మాచర్ల: కన్నకూతురు పది రోజులుగా అదృశ్యమైంది. పట్టణానికి వచ్చిన తమ కుమార్తెను గుర్తు తెలియని యువకుడు తీసుకెళ్లాడని పల్నాడు జిల్లా మాచర్ల పట్టణ పోలీసులను దంపతులు పది రోజుల కిత్రం ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై పోలీసులు ఫిర్యాదు తీసుకోకుండా ‘విచారణ చేస్తున్నాం. మీ అమ్మాయిని తీసుకొస్తామంటూ’ కాలం గడుపుతున్నారు. పది రోజులైనా తమ కుమార్తె ఆచూకీ తెలుసుకోవటానికి పోలీసులు ప్రయత్నం చేయటం లేదని ఆవేదన చెందిన ఆమె తల్లిదండ్రులు కామనబోయిన చంద్ర శ్రీను, గంగలు బుధవారం రాత్రి పోలీసు స్టేషన్‌కు వచ్చి పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకోబోయారు. గమనించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని న్యాయం చేస్తామంటూ నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కుమార్తె ఆచూకీ విషయం పట్టించుకోకుండా పట్టణ సీఐ వెంకటరమణ నిర్లక్ష్యం వహించటం వల్లనే తమకు ఆవేదన మిగిలిందని వాపోయారు. పైగా దురుసుగా మాట్లాడారని, చేయి పట్టుకొని తీసుకెళ్లి ఇబ్బందికి గురిచేశారని గంగ ఆవేదన వ్యక్తం చేశారు. దంపతులను అదుపులోకి తీసుకున్నాక బంధువులను రానివ్వకుండా పోలీసులు గేట్లు వేశారు. ఈ విషయమై గురజాల ఇన్‌చార్జి డీఎస్పీ వెంకటరమణ మాట్లాడుతూ విచారించి చర్యలు తీసుకుంటామని బాధిత కుటుంబానికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కావాలని పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని బాధితులు వాపోయారు. తమ కుమార్తెను ఇప్పటికే గ్రామానికి చెందిన వారే హత్య చేసి ఉంటారని చంద్రశ్రీను ఆవేదనతో చెప్పారు. ఈ విషయం వెలుగులోకి రాకుండా పోలీసులు తమను మభ్యపరుస్తూ విచారిస్తున్నామని పేర్కొంటున్నట్లు తెలిపారు. ఇప్పటికై నా పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. రాత్రి 10 గంటలకుపైగా పట్టణ పోలీసు స్టేషన్ ముందు తల్లిదండ్రులు వేచి ఉండటంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీనిపై ఇన్‌చార్జి డీఎస్పీ మాట్లాడుతూ యువతి అదృశ్యంపై కేసు నమోదు చేశామన్నారు. ప్రత్యేక పోలీస్ బృందాలను ఆచూకీ కనుగొంటామన్నారు.
తమ కుమార్తె ఆచూకీ
తెలపాలంటూ ఆందోళన


