మొబైల్‌ ఫోన్లలో పోలీస్‌ సేవలు | - | Sakshi
Sakshi News home page

మొబైల్‌ ఫోన్లలో పోలీస్‌ సేవలు

Mar 13 2026 8:11 AM | Updated on Mar 13 2026 8:11 AM

నగరంపాలెం(గుంటూరు వెస్ట్‌) : మన మిత్ర – వాట్సాప్‌ గవర్నెన్‌న్స్‌ ద్వారా మొబైల్‌ ఫోన్లలోనే పోలీస్‌ సేవలను సులభంగా పొందవచ్చునని జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత సులభంగా, వేగవంతంగా అందుబాటులోకి తీసుకువచ్చే లక్ష్యంతో ప్రవేశపెట్టారని అన్నారు. ఈ సేవల ద్వారా ప్రజలు పోలీస్‌స్టేషన్లకు ప్రత్యక్షంగా వెళ్లకుండానే మొబైల్‌ ఫోన్లలో ఎఫ్‌ఐఆర్‌ కాపీ, ఎఫ్‌ఐఆర్‌ ప్రస్తుత స్థితి, ఈ–చలానా వివరాలు, పోలీస్‌ శాఖకు సంబంధించి సేవలు పొందవచ్చునని పేర్కొన్నారు. మన మిత్ర – వాట్సాప్‌ గవర్నెన్‌న్స్‌ సేవలు పొందేందుకు ముందు 95523 00009 అనే నంబర్‌ను మొబైల్‌ఫోన్లలో సేవ్‌ చేసుకోవాలని అన్నారు. వాట్సాప్‌ ద్వారా ‘హెచ్‌ఐ’, లేదా ‘హెచ్‌ఏఐ’ అని మెసేజ్‌ పంపించాలని చెప్పారు. అనంతరం ప్రభుత్వం పలు సేవలకు సంబంధించి మెనూ ప్రదర్శిస్తుందని అన్నారు. అందులో ‘సేవను ఎంచుకోండి’ అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేసి అవసరమైన సేవలు ఎంపిక చేసుకోవచ్చని వివరించారు. ఆ మెనూలో పోలీస్‌శాఖ సేవలు అనే ఆప్షనన్‌ను ఎంచుకుంటే ఎఫ్‌ఐఆర్‌ నమోదు, ఎఫ్‌ఐఆర్‌ స్థితి, ఈ–చలానా వివరాలు తదితర సేవలు సులభంగా అందుబాటులో ఉంటాయని జిల్లా ఎస్పీ తెలిపారు. జిల్లాలోని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. సైబర్‌ క్రైంపై 1930కి, పోలీసుల సహాయంపై 112 కి కాల్స్‌ చేసి పోలీస్‌ సేవలు పొందవచ్చునని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement