వాహనం బోల్తా..22 మందికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

వాహనం బోల్తా..22 మందికి గాయాలు

Mar 14 2026 7:51 AM | Updated on Mar 14 2026 7:51 AM

● తప్పిన పెను ప్రమాదం ● డ్రైవర్‌ నిద్రమత్తే ప్రమాదానికి కారణమా?

రెంటచింతల: రెంటచింతల గ్రామ శివారులోని హోసన్నా మందిరం సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో 22 మంది వ్యవసాయ కూలీలకు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి... ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోనున్న పాములపాడు మండలం నల్లకాలువకు చెందిన 26 మంది వ్యవసాయ కూలీలు గురువారం రాత్రి 12గంటలకు గురజాల మండలం గంగవరం గ్రామంలో మొక్కజొన్న కోత కోయడానికి వాహనంలో బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున సుమారు 4 గంటల సమయంలో గ్రామ శివారులోని హోసన్నా మందిరం సమీపంలో కల్వర్టు గోడకు ఢీకొనడంతో వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో సుమారు 22 మందికి గాయాలుకాగా వారిని వెంటనే 108 వాహనంలో గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. గాయపడిన వారిలో ఏసయ్య, బొల్లా వీరమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. వీరమ్మను మెరుగైన వైద్యం కోసం నరసరావుపేట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మరో ఏడుగురు గురజాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారికి ప్రథమ చికిత్స అనంతరం పంపించినట్లు వైద్య సిబ్బంది తెలిపారు. రెంటచింతల ఎస్‌ఐ సీహెచ్‌ నాగార్జున కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. వాహనం డ్రైవర్‌ పరారీలో ఉన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement