‘మూగ’బోయిన వైద్యం | - | Sakshi
Sakshi News home page

‘మూగ’బోయిన వైద్యం

Mar 14 2026 7:52 AM | Updated on Mar 14 2026 7:52 AM

‘మూగ’బోయిన వైద్యం రూ.కోట్లలో ఆదాయం.. ఏదీ సాయం!

రైతు సంక్షేమాన్ని గాలికి వదిలేసిన ప్రభుత్వం మార్కెటింగ్‌ శాఖ, పశువైద్యశాఖ మధ్య కొరవడిన సమన్వయం జిల్లాలో కానరాని వైద్య శిబిరాలు

వ్యవసాయ మార్కెట్‌ యార్డులకు ఏటా కోట్లాది రూపాయల ఆదాయం వస్తుంది. రైతులకు ఆదరువుగా ఉండేందుకు గతంలో క్రమం తప్పకుండా పశు వైద్య శిబిరాలు నిర్వహించేవారు. వీటి నిర్వహణకు ప్రత్యేకంగా నిధులు వెచ్చించేవారు. ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం పశు వైద్య శిబిరాలు అటకెక్కాయి. పశువులు పలు జబ్బులతో మృత్యువాత పడుతున్నాయి. రైతులు ఆర్థికంగా నష్టపోతున్నా పాలకులు, అధికారులు దృష్టి సారించని దుస్థితి నెలకొంది.
రూ.కోట్లలో ఆదాయం.. ఏదీ సాయం!

సత్తెనపల్లి: పల్నాడు జిల్లాలో 12 వ్యవసాయ మార్కెట్‌ యార్డులు ఉన్నాయి. రైతులు పండించిన పంట ఉత్పత్తులను ఇక్కడికి తీసుకొచ్చి అమ్ముకొంటుంటారు. ఏటా సీజన్‌లో కొనుగోళ్లు, అమ్మకాలు జరుగుతుంటాయి. వీటి ద్వారా ఏటా కోట్లాది రూపాయల ఆదాయం సమకూరుతోంది. జిల్లాలోని 12 వ్యవసాయ మార్కెట్‌ యార్డుల ద్వారా 2025–26 సంవత్సరంలో రూ 32.42 కోట్లు ఆదాయం లక్ష్యం కాగా 2026 జనవరి 31 నాటికి రూ.18.17 కోట్లు ఆదాయం రావడం విశేషం. ప్రతి మార్కెట్‌ యార్డు పరిధిలోని గ్రామాల్లో పశు వైద్య శిబిరాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఏటా ఇందుకోసం రూ. లక్ష వరకు ఖర్చు చేయాల్సి ఉంది. ఏడాది కాలంలో ఐదు శిబిరాలు నిర్వహించాలి. ఒక్కో శిబిరానికి రూ. 20 వేలు ఖర్చు చేయాలి. పశువైద్య శాఖ సహకారంతో వీటిని ఏర్పాటు చేయాలి. కాలానుగుణంగా వస్తున్న వ్యాధులను బట్టి మందులు కొనుగోలు చేయడం పశువైద్య శాఖ బాధ్యత. శిబిరం ఏర్పాటు, ప్రచారానికి రూ. 2 వేలు, మందుల కోసం రూ. 18 వేలు వెచ్చించాలి. మందుల కొనుగోలు విషయంలో మార్కెటింగ్‌ శాఖ, పశువైద్య శాఖ అధికారుల మధ్య సమన్వయం కొరవడింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా పశు వైద్య శిబిరాల ఊసే లేదు.

కమిటీ ఏం చేస్తోంది...?

పశువైద్య శిబిరాలు నిర్వహణకు కమిటీ ఉంది. ఈ కమిటీలో మార్కెట్‌ యార్డు కార్యదర్శులు, పశువైద్య శాఖ అధికారులు ఉంటారు. ఏ ఏ ప్రాంతాల్లో పశువులు అధికంగా ఉన్నాయి..ఎలాంటి వ్యాధులు వస్తున్నాయి. అనే విషయాలను కమిటీలో చర్చించాల్సి ఉంటుంది. వ్యాధులకు అనుగుణంగా మందులు కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ మూలకు చేరింది. ఫలితంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. రైతుల ద్వారా వ్యవసాయ మార్కెట్‌ యార్డులు ఏటా కోట్లాది రూపాయల లాభాలు వస్తున్నా వాటి పరిధిలోనున్న రైతులకు సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రస్తుత పాలకవర్గాలు సైతం పట్టించుకోకపోవడం గమనార్హం. మాటల్లో రైతు సంక్షేమానికి కృషి చేస్తున్నట్టు చెబుతున్నా ఆచరణలో అమలు కావడం లేదు.

జిల్లాలో 11.55 లక్షల పశు సంపద ..

జిల్లాలో 11,55,833 పశుసంపద ఉంది. వీటిల్లో గేదెలు, దున్నలు 4,65,046, ఆవులు, ఎద్దులు 65,072, గొర్రెలు 4,69,424, మేకలు 1,56,291 ఉన్నాయి. వీటిలో ఏటా వివిధ వ్యాధుల బారిన పడి వేలాది పశువులు మృత్యువాత పడుతున్నాయి. మరోవైపు పశు వైద్యశాలలు ఉన్నప్పటికీ మందుల కొరత కారణంగా పశు వైద్యం సక్రమంగా అందక రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. ఎంఎస్‌పీ కారణంగా రైతుబంధు అమలు కావడం లేదు. ఇప్పటికై నా పాలకులు, అధికారులు స్పందించి పశువైద్య శిబిరాలు నిర్వహణకు చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement