ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి పరీక్షలు ఆందోళనకు గురవుతున్న విద్యార్థులు ఆరోగ్యం బాగుంటేనే ఏకాగ్రత నిద్ర, ఆహార నియమాలు తప్పనిసరి అంటున్న నిపుణులు సత్తెనపల్లి విద్యా డివిజన్ పరిధిలో 4,936 మంది టెన్త్ విద్యార్థులు
సత్తెనపల్లి: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పదో తరగతి పరీక్షలు దగ్గర పడ్డాయి. మరో మూడు రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇందుకు విద్యార్థులు సిద్ధమయ్యారు. మంచి మార్కులను సాధించాలని విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఆరాటపడుతున్నారు. ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించే దిశగా అడుగులు వేస్తున్నారు. దీని కోసం ఎక్కువ మంది విద్యార్థులు నిద్ర, భోజనం మానేసి పుస్తకాలతో కుస్తీ పడుతున్నారు. చదువుతోపాటు మన ఆరోగ్యంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపించాలని వైద్యులు చెబుతున్నారు. ఏకాగ్రత ఉండాలి అంటే ముందుగా మన ఆరోగ్యం బాగుండాలని, మానసిక ఒత్తిడిని జయించాలంటే పోషకాహారం తీసుకో వాలని, ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించాలని సూచిస్తున్నారు.
ఆరోగ్య సూత్రాలు...
● పదో తరగతి పరీక్షలు ఈ నెల 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. సత్తెనపల్లి విద్యా డివిజన్ పరిధిలోని అమరావతి, అచ్చంపేట, బెల్లంకొండ, దాచేపల్లి, గురజాల, కారంపూడి, క్రోసూరు, మాచవరం, ముప్పాళ్ళ, పెదకూరపాడు, పిడుగురాళ్ల, రాజుపాలెం, సత్తెనపల్లి మండలాల్లో 87 ప్రభుత్వ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు 4,936 మంది ఉన్నారు. వీరందరూ పరీక్షలు రాయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఒక్కరూ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులు విద్యార్థులపై దృష్టి సారిస్తున్నారు.
● ఈ క్రమంలో విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా ఏకాగ్రతగా ఉండాలంటే మంచి ఆహార అలవాట్లు, నిద్ర అవసరమని తెలుసుకోవాలి.
● ప్రతి రోజు ఆరు నుంచి ఏడు గంటలు కచ్చితంగా నిద్రపోవాలి.
● శరీరానికి ఉల్లాసం కావాలి అంటే పండ్ల రసాలు తీసుకోవాలి. పుచ్చకాయ, బత్తాయి రసం వంటివి ఉండాలి.
● బార్లీ గంజిని సాయంత్రం వేళల్లో తీసుకోవడంతో పాటు అప్పుడప్పుడు కొబ్బరి నీళ్లు, మజ్జిగ వంటివి తాగాలి.
● టీ, కాఫీలను మోతాదుకు మించి తాగకూడదు. కాచి చల్లార్చిన నీటిని తీసుకోవాలి.
● ప్రతి రోజు 15–20 నిమిషాలు వ్యాయామం చేయాలి. టిఫిన్ చేయడానికి ముందు రాగిజావ తీసుకుంటే మంచిది. సులభంగా జీర్ణమయ్యే ఆకుకూరలు వంటివి తినాలి.
● ఆహారంతో పాటు అరటిపండు తీసుకోవడం వలన ఆరోగ్యం మెరుగుపడుతుంది.
● విద్యార్థులు ఒత్తిడికి గురి కావడం వలన శరీరం వేడి చేసే అవకాశం ఉంది. దీంతో తలనొప్పి, నీరసం వంటివి వస్తాయి. ఇలాంటి వాటిని అధిగమించాలి అంటే మంచి నీరు ఎక్కువగా తాగాలి.
● పాల ఉత్పత్తులను తీసుకుంటే గ్లూకోమిక్స్ పాటు క్యాల్షియం తగినంత లభిస్తుంది.
● పరీక్షల సమయంలో స్వీట్లు, చాక్లెట్లు, నూనె పదార్థాలు వంటివి తీసుకోకుండా ఉంటే మంచిది.
సులభంగా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవాలి
పదో తరగతి విద్యార్థులు ఒత్తిడికి గురికాకుండా మనసు ప్రశాంతంగా ఉంచుకొని ఏకాగ్రతపై దృష్టి సారించాలంటే ఆరోగ్యం బాగుండాలి. ముఖ్యంగా ఆహార నియమాలను ప్రతి విద్యార్థి పాటించాలి. సులభంగా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవాలి. పండ్లు, ఆకుకూరలు వంటివి తీసుకుంటే మంచిది. పరీక్షల సమయంలో ప్రతి ఒక్కరూ పోషకాహారం తీసుకోవాలి.
–డాక్టర్ బి.లక్ష్మణరావు, సూపరింటెండెంట్, ఏరియా వైద్యశాల, సత్తెనపల్లి


