పురాధీశులు సత్తెనపల్లి: జిల్లాలోని మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలనకు తెర లేచింది. పురపాలక సంఘాలు, నగర పంచాయతీలోని పాలకవర్గాల పదవీకాలం ఈ నెల 16తో ముగియనున్న నేపథ్యంలో ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సురేష్‌కుమార్ జీఓ ఆర్‌టీ నం.284ను మంగళవారం విడుదల చేశారు. జాయింట్ కలెక్టర్, ఆర్డీఓలు ప్రత్యేక అధికారులుగా వ్యవహరిస్తారని, కొత్తగా ఎన్నికయ్యే పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించే వరకు లేదా గరిష్టంగా ఆరు నెలల పాటు మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో పరిపాలన నిర్వహించనున్నారు.
చిలకలూరిపేట పురపాలక సంఘానికి జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహను ప్రత్యేక అధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వినుకొండకు పులిచింతల ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ రమేష్ కు ప్రత్యేక అధికారిగా అదనపు బాధ్యతలు కేటాయించింది. పిడుగురాళ్లకు గుంటూరు ఆర్‌డీఎంఏ హరికష్ణ, మాచర్లకు గురజాల రెవెన్యూ డివిజనల్ అధికారి మురళీకృష్ణ, సత్తెనపల్లికి సత్తెనపల్లి ఇన్‌చార్జి రెవెన్యూ డివిజనల్ అధికారి కె.శ్రీరాములును ప్రత్యేక అధికారిగా నియమించారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట మున్సిపాలిటీ పదేళ్లుగా ప్రత్యేక అధికారి పాలనే కొనసాగుతుంది.
మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఉన్న ప్రస్తుత పాలకవర్గం ఈనెల 16తో ముగియనుంది. స్థానిక ఎన్నికలకు చంద్రబాబు ప్రభుత్వం వెళుతుందా, లేదా? అన్న సంశయాలకు తెర పడినట్లే. ఆరు నెలల పాటు ప్రత్యేక అధికారుల కొనసాగుతారని జీవోలో స్పష్టంగా పేర్కొన్నారు. దీన్ని బట్టి మరో ఆరు నెలలైతేగానీ .. ఎన్నికల నిర్వహణ, కొత్త పాలకవర్గం కొలువుదీరే అవకాశం లేదని స్పష్టమవుతోంది. వాస్తవానికి పంచాయతీల వారీగా ఓటరు జాబితాను ఈ నెల 9వ తేదీన ప్రకటించాలని ఎన్నికల సంఘం భావించింది. సాంకేతిక సమస్యల కారణంగా పంచాయతీల వారీ జాబితాల రూపొందించడం సాధ్యం కాకపోవడంతో ఈనెల 18 వరకు గడువు ఇచ్చింది. జిల్లా పరిషత్, మండల పరిషత్తులకు జూన్ వరకు గడువు ఉంది. ఓటరు జాబితా, రిజర్వేషన్ల కసరత్తు, ఇతర సాంకేతిక అవరోధాలను అధిగమించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది. ఆగస్టులోనే స్థానిక ఎన్నికలకు వెళ్లవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవు తోంది. ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం పై ప్రజా వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలకు వెళ్లే సాహసం చేస్తుందా, లేక ప్రత్యేకాధికారులతోనే ఇంకోన్నాళ్లు నెట్టుకోస్తుందా? అన్నది చూడాలి. కొత్త పాలకవర్గం బాధ్యతలు స్వీకరించే వరకూ ప్రత్యేకాధికారుల పాలనే సాగనుంది.
అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పాలకవర్గాల్లోని సభ్యులకు పదవులు, ఆర్థికపరమైన అంశాలను ఎరగా వేసి టీడీపీ నేతలు తమ వైపు తిప్పుకున్నారు. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి కొత్త పాలకవర్గాల్లో తమ వ్యక్తులను నియమించుకున్నారు. ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా అధికారాలను అప్పనంగా లాక్కున్నారు. ఈ దశలో ఎన్నికలకు వెళ్తే గడిచిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో తాము వేసిన ఓటుకు విలువ లేకుండా అధికార మార్పిడి చేసిన వారిపై ఓటర్లు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారేమోనన్న అనుమానాలు కూడా టీడీపీ నాయకులను వెంటాడుతూ ఉండవచ్చని రాజకీయ వేత్తలు చెబుతున్నారు.
స్థానిక ఎన్నికలకు వెనకడుగు..?
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 2021 మార్చి 10న మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 2021 మార్చి 14న ఓట్ల లెక్కింపు నిర్వహించారు. అనంతరం ఎన్నికై న సభ్యులు చైర్మన్‌గా, వైస్ చైర్మన్‌లుగా, కౌన్సిలర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్లో ఎన్నికై న పురపాలక, నగర పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ఈనెల 16తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలు నిర్వహించాల్సిన ప్రభుత్వం ప్రత్యేక అధికారుల పాలనకు మొగ్గుచూపుడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గడిచిన సార్వత్రిక ఎన్నికల సమయంలో అలవికాని హామీలు ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం వాటిని అమలు చేయడంలో విఫలమైంది. డైవర్షన్ రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతోంది. దీనిపై ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. ఒకవేళ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళితే ఆ వ్యతిరేకత టీడీపీ కొంప ముంచుతుందనే భయం నాయకులను వెంటాడు తోంది. అందుకే ఎన్నికలకు వెళ్లకుండా ప్రత్యేక అధికారుల పై పరిపాలన వదిలేయడం మంచిదనే ఆలోచన చంద్రబాబు అండ్ కో చేసినట్టు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
చిలకలూరిపేటకు జేసీ సంజనా సింహ...
స్థానికం ఇప్పట్లో లేనట్లేనా?
అవిశ్వాసంతో .. విశ్వాసం కోల్పోయి..
చిలకలూరిపేట ప్రత్యేకాధికారిగా
జేసీ సంజనా సింహ
పిడుగురాళ్లకు గుంటూరు
ఆర్‌డీఎంఏ హరికృష్ణ
వినుకొండకు పులిచింతల ప్రాజెక్ట్
డిప్యూటీ కలెక్టర్ రమేష్
మాచర్ల, సత్తెనపల్లికి ఆర్డీఓలు
మురళీకృష్ణ, శ్రీరాములు
ఈ నెల 16తో ముగియనున్న
పాలకవర్గాల పదవీ కాలం
ప్రత్యేక పాలనపై ఉత్తర్వులు
విడుదల చేసిన ప్రభుత్వం
‘స్థానిక’ఎన్నికల నిర్వహణకు
టీడీపీ ప్రభుత్వం వెనుకంజ