2023–24 ఏడాదిలో జిల్లాలో 2,80,181 మందికి రైతు భరోసా అందజేసిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం
2025–26 ఏడాదికి చంద్రబాబు ప్రభుత్వం ఇస్తున్నది 2,40,530
మందికే...
40 వేల మంది రైతులకు అన్నదాత సుఖీభవ నిధుల కోత
ఇప్పటికే 2024–25 ఏడాది నగదు ఇవ్వకుండా మోసం చేసిన చంద్రబాబు
రెండేళ్లు అవుతున్నా కౌలు రైతు ఊసెత్తని కూటమి సర్కార్
అధికారికంగా 17,662 మంది కౌలురైతులకు అందని అన్నదాత సుఖీభవ
అనధికారికంగా జిల్లాలో 40 వేల మంది కౌలు రైతులు ఉన్నారంటున్న రైతు సంఘం నేతలు
రైతులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోంది...
కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ ఏది...?
కేంద్రంతో సంబంధం లేకుండా రూ.20 వేలు ఇవ్వాలి...
భారీగా తగ్గిన అన్నదాత సుఖీభవ లబ్ధిదారుల సంఖ్య
సాక్షి, నరసరావుపేట: అన్నదాతలను చంద్రబాబు ప్రభుత్వం నిలువునా మోసం చేస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు అన్నదాత సుఖీభవ పేరుతో నగదు సాయం చేస్తామని హామీనిచ్చారు. తీరా గెలిచాక కేంద్రంతో కలిపి రూ.20 వేలు ఇస్తామని మాట మార్చారు. రైతులకు ఏటా రూ.6 వేలు ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం మరోవైపు లబ్ధిదారుల సంఖ్యను అమాంతం తగ్గించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చివరి ఏడాదైన 2023–24 ఆర్థిక సంవత్సరంలో వైఎస్సార్ రైతు భరోసా పేరిట పల్నాడు జిల్లా వ్యాప్తంగా ఏకంగా 2,80,181 మందికి నగదు జమ చేశారు.ఇక చంద్రబాబు ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అని పేరు మార్చి లబ్ధిదారుల సంఖ్యను 2,40,530 మందికే పరిమితం చేస్తోంది. ఏకంగా 40 వేల మంది లబ్ధిదారుల సంఖ్య తగ్గిపోయింది. ప్రభుత్వం మారగానే రైతుల సంఖ్య ఎందుకు తగ్గిందన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి సహేతుకమైన కారణాలు చెప్పాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
తొలి ఏడాది దగా...
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా క్రమం తప్పకుండా ఐదేళ్లు వైఎస్సార్ రైతు భరోసా పేరిట రైతులకు ఆర్థిక సహాయం అందజేశారు. ప్రతి రైతుకు ఏడాదికి రూ.13,500 చొప్పున ఐదేళ్లు పాటు వారి ఖాతాల్లో నగదు జమచేశారు. ఇలా గత ఐదేళ్ల వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పల్నాడు జిల్లాలో ఏకంగా రూ.1,738.58 కోట్ల నిధులను నేరుగా రైతుల ఖాతాలలో జమ చేశారు.
అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రైతులకు రూ.20వేలు అందజేస్తామని గత ఎన్నికల్లో టీడీపీ రైతులకు హామీ ఇచ్చింది. తీరా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం హామీని మరిచిపోయింది. 2024–25 సంవత్సరంలో పథకం ఊసే ఎత్తలేదు. కేంద్రప్రభుత్వం ఇస్తున్న పీఎం కిసాన్ కింద రూ.6 వేలు మాత్రమే రైతుల ఖాతాలో జమైంది. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.14 వేలను ఇవ్వకుండా టీడీపీ ప్రభుత్వం మోసం చేసింది. ఇలా సుమారు రూ.392 కోట్లను రైతులకు ఇవ్వకుండా మోసం చేసింది.
కౌలు రైతులకు ఈ ఏడాదీ మొండి చేయి...
– మరో వైపు కౌలు రైతులకు కేంద్రంతో సంబంధం లేకుండా రూ.20 వేలు ఇస్తామన్నారు, ఇప్పటివరకు కౌలు రైతులకు ఒక్కరికి కూడా అన్నదాత సుఖీభవ నిధులు జమచేయలేదు. గురింపు కార్డుల జారీలోనే తాత్సారం చేస్తున్నారని రైతులు, రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారిక లెక్కల ప్రకారం ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 17,662 మంది కౌలు రైతులున్నారు. వీరు కాకుండా అనధికారికంగా జిల్లా వ్యాప్తంగా సుమారు 40 వేల మందికి పైగా కౌలు రైతులున్నారు. వీరికి ఎప్పుడు నిధులు జమ చేస్తారో ప్రభుత్వం చెప్పడం లేదు.
సూపర్–6లో భాగంగా టీడీపీ మేనిఫెస్టోలో రైతులకు ఇస్తామన్న అన్నదాత సుఖీభవ పథకం
2019–20 2,41,515 326.04
2020–21 2,50,469 338.13
2021–22 2,48,812 335.90
2022–23 2,66,871 360.27
2023–24 2,80,181 378.24
మొత్తం 2,80,181 1,738.58
ఎన్నికల్లో అడ్డగోలు హామీ లు ఇచ్చి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఇప్పుడు వివిధ కారణాలతో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించింది. ఇప్పుడేమో పీఎం కిసాన్, అన్నదాత సుఖీభవ అంటూ రెండు జాబితాలు తయారు చేసి అనర్హులు చేస్తోంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంతో పోల్చితే సుమారు 40 వేల మంది లబ్ధిదారులు తగ్గడం అన్యాయం.
– అన్నెం పున్నారెడ్డి,
జిల్లా వైఎస్సార్ సీపీ రైతు విభాగం
అధ్యక్షుడు,
అన్నదాత సుఖీభవ నిధులు వాస్తవ సాగుదారులైన కౌలు రైతులకు పడటం లేదు. కేంద్ర ప్రభుత్వమేమో కౌలు రైతులకు పీఎం కిసాన్ ఇవ్వమంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామంటున్నా ఇప్పటివరకు కౌలు రైతు కార్డుల మంజూరులో సమస్యలు తీర్చడంలేదు. భూ యజమాని సంతకం లేకుండా కార్డులు ఇస్తామని ప్రకటనలు చేస్తున్నారు తప్ప జీవోలు విడుదల చేయలేదు. దీంతో కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ లేదు, పంటలు అమ్ముకోలేరు, బ్యాంక్ రుణాలు రావు.
–పెండ్యాల మహేష్, కౌలు రైతు సంఘం పల్నాడు జిల్లా ఉపాధ్యక్షులు
టీడీపీ నేతలు ఎన్నికల ముందు అన్నదాత సుఖీభవ కింద రూ.20 వేలను కేంద్రంతో సంబంధం లేకుండా ఇస్తామని చెప్పారు. తీరా గెలిచాక పీఎం కిసాన్‌తో కలిపి అంటున్నారు. ఇప్పుడేమో ఈ–కేవైసీ సాకుతో కొందరికి రూ.4 వేలు, మరికొందరికి రూ.2 వేలు జమ చేసి రైతులను మభ్యపెడుతున్నారు. టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కేంద్రాన్ని బూచి చూపకుండా నేరుగా రూ.20 వేలు జమ చేయాలి.
– ఏపూరి గోపాలరావు, ఆంధ్రప్రదేశ్
రైతు సంఘం పల్నాడు జిల్లా కార్యదర్శి


