అమరావతి: మండలంలో 8 గ్రామాల్లో భూ సమీకరణలో భూమి కోల్పోతున్న రైతాంగానికి న్యాయమైన నష్ట పరిహారం ఇవ్వాలని, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, చేతివృత్తులవారిని ఆదుకోవాలని సీపీఎం పలనాడు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రవిబాబు అన్నారు మంగళవారం స్థానిక సీపీఎం కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ మండలంలోని వైకుంఠపురం, పెద్దమద్దూరు, చావపాడు, ఎండ్రాయి, లేమల్లె, కర్లపూడి గ్రామాల్లో భూమి మొత్తాన్ని రాజధాని అవసరాలు నిమిత్తం రెండో విడత భూ సమీకరణ, ఔటర్ రింగ్ రోడ్డు అవసరాల కోసం ధరణికోట, లింగాపురం గ్రామాల్లో భూమిని భూ సమీకరణ చేయటానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి అవసరానికి మించి భూమిని 250 మీటర్లు వెడల్పులో సేకరిస్తున్నట్లుగా ప్రభుత్వం ప్రకటించిందని వెడల్పున 70 మీటర్లకు తగ్గించాలన్నారు. రైతాంగానికి న్యాయమైన నష్ట పరిహారం ఇవ్వటానికి, అదేవిధంగా కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులు, ఆదుకోవటానికి ఆయా గ్రామాలలో గ్రామసభలను జరిపి ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, వారికున్న సందేహాలను నివృత్తి చేయాలన్నారు. భూసమీకరణ చేస్తున్న గ్రామాల్లో అభివృద్ధి అవసరాల కోసం ఉపాధి హామీ పనులను కొనసాగించాలన్నారు. గ్రామాలలో మౌలిక సౌకర్యాలు మురుగు కాలువలు తాగునీరు సమస్యలు ఉన్నాయని ఈ సమస్యల పరిష్కారానికి కూడా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో నాయకులు బి. సూరిబాబు, రూరల్ శాఖ కార్యదర్శి సయ్యద్ మోహిద్దీన్, నండూరి వెంకటేశ్వరరాజు, షేక్ నాగుల్ మీర పాల్గొన్నారు.


