పెదకాకాని: దివంగత ముఖ్యమంత్రి, మహానేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లేందుకు ఆవిర్భవించిన పార్టీ వైఎస్సార్ సీపీ అని రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి అన్నారు. పార్టీ ఆవిర్భావం సందర్భంగా గురువారం పార్టీ శ్రేణులకు, కార్యకర్తలకు, అభిమానులకు, ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు పాదయాత్ర చేపట్టి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐదేళ్లపాటు సుపరిపాలన అందించారన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా మంచి పేరు తెచ్చుకున్నారని ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు మంచి జరగాలంటే, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు వెళ్లాలంటే వైఎస్సార్ సీపీ ద్వారానే సాధ్యమన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పార్టీ పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ప్రజల ఆదరణ, అభిమానాలతో వైఎస్సార్ సీపీ తిరిగి అధికారంలోకి వస్తుందన్నారు.


