పురాతన బ్రిడ్జి పిల్లర్లు తొలగింపు | - | Sakshi
Sakshi News home page

పురాతన బ్రిడ్జి పిల్లర్లు తొలగింపు

Mar 12 2026 7:37 AM | Updated on Mar 12 2026 7:37 AM

పురాతన బ్రిడ్జి పిల్లర్లు తొలగింపు టెన్త్‌ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించాలి గుంటూరు మహిళకు ఇండియన్‌ ఆర్ట్స్‌ అవార్డు

తాడేపల్లిరూరల్‌ : కృష్ణానది దిగువ ప్రాంతంలో బ్రిటీష్‌కాలం నాటి రైల్వే బ్రిడ్జి పిల్లర్లను తొలగించే కార్యక్రమాన్ని రైల్వే అధికారులు చేపట్టారు. మొదటి పిల్లర్‌ను పగలకొట్టడం ప్రారంభించి బుధవారానికి వారం రోజులు దాటింది. ఆ పిల్లర్‌ను సగం కూడా పగలకొట్టేందుకు భారీ బ్రేకర్‌ వల్ల కావడం లేదు. నల్లరాయి, సిమెంట్‌తో కట్టిన ఈ బ్రిడ్జి చాలా దృఢంగా ఉంది. సగం వరకు పిల్లర్‌ను పగలకొట్టి పెద్ద పెద్ద జేసీబీలు తీసుకువచ్చి తోసినా పిల్లర్లను కదలించలేకపోతున్నారు. కృష్ణానదిలో మొత్తం 15 పిల్లర్లు ఉన్నాయి. రైల్వే అధికారులు ఈ పిల్లర్లను తొలగించి డబుల్‌లైన్‌ బ్రిడ్జి ఏర్పాటు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఒక పిల్లర్‌ పగలకొట్టడానికి సుమారు 15 రోజుల వ్యవధి పడుతుందని, 15 పిల్లర్లు తొలగించాలంటే రెండు బ్రేకర్లు 5 నెలలు సమయం పడుతుందని కాంట్రాక్టర్లు తెలిపారు.

నరసరావుపేట రూరల్‌: పదవ తరగతి పరీక్షలు పల్నాడు జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా నోడల్‌ అధికారి, జాయింట్‌ డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌ పి.శైలజ తెలిపారు. కేసానుపల్లిలోని ఎంఏంఎం కళాశాలలో బుధవారం మండల స్థాయి అధికారులు, చీఫ్‌ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్‌ అధికారులు, రూట్‌ అధికారులతో సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న శైలజ మాట్లాడుతూ జిల్లాలో పదో తరగతి పరీక్షలు ఎటువంటి తప్పులకు ఆస్కారం లేకుండా ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. పరీక్షా కేంద్రాలలో ఏ ఒక్క విద్యార్థి నేల మీద కూర్చుని పరీక్ష రాయకూడదని స్పష్టంచేశారు. పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి పీవీజే రామారావు మాట్లాడుతూ సీఎస్‌, డీవోలు పోలీస్‌స్టేషన్‌ నుంచి పాఠశాలకు ప్రశ్నపత్రాలు తరలించే క్రమంలో పోలీసు ఎస్కార్ట్‌తో వెళ్లాలని తెలిపారు. పరీక్షా కేంద్రాల్లో సమస్యలు ఉంటే వెంటనే నోడల్‌ అధికారికి తెలియజేయాలని తెలిపారు. కార్యక్రమంలో ఏఎంవో పూర్ణచంద్రరావు, ఉపవిద్యాశాఖ, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: కేంద్ర ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఇండియన్‌ లిటరేచర్‌ అండ్‌ ఆర్ట్స్‌ సొసైటీ ప్రతి ఏటా వివిధ రంగాలకు చెందిన ప్రతిభావంతులకు ప్రదానం చేసే పురస్కారాల్లో భాగంగా గుంటూరుకు చెందిన శాఖమూరు పద్మ పెయింటింగ్స్‌ అండ్‌ క్లే క్రాఫ్ట్స్‌ విభాగంలో ‘ఇండియా ఆర్ట్స్‌ 2026’ అవార్డు పొందారు. ఈ మేరకు బుధవారం శాఖమూరు పద్మ అవార్డు ధ్రువీకరణ పత్రం అందుకున్నారు. సైన్స్‌లో బీఈడీ పట్టభద్రురాలైన పద్మ కొంతకాలం ఉపాధ్యాయురాలిగా పనిచేసి, పెయింటింగ్‌, ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌పై ఉన్న మక్కువతో ఆయా అంశాల్లో బోధకురాలిగా మారారు. ఐదేళ్ల వయసు మొదలు అన్ని వయసుల వారికి వారి ఆసక్తికి అనుగుణంగా ఆర్ట్స్‌ నేర్పుతున్న పద్మ ప్రస్తుతం గుంటూరు జిల్లా లాం లోని ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌లో ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ విభాగంలో పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement