నారని చెప్పారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాబోవు ఎన్నికల్లో బీసీల ప్రతాపాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగం బదులు రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలపై దాడులు తీవ్రంగా జరుగుతున్నాయని తెలిపారు. టీడీపీ బీసీలకు చేసేందేమిలేదన్నారు. అధికారం శాశ్వతం కాదని గుర్తుచేశారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో బీసీ విభాగ జిల్లా అధ్యక్షుడు సిడ్డారపు గాంధీ, వైఎస్సార్సీపీ మేధావుల విభాగం రాష్ట్ర కార్యదర్శి ఈఎం స్వామి, ఇంగ్గిష్ మీడియం విద్యా పరిరక్షణ వేదిక రాష్ట్ర కోఆర్టినేటర్ దాదినబోయిన ఏడుకొండలు, బీసీ విభాగ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజవరపు శివనాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ నరసరావుపేట వర్కింగ్ ప్రెసిడెంట్ అచ్చి శివకోటి, పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు ఆలా లక్ష్మీనారాయణ, బీసీ విభాగం నరసరావుపేట నియోజకవర్గ అధ్యక్షుడు మర్రిపూడి రాంబాబు, పిడుగురాళ్ల మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు శెట్టిపల్లి పూర్ణ, బీసీ సంఘ నాయకులు బాలు, చల్లా కాశీబాబు, అబ్దుల్ కలాం ఆశయ సాధన కమిటీ అద్యక్షుడు కాపర్తి మహమ్మద్నూర్లు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా బీసీ విభాగం నేతలు ఎమ్మెల్సీ రమేష్‌యాదవ్‌పై దాడికి ఖండన బీసీలను అణగదొక్కే దురుద్దేశంతోనే కూటమి ప్రభుత్వం కుట్రలని మండిపాటు -
ప్రకృతి వ్యవసాయంలో భాగస్వామ్యం కావాలి
నరసరావుపేట రూరల్: ప్రకృతి వ్యవసాయ విధానంలో రైతులందరూ పంటలు సాగు చేసే విధంగా వ్యవసాయ, ఉద్యాన అధికారులు భాగస్వామ్యంతో పనిచేయాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు తెలిపారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా కార్యాలయంలో గ్రామ సహాయ సంచాలకుల మూడవ రోజు శిక్షణా కార్యక్రమం గురువారం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు మాట్లాడుతూ వ్యవసాయ శాఖలో భాగమైన ప్రకృతి వ్యవసాయ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక స్థానం కల్పించిందన్నారు. రైతుల ఖర్చు తగ్గి ఆదాయం పొందే విధంగా రసాయనాలు వీడి కషాయాలు వాడే పద్ధతుల్లో పంటలను సాగు చేయాలని తెలిపారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ కె.అమలకుమారి మాట్లాడుతూ జిల్లాలోని అన్ని గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయ విధానాల్లో పంటలు సాగుచేసే విధంగా రైతులకు వ్యవసాయ సిబ్బంది, గ్రామ సహాయ సంచకులు కృషిచేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఏడీఏ శ్రీనివాసరావు, ఏఓ శాంతి తదితరులు పాల్గొన్నారు. వినుకొండలో సీపీఐ మహాసభలు ప్రారంభం వినుకొండ: వినుకొండలో సీపీఐ పల్నాడు జిల్లా మహాసభలు గురువారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు, నాయకులు తరలివచ్చారు. ఈ సభలకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావులతోపాటు పలువురు జిల్లా నాయకులు హాజరయ్యారు. నర్సరావుపేట నుంచి సీపీఐ నాయకులు, కార్యకర్తలు పౌరాణిక వేషధారణలో సభాస్థలికి వచ్చారు. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సెంటరు నుంచి నిర్వహించిన ర్యాలీలో వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
‘వారసత్వ చేనేత’ జాతీయ అవార్డు అందుకున్న మురళి
సత్తెనపల్లి: చేనేత ఇక్కత్ డిజైన్ కళ భవిష్యత్తు తరాలకు అందించాలని చేస్తున్న కృషికి పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన కర్నాటి మురళికి జాతీయ ఉత్తమ నేత వృత్తిదారుడి అవార్డు వరించింది. దేశవ్యాప్తంగా 19 మందికి అవార్డులు ప్రకటించగా.. రాష్ట్రం నుంచి మురళికి అరుదైన అవకాశం లభించింది. దేశ రాజధాని వేదికగా ఢిల్లీలోని భారత్ మండపంలో గురువారం జరిగిన జాతీయ చేనేత దినోత్సవంలో కేంద్ర జౌళిశాఖ మంత్రి గిరిరాజ్ సింగ్, మంత్రి పబిత్రా మార్గరిటా చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నేత వృత్తిదారుడి అవార్డును మురళి అందుకున్నారు. తండ్రి సాంబయ్య నుంచి చేనేత కళా నైపుణ్యాన్ని నేర్చుకున్న మురళి నాలుగున్నర దశాబ్దాలుగా చేనేత డిజైన్లపై పనిచేస్తున్నాడు. కేవలం ఆరో తరగతి వరకే చదువుకున్న ఆయన వారసత్వ చేనేత ప్రతిభ ఆధారంగా అమరావతిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ (ఎన్ఐడీ)లో ఇక్కత్ డిజైన్లపై శిక్షణ ఇస్తున్నాడు.కోర్టు తీర్పుపై ఉపాధ్యాయ నేతల హర్షంతాడేపల్లిరూరల్ : స్థానిక పోలీస్‌స్టేషన్ పరిధిలో 2019లో ఉపాధ్యాయులపై అప్పటి టీడీపీ ప్రభుత్వం ఉపాధ్యాయులపై నమోదైన కేసు తీర్పు గురువారం ఉపాధ్యాయులకు అనుకూలంగా రావడంతో హర్షం వ్యక్తం చేశారు. జనవరి 31, 2019 సంవత్సరంలో ఏపీసీపీ ఎస్‌ఇఏ ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ పిలుపు ఇచ్చారు. అప్పట్లో తాడేపల్లి పోలీసులు 17 మంది ఉపాధ్యాయులపై కేసు నమోదు చేశారు. ఆ కేసులో కర్నూలుకు చెందిన ఏడుగురు, విజయనగరానికి చెందిన ఆరుగురు, అనంతపురానికి చెందిన ముగ్గురుపై కేసు నమోదైంది. మంగళగిరి న్యాయస్థానం ఉపాధ్యాయులపై అప్పటి ప్రభుత్వం మోపిన కేసు కొట్టివేయడంతోఅధ్యక్ష కార్యదర్శులు బాజీ పఠాన్, కరీమ్ రాజేశ్వరరావు కోర్టు తీర్పుపట్ల హర్షం వ్యక్తం చేస్తూ న్యాయం గెలిచిందని అన్నారు. తమ న్యాయమైన కోర్కెల కోసం శాంతియుతంగా ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపడితే తాడేపల్లి పోలీసులు అక్రమంగా కేసులు నమోదు చేశారు. అప్పటి నుండి 17 మంది కోర్టు చుట్టూ తిరుగుతున్నారన్నారు. హర్షం వ్యక్తం చేసిన వారిలో సీబీ వెంకట రమణారెడ్డి (కర్నూలు), ప్రేమనాధ రెడ్డి (అనంతపురం), జె. రమేష్ (కర్నూలు) కులాయప్ప (అనంతపురం), అజయ్ (విజయనగరం) తవిడి నాయుడు (విజయనగరం), సత్యనారాయణ (గుంటూరు) ఉన్నారు. -
మాదక ద్రవ్యాల వినియోగం మానవ మనుగడకు ప్రమాదకరం
నరసరావుపేట రూరల్: మాదక ద్రవ్యాల వినియోగం మానవ మనుగడకు ప్రమాదకరమని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలన, శక్తి యాప్ వినియోగం, రోడ్డు భద్రత నియమాలుపై కళాశాలల ప్రతినిధులతో గురువారం అవగాహన కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఎస్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ యువతలో డ్రగ్స్ వినియోగం వలన కలిగే హానికర ప్రభావాలపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. దీనిపై నిర్వహించే అవగాహన కార్యక్రమాల్లో విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు భాగస్వాములు కావాలని కోరారు. కళాశాలలో విద్యార్థుల ప్రవర్తన, నడవడిక, చదువు తదితర అంశాలపై అధ్యాపకులపాటు తల్లిదండ్రులు అవగాహన కలిగి ఉండాలన్నారు. ప్రస్తుత సమాజంలో యువత చాలా తేలికగా మాదక ద్రవ్యాలకు అలవాటు పడుతుందని, వీరిలో 15 నుంచి 30 సంవత్సరాల వయస్సు వారు ఎక్కువుగా ఉంటున్నట్టు తెలిపారు. గంజాయి, డ్రగ్స్ వంటి వ్యసనాలకు అలవాటు పడి మానసిక నియంత్రణ కోల్పోయి, వ్యసనాలను తీర్చుకునేందుకు నేర ప్రవృత్తి వైపు మళ్లి నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. మాదక ద్రవ్యాలను నివరించేందుకు జిల్లా వ్యాప్తంగా 370 ఈగల్ క్లబ్స్ ఏర్పాటు చేశామని, తమ పరిసరాల్లో గంజాయి, మాదక ద్రవ్యాల వినియోగించినా, విక్రయించినా పోలీసులకు లేదా 1972 టోల్‌ఫ్రీ నెంబర్‌కు తెలియజేయాలని కోరారు. మహిళ భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం శక్తి యాప్‌ను తీసుకువచ్చినట్టు తెలిపారు. అత్యవసర సమయాల్లో మహిళలు శక్తి ఎస్‌వోఎస్ యాప్‌ను వినియోగించుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ఆగస్ట్ నెల మొత్తం ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. అనంతరం కళాశాల ప్రతినిధులతో కలిసి డ్రగ్స్ వద్దు బ్రో ప్లేకార్డులను ప్రదర్శించారు. కార్యక్రమంలో అడ్మిన్ ఎస్పీ జేవి సంతోష్, మహిళా పోలీస్‌స్టేషన్ డీఎస్పీ ఎం.వెంకటరమణ, జిల్లా డ్రగ్ కంట్రోల్ ఆఫీసర డి.సునీత, డీఏఈవో ఎం.నీలావతి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు -
రెడ్ బుక్ పాలనకు హైకోర్టు తీర్పు చెంపపెట్టు
బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ విభాగం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు పోలూరి వెంకటరెడ్డి పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): అక్రమ కేసుల విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు కూటమి రెడ్‌బుక్ పాలనకు అడుగులకు మడుగులు ఒత్తుతున్న పోలీసులకు ఒక చెంపపెట్టు లాంటిదని బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లీగల్ విభాగం రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు పోలూరి వెంకటరెడ్డి పేర్కొన్నారు. గుంటూరు అరండల్‌పేటలోని ఆయన కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో వెంకటరెడ్డి మాట్లాడారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు.. అనే దానికి తురకా కిషోర్ ఉదంతం ఒక ఉదాహరణ అని, ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా, పౌరహక్కులు నిలబెట్టేలా కిషోర్‌ను విడుదల చేయాలని హైకోర్టు తీర్పు ఇవ్వటం గొప్ప పరిణామం అన్నారు. పోలీసు వ్యవస్థ పొలిటికల్ బాస్‌ల చేతిలో కీలుబొమ్మల్లా మారిపోయిందని ధ్వజమెత్తారు. వాస్తవానికి తురకా కిషోర్‌ను 2022లో జరిగిన సంఘటనకు సంబంధించి అరెస్ట్ చేశాక, అనేక అక్రమ కేసులు బనాయించారన్నారు. కేవలం వైఎస్సార్ సీపీకి చెందిన వ్యక్తి అనే దురుద్దేశంతో 210 రోజులకుపైగా జైల్లో పెట్టారని మండిపడ్డారు. కిషోర్‌ను మానసికంగా, శారీరకంగా వేధించారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో హైకోర్టు ప్రజాస్వామ్యాన్ని, ప్రజల హక్కులను కాపాడాలనే ఉద్దేశంతో చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందని అన్నారు. సామాన్యుల హక్కులను కాలరాసే విధంగా అరాచక పాలన చేస్తున్న కూటమికి హైకోర్టు తీర్పు చెంప చెళ్లుమనిపించేలా ఉందన్నారు. అక్రమ అరెస్టులపై వైఎస్సార్ సీపీ లీగల్ విభాగం బాధితుల పక్షాల అన్ని విధాలుగా పోరాడుతోందని, బాధితులకు న్యాయం జరిగే వరకు వారికి అండగా ఉంటామన్నారు. జ్యుడిషీయల్ డిపార్ట్మెంట్కు సంబంధించి న్యాయమూర్తులు రిమాండ్ విధించేటప్పుడు రికార్డులు సరిగ్గా పరిశీలించటం లేదనే విషయాన్ని హైకోర్టు ఎత్తి చూపటం జరిగిందన్నారు. సుప్రీంకోర్టు, హైకోర్టు గైడ్‌లైన్స్ పాటించాలి.. ఇప్పటికై నా ఆయా న్యాయమూర్తులు కేసు పూర్వాపరాలను పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని, యాంత్రికంగా వ్యవహరించటం సరికాదన్నారు. సుప్రీం, హైకోర్టు గైడ్‌లైన్స్ పాటించాల్సిన బాధ్యత మెజిస్ట్రేట్లపై ఉందన్న విషయాన్ని తెలియజేస్తామన్నారు. ఏదో పోలీసులు తెచ్చారు.. రిమాండ్ విధిద్దాం.. అనే ధోరణిలో కాకుండా వాస్తవాలను పరిశీలించాలని విన్నవించారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు పూర్తిస్థాయిలో అండగా లీగల్ విభాగం ఉంటుందని, వారిని అన్ని విధాలుగా సహాయం అందజేస్తామన్నారు. తురకా కిషోర్‌పై ఇప్పటివరకు 18 అక్రమ కేసులు పెట్టారన్నారు. ఎల్లకాలం కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉండదన్న విషయాన్ని అధికారులు గుర్తించాలన్నారు. లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. -
భార్యను హతమార్చిన భర్త అరెస్ట్
నరసరావుపేటటౌన్: కుటుంబ వివాదాల నేపథ్యంలో భార్యను హతమార్చిన భర్తను అరెస్ట్ చేసినట్లు ఇన్చార్జి డీఎస్పీ వెంకటరమణ తెలిపారు. వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. ఈనెల 2వ తేదీ రాత్రి కంభంపాలెంకు చెందిన మృతురాలు మేరీ కనిపించటంలేదని ఆమె తల్లి కోటమ్మ ఇచ్చిన ఫిర్యాదుతో అదృశ్యం కేసు నమోదు చేశామన్నారు. విచారణలో భర్త జొన్నలగడ్డ రమేష్ ఆమెను ద్విచక్ర వాహనంపై తీసుకువెళ్లినట్లు సీసీ పుటేజ్ లభ్యమైందన్నారు. అతనిపై అనుమానంతో అదుపులోకి తీసుకొని విచారించగా, మేరీను అదే రోజు నకరికల్లు అటవీ ప్రాంతంలోకి తీసుకువెళ్లి హతమార్చినట్లు రమేష్ నేరాన్ని అంగీకరించాడన్నారు. అతను ఇచ్చిన సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకొని మేరీ మృతదేహాన్ని కనుగొన్నామన్నారు. సమావేశంలో సీఐ విజయ్ చరణ్, ఎస్ఐ అరుణ, సిబ్బంది పాల్గొన్నారు.కిడ్నాప్ చేశామంటూ.. నగదు స్వాహాఫోన్లో వృద్ధ దంపతులను బెదిరించి రూ.50వేలు కొట్టేసిన ఆంగతకులుచాగంటివారిపాలెం(ముప్పాళ్ళ): ‘మీ అబ్బాయి ఇక్కడ అమ్మాయిని ఇబ్బంది పెడుతుంటే అదుపులోకి తీసుకున్నాం... మీ వాడ్ని చంపేస్తాం... మీ అబ్బాయి మీకు కావాలంటే అర్జెంట్‌గా మాకు రూ.50వేలు పంపండి... లేకుంటే మీ అబ్బాయి మీకు దక్కడంటూ’ ఓ వ్యక్తి బెదిరింపు ఫోన్‌కాల్‌తో భయపెట్టి సొమ్ము కాజేసిన సంఘటన మండలంలోని చాగంటివారిపాలెం గ్రామంలో బుధవారం సాయంత్రం జరిగింది. సంఘటనకు సంబంధించి బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం చాగంటివారిపాలెంకు చెందిన అనుమాలశెట్టి శ్రీనివాసరావు కుమారుడు వెంకట బాలసతీష్ హైదరాబాద్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. తండ్రి శ్రీనివాసరావు గ్రామంలోనే చిల్లర దుకాణం నిర్వహిహించుకుంటూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం ఓ ఫోన్‌కాల్ రావటంతో శ్రీనివాసరావు బయటకు వెళ్లటంతో భార్య పద్మావతి ఫోన్‌లిఫ్ట్ చేసింది. ఫోన్లో అవతల వ్యక్తి హిందీ, ఇంగ్లిష్‌లో మాట్లాడుతూ మీ వాడ్ని కిడ్నాప్ చేశామని, అర్జంట్‌గా రూ.50వేలు ఫోన్‌పే చేయకపోతే చంపేస్తామంటూ ఏడుపులు, అరుపులు వినిపిస్తూ భయబ్రాంతులకు గురిచేసేలా మాట్లాడసాగాడు. ఆ సమయంలో వెంకట బాలసతీష్కు ఫోన్ చేయగా లిఫ్ట్ చేయకపోవటంతో తీవ్ర ఆందోళనకు గురైన శ్రీనివాసరావు దంపతులు వారు పంపిన నెంబర్‌కు రూ.50వేలు ఫోన్‌పే చేశారు. కొద్దిసేపటి తర్వాత వెంకట బాలసతీష్ తల్లిదండ్రులకు ఫోన్ చేయటంతో మోసపోయామని గ్రహించారు. వెంటనే వారు ఫోన్ చేసిన నెంబర్‌కు ఫోన్ చేయగా వారు హిందీలో సంభాషించారని శ్రీనివాసరావు దంపతులు తెలిపారు. వెంటనే శ్రీనివాసరావు ముప్పాళ్ళ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కాల్ చేసిన నెంబర్‌కు పోలీసులు ఫోన్ చేయగా వారితోను అదే రీతిలో మాట్లాడుతూ ఫోన్ స్విచ్ఛాప్ చేశారు. ఫోన్ పే చేసిన నెంబర్ ఆంధ్రప్రదేశ్‌కు చెందినదనే ప్రాథమికంగా గుర్తించారు. విషయాన్ని సైబర్‌క్రైమ్ దృష్టికి తీసుకెళ్లటంతో విచారణ చేపట్టినట్లు సమాచారం. -
జెడ్పీ హైస్కూల్‌ను దత్తత తీసుకున్న కలెక్టర్
నరసరావుపేట రూరల్: శంకరభారతీపురం జెడ్పీ హైస్కూల్‌ను జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు దత్తత తీసుకున్నారు. కలెక్టరేట్ సమీపంలోని లింగంగుంట్ల శంకరభారతీపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను గురువారం కలెక్టర్ అరుణ్‌బాబు సందర్శించారు. తరగతి గదుల్లోకి వెళ్లి ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థులు అభ్యాసన సామర్థ్యాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ పాఠశాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తానని, ప్రతి నెలా చదువులో వెనకబడిన విద్యార్థుల ప్రమాణాలను పరిశీలిస్తానని తెలిపారు. సిలబస్ పూర్తి చేయడం మీద కంటే విద్యార్థులకు పాఠాలు అర్ధమయ్యేలా బోధించడం ముఖ్యమని తెలిపారు. వారంలో రెండు సార్లు డిప్యూటి డీఈవో పాఠశాలను సందర్శించి బోధనా పద్ధతులను సమీక్ష చేయాలని ఆదేశించారు. -
తెనాలిలో విజిలెన్స్ అధికారుల దాడులు
తెనాలిటౌన్: అనుమతిలేని విత్తనాలను తెలంగాణ రాష్ట్రం నుంచి తెచ్చి తెనాలి ప్రాంతంలో అమ్మకాలు జరుపుతున్న ఎరువులు, విత్తనాల షాపులపై గురువారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మెరుపుదాడి చేసి భారీగా వరి విత్తనాలను సీజ్ చేశారు. స్థానిక నందులపేటలోని వినాయక ఎంటర్ ప్రైజెస్ దుకారణంలో జిల్లా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, వ్యవసాయాధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమతిలేని వరి విత్తనాలను తెలంగాణ నుంచి తెచ్చి అమ్ముతున్నట్లు గుర్తించారు. విత్తనాల నాణ్యతను పరీక్ష నిమిత్తం శాంపిల్స్ సేకరించి, ల్యాబ్ టెస్టింగ్‌కు పంపిచారు. డెల్టా ప్రాంతంలో ఎక్కువగా సాగు చేస్తున్న వరిలో మేలురకం విత్తనాలను రైతులకు అందివ్వాలన్న దృక్పథంతో వరుసగా తెనాలి పరిసర ప్రాంతంలో ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు చెప్పారు. రూ.5,85,300 విలువైన విత్తనాలు సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. దాడుల్లో విజిలెన్స్ అధికారి సీహెచ్.ఆదినారాయణ, ఇన్స్పెక్టర్లు కె.చంద్రశేఖర్, పి.శివాజీ, మండల వ్యవసాయాధికారి కె.సుధీర్‌బాబు, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. అనుమతి లేని వరి విత్తనాలు గుర్తింపు రూ.5,85,300 విలువైన విత్తనాలు సీజ్ చేసిన అధికారులు -
కళాశాలల్లో రెడ్ రిబ్బన్ క్లబ్‌లు ఏర్పాటు చేయాలి
జిల్లా ఎయిడ్స్ నియంత్రణాధికారి డాక్టర్ మురళీకృష్ణ నరసరావుపేట ఈస్ట్: జిల్లా పరిధిలో అన్ని యాజమాన్యాలలోని జూనియర్ కళాశాలల్లో రెడ్ రిబ్బన్ క్లబ్‌లను ఏర్పాటు చేయాలని జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ నియంత్రణాధికారి డాక్టర్ కె.మురళీకృష్ణ తెలిపారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ మండలి ఆదేశాల మేరకు ఆరోగ్యశాఖలో భాగమైన ఇంటిగ్రేటేడ్ స్ట్రాటజీ ఫర్ హెచ్ఐవి, ఎయిడ్స్ (దిశ) ఆధ్వర్యంలో గురువారం హార్డ్ జూనియర్ కళాశాలలో జిల్లా స్థాయి రెడ్ రిబ్బన్ క్విజ్ నిర్వహించారు. డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ కళాశాలల్లో రెడ్ రిబ్బన్ క్లబ్‌లు ఏర్పాటు చేయటం ద్వారా విద్యార్థులలో ఎయిడ్స్ అవగాహన పెరిగి నియంత్రణకు అవకాశం కలుగుతుందని తెలిపారు. జిల్లా ఇంటర్మీడియేట్ విద్యాశాఖాధికారి ఎం.నీలావతిదేవి మాట్లాడుతూ కళాశాలల్లో రెడ్ రిబ్బన్ క్లబ్‌లు ఏర్పాటుకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందాయని తెలిపారు. ఈమేరకు అన్ని ఇంటర్ కళాశాలల్లో క్లబ్‌ల ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు. కార్యక్రమంలో జిల్లా క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ జానీబాషా, హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ ప్రాజెక్ట్ మేనేజర్ ఉదయరాజు, సిఎస్సీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మహమ్మద్‌గౌస్ తదితరులు పాల్గొన్నారు. ఫ్లోర్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఓగిరాల నరసరావుపేట ఈస్ట్: ఆంధ్రప్రదేశ్ ఫ్లోర్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఓగిరాల వెంకట రాహుల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కే–రిడ్జి పాఠశాలలో గురువారం నిర్వహించిన రాష్ట్రస్థాయి ఫ్లోర్ బాల్ పోటీలలో భాగంగా అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి తనను అధ్యక్షుడిగా ఎన్నుకున్నట్టు ఈ సందర్భంగా వెంకటరాహుల్ తెలిపారు. రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్న ఫ్లోర్ బాల్ క్రీడాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. అసోసియేషన్‌ను మండల స్థాయి నుంచి ఏర్పాటు చేసి ఫ్లోర్ బాల్ పట్ల విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. అసోసియేషన్ అభివృద్ధికి నిధులు సమకూర్చేందుకు కృషి చేస్తానని తన వంతుగా రూ.1.10 లక్షలు అందివ్వటం జరిగిందని తెలిపారు. రణక్షేత్రంలో వీరాచారుల సందడి కారెంపూడి: పల్నాటి వీరాచారులు పల్నాటి రణక్షేత్రం కారెంపూడిలో గురువారం తమ పూర్వీకులైన పల్నాటి వీరులకు పీఠాధిపతి పిడుగు తరుణ్ చెన్నకేశవ ఆధ్వర్యంలో ప్రత్యేక క్రతువులు నిర్వహించారు. గుంటూరులోని గుజ్జనగుండ్లకు చెందిన సింగంశెట్టి వెంకటే ష్ కుంటుంబీకులతో పాటు వివిధ ప్రాంతాల నుంచి ఆచారవంతులు బస్సుల్లో తరలివచ్చారు. పల్నాటి వీరుల గుడి ఆవరణ నుంచి బ్రహ్మనాయుడు ఆయుధం నృసింహకుంతంతో పాటు పల్నాటి వీరుల ఆయుధాలకు వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. చెన్నకేశవస్వామి, అంకాలమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. -
నూరుశాతం అక్షరాస్యతే లక్ష్యం
నరసరావుపేట రూరల్: రాష్ట్రంలో నూరుశాతం అక్షరాస్యత సాధించే లక్ష్యంతో ఉల్లాస్–అక్షర ఆంధ్ర వయోజన అక్షరాస్యత కార్యక్రమాన్ని చేపట్టినట్టు వయోజన విద్యాశాఖ ఉప సంచాలకులు కె.ఆంజనేయులు తెలిపారు. ఉల్లాస్ వయోజన అక్షరాస్యత కార్యక్రమం రెండవ దశ ఉల్లాస్ అక్షర ఆంధ్ర కార్యక్రమంపై మండల స్ధాయి కమిటి సభ్యులకు ఒక్క రోజు శిక్షణా కార్యక్రమం మున్సిపల్ గెస్ట్ హౌస్‌లో గురువారం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఆంజనేయులు ప్రారంభించి మాట్లాడారు. అక్షరాస్యతలో మన రాష్ట్రం దేశంలోని ఇతర చిన్న రాష్ట్రాల కన్నా వెనుకబడి ఉందన్నారు. 2029 నాటికి నూరు శాతం అక్షరాస్యత సాధించాలనే లక్ష్యంతో ఇతర ప్రభుత్వ శాఖల సహకారంతో పనిచేస్తున్నట్టు తెలిపారు. డీఆర్డీఏ, మెప్మాలలోని స్వయం సహాయక బృందాల మహిళలు, ఉపాధి హామీ కూలీలలో చదువురాని వారిని గుర్తించి వారికి చదువు చెప్పేందుకు పదమందికి ఒక వలంటీర్‌ను నియమిస్తున్నట్టు తెలిపారు. వలంటీర్లకు మండల స్థాయి కమిటీలు వారి మండలాల్లో ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తారని తెలిపారు. అనంతరం టీచర్లు వారికి కేటాయించిన అభ్యాసకులకు క్రియాత్మక, ఆర్థిక, డిజిటల్ అక్షరాస్యతను అందించవలసి ఉంటుందని వివరించారు. బాపట్ల జిల్లా నోడల్ ఆఫీసర్ జి.మల్లికార్జన్, డ్వామా పీడీ సిద్ద లింగమూర్తి, రీసోర్స్ పర్సన్స్ కె.మనోరంజన్బాబు, రవి గోవర్ధన్, ఎంపీడీఓలు, ఎంఈఓలు, ఏపీఎంలు, ఏపీఓలు, మెప్మా సీఎంఎంలు పాల్గొన్నారు. -
9 నుంచి గుంటూరులో ట్రాఫిక్ మళ్లింపులు
శంకర్‌విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కూల్చివేత దృష్ట్యా నిర్ణయం నగరంపాలెం: గుంటూరు నగరంలోని శంకర్‌విలాస్ రైల్వే ఓవర్ బ్రిడ్జి కూల్చివేత పనుల దృష్ట్యా ఈ నెల 9 వ తేదీ నుంచి ట్రాఫిక్ మళ్లిస్తున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరు నగర పరిధిలో రాకపోకలు సాగించేందుకు ముందస్తు ప్రయాణ ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని అన్నారు. ప్రజల సౌకర్యార్థం పలు తాత్కాలిక మార్గాలను అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. అందరూ నిబంధనలను పాటించి సహకరించాలని జిల్లా ఎస్పీ కోరారు. వివిధ మార్గాల్లో మళ్లింపులు ఇలా.. ● అమరావతి రోడ్ నుంచి మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా (ఎంటీబీ) సెంటర్ వైపు వెళ్లే భారీ వాహనాలను చిల్లీస్ పాయింట్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్ మార్గంలో మళ్లిస్తారు. ● లాడ్జి సెంటర్ నుంచి ఎంటీబీ సెంటర్ వైపు వెళ్లే కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు ఇకనుంచి అరండల్‌పేట, పొట్టిశ్రీరాములునగర్, డొంకరోడ్డు, మూడు వంతెనలు లేదా బ్రాడీపేట, కంకరగుంట రైల్వే ఓవర్ బ్రిడ్జి మార్గాల్లో వెళ్లాల్సి ఉంటుంది. తిరుగు ప్రయాణంలో కూడా ఈ మార్గం మీదుగా వెళ్లాలి. ● ఎంటీబీ సెంటర్ నుంచి లాడ్జి సెంటర్ వైపు వెళ్లే భారీ వాహనాలు (పాఠశాల, కళాశాల బస్‌లు సహా) రమేష్ హాస్పిటల్ నుంచి కంకరగుంట రైల్వే ఓవర్ బ్రిడ్జి మీదగా ప్రయాణించాలి. ● కోబాల్డ్‌పేట, కృష్ణానగర్, చంద్రమౌళినగర్, బృందావన్గార్డెన్స్, లక్ష్మీపురం ప్రాంతాల నుంచి మార్కెట్ వైపు వచ్చే వాహనాలన్నీ పట్టాభిపురం పోలీస్‌స్టేషన్ రోడ్ లేదా బ్రాడీపేట, కంకరగుంట రైల్వే అండర్ బ్రిడ్జి, కలెక్టర్ కార్యాలయం రోడ్డు, నగరంపాలెం మీదగా వెళ్లాల్సి ఉంటుంది. ● పట్టాభిపురం నుంచి గుంటూరు ప్రభుత్వాసుపత్రి (జీజీహెచ్) వైపు వెళ్లే వారు కంకరగుంట రైల్వే ఓవర్‌బ్రిడ్జి, ఎంటీబీ సెంటర్, ప్రభుత్వ మహిళా కళాశాల (ఉమెన్స్ కాలేజ్) వైపు నుంచి రైల్వేస్టేషన్ రోడ్డు మీదగా వెళ్లాలి. ● లాడ్జి సెంటర్ నుంచి ఎంటీబీ సెంటర్ వైపు వెళ్లే భారీ వాహనాలు చిల్లీస్, ఇన్నర్‌రింగ్ రోడ్, ఆటోనగర్, బస్టాండ్ లేదా కంకరగుంట రైల్వే ఓవర్ బ్రిడ్జి మార్గాలను ఉపయోగించాలని తెలిపారు. -
రాష్ట్రంలో చేనేత కార్మికుల స్థితి దుర్భరం
సత్తెనపల్లి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న చేనేత వ్యతిరేక విధానాలతో రాష్ట్రంలో చేనేత కార్మికుల స్థితిగతులు మరింత దుర్భరంగా మారాయని ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పిల్లలమర్రి బాలకృష్ణ అన్నారు. పట్టణంలోని పుచ్చలపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో గురువారం జరిగిన సభకు చేనేత కార్మిక సంఘ నాయకుడు అనుముల వీరబ్రహ్మం అధ్యక్షత వహించారు. బాలకృష్ణ మాట్లాడుతూరాష్ట్రంలో పవర్ లూమ్స్ అధికంగా రావడం వల్లన చేనేత కార్మికులకు చాలీచాలని వేతనాలు వస్తూ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు.ఽ ధర్మవరంలో పవర్లూమ్ కంటే అధునాతన మైన యంత్రాలు రావడంతో చేనేత కార్మికులు పనులు కోల్పోయి కుటుంబాలు గడవక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగుపరచడానికి, చేనేత రంగ పరిరక్షణకు ప్రభుత్వాలు తగు చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన విధంగా ప్రతి చేనేత కార్మికునికి నేతన్న నేస్తం అమలు చేయాలన్నారు. ప్రతి చేనేత కార్మికుని కుటుంబానికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్తు అమలు చేయాలన్నారు. చేనేత రంగ పరిరక్షణకు11 రకాల రిజర్వేషన్లు అమలు జరపాలన్నారు. చేనేత సహకార సంఘాలకు ప్రభుత్వం ఇవ్వాల్సిన యారన్ సబ్సిడీ, పావలా వడ్డీ రిబేటు క్రింద రూ. 156 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సహకార సంఘాలు దివాలా తీయకుండా ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సత్తెనపల్లిలో 11వ రాష్ట్ర మహాసభలు ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం 11వ రాష్ట్ర మహాసభలు సత్తెనపల్లిలో అక్టోబర్ 6,7 తేదీలలో జరగనున్నాయని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కట్టా శివ దుర్గారావు, పిల్లలమర్రి బాలకృష్ణ తెలిపారు. ఈమేరకు 51 మందితో ఆహ్వాన సంఘం ఏర్పాటు చేయడం జరిగింది. ఆహ్వాన సంఘం అధ్యక్ష కార్యదర్శులుగా కట్టా శివ దుర్గారావు, పిల్లలమర్రి బాలకృష్ణలను ఎన్నుకున్నారు. మహాసభలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న చేనేత వ్యతిరేక విధానాలపై సుదీర్ఘంగా చర్చించడం జరుగుతుందన్నారు. ఆహ్వాన సంఘం గౌరవ అధ్యక్షుడు డాక్టర్ అనంత వెంకట్రావు, గౌరవ సలహాదారులు మున్నూరు భాస్కరయ్య, ఉపాధ్యక్షులు గద్దె చలమయ్య, కామర్తి రాజు, సహాయ కార్యదర్శులు డోకుపర్తి రామారావు, వాస గంగాధరరావు తదితరులు మహాసభ నిర్వహణ, ఏర్పాట్లపై అనేక సూచనలు, సలహాలు చేశారు. సత్తెనపల్లిలో అక్టోబర్ 6,7 తేదీలలో ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర మహాసభలు సంఘం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణ -
ఖరీఫ్‌లో పొగాకు సాగు నిషేధం
జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు నరసరావుపేట రూరల్: జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పొగాకు పంటను పూర్తిగా నిషేధించాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు తెలిపారు. కలెక్టరేట్ ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో కలెక్టర్ అరుణ్‌బాబు ఆధ్వర్యంలో బుధవారం వ్యవసాయ శాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ సీజన్‌కు రైతుల సమాయత్తంపై సమీక్షించారు. జిల్లావ్యాప్తంగా వర్షపాతం నమోదు, సాధారణ పంట సాగు విస్తీర్ణం, ప్రత్యామ్నాయ పంటల సాగు, ఎరువుల లభ్యత, కౌలుదారు హక్కు పత్రాలు, కౌలు రైతులకు పంట రుణాల పంపిణీ తదితర కార్యక్రమాలపై జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావుతో కలిసి సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ రబీ కాలానికి వరి పంట సాగుకు సాగర్ నీరు విడుదల చేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. దీనిపై వ్యవసాయ అధికారులు గ్రామస్థాయికి వెళ్లి రైతులకు తెలియజేయాలని ఆదేశించారు. ఆగస్ట్ నెలలో వివిధ పంటల సాగు విస్తీర్ణం పెరుగుతున్నందున సరిపడా ఎరువులు, పురుగుమందులు అందుబాటులో ఉంచాలని తెలిపారు. ప్రతి పదిరోజులకు ప్రైవేటు రిటైల్ డీలర్ షాపులను తనిఖీ చేయాలని వ్యవసాయ అధికారులకు సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు మాట్లాడుతూ ప్రత్యామ్నాయ పంటల సాగుకు మొగ్గు చూపేలా రైతులకు శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఖరీఫ్ సీజన్లో సరిపడా ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా నిర్వహిద్దాం.. నరసరావుపేట రూరల్: స్వాతంత్య్ర దినోత్సవాలు విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలోని పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో స్వాతంత్య్ర వేడుకల సన్నద్ధతపై బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది కలెక్టరేట్ పరేడ్ గ్రౌండ్స్‌లో 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వేడుకల్లో పాల్గొని జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపిస్తారని తెలిపారు. డీఆర్ఓ మురళి, అదనపు ఎస్పీ జేవీ సంతోష్, ఆర్డీఓ మధులత, పలు శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
‘ఉద్యోగం లేదు.. బతకాలని లేదు’
దాచేపల్లి: మండలంలోని పెదగార్లపాడు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామానికి చెందిన కామిరెడ్డి శ్రీనివాసరెడ్డి కుమారుడు బ్రహ్మారెడ్డి(25) బుధవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకోవడంతో గ్రామంలో విషాదం నెలకొంది. శ్రీనివాస రెడ్డి, భూలక్ష్మి దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు సతీష్ రెడ్డి బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండగా.. బీటెక్ పూర్తి చేసిన చిన్న కుమారుడు బ్రహ్మారెడ్డి హైదరాబాద్‌లో ఉంటూ ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర నిరాశ, నిస్పృహలకు లోనయ్యాడు. దీంతో బుధవారం తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఉద్యోగం సాధించలేకపోయానని.. తానిక బతకలేనని.. ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా తెలిపి ఫోన్ పెట్టేశాడు. కుటుంబ సభ్యులు అతనికి సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అనంతరం హైదరాబాద్ లింగంపల్లి సమీపంలో రైలు కిందపడి బ్రహ్మారెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. కుమారుడు మృతిచెందడంతో శ్రీనివాస్ రెడ్డి, భూలక్ష్మి బోరున విలపించారు. పోస్టుమార్టం పూర్తి కావడంతో బుధవారం రాత్రి బ్రహ్మారెడ్డి మృతదేహాన్ని స్వగ్రామమైన పెదగార్లపాడు తీసుకువచ్చారు. తల్లిదండ్రులకు ఫోన్ చేసి, అనంతరం రైలుకింద పడి మృతిచెందిన బ్రహ్మారెడ్డి హైదరాబాద్‌లో ఘటన.. మృతుడి స్వగ్రామం పెదగార్లపాడులో విషాదం -
‘చేనేత’కు అందని చేయూత
చేనేత వస్త్రాలు అంటే జాతీయ స్థాయిలో మంగళగిరికి పేరుంది. అగ్గిపెట్టెలో పట్టే చీరను తయారు చేసిన ఘనత మంగళగిరి నేతన్నలది. ఒకప్పుడు వెలుగు వెలిగిన చేనేత పరిశ్రమ నేడు సమస్యల్లో కొట్టుమిట్టాడుతోంది. ఒకప్పుడు జిల్లాలో 80 వేలకుపైగా ఉన్న మగ్గాలు నేడు 35 వేలకు తగ్గిపోయాయి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేనేత రంగాన్ని ఆదుకునేందుకు పలు పథకాలను ప్రవేశపెట్టింది. నేడు కూటమి ప్రభుత్వం వచ్చాక నేత కార్మికులను గాలికి వదిలేసింది. మంగళగిరి: నాడు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరి అంటే చేనేత గుర్తుకు వచ్చేలా ముఖద్వారంలో నేతన్న విగ్రహం ఏర్పాటు చేశారు. చేనేత సెంటర్‌గా పేరుపెట్టారు. విజయవాడ వైపు నుంచి వచ్చే వారికి మంగళగిరి అంటే చేనేత అని గుర్తుకు వచ్చేలా ప్రకాశం బ్యారేజి వద్ద నేతన్న విగ్రహం ఏర్పాటు చేశారు. ప్రతి కార్మికుడుకి నెలకు రూ.రెండు వేలు చొప్పున ఏటా రూ.24,000 నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. జిల్లా వ్వాప్తంగా 3,500 కుటుంబాలు చేనేతపైనే ఆధారపడి జీవిస్తున్నాయి. నాడు రాజీవ్ గృహ కల్ప కాలనీ వద్ద చేనేత షెడ్లు నిర్మించారు. 146 మగ్గాలు ఉచితంగా అందజేసి సుమారు 1,500 కుటుంబాలకు ఉపాధి కల్పించారు. పాత బస్టాడ్ ప్రగడ కోటయ్య, వైఎస్సార్‌ల పేరిట ఆవరణలో చేనేత భవనాన్ని నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నిర్మించింది. తెనాలి రోడ్డు విస్తరణలో దుకాణాలు కోల్పోయే వారికి చేనేత భవన్లో దుకాణాలు కేటాయించేలా ప్రణాళిక రూపొందింది. నేడు అంతటా నిర్లక్ష్యమే కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక చేనేత పరిశ్రమను పూర్తిగా విస్మరించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేనేత భవన్ కట్టిందనే కక్షతో నేటికీ ప్రారంభించలేదు. దీంతో నేత దుకాణదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళగిరిలో గెలిచి మంత్రి అయిన నారా లోకేష్ ఇప్పటికీ చేనేత పరిశ్రమను పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ పరిశ్రమపై ఆధారపడి వేల కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నా ప్రభుత్వం విస్మరించింది. దీంతో వారు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్మికుడు గుంట మగ్గంలో నేయడానికి కూలీకి వెళ్తే రోజుకు రూ.250 మించి రావడం లేదు. వేసవికాలంలో రూ.150 కే ఈ మొత్తం పరిమితం. సుదీర్ఘకాలం పనిచేస్తే అనారోగ్యం పాలవుతున్నారు. నాడు కార్మికులకు అండగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కూటమి సర్కార్ వచ్చాక తప్పని అష్టకష్టాలు నేతన్నలను ఆదుకోవడంలో చంద్రబాబు అన్నివిధాలా విఫలం నేడు జాతీయ చేనేత దినోత్సవం పూట గడవని దుస్థితిలో నేతన్నలు చంద్రబాబు చేనేత పరిశ్రమకు, కార్మికులు మేలు చేస్తారని ఓటేశాం. మంత్రి లోకేష్ కూడా పట్టించుకోవడం లేదు. వైఎస్సార్ సీపీ పాలనలో నెలకు రూ.రెండు వేలు చొప్పున వచ్చేవి. బ్యాంకు ఖాతాలో నేరుగా జమ అయ్యేవి. కార్మికులు సంతోషంగా జీవించేవారు. నేడు ఏ రోజుకా రోజు పని చేస్తేనే పూట గడిచే దుస్థితిలోఉన్నారు. ప్రభుత్వం స్పందించాలి. – వెంకటేశ్వరరావు, చేనేత కార్మికుడు -
అరకొరగా ‘సుఖీభవ’..అన్నదాత దుఃఖీభవ!
సాక్షి, నరసరావుపేట: అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేశామని కూటమి ప్రభుత్వం డప్పుకొడుతుండగా, మరోవైపు రైతులు మాత్రం అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. అన్ని అర్హతలుండి కొందరికి అన్నదాత సుఖీభవ నగదు జమకాలేదు. మరికొందరికి అయితే రూ.5 వేలు, రూ.2 వేల చొప్పున బ్యాంక్ ఖాతాలలో డబ్బులు జమయ్యాయి. దీంతో రైతులు తీవ్ర అయోమయంలో ఉన్నారు. పీఎం కిసాన్ నిధులు ఎందుకు పడలేదో చెప్పేవారు లేక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లావ్యాప్తంగా గత ప్రభుత్వంలో వైఎస్సార్ రైతు భరోసా కింద ఏటా 2.80 లక్షల మందికి పెట్టుబడి సాయం అందించారు. అఽధికారంలోకి వస్తే ఏటా రూ.20 వేలు ఇస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి నేతలు తొలి ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. రెండో ఏడాది అన్నదాత సుఖీభవ కింద రూ.5 వేలను రాష్ట్ర ప్రభుత్వం, పీఎం కిసాన్ ద్వారా రూ.2 వేలను ఖాతాలలో జమ చేశామని ఈ నెల 2వ తేదీన ప్రకటించారు. ఇందులో అన్నదాత సుఖీభవ పథకానికి 2,40,530 మంది అర్హులని అధికారులు ప్రకటించారు. గత ప్రభుత్వం ఇచ్చిన దానికన్నా 40 వేల మంది ఇందులో తగ్గారు. పీఎం కిసాన్ మాత్రమే.. ఈకేవైసీ, 1బీ మ్యూటేషన్ కాలేదని, ఫ్యామిలీ మ్యాపింగ్ అంటూ వివిధ కారణాలతో గత ప్రభుత్వంతో పోల్చితే లబ్ధిదారుల సంఖ్యను తగ్గించారు. పోని వీరికై నా రూ.7 వేలు జమ అయ్యాయా అంటే అది లేదు. పీఎం కిసాన్ పథకంలో భాగంగా జిల్లాలో కేవలం 2,04,738 మందే అర్హత సాధించారు. వీరికే కేంద్రం ఇస్తున్న రూ.2 వేలు జమ అయ్యాయి. 35,792 మంది రైతులు అన్నదాత సుఖీభవ పొంది పీఎం కిసాన్‌కు దూరమయ్యారు. -
రాష్ట్రస్థాయి జైళ్ల శాఖ కబడ్డీ పోటీలకు సబ్ జైలు సూపరింటెండెంట్ ఎంపిక
వినుకొండ: వినుకొండ సబ్‌జైల్ సూపరింటెండెంట్ అమరా కృష్ణారావు జైళ్ల శాఖ రాష్ట్రస్థాయి కబడ్డీ జట్టుకు ఎంపికయ్యారు. ఈనెల 6వ తేదీన నెల్లూరులో జరిగిన శిక్షణా శిబిరంలో ప్రతిభ కనపరచిన ఆయన సెప్టెంబరు 9,10 తేదీల్లో హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున ఆడనున్నారు. ఈసందర్భంగా సహచర ఉద్యోగులు సిబ్బంది కృష్ణారావును అభినందించారు. 9న మున్సిపల్ కార్యాలయాల ఎదుట టూల్‌డౌన్ మంగళగిరి టౌన్: మున్సిపల్ కార్మికుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవో నంబరు 36పై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్, వైఎస్సార్‌ట్రేడ్ యూనియన్ నేతలు డిమాండ్ చేశారు. మంగళగిరి నగర పరిధిలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ నెల 9వ తేదీన అన్ని మున్సిపల్ కార్యాయాల వద్ద టూల్‌డౌన్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 36పై స్పష్టత ఇవ్వకపోవడం, అమలు చేయకపోవడంపై మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గండికోట దుర్గారావు, వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ నియోజకవర్గ అధ్యక్షుడు రత్నాకరం శ్రీనివాసరాజు, పట్టణ వైఎస్సార్టీయూసీ అధ్యక్షుడు నక్క నాగరాజు, ఏఐటీయూసీ నియోజకవర్గ కార్యదర్శి చిన్ని సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ‘విద్యా శక్తి’పై నిర్బంధం తగదు గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుత విద్యాసంవత్సరం నుంచి ప్రారంభించిన విద్యాశక్తి కార్యక్రమాన్ని నిర్బంధం చేయడం తగదని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) జిల్లా చైర్మన్ కె.నరసింహారావు పేర్కొన్నారు. బుధవారం డీఈవో కార్యాలయంలో జిల్లా విద్యాశాఖాధికారి సీవీ రేణుకను కలిసిన నాయకులు తమ ఇబ్బందులను ఆమె దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా నరసింహారావు మాట్లాడుతూ పలుచోట్ల విద్యాశక్తి కార్యక్రమాన్ని నిర్బంధంగా నిర్వహిస్తున్నారని అన్నారు. అలసిపోయిన విద్యార్థులకు అదనపు తరగతులు నిర్వహించడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు. వారి మానసిక, శారీరక పరిస్థితులను అర్థం చేసుకోకుండా ఇలా చేయడం తగదన్నారు. హెచ్ఎంలకు తగు ఆదేశాలు జారీ చేయాలని కోరారు. డీఈవో మాట్లాడుతూ కార్యక్రమం నిర్బంధ కాదని, ఐచ్ఛికమేనని తెలిపారు. ఫ్యాప్టో జిల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్స్ యు.రాజశేఖర్‌రావు, డీకే సుబ్బారెడ్డి, ఎండీ ఖలీద్, జిల్లా కార్యవర్గ సభ్యులు తిరుమలేష్, ఎం.కళాధర్, డి.పెదబాబు, బాలాజీ, వై.శ్యాంబాబు, తదితరులు పాల్గొన్నారు. -
కూటమికి బీసీలంటే అంత అలుసా?
పెదకాకాని: కూటమి ప్రభుత్వం బీసీలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని వైఎస్సార్ సీపీ జిల్లా బీసీసెల్ అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్‌యాదవ్ అన్నారు. పెదకాకానిలోని రాజ్యసభ సభ్యుడు ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి నివాసంలో బుధవారం మండల ఎంపీపీ తుల్లిమిల్లి శ్రీనివాసరావు అక్రమ అరెస్టుపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బీసీసెల్ జిల్లా అధ్యక్షుడు తాడిబోయిన వేణుగోపాల్ యాదవ్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బీసీలే పార్టీకి వెన్నుముక అని ప్రచారం చేసే కూటమి ప్రభుత్వం బీసీలను కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తుందన్నారు. మూడు సంవత్సరాల కిందట జరిగిన జలకళ పథకంలో అక్రమాలు జరిగాయని ఎంపీపీ తుల్లిమిల్లి శ్రీనివాసరావుకు గిట్టని వారితో ఫిర్యాదు చేయించి అరెస్టు చేయించడం ముమ్మాటికీ రాజకీయకక్షే అన్నారు. ఈనెల 3వ తేదీన ఓ దినపత్రికలో సీనియర్ ఎమ్మెల్యేపై ఆ ఎమ్మెల్యే దందాలతో దడ అని ప్రచురణ కావడంతో సీనియర్ ఎమ్మెల్యే ఎవరబ్బా అని రాజకీయ విశ్లేషకులు, ప్రజలు సందిగ్ధంలో ఉన్నారన్నారు. అదే సమయంలో ఆ ఎమ్మెల్యే ఎవరో ఆ పార్టీ నాయకులే విలేకరుల సమావేశం పెట్టడం, అదే పత్రికతో పాటు పలు పేపర్లలో ఈనెల 5వ తేదీన తక్కెళ్ళపాడు కల్యాణ మండపం వ్యవహారంలో ఎమ్మెల్యే నరేంద్ర తప్పేంలేదని ప్రచురించడం చూస్తే ఆ సీనియర్ ఎమ్మెల్యే ఎవరో సమాజానికి స్పష్టంగా తెలియజేశారన్నారు. ఈ వ్యవహారంపై ప్రజల ఆలోచన, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చను ప్రక్కదారి పట్టించడానికే కూటమి ప్రభుత్వం ఎంపీపీని ఒక పథకం ప్రకారం అరెస్టు చేయించిందన్నారు. గతంలో అనుమర్లపూడిలో జరిగిన సంఘటన రోజు నుంచి ఎంపీపీపై ఎమ్మెల్యే కక్ష పెంచుకున్నాడని ఆరోపించారు. కేవలం రాజకీయకక్షతోనే ఎంపీపీని అక్రమంగా అరెస్టు చేయించారన్నారు. ఇటీవల కాలంలో పొన్నూరు రూరల్ మండలం, మన్నవ గ్రామ సర్పంచి బొనిగల నాగమల్లేశ్వరరావును కూడా రాజకీయ కక్షతో హత మార్చేందుకు ఎమ్మెల్యే అండదండలతో హత్యాయత్నం చేశారన్నారు. ప్రభుత్వం ఒక పథకం ప్రకారం వైఎస్సార్ సీపీకి చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీలను భయబ్రాంతులకు గురిచేస్తుందన్నారు. వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు బొల్లయదుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం బీసీలపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలి బీసీ, ఎస్సీ, ఎస్టీలను భయభ్రాంతులకు గురి చేయడానికే హత్యాయత్నాలు, అక్రమ అరెస్టులు వైఎస్సార్ సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్‌యాదవ్ -
నిమ్మకాయల ధరలు
వాణిజ్యంవలస కూలీల పిల్లలకు ప్రత్యేక బోధన తాడికొండ: రాజధానిలో వలస కూలీల చిన్నారులకు ప్రత్యేక వసతులతో కూడిన బోధన అందించనున్నట్లు తుళ్ళూరు ఎంఈవో లక్ష్మీనారాయణ తెలిపారు. బుధవారం ఆర్వీఆర్ నిర్మాణ కంపెనీలో పర్యటించిన ఆయన 10 మంది చిన్నారులను గుర్తించి, అయ్యన్నచెరువులోని ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. కూలీ భాష, అవసరాన్ని బట్టి సీజనల్ హాస్టల్ ఏర్పాటు చేసి ప్రత్యేక విద్య అందించనున్నట్లు తెలిపారు. యూపీ, మధ్యప్రదేశ్, బిహార్, చత్తీస్గడ్ నుంచి కూలీలు వచ్చారని పేర్కొన్నారు. సీఆర్డీఏ ఏడీసీఎల్ మార్స్ పీఆర్ఏ పుల్లయ్య పలువురు ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్‌యార్డులో బుధవారం నిమ్మకాయల క్వింటా ధరకనిష్టం : రూ. 1,500 గరిష్టం : రూ. 2,400మోడల్ ధర రూ. 2,000 -
‘పెట్రో’ రవాణాలో నిబంధనలు పాటించాలి
జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు నరసరావుపేట రూరల్: పెట్రోలియం ఉత్పత్తుల రవాణాలో చట్టబద్ద నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా పోలీసు కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జిల్లావ్యాప్తంగా ఉన్న పెట్రోల్ బంకు యజమానులు, గ్యాస్ డీలర్లతో సమావేశమయ్యారు. పెట్రోలియం ఉత్పత్తులు రోడ్డు ద్వారా సురక్షితంగా రవాణా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ పెట్రోలియం ఉత్పత్తులు, ఎల్పీజీ సహజ వాయువు సురక్షితమైన రోడ్డు రవాణాకు నియమాలు తప్పని సరిగా పాటించాలని తెలిపారు. పెట్రోలియం సంస్థలు ఎక్కువ దూరాలకు రోడ్డు రవాణాను తగ్గించి ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను పరిశీలించాలని సూచించారు. అత్యంత రద్దీ ప్రాంతాలను దాటే సమయంలో ప్రజా భద్రతను పరిగణనలోకి తీసుకోవాలని తెలిపారు. ఎక్కువ దూరం రవాణా చేసే సమయంలో డ్రైవర్‌తో పాటు ప్రత్యామ్నాయ డ్రైవర్‌ను ఏర్పాటుచేసుకోవాలన్నారు. డ్రైవర్ల వైద్య ఫిట్నెస్ పత్రాలను ప్రయాణం ప్రారంభించే ముందు తటస్థంగా పరీక్షించాలని తెలిపారు. లోడ్ అన్లోడ్ సమయంలో ట్రక్ డ్రైవర్లు విశ్రాంతికి సమయం కల్పించేలా సంస్ధలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. – జిల్లాలో 35 బ్లాక్ స్పాట్లును గుర్తించామని, ఆ ప్రదేశాల్లో సురక్షిత చర్యలను అమలు చేయాలని తెలిపారు. పెట్రోల్‌బంక్‌లు, గ్యాస్ ఏజెన్సీల వద్ద రోడ్డు ప్రమాదాలు, మత్తు పదార్దాల విషయంపై అవగాహన కల్పించేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. బీపీసీ, ఐఓసీఎల్, లీగల్ మెట్రాలజీ విభాగాల అధికారులు, గ్యాస్ ఏజెన్సీ డీలర్లు, పెట్రోల్ బంకుల డీలర్లు హాజరయ్యారు. అడిషనల్ ఎస్పీ జేవీ సంతోష్, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ ఎం.వెంకటరమణ, ట్రాఫిక్ సీఐ సీహెచ్ లోకనాథ, ఏఎంవీఐ ఎంఎల్ వంశీకృష్ణ, బీపీసీ జిల్లా సేల్స్ ఆఫీసర్ చంద్రకాంత్‌నాయక్, ఐఓసీఎల్ జిల్లా సేల్స్ ఆఫీసర్ సాయి ప్రకాష్, లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్ ప్రతినిధి అల్లూరయ్య తదితరులు పాల్గొన్నారు. -
పొగాకు రైతులను బలి చేయొద్దు
కొరిటెపాడు(గుంటూరు): పొగాకు రైతులను బలి చేయొద్దని, ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మొత్తం కొనుగోలు చేయాలని ఏపీ రైతు సంఘం, ఏపీ కౌలు రైతు సంఘాల రాష్ట్ర కమిటీలు డిమాండ్ చేశాయి. సంఘాల ఆధ్వర్యంలో చుట్టుగుంట సెంటర్లోని వ్యవసాయ రాష్ట్ర కమిషనర్ కార్యాలయం వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీతో పొగాకు కొనుగోలు ఆపేస్తామని ప్రభుత్వం చేసిన ప్రకటన విరమించుకోవాలని పేర్కొన్నారు. 20 శాతం మాత్రమే కొన్నారని తెలిపారు. మిగతాదీ కొనకుంటే ఆందోళన తప్పదని హెచ్చరించారు. ధర కూడా తగినంత ఇవ్వడం లేదని చెప్పారు. నాణ్యత లేదని పొగాకు వెనక్కి పంపుతున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ కంపెనీలతో కుమ్మకై ్క బయ్యర్లు ధర లేకుండా చేస్తున్నారని పేర్కొన్నారు. ఏపీ కౌలురైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.హరిబాబు మాట్లాడుతూ కొనుగోలు చేసిన పొగాకుకు సంబంధిత రైతులకు ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా జమ చేయలేదన్నారు. వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఢిల్లీ రావు అందుబాటులో లేకపోవడంతో మార్కెటింగ్ శాఖ రాష్ట్ర కమిషనర్ విజయ సునీతకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో నల్లమడ సంఘం నాయకులు కొల్లా రాజమోహన్, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కంచుమాటి అజయ్‌కుమార్, కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై. రాధాకృష్ణమూర్తి, నంద్యాల జిల్లా రైతు నాయకులు వెంకటేశ్వర గౌడ్, రైతు సంఘాల నాయకులు కొల్లి రంగారెడ్డి, పాడిబండ్ల కోటేశ్వరరావు, బండి శంకరయ్య, బిక్కి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఏపీ రైతు, కౌలు రైతు సంఘాల నాయకులు -
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై దాడిచేసిన గూండాలను అరెస్ట్ చేయాలి
వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జె.సింగరయ్య యాదవ్ దాచేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర బీసీ సెల్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆర్.రమేష్ యాదవ్‌పై దాడి చేసి గాయపరిచిన టీడీపీ గూండాలను వెంటనే అరెస్ట్ చేయాలని వైఎస్సార్ సీపీ బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగాల సింగరయ్య యాదవ్ డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ రమేష్ యాదవ్‌పై జరిగిన దాడిని బుధవారం ఆయన తీవ్రంగా ఖండించారు. కడప జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నల్లగొండపల్లి గ్రామంలో కారులో ప్రయాణిస్తుంటే, కారును అడ్డగించి, కారు అద్దాలు పగలగొట్టి కారులో ఉన్న రమేష్ యాదవ్‌పై తెలుగుదేశం పార్టీ గూండాలు, కార్యకర్తలు తీవ్రంగా దాడి చేసి గాయపరిచారన్నారు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన అమలు చేస్తూ వైఎస్సార్ సీపీ నేతలపై దాడులు చేయటం, అక్రమ కేసులు పెట్టడం లక్ష్యంగా పరిపాలన కొనసాగుతుందని మండిపడ్డారు. ఈ దాడి రమేష్ యాదవ్ మీద జరిగిన దాడి మాత్రమే కాదని, రాష్ట్రంలోని మొత్తం బడుగు, బలహీన వర్గాల మీద జరిగిన దాడి అని అన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదని, కేవలం నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం మాత్రమే నడుస్తుందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా ఈ దాడికి వ్యతిరేకంగా ఉద్యమించాలని, దాడి చేసిన నిందితులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. -
ప్రజల సహకారంతోనే గ్రామాల్లో స్వచ్ఛత
ప్రత్తిపాడు: ప్రజల సహకారంతోనే గ్రామాల్లో స్వచ్ఛత సాధ్యపడుతుందని జెడ్పీ సీఈవో వి. జ్యోతిబసు అన్నారు. ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెంలోని సుప్రీం ఎల్టీసీలో బుధవారం హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ కార్యక్రమం నిర్వహించారు. శిక్షణకు గుంటూరు జిల్లాలోని 17 మండలాల ఎంపీడీవోలు, డెప్యూటీ ఎంపీడీవోలు హాజరయ్యారు. వారు ఆరు బృందాలుగా క్లాప్ మిత్రలతో కలిసి ఇంటింటికీ వెళ్లి తడి చెత్త, పొడి చెత్త సేకరణ విధానాలపై ఆరా తీశారు. మహిళలతో మాట్లాడారు. వ్యర్థాల నిర్వహణ, స్వచ్ఛ లక్ష్యాలను అనంతరం రచ్చబండ సెంటరులో ప్రజలకు వివరించారు. స్వచ్ఛ ఆంధ్ర–స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హ్యాండ్ వాష్ చేయించారు. తదనంతరం గ్రామంలోని సుప్రీం ఎల్టీసీని సందర్శించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈవో మాట్లాడుతూ గ్రామాల స్వచ్ఛతపై యంత్రాంగం పూర్తి స్థాయి దృష్టి కేంద్రీకరించాలని చెప్పారు. జిల్లా పంచాయతీ అధికారి బి.వి.నాగసాయి కుమార్ మాట్లాడుతూ తుమ్మలపాలెం పంచాయతీలో జరుగుతున్న అన్ని రకాల స్వచ్ఛతా కార్యక్రమాలు జిల్లాలోని అన్ని మండలాల్లో జరిగేలా ఎంపీడీవోలు, డెప్యూటీ ఎంపీడీవోలు చూడాలన్నారు. గుంటూరు డీఎల్పీవో శ్రీనివాసరావు గ్రామంలో విజయవంతంగా స్వచ్ఛతను అమలు చేస్తున్నారన్నారు. గ్రామ సర్పంచ్ చల్లా నాగమల్లేశ్వరి, కార్యదర్శి షేక్ ఖాజా, క్లాప్ మిత్రులను సత్కరించారు. ఎంపీడీవోలు, డెప్యూటీ ఎంపీడీవోలు, డీపీఆర్‌సి ప్రతినిధులు నిరంజన్, కరీముద్దిన్, అనురాధ, ఐటీసీ ఫినిష్ సొసైటీ కో–ఆర్డినేటర్ యశ్వంత్ శ్రీనివాసరావు, ఉమామహేశ్వరి పాల్గొన్నారు. జెడ్పీ సీఈఓ వి.జ్యోతిబసు -
● కన్నీరుమున్నీరుగా విలపించిన తల్లిదండ్రులు
అక్రమ కేసుతో ఎంపీపీని వేధించడం దారుణం యాదవ యువజన రాష్ట్ర అధ్యక్షుడు చింతలపూడి మురళీకృష్ణ పొన్నూరు: కూటమి ప్రభుత్వం ప్రజా ప్రతినిధులపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు పాల్పడటం దారుణమని ఆంధ్రప్రదేశ్ యాదవ యువత రాష్ట్ర అధ్యక్షులు పొన్నూరు మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షులు చింతలపూడి మురళీకృష్ణ ఆరోపించారు. పెదకాకాని మండల పరిషత్ అధ్యక్షులు, వైఎస్సార్ సీపీ సీనియర్ నాయ కులు తుల్లిమిల్లి శ్రీనివాసరావుపై అక్రమ కేసుతో ఇబ్బందులకు గురిచేసిన ప్రభుత్వ చర్యలను ఖండించారు. ఎంపీపీ ఎలాంటి అవకతవకలకు పాల్పడకుండా జలకళ ద్వారా మండలంలో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారని అన్నారు. ఉద్దేశపూర్వకంగానే అక్రమంగా కేసు పెట్టి వేధిస్తున్నట్లు స్పష్టమవుతోందని వెల్లడించారు. అధికారులపై ఎలాంటి చర్యలు లేకుండా శ్రీనివాసరావుని మాత్రమే బాధ్యుడిని చేయడం దారుణమన్నారు. రాజకీయంగా అణచివేసే పన్నాగంలో భాగంగా బలహీన వర్గా లను టార్గెట్ చేసి వేధింపులకు గురిచేయడం హేయమైన చర్య అన్నారు. ఎమ్మెల్యే ప్రోద్బలంతోనే యాదవ కులానికి చెందిన వ్యక్తిని అరెస్టు చేయడం జరిగిందని ఆరోపించారు. రాష్ట్రంలోని యాదవులంతా ఒక్కటై కూటమిని శంకరగిరి మాన్యాలు పట్టిస్తామని అన్నారు. నిరాధారమైన ఆరోపణలతో ఎంపీపీపై పెట్టిన అక్రమ కేసును తీసివేసే వరకూ ఉద్యమిస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. జ్వరంతో ‘నారాయణ’ విద్యార్థి మృతి లక్ష్మీపురం: నారాయణ విద్యాసంస్థలో చదువుతున్న విద్యార్థి జ్వరంతో బుధవారం మృతి చెందాడు. వివరాలు.. ప్రకాశం జిల్లా, కొమరోలు మండలం, బోనపల్లె గ్రామానికి చెందిన ఏలూరి వెంకట సుబ్బయ్య, సువర్ణ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు వెంకట నారాయణ(15), రెండో కుమారుడు దీక్షిత్‌లు గుంటూరులోని నారాయణ విద్యాసంస్థలో చదువుతున్నారు. వెంకట నారాయణ పలకలూరు క్యాంపస్‌లో పదో తరగతి, దీక్షిత్ పట్టాభిపురం ఐఐటీ క్యాంపస్‌లో పదో తరగతి చదువుతున్నారు. ఇద్దరు హాస్టల్లోనే ఉంటున్నారు. వెంకట నారాయణ వారం రోజుల నుంచి జ్వరంతో ఉండటంతో ఈ నెల 2వ తేదీన తల్లిదండ్రులు వచ్చి స్వగ్రామానికి తీసుకెళ్లి వైద్యం చేయించారు. సోమవారం పలకలూరులోని క్యాంపస్‌లో దిగబెట్టి వెళ్లారు. జ్వరం మళ్లీ రావడంతో మంగళవారం రాత్రి గుంటూరు గుజ్జనగుండ్లలో ఉండే మేనమామ మహేష్‌కు ఫోన్ చేయడంతో బుధవారం ఉదయం సుమారు 6.30 గంటలకు క్యాంపస్‌కు వచ్చి బాలుడిని గుజ్జనగుండ్లలోని తన సోదరి అనసూయ ఇంటికి తీసుకొచ్చారు. తర్వాత స్థంభాలగరువులోని ఎంజీఆర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షలు చేస్తున్న సమయంలో వెంకట నారాయణ మృతి చెందాడు. మధ్యాహ్నం సుమారు 2.20 గంటల సమయంలో తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు వచ్చి మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. పోలీస్‌స్టేషన్‌లో ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో జోరువానలోనూ స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఏఐఎస్ఎఫ్ నాయకులు ఆస్పత్రికి చేరుకుని విద్యార్థి కుటుంబానికి అండగా నిలిచారు. 14 మంది బాల కార్మికులు గుర్తింపు నెహ్రూనగర్: బాల కార్మికులను పనిలో పెట్టుకునే యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ ఎం.బాలు నాయక్‌తో కలిసి బుధవారం చిలకలూరిపేట రోడ్డులో మిర్చి గ్రేడింగ్ చేసే పాయింట్లో తనిఖీలు నిర్వహించారు. పని చేస్తున్న 14 మంది బాల కార్మికులను గుర్తించారు. ఈ సందర్భంగా జాయింట్ కమిషనర్ మాట్లాడుతూ యజమానులకు 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్షతోపాటు రూ.20 వేల నుంచి రూ. 50 వేల జరిమానా విధించడం జరుగుతుందన్నారు. ముగ్గురు యజమానులపై కేసులు నమోదు కోర్టులో ప్రవేశపెట్టామన్నారు. బాలలతో ఎక్కడైనా పని చేయిస్తున్నట్లు గుర్తిస్తే 94925 55144 ఫోను నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్మికశాఖ డిప్యూటీ కమిషనర్ ఎ.గాయత్రీదేవి, అసిస్టెంట్ కమిషనర్ కె. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. తల్లిపాలు బిడ్డకు శ్రేయస్కరంమంగళగిరి టౌన్: తల్లిపాలు బిడ్డకు ఎంతో శ్రేయస్కరమని, పుట్టిన గంటలోపు పాలు పట్టించాలని డీఎంహెచ్‌వో డాక్టర్ విజయలక్ష్మి సూచించారు. మంగళగిరి నగర పరిధిలోని ఇందిరానగర్ యూపీహెచ్‌సీలో జరుగుతున్న తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా డీఎంహెచ్‌వో విజయలక్ష్మి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ ఎ. శ్రావణ్ బాబు హాజరయ్యారు. -
క్రైస్తవులపై అక్రమ కేసుల ఎత్తివేతకు డిమాండ్
నగరంలో క్రైస్తవ సంఘాల భారీ శాంతి ర్యాలీ నెహ్రూనగర్: చత్తీస్‌గడ్‌లో ఇద్దరు నన్లను అక్రమంగా అరెస్ట్ చేశారని, వారిపై అక్రమ కేసులను ఎత్తివేయాలని గుంటూరు మేత్రాసన పీఠాధిపతి డాక్టర్ చిన్నాబత్తిన భాగ్యమ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు క్రైస్తవ, దళిత, బహుజన సంఘాల నాయకుల ఆధ్వర్యంలో బుధవారం ఏసీ కాలేజీ ఎదురుగా ఉన్న పునీత ఆగ్నేసమ్మ దేవాలయం నుంచి కలెక్టరేట్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మతమార్పిడుల పేరుతో సిస్టర్లను అన్యాయంగా అరెస్టు చేయడం దేశవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులు వ్యతిరేకిస్తున్నారన్నారు. ఇలాంటి దాడులపై ఐక్యంగా ఉంటూ పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. బలవంతపు మత మార్పిడి ఎవరూ చేయరని, సమాజంలో అట్టడుగువర్గాల అభివృద్ధికి క్రైస్తవ మతం కృషి చేస్తుందన్నారు. వీసీకే రాష్ట్ర అధ్యక్షుడు ఎన్జె విద్యాసాగర్ మాట్లాడుతూ దేశంలో దశాబ్దాలుగా క్రైస్తవులపై దాడులు జరుగుతూనే ఉన్నాయన్నారు. వారు కూడా భారతీయులేనని గ్రహించలేని స్థితిలో మతోన్మాదులు ఉన్నారని మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఆనంతరం డీర్ఆర్ఓ ఖాజావలికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు గాబ్రియేల్, సహదేవ్, నెహెమ్యా, మార్కు, బాబురావు, సతీష్‌కుమార్, కిరణ్, రాజు, రేపూడి రాయప్ప, అబ్రహం, విజయ్‌పాల్, వివిధ సంఘాల నాయకులు నల్లపు నీలాంబరం, మద్దు ప్రేమజ్యోతిబాబు, డాక్టర్ కర్రా హనోక్ బెంజిమెన్, రత్నశ్రీ, జీఆర్ భగత్ సింగ్, జూపూడి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
నిర్లక్ష్యం.. ప్రస్ఫుటం
● 14 నెలలుగా ఒక్క రూపాయి విడుదల చేయని కూటమి ప్రభుత్వం ● కళాశాలలో నిలిచిన అభివృద్ధి పనులు ● హాస్టళ్ల నిర్మాణం పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు ● వైఎస్సార్ సీపీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి ● కళాశాలలో వసతులు పరిశీలన నరసరావుపేట రూరల్: జేఎన్‌టీయూఎన్ ఇంజినీరింగ్ కళాశాల అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని, ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల కాలంలో ఒక్క రూపాయి కూడా అభివృద్ధి పనులకు విడుదల చేయలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. కాకానిలోని కళాశాలను మంగళవారం డాక్టర్ గోపిరెడ్డి సందర్శించి, క్యాంపస్‌లోని భవనాలను పరిశీలించారు. నిర్మాణాలు నిలిచిపోయిన విద్యార్థుల వసతి గృహాలు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ పనుల గురించి ఇంజినీరింగ్ అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. డాక్టర్ గోపిరెడ్డి మాట్లాడుతూ 2014లో మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి కృషితో కాకాని వద్ద జేఎన్‌టీయూఎన్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందన్నారు. ఇందుకు గాను 84 ఎకరాలు కేటాయించినట్టు తెలిపారు. 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ 2019 వరకు క్యాంపస్‌లో కనీసం ఇటుక కూడా వేయలేదన్నారు. క్యాంపస్‌లో కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.3కోట్లు కేటాయించి టెండర్లు పిలిస్తే పనులు చేయకుండా టీడీపీ నాయకులు అడ్డుకున్నారని తెలిపారు. హాస్టళ్ల నిర్మాణంపై శ్రద్ధ ఏదీ? హాస్టల్ భవన నిర్మాణానికి కేవలం రూ.10 కోట్లు చాలని, వాటిని కూడా విడుదల చేయకుండా విద్యార్థులను ఇబ్బందులు గురిచేస్తున్నారని తెలిపారు. కళాశాలలో దాదాపు 1200 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారని వీరంతా పట్టణంలోని ప్రైవేటు హాస్టళ్లలో ఉంటూ కళాశాలకు రావాల్సి వస్తుందన్నారు. కళాశాలలో నిర్మాణంలో ఉన్న హాస్టళ్లు పూర్తయితే నాలుగు బ్లాక్‌ల్లో 700 గదులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. పర్మినెంట్ ఫ్యాకల్టీని నియమించాలి.. కళాశాలలో 1200 మంది విద్యార్థులకు 13మంది రెగ్యులర్ టీచింగ్ స్టాప్ మాత్రమే ఉన్నారంటే విద్యా బోదన ఎలా జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చని పేర్కొన్నారు. 44మంది గెస్ట్ లెక్చరర్స్ ఇక్కడ పనిచేస్తున్నారని తెలిపారు. టీచింగ్ పోస్ట్‌లను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిర్మాణాలు త్వరితగతిన పూర్తిచేయాలి కళాశాలకు ముఖ్యమైన హాస్టల్ నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేసేలా స్థానిక ఎమ్మెల్యే వర్సిటీ వీసీపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు. అవసరమైతే వీసీని క్యాంపస్‌కు పిలిపించి మాట్లాడాలని తెలిపారు. అప్పటి వరకు విద్యార్థులను కళాశాలకు చేరవేసేందుకు ఏర్పాటుచేసిన బస్సుల సంఖ్యను పెంచాలని సూచించారు. అభివృద్ధికి కృషిచేయకుండా కళాశాలలో ఉద్యోగాలు తమ వారికే కావాలని ఎమ్మెల్యే అడగడం బాధాకరమన్నారు. గోపిరెడ్డి వెంట వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గుజ్జర్లపూడి ఆకాష్, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ తన్నీరు శ్రీనివాసరావు, జెడ్పీటీసీ పదముత్తం చిట్టిబాబు, దొండపాడు సర్పంచ్ జెక్కిరెడ్డి వెంకటేశ్వరరెడ్డి, ఎంపీటీసీ దండా వీరాంజనేయులు , కనకా పుల్లారెడ్డి తదితరులు ఉన్నారు. జేఎన్‌టీయూఎన్‌లో నిలిచిపోయిన భవన నిర్మాణాలను పరిశీలించి, అధికారులతో మాట్లాడుతున్న డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డివైఎస్సార్ సీపీ హయాంలో రూ.150కోట్లతో అభివృద్ధి 2019లో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ.150 కోట్లతో క్యాంపస్‌లో అభివృద్ధి పనులు చేపట్టినట్టు వివరించారు. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, అకడమిక్ బ్లాక్‌లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్, యువతీ, యువకుల వసతి గృహాలు, అంతర్గత రోడ్ల నిర్మాణ పనులు ప్రారంభించామని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 14 నెలల కాలంలో ఒక్క రూపాయి పని కూడా కళాశాలలో నిర్వహించలేదని, ఒక్క ఇటుక వేసిన పాపాన పోలేదని గోపిరెడ్డి తెలిపారు. దీన్నిబట్టి కళాశాల అభివృద్ధిపై కూటమి నేతలకు ఉన్న శ్రద్ధ అర్ధమవుతుందన్నారు. -
ఈదుపల్లికి విష జ్వరం
నగరం: నగరం మండలం ఈదుపల్లి గ్రామానికి విషజర్వం సోకింది. రెండు రోజుల వ్యవధిలోనే ఇద్దరు మృతి చెందారు. పలువురు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో పాలకులు, అధికారులు స్పందించారు. సోమవారం రాత్రి జిల్లా వైద్యధికారిణి విజయమ్మ ఈదుపల్లి గ్రామంలో పర్యటించారు. మంగళవారం వైద్య సిబ్బంది గ్రామంలో ఇంటింటి సర్వే చేపట్టారు. పంచాయతీ సిబ్బంది ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈదుపల్లి గ్రామంలో నెల రోజుల నుంచి విష జర్వాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాలకులుగాని, అధికారులు గాని స్పందించలేదు. రెండు రోజుల్లోనే ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు తుమ్మల సుబ్బారావు, మహాలక్ష్మి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇద్దరు చిన్నారులు అనాధలుగా మిగిలారు. సరైన సమయంలో వైద్య సిబ్బందిగాని, పంచాయతీ అధికారులు గాని స్పందించి ఉంటే ప్రాణ నష్టం జరిగి ఉండేది కాదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఈదుపల్లి గ్రామంలో జిల్లా కలెక్టర్ జె.వెంకట మురళి మంగళవారం పర్యటించారు. గ్రామంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. గ్రామంలో మురుగు నీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జర్వాలు తగ్గుముఖం పట్టే వరకు గ్రామంలో ప్రత్యేక వైద్యశిబిరాలు కొనసాగించాలన్నారు. అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండి జర్వాలతో బాధపడుతున్న వారికి మెరుగై వైద్యసేవలు అందజేయాలని సూచించారు. ఇంటింటి సర్వే ఈదుపల్లి గ్రామంలో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే చేపట్టారు. 450 కుటుంబాలలో సర్వే నిర్వహించగా 56 మందికి జర్వాలు ఉన్నట్లు గుర్తించారు. వీరికి డెంగీ పరీక్ష నిర్ధారణ కోసం శాంపిళ్లు సేకరించి పరీక్షల నిమిత్తం పంపించినట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు.విష జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి నగరం: విషజర్వాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జే వెంకటమురళి ప్రజలకు సూచించారు. మండలంలోని ఈదుపల్లి గ్రామంలో మంగళవారం పర్యటించి పారిశుద్ధ్య కార్యక్రమాలను పర్యవేక్షించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. ఈదుపల్లి గ్రామంలో విష జ్వరాలు ఉండటంతో వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించినట్లు తెలిపారు. సర్వేలో 56మందికి జ్వరాలు ఉన్నట్లు గుర్తించినట్లు తెలిపారు. మృతి చెందిన మహలక్ష్మికి మాత్రమే డెంగీ లక్షణాలు ఉన్నాయని, ఆమె భర్త అనారోగ్య సమస్యలతో మృతి చెందినట్లు తేలిందన్నారు. వైరల్ ఫీవర్లు వచ్చిన వారు ఆర్ఎంపీల వద్ద చికిత్స చేయించుకోవడం మంచిది కాదన్నారు. ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందాలన్నారు. ఆర్ఎంపీలు ప్రథమ చికిత్స మాత్రమే చేయాలని రోజుల తరబడి రోగులకు చికిత్స చేయకూడదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా వైద్యం చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. మహాలక్ష్మికి డెంగీ వచ్చినట్లు గుర్తించని ఏఎన్ఎం, ఆశ కార్యకర్తను సస్పెండ్ చేసినట్లు వెల్లడించారు. గ్రామంలో విషజ్వరాలు అదుపులోకి వచ్చేంత వరకు వైద్య శిబిరాలు, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గ్రామస్తులు తాగునీటి సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. 15 రోజులలో తాగునీటి సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఆర్డీవో రామలక్ష్మి, డీఎంహెచ్ఎం డాక్టర్ విజయమ్మ, డీఎల్డీఓ పద్మ, డెప్యూటీ సీఈఓ కృష్ణ, తహసీల్దార్ నాంచారయ్య, ఎంపీడీఓ శ్రీనివాసరావు పాల్గొన్నారు. రెండు రోజుల్లోనే భార్యాభర్తలు మృతి అనాధలుగా మిగిలిన ఇద్దరు కుమార్తెలు కదిలిన పాలకులు, అధికార యత్రాంగం ఇంటింటి సర్వే చేపట్టిన వైద్య సిబ్బంది గ్రామంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు -
2జీతో ఎలా జీ..!
● ఫోన్లలో లబ్ధిదారుల నమోదుకు అంగన్వాడీల తిప్పలు ● బాలింతలు, గర్భిణుల గుర్తింపునకు ఆపసోపాలు ● సరిగ్గా పని చేయని బాలసంజీవని, పోషణ ట్రాకర్ యాప్‌లు ● జిల్లాలో 19 ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌ల పరిధిలో 2,031 అంగన్వాడీ కేంద్రాలు సత్తెనపల్లి: జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు యాప్‌లతో ఆప సోపాలు పడుతున్నారు. ముఖచిత్ర గుర్తింపునకు పడరాని పాట్లు పడుతున్నారు. యాప్‌లు పనిచేయక వాటితో కుస్తీలు పడుతున్నారు. ఈ బాధలు పడలేని అంగన్వాడీ కార్యకర్తలు యాప్‌ల భారం తగ్గించాలంటూ ఆందోళన చేపడుతున్నారు. లబ్ధిదారులకు పోషకాహారం పంపిణీ చేయాలంటే తప్పనిసరిగా ముఖచిత్ర గుర్తింపు చేయాల్సిందే. అలా చేయకుండా ఆహార పదార్థాలను అందించలేరు. యాప్‌లు సరిగ్గా పని చేయకపోవడం, 2జీ ఫోన్లతో సకాలంలో ముఖచిత్ర గుర్తింపు ప్రక్రియ జరగక పోవడంతో ఇటు లబ్ధిదారులు, అటు అంగన్వాడీ కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. సక్రమంగా సాగని పంపిణీ లబ్ధిదారులకు పోషణ ట్రాకర్, బాల సంజీవని అందించాలంటే రెండు యాప్‌లు నిర్వహించాలి. లబ్ధిదారు ఫేస్ రికగ్నైజ్ చేసి యాప్‌లో నమోదు చేయాలి. అయితే 2జీ ఫోన్లు వల్ల నెట్ సరిగా రాక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ గుర్తింపు చాలా సార్లు సక్సెస్ కావడం లేదని అంగన్వాడీ కార్యకర్తలు చెబుతున్నారు. ప్రభుత్వం బాల సంజీవని ద్వారా లబ్ధిదారులకు ముఖ గుర్తింపుతో బియ్యం ఇస్తోంది. ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన పోషణ ట్రేకర్ ద్వారానే లబ్ధిదారులను గుర్తించి సరుకులు ఇవ్వాలనే నిబంధనను తప్పనిసరి చేయడంతో కార్యకర్తలు ఈ రెండు యాప్ లను వినియోగించాల్సి వస్తోంది. ఇది కష్టంగా ఉందని అంగన్వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. అంగన్వాడీలు నిర్వహించే రికార్డులు ● లబ్ధిదారులకు అందించే ఆహార వినియోగం (ఎఫ్‌సీఆర్) ● పిల్లలు, గర్భిణులు, బాలింతలను నమోదు చేసే రికార్డులు (ఎస్ఎన్ఎన్) ● ప్రీ స్కూల్ అడ్మిన్ విద్యార్థుల వివరాల నమోదు ● పిల్లలకు అందించే టీకాలకు సంబంధించిన రిజిస్టర్ ● విటమిన్–ఏ రికార్డు, రిఫరల్ సర్వీసెస్ గృహ సందర్శకుల రికార్డులు ● నెలవారీ ప్రాజెక్టు (ఎంటీఆర్) ● ఆయా అంగన్వాడీల పరిధిలోని హౌస్ హోల్డ్ సర్వే ● గ్రోత్ రికార్డ్, గ్రోత్ చార్టులు ● చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు సంబంధించి టేక్ హోం రేషన్ పంపిణీ రికార్డు ● స్టాఫ్ అడ్మిషన్ రిజిస్టర్ నిర్వహణ ఈ రికార్డుల నిర్వహణ, యాప్‌ల భారంతో చిన్నారులకు ప్రాథమిక విద్య బోధించేందుకు ఇబ్బందులు కలుగుతున్నాయని అంగన్వాడీలు వాపోతున్నారు. 2జీ ఫోన్లతో తిప్పలు పలు అంగన్వాడీ కేంద్రాల్లో నెట్వర్క్ కష్టాలు అధికంగా ఉండడంతో కార్యకర్తలు ఇబ్బందులు పడుతున్నారు. మొబైల్స్ ర్యామ్ తక్కువగా ఉండడంతో తక్షణమే యాప్ స్పందించక తిప్పలు తప్పడం లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2జీ ఫోన్లు మా కొద్దు 5జీ ఫోన్లు ఇవ్వాలంటూ అంగన్వాడీ కార్యకర్తలు కోరుతున్నారు. ఇదే విషయమై గత నెల 22న, ఈ నెల 4న సత్తెనపల్లిలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయం వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్వాడీలు నిరసన చేపట్టి 2జీ ఫోన్లు వెనక్కి ఇచ్చేశారు. -
13 నుంచి అమరేశ్వరుని పవిత్రోత్సవాలు
అమరావతి: ప్రసిద్ధ శైవ క్షేత్రం అమరావతి అమరేశ్వరాలయంలో 13వ తేదీ బుధవారం నుంచి పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా ప్రారంభిస్తామని ఆలయ ఈఓ రేఖ మంగళవారం తెలిపారు. యార్లగడ్డ ఉపేంద్ర, విజయలక్ష్మి దంపతుల నేతృత్వంలో మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నామన్నారు. మొదటి రోజు వేదపండితులచే ఉదక శాంతి, ఆలయ శుద్ధి, ప్రధాన ఉపాలయాల మూర్తులకు స్నపనాభిషేకాలు, అర్చనలు నిర్వహిస్తారన్నారు. రెండోరోజు గురువారం మండప పూజలు, దీక్షా హోమాలు, మూలమంత్ర హవనములు, రుద్రహోమం, పవిత్రారోపణం, చంఢీహోమం మూడవరోజు శుక్రవారం ప్రాయశ్చిత్త హోమం, పూర్ణాహూతి, మహదాశీర్వచనం కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికవినుకొండ: ఉమ్మడి గుంటూరు జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 3వ తేదీన నిర్వహించిన సబ్ జూనియర్ మరియు జూనియర్ బాలుర, బాలికల ఎంపికల్లో స్థానిక నరసరావుపేట రోడ్డులోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఎం.గౌతమ్, బి. వెంకటేశ్వర్లు రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ డి.వెంకటేశ్వరప్రసాద్ మంగళవారం తెలిపారు. ఎంపికై న విద్యార్థులు ఈ నెల 29న ప్రకాశం జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. పీఈటీ జోనా నాయక్, ఏటీపీ ఎస్కే ఖాశీం, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.సాగర్ నీటిమట్టంవిజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటిమట్టం మంగళవారం 587.20 అడుగులకు చేరింది. ఇది 305.6242 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 5,088, ఎడమ కాలువకు 8,541, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 28,542, ఎస్ఎల్బీసీకి 1,800, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ ఫ్లోగా 44,271 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 44,271 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.ఐపీఎస్‌కు ఎంపికై న దోనేపూడి విజయ్‌బాబు● ప్రస్తుతం ఐఆర్ఎస్ అధికారిగా విధులు నిర్వహణ● నాలుగో పర్యాయం సివిల్స్ రాసి ఐపీఎస్‌కు ఎంపికతెనాలి: పట్టణానికి చెందిన దోనేపూడి విజయ్‌బాబు ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. 2024 సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన అభ్యర్థులకు సర్వీస్‌లను కేటాయిస్తూ యూపీఎస్ఈ మంగళవారం తుది ఫలితాలను విడుదల చేసింది. 2021 సివిల్స్ పరీక్షల్లో తొలి ప్రయత్నంలోనే ఐఆర్ఎస్కు ఎంపికైన విజయ్‌బాబు, ప్రస్తుతం విజయవాడలో ఆదాయపు పన్ను శాఖలో అసిస్టెంట్ కమిషనర్ (ఇన్వెస్టిగేషన్స్) బాధ్యతల్లో ఉన్నారు. ఐఏఎస్‌కు ఎంపిక కావాలన్న లక్ష్యం కోసం వరుసగా సివిల్స్ పరీక్షలురాస్తూ వచ్చారు. నాలుగో పర్యాయం 681 ర్యాంకు సాధించి ఐపీఎస్‌కు ఎంపికయ్యారు. అయినప్పటికీ తనకు సంతృప్తి లేదన్నారు. విశ్రాంత ఐఆర్ఎస్ అధికారి అయిన తన తండ్రి దోనేపూడి మధుబాబు కోరిక ప్రకారం ఐఏఎస్ అధికారి కావాలన్నదే తన కలగా విజయ్‌బాబు చెప్పారు. అందుకోసం మరోసారి సివిల్స్ రాస్తానని తెలిపారు. -
పిడుగుపాటుకు వ్యక్తి మృతి
నకరికల్లు: పిడుగుపాటుకు గురైన వ్యక్తి మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన మండలంలోని కుంకలగుంట గ్రామంలో సోమవారం రాత్రి జరిగింది. పోలీసుల సమాచారం మేరకు సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలాఉన్నాయి.. కుంకలగుంట గ్రామానికి చెందిన ఊసా నాగేంద్రబాబు(36) వరి విత్తనాలు చల్లేందుకు గాను కూలి పనులకు వెళ్లాడు. అదే సమయంలో కురుస్తున్న వర్షానికి పిడుగు పడింది. పిడుగుపాటుకు గురైన నాగేంద్రబాబు అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. బంధువులు హుటాహుటిన నరసరావుపేటలోని ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. మృతునికి భార్య శ్రావణి, ఒక కుమార్తె ఉన్నారు. ఘటనపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చల్లా సురేష్ తెలిపారు. -
మహాత్ములారా.. మన్నించండి!
దేశ స్వాతంత్య్రం కోసం అహర్నిశలు శ్రమించి, ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించిన, పీడిత వర్గాలకోసం తమ జీవితాలను త్యాగం చేసిన మహానుభావులు వారు.. అటువంటి గొప్పవారి చిత్రపటాలకు ఏ మాత్రం గౌరవ మర్యాదలు ఇవ్వకుండా, ఓ మూలకు పడేసిన వైనమిది. పెదకూరపాడు తహసీల్దార్ కార్యాలయంలో జాతిపిత మహాత్మా గాంధీ, మన్యం వీరుడు అల్లూరి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తదితర నేతల చిత్రపటాలను చెత్త వలే ఓ మూలన పడేసిన అధికారుల తీరుపై పలువురు మండిపడుతున్నారు. సాక్షాత్తు తహసీల్దార్ కార్యాలయంలో ఇటువంటి ఘటనలు జరిగితే ఎలాగంటూ ప్రశ్నిస్తున్నారు. – పెదకూరపాడు -
అన్నదాతకు అవమానం
దేశానికే అన్నం పెట్టే రైతు మెట్లపై కూలబడ్డాడు.. అధికారులు ఎప్పుడొస్తారో తెలీక.. అందాక కూర్చునే తావు లేక.. మళ్లీ ఎవరైనా కసురుకుంటారేమోనని బెరుకు బెరుకుగా.. మెట్లపై ఓ మూలన కూర్చున్నారు. అటు ఇటు కొందరు అధికారులు తిరుగుతున్నా.. మాకిది మామూలేననుకుంటూ వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. కలెక్టరేట్లో మంగళవారం ఉదయం 11:30 గంటలకు కనిపించిన చిత్రమిది. అడంగల్‌లో తప్పుల సవరణకు తామొచ్చామని.. గత రెండ్రోజులుగా తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జై కిసాన్.. రైతే రాజు.. అంటూ ప్రసంగాల్లో ఊదరగొట్టే నేతలు, అధికారులు చేతల్లో మాత్రం వారిని తీవ్రంగా అవమానిస్తున్నారు. సమయానికి పనులు చేయరు సరికదా.. కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేకుండా చేసి.. వారిని మెట్లపై కూర్చోబెట్టి అవమానించారంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. – సాక్షి, నరసరావుపేట -
టీచర్లకు ఇచ్చిన ఒక్క హామీనీ నెరవేర్చని ప్రభుత్వం
ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు చిలకలూరిపేట: ఎన్నికలకు ముందు ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ ప్రభుత్వం నెరవేర్చలేదని ఎస్టీయూ రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కె.కోటేశ్వరరావు, రాష్ట్ర డైరీ కమిటీ కన్వీనర్ పోటు శ్రీనివాసరావులు పేర్కొన్నారు. పట్టణంలోని సీపీఐ కార్యాలయంలో ఎస్టీయూ సంఘ సమావేశం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ఉద్యోగుల, ఉపాధ్యాయుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా ఉంటామని, ఎటువంటి బకాయిలు లేకుండా వెంటనే చెల్లిస్తామని ఇచ్చిన హామీలు ఏ మాత్రం నెరవేరలేదన్నారు. పెండింగ్ బకాయిలు, నాలుగు డీఏలు వెంటనే ప్రకటించాలన్నారు. వేతన సవరణ సంఘం చైర్మన్‌ను నియమించాలని, ఈ లోపు 30 శాతం మధ్యంతర భృతిని చెల్లించాలని డిమాండ్ చేశారు. జూన్ నెలలో బదిలీలు జరిగిన 60వేల మందికి పైగా ఉపాధ్యాయులకు నేటికీ జీతాలు అందలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటివరకు ఉపాధ్యాయ సంఘాలతో ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేయకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఎస్టీయూ నాయకులు వి.అక్కయ్య, కె.కోటేశ్వరరావు, వి.జయప్రకాశ్, షేక్ మగ్బూల్‌బాష, దుర్గా ప్రసాద్, జి.కోటేశ్వరరావు, సతీష్‌కుమార్, బి.రవి, మస్తాన్‌వలి తదితరులు పాల్గొన్నారు. -
ఇకపై ఉపాధి కూలీలకు ముఖ ఆధారిత హాజరు
జిల్లా ‘ఉపాధి’ పీడీ సిద్దా లింగమూర్తి శావల్యాపురం: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కూలీలకు ఇకపై ముఖ ఆధారిత హాజరు నమోదు చేస్తారని జిల్లా ఉపాధి హామీ పథకం పీడీ సిద్దా లింగమూర్తి అన్నారు. మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో నూజెండ్ల, బొల్లాపల్లి మండలాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లకు నూతన మస్టర్ విధానంపై శిక్షణా తరగతులు నిర్వహించారు. పీడీ మాట్లాడుతూ ఉపాధి పథకంలో అవినీతి, అక్రమాలు నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం నూతన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఒక్కో ఉపాధి కూలీ ముఖ ఆధారిత చిత్రాన్ని ఆన్లైన్లో పొందుపరచాలన్నారు. ఎఫ్‌ఏలు పని ప్రదేశంలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్‌తో హాజరు నమోదు చేయాలన్నారు. అలాగే ఈకేవైసీ నమోదు చేయించుకోని వారికి వేతనం మంజూరు కాదన్నారు. ఉపాధి శ్రామికులు చేసిన పనులకు సంబంధించిన పని కొలతలు, సమగ్ర వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. నూతన సాంకేతిక పరిజ్ఞానంపై గ్రామాల్లో క్షేత్రసహాయకులు ప్రచారం చేయాలన్నారు. నకలీ మస్టర్స్కు తావు లేకుండా నూతన విధానం దోహదపడుతుందన్నారు. శిక్షణా తరగతులు పూర్తికాగానే నూతన విధానం అమల్లోకి వస్తుందన్నారు. శిక్షణా తరగతుల్లో జిల్లా ప్లాంటేషన్ ఉద్యాన అధికారి శిరీషా, ఏపీడీ బూసిరెడ్డి, ఏపీఓలు ఆంజనేయరాజు, లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు. -
దక్షిణ మధ్య రైల్వే జీఎం తనిఖీలు
లక్ష్మీపురం: దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మంగళవారం పగిడిపల్లి – గుంటూరు – కృష్ణా కెనాల్ – విజయవాడ సెక్షన్లో తనిఖీలు చేపట్టారు. గుంటూరు డివిజనల్ రైల్వే మేనేజర్ సుధేష్ణ సేన్, విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా ఆయా ప్రాంతాల్లో పాల్గొన్నారు. ముందుగా జీఎం ఈ సెక్షన్లో రియర్ విండో తనిఖీ నిర్వహించారు. సిగ్నలింగ్, రైల్వే ట్రాక్‌ల నిర్వహణ పరిశీలించారు. నల్గొండ రైల్వే స్టేషన్లో వెయిటింగ్ హాల్, దివ్యాంగుల టాయిలెట్లు, లిఫ్ట్, తాగు నీటి సౌకర్యం వంటి వాటిపై సమీక్షించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా పునరాభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకున్నారు. తర్వాత గుంటూరు పట్టాభిపురంలోని గుంటూరు రైల్వే డివిజనల్ కార్యాలయంలో డివిజనల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా గుంటూరులో మొక్కలు నాటే కార్యక్రమంలో అధికారులతో కలిసి పాల్గొన్నారు. తర్వాత మంగళగిరి రైల్వే స్టేషన్‌కు వెళ్లి పరిశీలించారు. భద్రతా మార్గదర్శకాలను పాటించాలని, పనులను గడువు నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. -
ప్రకృతి వ్యవసాయంలో భాగస్వామ్యం కావాలి
జిల్లా ప్రకృతి వ్యవసాయ అధికారి అమలకుమారి ఈపూరు(శావల్యాపురం): ప్రకృతి వ్యవసాయంలో రైతుసేవా కేంద్రం వీఏఏలు భాగస్వామ్యం కావాలని జిల్లా ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజరు కె.అమలకుమారి అన్నారు. మంగళవారం ఈపూరులోని రైతుసేవా కేంద్రంలో బొల్లాపల్లి, శావల్యాపురం, ఈపూరు మండలాలకు చెందిన వీఏఏలకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కె.అమలకుమారి మాట్లాడుతూ రసాయనిక ఎరువులు మోతాదు పెరగటం వలన భూమిలో పోషకాల శాతం తగ్గిపోయి మానవాళి అంతు చిక్కని వ్యాధుల బారిన పడుతున్నారన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా భూమి ఆరోగ్యంగా ఉండి రైతులకు పెట్టుబడులు తగ్గి ఆదాయం పెరుగుతుందన్నారు. నీటి నిల్వ స్థాయి సామర్ధ్యం పెంపుదలతో పాటు భూసారం పెరుగుతుందన్నారు. జిల్లా డీడీఏ కార్యాలయ అధికారి హనుమంతరావు, వినుకొండ ఏడీఏ రవికుమార్, ఏఓలు రామినేని రామారావు, ఆంజనేయనాయక్, ప్రకృతి వ్యవసాయ శిక్షకులు సైదయ్య, డీటీ శివలక్ష్మి, తిరుపతిరావు, యూనిట్ ఇన్చార్జ్ ఆంజనేయులు, లక్షణ్నాయక్, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు
యడ్లపాడు: జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు యువకులకు తీవ్రగాయాలు కాగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఎస్ఐ టి.శివరామకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. చిలకలూరిపేట వైపునకు వెళుతున్న కారు టైర్ పంక్చర్ కావడంతో యడ్లపాడు జాతీయ రహదారిపై పిల్లికొండ వద్ద కారు నిలుపుదల చేసుకున్నారు. అయితే అదేమార్గంలో మండలంలోని జగ్గాపురం గ్రామానికి చెందిన అన్నలదాసు తేజ్‌పాల్, దావల యువరాజు అనే ఇద్దరు యువకులు బైక్‌పై చిలకలూరిపేట వైపునకు ప్రయాణిస్తున్నారు. కారుడ్రైవర్ అకస్మాత్తుగా డోర్ తెరవడంతో బైక్ వేగంగా వచ్చి డోర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు రోడ్డుపై పడి తీవ్రగాయాలయ్యాయి. గాయాలైన వారిని చిలకలూరిపేట, గుంటూరు పట్టణాల్లోని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. అయితే వారిలో ఒకరికి మెదడులో బ్లడ్ క్లాటై, పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సెప్టెంబర్ 13న జాతీయ లోక్ అదాలత్ తెనాలి రూరల్: జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో సెప్టెంబర్ 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. ఈ మేరకు మండల న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, 11వ అదనపు జిల్లా న్యాయమూర్తి డి.శ్రీనివాసులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని రకాల సివిల్, భరణం, బ్యాంకు దావాలు, మోటారు వాహనాల ప్రమాదాల కేసులు, రాజీ పడదగిన క్రిమినల్ కేసులను ఈ అదాలత్‌లో పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. -
ఇన్స్పైర్ రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలి
గుంటూరు ఎడ్యుకేషన్: విద్యార్థుల్లో వైజ్ఞానిక ఆలోచనలు రేకెత్తించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇన్స్పైర్ మానక్ విద్యా, వైజ్ఞానిక ప్రదర్శనకు విద్యార్థులతో పెద్ద సంఖ్యలో రిజిస్ట్రేషన్ చేయించాలని గుంటూరు జిల్లా ఉపవిద్యాశాఖాధికారి జి.ఏసురత్నం పేర్కొన్నారు. మంగళవారం పాత బస్టాండ్ సెంటర్లోని జిల్లా పరీక్షా భవన్లో ఇన్‌స్సైర్ మానక్‌పై డివిజన్ పరిధిలోని సైన్సు ఉపాధ్యాయులకు ఓరియెంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సైన్సు అధికారి షేక్ గౌసుల్‌మీరా అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏసురత్నం మాట్లాడుతూ భావి శాస్త్రవేత్తల రూపకల్పనకు నాందిగా ప్రతిభావంతులుగా తీర్చిదిద్దవచ్చునని అన్నారు. ప్రాథమికోన్నత బడుల నుంచి మూడు, ఉన్నత పాఠశాలల నుంచి ఐదు, హైస్కూల్ ప్లస్ నుంచి ఏడు చొప్పున నామినేషన్లు పంపాలని స్పష్టం చేశారు. పోస్టర్‌ను ఆవిష్కరించారు. జిల్లా సైన్సు అధికారి షేక్ గౌసుల్‌మీరా, రీసోర్సు పర్సన్లు డి. శివ శంకరరావు, డీవీ రమణ పాల్గొన్నారు. -
ఆల్ ఇండియా బిషప్స్ అండ్ పాస్టర్స్ ఫెలోషిప్ జాతీయ కార్యదర్శిగా క్రిష్టర్
చిలకలూరిపేటటౌన్: పట్టణంలోని శాంతినిలయం అధినేత, బ్రదర్ నందమూరి క్రిష్టర్ ఆల్ ఇండియా బిషప్స్ అండ్ పాస్టర్స్ ఫెలోషిప్ నేషనల్ జాయింట్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. గత శనివారం కోనసీమ జిల్లా తాపేశ్వరంలో జరిగిన జాతీయ స్థాయి పాస్టర్ల సమావేశంలో ఆయనను ఈ ఉన్నత పదవికి ఎన్నుకున్నట్లు తెలిపారు. 17 రాష్ట్రాల ప్రతినిధులు సభ్యులుగా ఉన్న ఈ ఫెలోషిప్‌లో పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న క్రిష్టర్ జాతీయ స్థాయి పదవిని చేపట్టడంపై పల్నాడు జిల్లా పాస్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా దైవసేవకులు నందమూరి క్రిష్టర్ మాట్లాడుతూ భవిష్యత్తులో దేశవ్యాప్తంగా క్రైస్తవుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు. ఆయన ఎన్నికతో క్రైస్తవ సమాజం మరింత బలోపేతం అవుతుందని పలువురు పాస్టర్లు, సేవకులు అభిప్రాయపడ్డారు. -
ట్రైబల్ ఫొటో అవార్డులకు ఎంపిక
కేసానుపల్లి సుబ్బారావు తీసిన వాటర్ క్యారీ ఫొటో వినుకొండ: అంతర్జాతీయ ఆదివాసి దినోత్సవాల సందర్భంగా క్రియేటివ్ కల్చర్ కమిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ, ఇంటర్నేషనల్ ఫొటోగ్రాఫిక్ కౌన్సిల్, ఫొటోగ్రఫీ అకాడమీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఫొటో కాంటెస్ట్‌లో వినుకొండకు చెందిన ఫొటోగ్రాఫర్లకు ట్రైబల్ ఫొటో ఆఫ్ ది ఇయర్ అవార్డు లభించింది. వినుకొండకు చెందిన వంగపల్లి బ్రహ్మయ్య తీసిన హ్యాపీనెస్, కేసానుపల్లి సుబ్బారావు తీసిన వాటర్ క్యారీ ఫొటోలు అవార్డులకు ఎంపికై నట్లు వారు తెలిపారు. ఈ నెల 18న విజయవాడలో అవార్డులు అందుకోనున్నట్లు వివరించారు. వంగపల్లి బ్రహ్మయ్య తీసిన హ్యాపీనెస్ ఫొటో -
నాణ్యమైన ఎరువులు విక్రయించాలి
బెల్లంకొండ: దుకాణదారులు రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలను విక్రయించాలని క్రోసూరు డివిజన్ ఏడీఏ మస్తానమ్మ సూచించారు. మంగళవారం మండలంలోని పలు ఎరువులు, విత్తనాలు, పురుగుమందుల దుకాణాలను తహసీల్దార్ ప్రవీణ్, మండల వ్యవసాయ అధికారి అరుణకుమారితో కలిసి తనిఖీ చేశారు. నాణ్యతలేని విత్తనాలను, ఎరువులను విక్రయిస్తే దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిషేధిత పురుగుమందుల విక్రయం నేరమన్నారు. రైతులకు నాణ్యత కలిగిన విత్తనాలనే విక్రయించాలని, అదేవిధంగా కొనుగోలు చేసిన ప్రతిదానికి రైతులకు బిల్లులు ఇవ్వాలని సూచించారు. లయన్స్ క్లబ్ జిల్లా రీజినల్ సెక్రటరీగా రామకోటయ్య సత్తెనపల్లి: లయన్స్ క్లబ్ జిల్లా రీజినల్ సెక్రటరీగా లయన్స్ క్లబ్ ఆఫ్ సత్తెనపల్లి టౌన్ మాజీ అధ్యక్షుడు, మాజీ జోన్ చైర్మన్ పొత్తూరి రామకోటయ్య నియమితులయ్యారు. 316 హెచ్ జిల్లా గవర్నర్ సీహెచ్ హరిప్రసాద్ నుంచి మంగళవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. పొత్తూరి రామకోటయ్య 2025–26 పల్నాడు జిల్లా రీజినల్ సెక్రటరీగా కొనసాగుతారు. ఈ సందర్భంగా లయన్స్ రీజినల్ చైర్మన్ తోట చిన్న సాంబయ్య. లయన్స క్లబ్ సభ్యులు, మిత్రులు, పలువురు రామకోటయ్యకు అభినందనలు తెలిపారు. ప్రకృతి సాగు భేష్ పెదకూరపాడు: ప్రకృతి వ్యవసాయంలో రాష్ట్ర అభ్యుదయ రైతు అవార్డు గ్రహీత దర్శి శేషారావు ఆదర్శనీయమని సత్తెనపల్లి వ్యవసాయ శాఖ ఏడీఏ బోడపాటి రవికుమార్ అన్నారు. మంగళవారం పొలం పిలుస్తుంది కార్యక్రమంలో భాగంగా శేషారావు పొలాన్ని ఏడీఏ పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ 30 రకాలతో తీగజాతి, చెట్టు జాతి, కాయ జాతి, నూనె జాతి, పప్పు జాతి రకాలు వేసిన పొలాన్ని ఇప్పుడే మొట్టమొదటిసారి చూస్తున్నామన్నారు. వాణిజ్య పంటలు వేసే ప్రతి రైతు ముఖ్యంగా మిరప సాగు చేసే రైతులు పీఎండీఎస్ వేసుకోవాలన్నారు. పీఎండీఎస్ వేయటం ద్వారా ప్రధాన పంటకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. పంట ఖర్చులు కూడా తగ్గించుకోవచ్చన్నారు. ఆయన వెంట పెదకూరపాడు మండల వ్యవసాయ శాఖ అధికారి డి.కృష్ణయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
టీపీఓపై అవినీతి ఆరోపణలపై క్షేత్రస్థాయిలో విచారణ
టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ మధుకుమార్ సత్తెనపల్లి: సత్తెనపల్లి టౌన్ ప్లానింగ్ అధికారి(టీపీఓ) రాధాకృష్ణపై క్షేత్రస్థాయిలో విచారించి చర్యలకు సిఫార్సు చేస్తానని టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ గుంటూరు రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ పి.మధుకుమార్ అన్నారు. సత్తెనపల్లి టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండటమే కాక కార్యాలయం ముగిసిన తర్వాత ప్లానింగ్ సెక్రటరీల ద్వారా అవినీతికి పాల్పడుతున్నారని, ఇటీవల కౌన్సిల్ సాధారణ సమావేశంలో పెద్దఎత్తున ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విచారణ నిమిత్తం మధు కుమార్ సత్తెనపల్లి పురపాలక సంఘాన్ని మంగళవారం సందర్శించారు. మున్సిపల్ చైర్పర్సన్ చల్లంచర్ల లక్ష్మీతులసి, 4వ వార్డ్ కౌన్సిలర్ కటకం రామకృష్ణలతో పాటు మరికొందరు టీపీఓ రాధాకృష్ణపై పలు ఆరోపణలు చేయడమే కాకుండా లిఖితపూర్వకంగా కూడా ఫిర్యాదు అందించారు. ఈ క్రమంలో క్షుణ్ణంగా పరిశీలన జరిపారు. అనంతరం టౌన్ ప్లానింగ్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా మధుకుమార్ మాట్లాడుతూ మరో రెండు రోజుల్లో ప్రత్యేక టీంను ఏర్పాటు చేస్తానని, ఆ టీం క్షేత్రస్థాయిలో అనధికార లేఅవుట్లు, ఆక్రమణలు తొలగింపులో పక్షపాత ధోరణి, అంతేకాక ఎవరెవరు దగ్గర ఎలాంటి వసూళ్లకు పాల్పడ్డారనే అంశాలపై విచారణ జరిపి నివేదిక ఇస్తుందని, దాని ప్రకారం చర్యలకు డీటీసీకి సిఫార్సు చేస్తానన్నారు. ఆయనతో పాటు ఆర్డీ కార్యాలయ టీపీఓ పూర్ణచంద్ర రావు ఉన్నారు. -
అర్జీల పరిష్కారంలో జాప్యం తగదు
నరసరావుపేట: ప్రజలు అందించిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు అధ్యక్షత వహించి జాయింట్ కలెక్టర్ సూరజ్ గనోరే, డీఆర్ఓ ఏకా మురళిలతో కలిసి జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వారిచే 91 అర్జీలు స్వీకరించారు. కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో ఎటువంటి జాప్యానికి తావులేకుండా నాణ్యతతో పరిష్కరించాలన్నారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలను తెలుసుకుని పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. జిల్లా అధికారులు వారి శాఖలకు సంబంధించిన అర్జీలను క్షుణంగా పరిశీలించి తమ సిబ్బందితో నిర్ణీత గడువులోగా త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్డీఓ కె.మధులత, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.పీజీఆర్ఎస్లో 91 అర్జీలు స్వీకరించిన కలెక్టర్ అరుణ్‌బాబు -
రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు ఏడుగురు ఎంపిక
సత్తెనపల్లి: రాష్ట్ర స్థాయి యోగా పోటీలకు సత్తెనపల్లి నుంచి ఏడుగురు ఎంపిక య్యారు. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ పల్నాడు జిల్లా, నేషనల్ యోగా స్పోర్ట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా స్థాయిలో యోగాసనాలు పోటీలు నరసరావుపేట సరస్వతి శిశు మందిర్ స్కూల్లో ఈ నెల 3న నిర్వహించారు. ఈ పోటీలలో సత్తెనపల్లి శక్తి యోగ యోగా గురువు ఎం. రమేష్ సారధ్యంలో సభ్యులు పాల్గొన్నారు. సత్తెనపల్లికి చెందిన ఎమ్ సునీల్‌కుమార్, తల్లం ఆంజనేయులు, ధనేకుల సాంబశివరావు, వల్లూరు శ్రీనివాస్, పులహరి భానోజి, పులికొండ శ్రీనివాసరావు, మహిళా విభాగంలో డి. కాత్యాయినీ ఏడుగురు గోల్డ్ మెడలు, మెరిట్ సర్టిఫికెట్స్ సాధించటంతో పాటు రాష్ట్రస్థాయి పోటీలకు అర్హత సంపాదించారు. గూడ్స్ రైలు ఢీకొని వృద్ధుడి మృతి నరసరావుపేట టౌన్: రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు గూడ్స్ రైలు ఢీకొని ఓ వృద్ధుడు మృతి చెందినట్లు ఇన్చార్జి రైల్వే ఎస్ఐ రమేష్‌బాబు సోమవారం తెలిపారు. నరసరావుపేట నుంచి మునుమాక వెళ్లే రైలు మార్గంలో ఆదివారం గుంటూరుకు చెందిన పెండెం సాయిబాబు(65) పట్టాలు దాటుతుండగా ఆ సమయంలో వచ్చిన గూడ్స్ రైలు ఢీకొంది. సంఘటనలో తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని సోమవారం బంధువులకు అప్పగించారు. రెంటచింతలలో చోరీ బంగారు ఆభరణాలు..నగదు అపహరణ రెంటచింతల: రెంటచింతలలోని రేంజర్‌గారి బజారులో జరిగిన భారీ చోరీ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక రేంజర్‌గారి బజారులో నివసిస్తున్న జెట్టిపాలెం ఏపీ మెడల్ స్కూల్ పాఠశాల ఉపాధ్యాయుడు గెల్లిపోగు జనార్ధనరావు మాచర్ల పట్టణంలో ఉంటున్న తన తల్లి మరియమ్మను చూడటానికి శనివారం భార్యతో కలిసి వెళ్లారు. తిరిగి సోమవారం వచ్చే సమయానికి ఇంటి తాళాలు పగులగొట్టి తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువాలో దాచిన 122 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 20 వేల నగదు దొంగలు అపహరించినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని కారంపూడి సీఐ టీవీ శ్రీనివాస రావు, ఎస్ఐ సీహెచ్ నాగార్జున పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అట్టహాసంగా పోలేరమ్మ జాతర
బాపట్ల అర్బన్: బాపట్ల పట్టణంలోని రామకృష్ణాపురంలో ఉన్న మహాలక్ష్మి అమ్మవారి చెట్టు వద్ద మూడోరోజు పోలేరమ్మ కొలుపులు సోమవారం ఘనంగా జరిగాయి. మొదటి రోజు ఆడపడుచులు అందరూ కలిసి అమ్మవారికి పొంగళ్లు సమర్పించి మొక్కులు చెల్లించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అభిషేక మహోత్సవాన్ని వీక్షించడానికి, అమ్మవారి కృపకు పాత్రులు కావడానికి దూర ప్రాంతాల్లో నివసించే వారితోపాటు చుట్టూ పక్కల గ్రామ ప్రజలు హాజరయ్యారు. పోలేరమ్మ జాతర మహాలక్ష్మి గుడినిపూలు, విద్యుత్ దీపాలతో అలకరించారు. కోలాట ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. సుమారు 20 మంది పాటలతో లయబద్ధంగా నాట్య ప్రదర్శన చేశారు. కార్యక్రమంలో నాదెండ్ల రాంబాబు, పేరాల నాగేశ్వరరావు, కొన్నే వెంకటేశ్వర్లు, నామేపల్లి లక్ష్మీనారాయణ, శంఖవరపు రాంబాబు, పెద్ద వెంకట్రావు, చిన్న వెంకటరావు, మణి, శరత్, మహేష్, వినుకొండ శ్రీను, కొండవీటి శ్రీను,సాంబ, పత్తిపాటి సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆకట్టుకున్న పెద్దలు, చిన్నారుల నృత్యాలు -
ఎరువుల వాడకంపై అవగాహన కల్పించాలి
నరసరావుపేట రూరల్: ఎరువుల వాడకం తగ్గించే విధంగా రైతులకు వ్యవసాయ సిబ్బంది అవగాహన కల్పించాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు తెలిపారు. జిల్లా వనరుల కేంద్రం ఆధ్వర్యంలో నరసరావుపేట సబ్‌డివిజన్‌లోని రైతు సేవా కేంద్రం సిబ్బందికి శిక్షణ కార్యక్రమాన్ని సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా వ్యవసాయ అధికారి జగ్గారావు పాల్గొని మాట్లాడారు. రైతు సేవా కేంద్రం ఇన్‌చార్జ్‌లు రైతులతో సత్ససంబంధాలు కలిగి ఉండాలని తెలిపారు. ప్రతి రైతు వేసిన పంటను నమోదు చేయాలని, పంట వేయకపోతే వేయలేదని కూడా నమోదు చేయాలని తెలిపారు. వీఏఏలు రైతులకు అందుబాటులో ఉండాలని సూచించారు. జిల్లా వనరుల కేంద్రం డీడీఏ శివకుమారి మాట్లాడుతూ వివిధ పంటలలో కలుపు నివారణ, ఎరువుల వాడకంపై అవగాహన కల్పించారు. భూసారం పెంచేందుకు రసాయన ఎరువుల ప్రత్యామ్నాయ మార్గాలైన పచ్చిరొట్ట, పీఎండీఎస్లు పైరులు వేసి 45 రోజులకు భూమిలో కలియదున్నాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాట్ సెంటర్ కో–ఆర్డినేటర్ ఎం.నగేష్, జిల్లా వనరుల కేంద్ర వ్యవసాయ అధికారి ఎం.అరుణ తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి ఎం.జగ్గారావు -
ఎరువుల పంపిణీలోనూ వివక్ష
నరసరావుపేట: రాష్ట్రంలో రైతులకు పార్టీల పేరుతో ఎరువులు ఇవ్వకుండా కూటమి ప్రభుత్వం ఘోరంగా అవమానిస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపుమేరకు సోమవారం పార్టీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి విడుదల రజిని, వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ గజ్జల సుధీర్ భార్గవరెడ్డి కలెక్టరేట్లో జరుగుతున్న ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబును కలిసి రైతులకు కావాల్సిన యూరియూను తక్షణమే అందుబాటులోకి తీసుకొని రావాలని, రైతులందరికీ సమానంగా ఎరువులను పంపిణీ చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి పడాల సాంబశివారెడ్డి, పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శి పడాల చక్రారెడ్డి, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు అన్నెం పున్నారెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు పదముత్తం చిట్టిబాబు, పట్టణ అధ్యక్షుడు షేక్ కరిముల్లా, మాదిగ, గిరిజన కార్పొరేషన్ మాజీ డైరక్టర్లు కందుల ఎజ్రా, పాలపర్తి వెంకటేశ్వరరావు, భవనం నరిసిరెడ్డి, పలువురు సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రైతులకు పార్టీలు అంటగట్టడం దుర్మార్గం యూరియాను బ్లాక్‌లో అమ్మకుండా చర్యలు తీసుకోవాలి త్రీ మెన్ కమిటీ పేరుతో టీడీపీ వారికే ఎరువులు ఇవ్వటం ఘోరం రైతులకు పార్టీ ముద్ర వేయకుండా ఎరువులు అందజేయాలి ఏ పంటకు గిట్టుబాటు ధర ఇస్తారో ప్రభుత్వం తక్షణమే రైతులకు తెలియజేయాలి రైతులపై కూడా రెడ్‌బుక్ అమలు చేస్తున్న ప్రభుత్వం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్ సీపీ జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు డాక్టర్ గోపిరెడ్డి, మాజీ మంత్రి విడుదల రజిని, బొల్లా తదితరులు టీడీపీ వారికే ఇస్తున్నారు : గోపిరెడ్డి డాక్టర్ గోపిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పల్నాడు జిల్లాకు ఖరీఫ్, రబీ పంటలకు కలిపి మొత్తం 1,20,540 టన్నుల యూరియా అవసరమైతే ఇప్పుటిదాకా సమకూర్చింది కేవలం 23,142 టన్నులు మాత్రమేనన్నారు. మిగిలిన 50 వేల టన్నుల యూరియాను రైతులకు అందజేయాలని పార్టీ తరఫున పల్నాడు జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇచ్చామన్నారు. అదేవిధంగా డీఏపీ 51,883 టన్నులు అవసరమైతే కేవలం 9337 టన్నులు మాత్రమే ఇచ్చారని, 3,51,765 టన్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరమైతే 62,160 మాత్రమే అందుబాటులో ఉన్నాయన్నారు. యూరియా ప్రైవేట్ మార్కెట్లో బ్లాక్‌లో అమ్ముతున్నారని, ప్రభుత్వ సొసైటీలో కూడా చూస్తే, త్రీమెన్ కమిటీ పేరుతో టీడీపీ వారికే ఇస్తున్నారన్నారు. -
షూటింగ్ బాల్ జిల్లా జట్ల ఎంపిక
సత్తెనపల్లి: జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జూనియర్ బాల, బాలికల జిల్లా జట్ల ఎంపికలు సత్తెనపల్లి మండలం గుడిపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించారు. బాలుర విభాగంలో 80 మంది, బాలికల విభాగంలో 60 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెలలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగే రాష్ట్రస్థాయి క్రీడా పోటీలలో పాల్గొంటారని జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మువ్వా నరసింహారావు, ప్రధాన కార్యదర్శి కోనంకి కిరణ్ కుమార్ తెలిపారు. బాలుర జట్టుకు: కె. వెంకట్, జి.నవీన్, పి.మోబీన్, బి.రిషి, జి.వెంకటేష్, షేక్.అబ్దుల్, ఎం.హఫీజ్, ఎం.మహీధర్, కె.ప్రవీణ్, జి.మాంజి, కె.సుధీర్, ఎస్.భార్గవ్‌లు ఎంపికయ్యారు. బాలికల జట్టుకు : యమ్.విజయ పరిమళ, కె.హిమ బిందు, జె.లక్ష్మి కీర్తన, జె.యశస్విని, పి.మేఘన, పి.సుచరిత, ఎం.నందిని, సిహెచ్.అక్షర, కె.హర్షిత, టి.సింధు, ఎం.జ్యోతిక, ఎస్.మధులు ఎంపికయ్యారు. వ్యాయామ ఉపాధ్యాయులు లాకు పిచ్చయ్య, బి.అనీల్‌దత్తానాయక్, షేక్.మెహబూబి, బి.తులసీరామ్‌నాయక్, ఎ.చిన్నయ్య, తిరుపతమ్మ, రత్నాకర్, యమ్.ప్రసన్న, పి.శివరామకృష్ణ ఎంపిక కార్యక్రమంలో పాల్గొన్నారు. -
ద్విచక్ర వాహనాలపై స్పెషల్ డ్రైవ్
జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు నరసరావుపేట రూరల్: రోడ్డు ప్రమాదాల నుంచి ప్రజల విలువైన ప్రాణాలను కాపాడేందుకు ట్రాఫిక్ ఉల్లంఘనకు పాల్పడే ద్విచక్ర వాహనాలపై ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు సోమవారం తెలిపారు. డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించే కార్యక్రమంలో భాగంగా జిల్లాలో డ్రైవ్ కొనసాగుతుందన్నారు. ఈ నెల 4 నుంచి 10వ తేదీ వరకు డ్రంకెన్ డ్రైవ్, 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అతి వేగంగా ద్విచక్ర వాహనం నడిపే వారిపై, 18 నుంచి 24 వరకు హెల్మెట్ ధరించని వారిపై, 25 నుంచి 31వ తేదీ వరకు బ్లాక్ స్పాట్స్ వద్ద అన్ని రకాల ఉల్లంఘనలకు పాల్పడే ద్విచక్రవాహనదారులపై కేసులు నమోదు చేసేందుకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. తల్లిపాలు బిడ్డ హక్కు ప్రత్తిపాడు: తల్లిపాలు బిడ్డ హక్కు అని మహిళా శిశు సంక్షేమ శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎస్. జయలక్ష్మి అన్నారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా సోమవారం గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడు పాలెం–2 అంగన్వాడీ కేంద్రంలో గర్భిణులు, బాలింతలకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన రీజనల్ జాయింట్ డైరెక్టర్ ఎస్.జయలక్ష్మి మాట్లాడుతూ తల్లిపాలు శిశువు జీవితానికి రక్షణ అని, ఆరోగ్య భవితకు బలమైన పునాదని చెప్పారు. తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డతో పాటు తల్లికి కూడా శారీరక, మానసిక ధృఢత్వం లభిస్తుందన్నారు. తదనంతరం కేంద్రంలో ప్రీస్కూల్ నిర్వహణ, రిజిస్టర్లును పరిశీలించారు. సీడీపీవో జి. విజయలక్ష్మి, ఏసీ డీపీవో సీహెచ్. విజయనిర్మల, సూపర్వైజర్లు ఎం.వీ రత్నం, ఎంఎల్‌హెచ్‌పి మేఘన, ఎంఎస్కె బి. సుశీల పాల్గొన్నారు. ప్రత్తిపాడు మండలంలో.. ప్రత్తిపాడు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మండల స్థాయి అధికారులకు ఐసీడీఎస్ సిబ్బంది తల్లిపాల ప్రాముఖ్యతను వివరించారు. తహసీల్దార్ సుజాత, ఎంఈవో సీహెచ్. రమాదేవి, ఈవోపీఆర్డీ షేక్ ఆదంషఫీ, ఏవో సుగుణబేగంతో పాటు ఆయా శాఖల అధికారులు తల్లిపాల ఆవశ్యతను వివరించే కరపత్రాలు పోస్టర్లును ఆవిష్కరించారు. కౌలు రైతులకు సుఖీభవ వర్తింప చేయాలి లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రాష్ట్రంలో 60 నుండి 70 శాతం భూమిని కౌలురైతులే సాగుచేస్తున్నారని, వీరికి గుర్తింపు కార్డులు, పంట రుణాలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని కౌలు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కె.హరిబాబు అన్నారు. గుంటూరు బ్రాడీపేటలోని సంఘం జిల్లా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌలు రైతులకు గుర్తింపు కార్డులు మంజూరు చేయాలంటే భూ యజమాని సంతకం కావాలనే నిబంధన వల్ల గుర్తింపు కార్డులు పొందలేకపోతున్నారన్నారు. -
జిల్లా ఎస్పీ కార్యాలయంలో కాన్ఫరెన్స్ హాల్ ప్రారంభం
నరసరావుపేట రూరల్: జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నూతనంగా నిర్మించిన కాన్ఫరెన్స్ హాల్‌ను ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి సోమవారం ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. నూతన హాల్లో మొదటి క్రైమ్ రివ్యూ సమావేశాన్ని ఐజీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేర సమీక్షలు, శాఖాపరమైన అంతర్గత సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహణలో ఇది కీలకపాత్ర పోషిస్తుందన్నారు. జిల్లా కలెక్టర్ అరుణ్‌బాబు మాట్లాడుతూ పోలీసు ప్రధాన కార్యాలయంలో నూతనంగా హాల్ నిర్మించుకోవడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు మాట్లాడుతూ నూతన హాల్లో ప్రారంభ సమావేశాన్ని బ్యాంకర్లతో నిర్వహిస్తున్నట్టు తెలిపారు. -
ప్రారంభించిన 15 రోజులకే కుంగిన రోడ్డు
పెదకూరపాడు : జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ. కోటి 50 లక్షలతో నిర్మించిన రహదారి ప్రారంభించిన 15 రోజులకే కుంగిపోయింది. జూలై 18వ తేదీన రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చేతుల మీదుగా ఈ రహదారి ప్రారంభోత్సవం జరిగింది. ఇప్పుడీ రహదారి కంభంపాడు జలాలపురం మధ్య కుంగిపోయింది. నాసిరకం నిర్మాణానికి ఇదొక నిదర్శనంగా నిలిచింది. గారపాడులో పంచలోహ విగ్రహాలు చోరీ పెదకూరపాడు: గారపాడు గ్రామంలో ఆదివారం పంచలోహ విగ్రహాలు చోరీకి గురయ్యాయి. ఆలయ అర్చకులు గొట్టుముక్కల ఆంజనేయులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలోని వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో పూజల నిర్వహించేందుకు ఆదివారం ఉదయం అర్చకులు తలుపులు తెరవగా స్వామివారి, అమ్మవారి కళ్యాణ పంచలోహ విగ్రహాలు కనిపించలేదు. దక్షిణం వైపు గేటు తాళాలు పగలగొట్టి ఉండటం గమనించి స్థానికులకు, ఆలయ కమిటీ సభ్యులకు సమాచారం అందించారు. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సీఐ పత్తిపాటి సురేష్, ఎస్సై గిరిబాబులు సంఘటన స్థలానికి చేరుకొని సోమవారం విచారించారు. క్లూస్ టీం ద్వారా ఆనవాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు సురేష్ తెలిపారు. నేడు ప్రభుత్వ ఉద్యోగుల ఛాయ్ పే చర్చ నరసరావుపేట ఈస్ట్: ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు ఈ నెల 5వ తేదీన కలెక్టరేట్ ఆవరణలోని క్యాంటీన్ వద్ద ‘రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం’ కార్యక్రమం చేపడుతున్నట్టు సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షుడు స్వర్ణ చినరామిరెడ్డి తెలిపారు. సోమవారం ఏర్పాటు చేసిన కార్యవర్గ సభ్యుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సంఘం రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు కే.ఆర్.సూర్యనారాయణ, రమేష్‌కుమార్ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు వివరించారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు చుక్కా వెంకటేశ్వర్లు, కంపాల వెంకటేశ్వర్లు, షేక్.బాజీ, ఏ.భాగ్యమేరీ, రేణుక తదితరులు పాల్గొన్నారు. సాగర్ నీటిమట్టంవిజయపురిసౌత్: నాగార్జు సాగర్ జలాశయ నీటిమట్టం సోమవారం 586.50 అడుగులకు చేరింది. ఇది 302.9125 టీఎంసీలకు సమానం. సాగర్ జలాశయం నుంచి కుడి కాలువకు 5,088, ఎడమ కాలువకు 8,280, ప్రధాన జలవిద్యుత్ కేంద్రానికి 28,664, ఎస్ఎల్బీసీకి 1,800, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్ ఫ్లోగా 44,132 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 66,407 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. లక్ష్మీ నృసింహస్వామి వారికి చైన్ బహుకరణ మంగళగిరి: మంగళాద్రిలోని లక్ష్మీనృసింహస్వామి వారికి విజయవాడకు చెందిన మండ్రు శ్రీనివాస్, భాగ్యశ్రీ దంపతులు రూ.లక్ష విలువైన పింక్ కలర్ రాయి చైన్‌ను బహూకరించారు. అలాగే రాజ్యలక్ష్మి అమ్మవారికి మంగళగిరి పట్టణానికి చెందిన మానుకొండ వీరభద్రరావు, శివపార్వతి దంపతులు రూ. లక్ష విలువైన తిరునామాలను అందజేశారు. -
రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఎన్డీఏ కృషి
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ నరసరావుపేట ఈస్ట్: రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించిన మాధవ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా రెండవ విడతగా పల్నాడు జిల్లాలో సారధ్యం పర్యటనను సోమవారం నిర్వహించారు. జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. పల్నాడు ప్రాంతంలో పొగాకు పండించే రైతుల అభ్యున్నతికి రూ.200 కోట్లతో పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఉదయం వివిధ క్షేత్రాల సమావేశం నిర్వహించి స్టేషన్‌రోడ్డులో ఛాయ్‌పే చర్చ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబుతో కలిసి పల్నాడు ప్రాంత సమస్యలపై ప్రజల నుంచి తెలుసుకున్నారు. అనంతరం పల్నాడు రోడ్డులోని ఎస్ఎస్ఎన్ కళాశాల వద్ద నుంచి జమిందార్ ఫంక్షన్ హాల్ వరకు ర్యాలీ నిర్వహించి ఫంక్షన్హాల్లో కార్యకర్తల విస్త్రృత స్థాయి సమావేశంలో పాల్గొన్నారు. సాయంత్రం జిల్లా మేధావుల సదస్సులో పాల్గొని సమస్యలను తెలుసుకున్నారు. చిన్నారులపై అసభ్య ప్రవర్తన వ్యక్తిపై పోక్సో కేసు నమోదు తాడేపల్లిరూరల్: పెనుమాకలో నివాసం ఉండే ఓ వ్యక్తి బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించిన సంఘటనపై పోలీసులు సోమవారం పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. బుక్కా వీరయ్య అనే వ్యక్తి ఆ ప్రాంతంలో వున్న 9, 10 సంవత్సరాల బాలికల పట్ల అసభ్యంగా ప్రవర్తించి, ముళ్ల పొదల్లోకి తీసుకువెళుతున్నాడు. ఆదివారం కూడా ఒక బాలికను ఇదేవిధంగా చేయడంతో గమనించిన తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని పోలీసులు తెలిపారు. బాలికను వేధిస్తున్న యువకుడిపై.. తెనాలిరూరల్: ఇంటర్ చదువుతున్న బాలికను వేధింపులకు గురి చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదైంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన 15 ఏళ్ల బాలిక ఇంటర్ ఫస్టియర్ చదువుతోంది. బాలిక కళాశాలకు వెళ్లి వచ్చేటప్పుడు, చినరావూరుకు చెందిన యువకుడు విజయ్ వేధిస్తున్నాడు. ఈ విషయమై బాలిక తల్లిదండ్రులకు తెలియజేయగా వారి సహాయంతో వన్ టౌన్ పోలీసులను ఆశ్రయించింది. నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసినట్టు పోలీసులు సోమవారం తెలిపారు. పీజీ 4వ సెమిస్టర్ ఫలితాలు విడుదల పెదకాకాని(ఏఎన్యు): ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ నెలలో జరిగిన పీజీ నాలుగో సెమిస్టర్ ఫలితాలను విడుదల చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాద్ సోమవారం తెలిపారు. ఎంఏ తెలుగు, సంస్కృతం, హిస్టరీ, పొలిటికల్ సైనన్స్, ఎంబీఏ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, హాస్పిటల్ మేనేజ్మెంట్, ఎంబీఏ టీటీఎం జిల్లా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. రీవాల్యుయేషన్‌కు ఈనెల 13వ తేదీ లోపు ఒక్కొక్క పేపర్ కు రూ.1860లు చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకోవాలన్నారు. జిరాక్స్ కాపీల కోసం రూ.2190లు చెల్లించాలని ఆయన సూచించారు. -
పని ఒత్తిడి పెంచిన ఈ ఫోన్లు మాకొద్దు
నరసరావుపేట: ఒక వైపు యాప్‌ల భారం, మరో వైపు సక్రమంగా పనిచేయని ఫోన్లతో అంగన్వాడీలకు పని ఒత్తిడి పెరిగి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ (సీఐటీయు) పల్నాడు జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటూరు మల్లేశ్వరి అన్నారు. సోమవారం యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అంగన్వాడీల వద్ద ఉన్న ఫోన్లను నరసరావుపేట ప్రాజెక్టు కార్యాలయంలో సీడీపీఓ కాంత కుమారికి అందజేశారు. ఈ సందర్భంగా మల్లేశ్వరి మాట్లాడుతూ ఎఫ్.ఆర్.ఎస్ ద్వారా సరుకులు ఇవ్వాలని పెట్టిన నిబంధన విరమించుకోవాలన్నారు. ఫోన్ సక్రమంగా పనిచేయక, సరుకులు నెలలో ఒక్కసారిగా ఇవ్వకపోవడం వంటి కారణాలతో అంగన్వాడీలతో పాటు లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. మాతా, శిశు సంరక్షణలో అంగన్వాడీల పాత్ర కీలకమని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించి అంగన్వాడీలకు పనిభారం తగ్గించాలని కోరారు. 5జి ఫోన్లు పంపిణీ చేయాలని యూనియన్ రాష్ట్ర నాయకులు ప్రభుత్వం దృష్టికి అనేకమార్లు తీసుకెళ్లారని, అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేస్తున్నారే కానీ ఫోన్లు పంపిణీ చేయకపోవడాన్ని నిరసిస్తున్నామన్నారు. 5 జి ఫోన్లు పంపిణీ చేసి యాప్‌లు క్రమబద్ధీకరించే వరకు రికార్డులలో లబ్ధిదారులచే సంతకాలు చేయించి పోషకాహారం పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం సమ్మెలు, ధర్నాలు ఏమీ చేయడం లేదని పనిఒత్తిడి పెరిగిన నేపథ్యంలో రికార్డుల ద్వారా పనిచేస్తామని చెప్పారు. ప్రాజెక్టు అధ్యక్ష, కార్యదర్శులు కవిత, నిర్మల, అంగన్వాడీలు మాధవి, విజయలక్ష్మి, రమణ, కమురూన్, హసీనా, ఏలీనా పాల్గొన్నారు. సీడీపీఓ కార్యాలయంలో ఫోన్లు అందజేసిన అంగన్వాడీ యూనియన్ నాయకులు -
క్వారీ అనుమతులు రద్దు చేయాలి
నరసరావుపేట: బాపట్ల జిల్లా బల్లికురవ క్వారీలో భద్రత చర్యలు తీసుకోని యాజమాన్యంపై చర్యలు తీసుకుని అనుమతులు రద్దు చేయాలని పౌరహక్కులు, ప్రజాసంఘాల నాయకులు కోరారు. సంబంధిత శాఖల అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగిందని, వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని, మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.1కోటి నష్టపరిహారం ఇవ్వాలని, క్షతగాత్రులకు రూ.25 లక్షలు చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. సోమవారం క్వారీ ప్రమాద స్థలంతో పాటు నరసరావుపేట పట్టణంలోని ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితులను పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్, పీడీఎం రాష్ట్ర నాయకులు వై.వెంకటేశ్వరరావు, నల్లపాటి రామారావు, బీసీ నాయకులు బాదుగున్నల శ్రీనివాసరావు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు నరసరావుపేటలో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ అనుమతులకు మించి క్వారీలో లోతులోకి వెళ్లి తవ్వకాలు పెద్ద ఎత్తున చేపట్టారని అన్నారు. ప్రమాద స్థలాన్ని పరిశీలిస్తే క్వారీ యజమానులు ఎలాంటి భద్రత చర్యలు తీసుకున్నట్లు ఆధారాలు కన్పించట్లేదన్నారు. రెవెన్యూ, కార్మిక శాఖ, మైనింగ్ శాఖ పర్యవేక్షణ లోపించడం వలన ఇలాంటి ప్రమాదాలు తరచూ సంభవిస్తున్నాయని అన్నారు. డిమాండ్ చేసిన పౌరహక్కులు, ప్రజాసంఘాల నాయకులు -
అర్జీలు ఇస్తున్నా.. పరిష్కారం సున్నా
నరసరావుపేట రూరల్: తమకు జరుగుతున్న అన్యాయంపై, తమ సమస్యలపై ఇప్పటికే పోలీసు పీజీఆర్ఎస్లో పలుమార్లు అర్జీలు ఇచ్చామని, అయితే వాటిని ఇంతవరకు పరిష్కరించలేదని పలువురు బాధితులు జిల్లా ఎస్పీతో మొరపెట్టుకున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎస్పీ కె.శ్రీనివాసరావు పాల్గొని ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో కుటుంబ, ఆర్థిక, ఆస్తి తగాదాలు, మోసం తదితర 106 సమస్యలపై ఫిర్యాదులు అందాయి. పీజీఆర్ఎస్లో రెండు సార్లు ఫిర్యాదు చేశా.. నాతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు మా ఇంటిపై దాడి చేసి చంపుతామని అన్నెం శివగోపినాథ్ అనే వ్యక్తి బెదిరిస్తున్నాడు. దీనిపై ఇప్పటికే రెండుసార్లు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశాను. ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తాజాగా శివగోపినాథ్, కాకుమాను సుధాకర్‌లు నన్ను దుర్భాషలాడుతూ మేం ఎమ్మెల్యే మనుషులం ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు కేసులు పెట్టరు మా మాటే వింటారు అంటూ బహిరంగంగా చెబుతున్నారు. ఇంటిపై దాడికి పాల్పడిన సీసీ ఫుటేజ్ ఇచ్చినా ఇంతవరకు పోలీసులు పరిశీలించలేదు. కేసు నమోదు చేసి న్యాయం చేయాలని ఎస్పీని కోరాను. – కె.స్నేహరెడ్డి, న్యాయవాది, నరసరావుపేట ఎస్పీతో మొరపెట్టుకున్న పలువురు బాధితులు జిల్లా ఎస్పీ కార్యాలయంలోప్రజా సమస్యల పరిష్కార వేదిక ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ కె.శ్రీనివాసరావు -
పంపిణీపై పచ్చ ముద్ర
సాక్షి, నరసరావుపేట: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బియ్యం, పంచదార, కందిపప్పు, రాగులు, ఇతర తృణధాన్యాలు వంటి సరుకులను రైస్‌కార్డు దారులకు ఇంటి వద్దకే ఎంయూడీ వాహనంలో అందించేవారు. సరుకుల పంపిణీ పారదర్శకంగా ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఎండీయూ వాహన వ్యవస్థలను పూర్తిగా రద్దుచేసి కూటమి కార్యకర్తలకు రేషన్ దుకాణాలను అప్పగించింది. ఇక వారంతా పేదలకు అందాల్సిన బియ్యాన్ని బ్లాక్‌మార్కెట్‌కు తరలించి సొమ్ము చేసుకొని డబ్బులు సంపాదించడమే ధ్యేయంగా పనిచేస్తున్నారు. బియ్యం అడిగితే లేవంటూ వేలిముద్రలు వేయించుకొని నగదు తీసుకోవాలంటూ బలవంతం చేస్తున్నారు. గట్టిగా అడిగితే అధికారమదంతో బెదిరిస్తున్నారు. కార్డులు తొలగిస్తామంటూ బెదిరింపులు మాకు డబ్బులు వద్దు బియ్యమే కావాలంటూ ఎవరైనా రైస్‌కార్డు దారులు రేషన్ పంపిణీ కేంద్రాలకు వెళితే వారికి చుక్కలు చూపిస్తున్నారు. సమయపాలన లేకుండా ఎప్పుడు ఉంటారో, ఎప్పటి వరకు ఇస్తారో తెలియకుండా చేస్తున్నారు. రేషన్ దుకాణాల వ్యవస్థ పనితీరుపై కూటమి ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వేలలో కార్డుదారులు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా కార్డుదారులతో రేషన్ దుకాణాల నిర్వాహకులు దురుసుగా ప్రవర్తిస్తున్నట్టు చెబుతున్నారు. ఒక్కో ప్రాంతానికి ఒక్కో రేటు జిల్లాలో ఒక్కో ప్రాంతంలో కేజీ రేషన్ బియ్యానికి ఒక్కో రేటు కార్డుదారులకు ఇస్తున్నారు. ఇది రూ.8 నుంచి రూ.14 దాకా ఉంటోంది. ముఖ్యంగా నరసరావుపేట లాంటి పట్టణాలలో ఎక్కువమంది దుకాణదారులు రూ.8 ఇస్తున్నారు. ప్రశ్నిస్తే మీకు రైస్‌కార్డు పొందే అర్హత లేదని, కార్డు తొలగిస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. దీంతో చేసేదేమిలేక ఇచ్చింది తీసుకొని వెనుతిరుగుతున్నారు. పల్లెల్లో మాత్రం రూ.12 నుంచి రూ.14 వరకు అందజేస్తున్నారు. డీలర్లు రేషన్ మాఫియాకు రూ.18 నుంచి రూ.20 దాకా అమ్ముకొని సొమ్ముచేసుకుంటున్నారు. నచ్చని వారిపై అధికారులతో దాడులు రేషన్ దుకాణాలలో బియ్యం కార్డుదారులకు ఇవ్వకుండా బ్లాక్‌మార్కెట్‌కు తరలుతున్నా పౌర సరఫరాలశాఖ అధికారులు మాత్రం చూసీచూడనట్టు వదిలేస్తున్నారు. రేషన్ డీలర్లపై విమర్శలొస్తున్నా ఆ శాఖ పట్టించుకోలేదు. ఆయా దుకాణాలపై ఆన్లైన్లో ఫిర్యాదులు అందుతున్నా కూటమి నేతల ఒత్తిళ్లతో మిన్నుకుండిపోతున్నారు. అధికారం రాగానే రేషన్ డీలర్లను బెదిరించి కూటమి నేతలు ఆయా షాపులను లాక్కొన్నారు. ఎన్నోఏళ్లుగా చేస్తున్న కొందరు వైఎస్సార్ సీపీ సానుభూతిపరులు కోర్టులకు వెళ్లి తమ డీలర్‌షీప్‌ను కాపాడుకుంటున్నారు. అటువంటి వాటిపై కూటమి నేతలు అధికారులను పంపి కక్షపూరితంగా దాడులు నిర్వహించి 6ఏ కేసులు నమోదు చేస్తున్నారు. మాపై వచ్చిన ఫిర్యాదులు చెప్పమంటే ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి ఉందని దుకాణాలను వదిలేయమని సలహాలిస్తున్నారు. ● గత వారం రోజులుగా వినుకొండ నియోజకవర్గంలో ఈ తరహా దాడులు అధికమయ్యాయి. బియ్యాన్ని పక్కదారి పట్టిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు చేసి వదిలేస్తున్నారు. గోదాముల్లో పెద్దసంఖ్యలో రేషన్ బియ్యం దొరికిన సమయంలో కేసులు నమోదు చేస్తున్నామని మీడియాకు సమాచారం ఇస్తున్నారు తప్ప ఆ తరువాత వారిపై ఏ చర్యలు తీసుకుంటున్నారన్నది చిదంబర రహస్యంగా మారుతోంది. ప్రభుత్వం, అధికారులు స్పందించి నిత్యావసర వస్తువులు సక్రమంగా అందేలా చూడాలని పేదలు కోరుతున్నారు. రేషన్ డీలర్ల అక్రమాలకు అడ్డుకోట్ట వేయాలని డిమాండ్ చేస్తున్నారు. తూకంలో భారీ మోసం తూకాలలో మోసాన్ని బహిరంగా చేస్తున్నా ప్రశ్నిస్తే బెదిరింపులకు దిగుతున్నారు. ప్రభుత్వం మాకు కోటా తక్కువగా ఇస్తోందని, ఇచ్చిన కొలతలతో తీసుకోవాలని, నచ్చకపోతే నగదు తీసుకొని పోవాలని హెచ్చరిస్తున్నారు. 20 కిలోలు ఇవ్వాల్సిన వారికి 18 కిలోలు మాత్రమే అందజేస్తున్నారు. రెండు కిలోలు తగ్గాయని ప్రశ్నిస్తే నగదు తీసుకుంటే 20 కిలోలకు నగదు ఇస్తామని చెబుతున్నారు. డీలర్లతో వాదించలేదని పేదలకు తినడానికి వారు ఇచ్చిన బియ్యాన్ని భుజాన వేసుకొని నిరాశతో వెనుతిరుగుతున్నారు. మొత్తం రైస్ కార్డులు 6,34,893 జిల్లాలో చౌక దుకాణాలు 1289 అందుతున్న సరుకులు : బియ్యం (అరకొరగా) బలవంతంగా వేలిముద్రలు..నగదు పంపిణీ వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఇంటింటికి రేషన్ బియ్యం పంపిణీ కూటమి ప్రభుత్వంలో బియ్యం బదులు నగదు డోర్ డెలివరీ ఇంటికొచ్చి కార్డుదారుల వేలిముద్ర వేయించుకొని నగదు పంపిణీ దుకాణాల వద్ద బియ్యం బదులు నగదు తీసుకోవాలని ఒత్తిడి లేదంటే కార్డులు తొలగిస్తామంటూ బెదిరింపులు బియ్యమే కావాలన్నవారికి తక్కువ తూకాలతో పంపిణీ ఐవీఆర్ఎస్ సర్వేలో రేషన్ పంపిణీపై తీవ్ర అసంతృప్తిఇంటింటికీ రేషన్ మాఫియా వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మాదిరిగా ఇప్పుడు ఇంటింటికి రేషన్ డీలర్లు వస్తున్నారు. అయితే వారు వస్తున్నది సరుకులు ఇవ్వడానికి కాదు.. ఇంటి వద్దే వేలిముద్రలు వేయించుకొని నగదు అందజేసి బియ్యాన్ని బ్లాక్ మార్కెట్‌కు తరలించడానికి. పోర్టబులిటీ సౌకర్యం ఉండటంతో కార్డుదారులు ఏ షాపులోనైనా సరుకులు తీసుకోవచ్చు. దీన్ని ఆసరాగా తీసుకొని పట్టణాలలో రేషన్‌డీలర్లు ఇంటింటికి తిరిగి కార్డుదారులతో వేలిముద్రలు వేయించుకొని నగదు అందజేస్తున్నారు. కేజీ బియ్యానికి రూ.8 నుంచి రూ.10 వరకు అందజేస్తున్నారు. వారికి పంచాల్సిన బియ్యాన్ని రేషన్ మాఫియాకు కిలో రూ.18 నుంచి రూ.20కు అమ్ముకుంటూ భారీగా సొమ్ము చేసుకుంటున్నారు.జిల్లాలో రేషన్ పంపిణీ తీరు -
ముగిసిన రాష్ట్రస్థాయి ఫ్లోర్ బాల్ పోటీలు
నరసరావుపేట ఈస్ట్: గుంటూరు రోడ్డులోని కే–రిడ్జి ఇంటర్నేషనల్ స్కూల్లో రెండురోజుల పాటు నిర్వహించిన రాష్ట్రస్థాయి అండర్–14, అండర్–19 బాల బాలికల ఫ్లోర్ బాల్ చాంపియన్‌షిప్ పోటీలు సోమవారం ముగిశాయి. పోటీల్లో 16 జిల్లాల నుంచి బాలబాలికల జట్లు పాల్గొన్నాయి. పోటీల విజేతల వివరాలను పాఠశాల చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు, ఆర్గనైజింగ్ సెక్రటరీ పి.సురేంద్ర ప్రకటించారు. బాలికల అండర్–14 విభాగంలో తిరుపతి జిల్లా జట్టు ప్రథమస్థానం కై వసం చేసుకోగా, శ్రీసత్యసాయి జిల్లా రెండవ స్థానం, కర్నూలు, అనంతపురం జిల్లాలు సంయుక్తంగా మూడవ స్థానంలో నిలిచాయి. అలాగే అండర్–19 విభాగంలో తిరుపతి ప్రథమస్థానం సాధించగా, కృష్ణా, పల్నాడు జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. బాలుర అండర్–14 విభాగంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రథమ స్థానం సాధించగా, పల్నాడు, కర్నూలు జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. అండర్–19 విభాగంలో కృష్ణా జిల్లా ప్రథమ స్థానం కై వసం చేసుకోగా, తిరుపతి, పల్నాడు జిల్లాలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. ● ఫ్లోర్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోసఫ్ మాట్లాడుతూ, పోటీలో పాల్గొన్న క్రీడాకారుల నుంచి రాష్ట్ర జట్టుకు కొందరు పేర్లు ఎంపిక చేశామన్నారు. తిరిగి వారి ప్రతిభను పరిశీలించి తుది జట్టును ప్రకటిస్తామన్నారు. రాష్ట్రజట్టుకు ఎంపికై న క్రీడాకారులు సెప్టెంబర్‌లో బిహార్‌లో జరగనున్న జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విజేతలకు పాఠశాల చైర్మన్ నాతాని, డైరెక్టర్ కోమటినేని నాసరయ్య బహుమతులు అందించారు. ఫోర్ బాల్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ ఎం.కిషోర్‌బాబు, పాఠశాల ఇన్చార్జి కోట బాపూజీ పాల్గొన్నారు. -
మృత్యుకుహరాలు గ్రానైట్ క్వారీలు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బల్లికురవ, సంతమాగులూరు ప్రాంతాల్లోని గ్రానైట్ క్వారీలు మృత్యుకుహరాలుగా మారాయి. పొట్టకూటి కోసం ఒడిశా, ఎంపీ, యుపీ, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాలకు చెందిన కార్మికులు వచ్చి క్వారీల్లో పనిచేస్తూ మృత్యువాత పడుతున్నారు. ఆర్గనైజర్ల ద్వారా పనిలోకి వస్తున్న కార్మికులు ప్రమాదాల్లో మృతి చెందినా యజమానులు బయటకు తెలియనీయడంలేదు. మృతుల వివరాలు తక్కువగా చూపి మృతదేహాలను మట్టిలో కప్పెడుతున్నారు. దీంతో తమవారు ఎక్కడున్నారో? ఎక్కడ పనిచేస్తున్నారో, అసలు ఏమయ్యారో కూడా వారి కుటుంబ సభ్యులకు తెలిసే అవకాశంలేదు. ఒకవేళ మృతుల వివరాలు తెలిసిన కార్మికులు ఉన్నా.. క్వారీల యజమానులు వారిని భయపెట్టి వివరాలు కుటుంబ సభ్యులకు చేరకుండా చూస్తున్నారు. ప్రమాద ఘటనలో మృతులెందరు? శనివారం జరిగిన బల్లికురవ మండలం కొనెదన రెవెన్యూలోని సత్యకృష్ణ క్వారీ ప్రమాదఘటనలో మృతుల సంఖ్యపై బాపట్ల, ప్రకాశం, పల్నాడు జిల్లాలో పెద్ద దుమారమే రేగింది. పచ్చనేత దివ్యరామాంజనేయులుకు చెందిన ఈ క్వారీలో జరిగిన ఘటనలో మృతుల సంఖ్య 15గా ఉందని కొందరు.. కాదు 16 మంది అని మరికొందరు అంతకు మించి ఉండవచ్చని ఇంకొందరు చెబుతున్నారు. వాస్తవానికి ప్రమాద సమయంలో ఆరు జాకీలు పనిచేస్తుండడంతో 18 మందికి తక్కువ లేకుండా ఉన్నారని కార్మిక వర్గాలు చెబుతున్నాయి. కానీ అధికారులు మొత్తం తొమ్మిది మంది మాత్రమే ఉన్నారని ప్రకటించారు. వారిలో ఆరుగురు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డట్లు తెలిపారు. కానీ నరసరావుపేట ఆసుపత్రిలో ఏడుగురు చికిత్స పొందుతున్నట్లు చూపారు. ముగ్గురు గాయపడితే ఏడుగురు ఎలా చికిత్స పొందుతారని కార్మిక సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ లెక్కన మృతుల సంఖ్య ఎక్కువ ఉండవచ్చని, ఆరుగురిని లెక్క చూపి మిగిలిన మృతదేహాలను క్వారీలోనే పూడ్చి పెట్టి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పొంతన లేని ప్రకటనలు ప్రమాద ఘటనపై అధికారులు, పోలీసులు పరస్పర విరుద్ధమైన ప్రకటనలు చేశారు. క్వారీలో 12 మంది కార్మికులు మాత్రమే ఉన్నారని, ఆరుగురు మృతి చెందిగా ముగ్గురు గాయాలపాలయ్యారని, మరో ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారని జిల్లా అధికారి, అధికారులు ప్రకటించారు. క్వారీలో తొమ్మిది మంది కార్మికులు ఉన్నారని, ఆరుగురు మృతి చెందగా ముగ్గురు గాయపడ్డారని అదేరోజు సాయంత్రం అద్దంకిలో సీఐ విలేకరులకు చెప్పారు. ఆదివారం నాటికి గాయపడినవారి సంఖ్య ఏడుకు పెరిగింది. పరస్పర విరుద్ధమైన ప్రకటనలతో మృతుల సంఖ్యపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చేతులు మారిన రూ. కోట్లు క్వారీ ప్రమాదంలో పదిమందికి మించి కార్మికులు మృతి చెందితే లీజులు రద్దయ్యే అవకాశం ఉంది. దీంతో ప్రమాదంలో ఎక్కువ మంది మృతి చెందినా ఆరుగురు మాత్రమే మృతి చెందినట్లు చూపుతున్నట్లు సమాచారం. అధికారులు మృతుల సంఖ్యను మార్చిమార్చి చెప్పి ఎట్టకేలకు ఆరుగురుగా ప్రకటించారు. మిగిలిన వారిపై స్పష్టతనివ్వలేదు. క్షతగాత్రుల సంఖ్యను ఇష్టానుసారంగా ప్రకటించడం విమర్శలకు దారితీసింది. మంత్రి గొట్టిపాటి రవికుమార్ సొంత నియోజకవర్గం కావడంతో ప్రమాద ఘటన అనంతరం అధికారపార్టీ ముఖ్యనేతల జోక్యంతోపాటు రూ.కోట్లలోనే డబ్బులు చేతులు మారిన కారణంగానే అధికారులు మృతుల సంఖ్యను తక్కువ చేసి చూపించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.బల్లికురవ దుర్ఘటనలో మృతుల సంఖ్యపై అనుమానాలు నిబంధనలకు పాతర వాస్తవానికి క్వారీలో ఎటువంటి భద్రతా ప్రమాణాలు పాటించడం లేదని తెలుస్తోంది. కార్మికులు పనిచేసేటప్పుడు వారికి భద్రతా పరంగా హెల్మెట్లు, బూట్లు ఇతర సామగ్రి ఇవ్వాలి. కార్మికులకు పర్యవేక్షకులుగా మేట్లు, ఫస్ట్‌క్లాస్ మేనేజర్ ఉండాలి. ఆదివారం సెలవు కావడంతో వారెవరు లేరని తెలుస్తోంది. అయినా ఆదివారంనాడు కార్మికులతో ఎలా పనిచేయించారో క్వారీ యజమానులు, అధికారులు చెప్పాలి. బల్లికురవ, సంతమాగులూరు పరిధిలో సుమారు 50 క్వారీలు ఉండగా ఒక్కొక క్వారీలో వందమంది చొప్పున 5 వేల మంది కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 60 నుంచి 70 శాతం మంది ఇతర రాష్ట్రాల కార్మికులు ఉన్నారు. క్వారీ ప్రమాదాల్లో గడచిన పదేళ్లలో 100 మంది మృతిచెందినట్లు సమాచారం.