దాచేపల్లి: తిరుమలకు బయలుదేరిన కారుకు బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో కారు వేగంగా డివైడర్‌ని ఢీకొట్టి వాగులో దూసుకెళ్లి పల్టీలు కొట్టింది. ఈ ఘటన పల్నాడు జిల్లా దాచేపల్లి నగర పంచాయతీ పరిధిలో బుధవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. హైదరాబాద్ నుంచి గోపవరం శ్రీనివాసరెడ్డి తన భార్య, ఇద్దరు పిల్లలు, అత్తమామలతో కలిసి కారులో తిరుపతికి బయలుదేరారు. దాచేపల్లిలోని నడికుడి వ్యవసాయ మార్కెట్‌యార్డు సమీపంలో కారు బ్రేకులు ఫెయిల్ అయినట్లుగా గుర్తించారు. ఈ క్రమంలో రోడ్డు మార్జిన్‌లోకి కారును దింపే క్రమంలో రోడ్డు డివైడర్‌ని ఢీకొట్టి వాగులోకి పల్టీలు కొట్టింది.
ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన వాగు వద్దకు చేరుకున్నారు. కారు తలుపులు, అద్దాలు పగులగొట్టి అందులో చిక్కుకున్న వారిని అతికష్టం మీద బయటకు తీశారు. ఈ ప్రమాదంలో కారులో ఉన్న శ్రీనివాసరెడ్డి, అతని భార్య, కుమారుడు అద్విత్, కుమార్తె అద్వితి, మామ కృష్ణారెడ్డి, అత్త సుమతీలు గాయపడ్డారు. వీరిలో కృష్ణారెడ్డి, సుమతీ, అద్విత్‌కు బలమైన గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనం ద్వారా పిడుగురాళ్లలోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు పరిశీలించి వివరాలు సేకరించారు.
ఆరుగురికి గాయాలు


