రంజాన్ మాసంలో డ్రైఫ్రూట్స్‌కు విపరీతమైన డిమాండ్
చిలకలూరిపేట: పవిత్ర రంజాన్ మాసంలో ముస్లింలు నెలరోజుల పాటు నియమనిష్టలతో ఉపవాసం ఉండి, రోజుకు ఐదుసార్లు నమాజు చేస్తారు. తెల్లవారుజాము నుంచి సాయంత్రం దీక్ష విరమించేవరకు మంచినీరు కూడా ముట్టుకోకుండా దైవభక్తితో ఉపవాసదీక్ష చేపడతారు. సాధారణంగా ఇలాంటి దీక్షలు ఎవరు చేపట్టినా నీరసం వస్తుంది, అలసట, నీరసం దరిచేరనీయకుండా డ్రైఫ్రూట్స్ ఎంతో ఉపయోకరం కావటంతో వీటి విక్రయాలు ఊపందుకున్నాయి.
ఎండు ఖర్జూరంతో మేలు...
డ్రైఫ్రూట్స్ ఎన్ని లభ్యమౌతున్నా ఖర్జూరానికి ముస్లింలు ప్రాధాన్యత ఇస్తారు. ఉపవాస దీక్ష అనంతరం ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష (కిస్‌మిస్), బాదం, పిస్తా, అంజూర్, జీడిపప్పు, ఆఫ్రికార్డ్స్ వంటి డ్రై ఫ్రూట్స్‌ను క్రమం తప్పకుండా తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరం. ఇవి అత్యంత శక్తిని ఇవ్వటంతో పాటు , ఉల్లాసంగా ఉండటానికి ఎంతగానో ఉపకరిస్తాయి.
ఔషధ గుణాలు...
ఎండిన ఫలాల్లో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. వీటి వలన ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. శరీరానికి అవసరమైన ఖనిఖాలు, విటమిన్లుతో పాటు జీర్ణశక్తికి తోడ్పడి, రక్తాన్ని శుద్ధిచేస్తాయి. హృద్రోగాన్ని , క్యాన్సర్ వంటి వాటిని దరిచేరనీయవు. దీంతో మసీదుల సమీపంలో ప్రత్యేక దుకాణాల్లో ఈ డ్రైఫ్రూట్స్ దర్శనమిస్తున్నాయి.
ఇతర దేశాల నుంచి ....
ఒకప్పుడు రంజాన్ పండుగ వేళల్లో బండ్లపై ఎక్కువగా వీటిని అమ్మేవారు. గత కొన్నేళ్లుగా ఎండు ఫలాలు గుంటూరు నగరంతో పాటు ,చిలకలూరిపేట, నరసరావుపేట, తెనాలి వంటి పెద్ద పట్టణాల్లో ప్రత్యేక దుకాణాలు వెలిశాయి. ఈ ఎండు ఫలాలను ఢిల్లీ , ముంబాయి తదితర ప్రాంతాల నుంచే కాక దుబాయి, షార్జా, సౌదిఅరేబియా, కువైట్ వంటి దేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి.
ఆకర్షణీయ ప్యాకెట్లలో ...
ఎండు ఫలాలను ఆకర్షణీయ ప్యాకెట్లలో విక్రయిస్తున్నారు. స్వదేశి వాటితో పాటు ఇతర దేశాల ఫలాలకు డిమాండ్ అధికంగానే ఉంది. కొనుగోలు దారుల సౌలభ్యం కోసం రూ. 100 నుంచి రూ. 1000 దాక విలువైన ప్యాకెట్లలో లభ్యమౌతున్నాయి. వందగ్రాముల ప్యాకెట్ల నుంచి ఐదు కేజీల గిఫ్ట్ ప్యాకెట్ల వరకు దొరుకుతున్నాయి. అయితే గత ఏడాదితో పోలిస్తే ధరలు పెరిగినట్లు వ్యాపారులు తెలుపుతున్నారు.
దాతల సహాయంతో....
పలు మసీదుల వద్ద , చిన్న స్థాయి దుకాణాలతో పాటు తోపుడు బండ్లపై ఎండు ఫలాలు విరివిరిగా విక్రయిస్తున్నారు. దాతలు ఇఫ్తార్ విందు సమయాల్లో ఉచితంగా అందిస్తున్నారు.


