బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం సజ్జాపురంకు చెందిన తుమ్మరి కోటేశ్వరరావు అనారోగ్యంతో ఏరియా వైద్యశాలకు వచ్చాడు. ఆయాసం ఎక్కువగా ఉండటంతో ఆసుపత్రిలోని వైద్యులను సంప్రదించాడు. రక్తపరీక్షలు అవసరమని మూడవ అంతస్తుకు వెళ్లమని సూచించారు. ఆయాసంతో బాధపడుతున్న కోటేశ్వరరావు మూడవ అంతస్తుకు మెట్ల మీద నుంచి ఎక్కడం కష్టంగా మారింది. ఇబ్బందులు పడుతూ మూడవ అంతస్తుకు చేరి రక్తపరీక్షలు చేయించుకొని వైద్యున్ని సంప్రదించాడు. కొంతకాలం మందులు వాడాల్సి ఉంటుందని తెలిపిన వైద్యుడు అవసరమైన మందుల చీటిని చేతిలో పెట్టాడు. ఫార్మసీకి వెళ్లిన కోటేశ్వరరావుకు ఒక రకం మందులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, మిగిలిన రెండు రకాలు బయట తీసుకోవాలని సిబ్బంది సూచించారు. దీంతో ఆసుపత్రిలో ప్రాంగణంలోనే ఉన్న జనరిక్ మెడికల్ షాపులో డబ్బులు చెల్లించి మందులు కొనుగోలు చేయాల్సి వచ్చింది.


