పల్నాడు జిల్లాలో గ్యాస్ సంక్షోభం
హోటళ్లు, హాస్టళ్లపై పెను ప్రభావం
బుకింగ్ తీసుకోని గ్యాస్ కంపెనీలు
సిలిండర్‌ల కృత్రిమ కొరతతో ధరల పెరుగుదల
బ్లాక్ మార్కెట్‌లో రెట్టింపు ధరకు విక్రయాలు
ఆందోళనలో గృహ వినియోగదారులు
నరసరావుపేట టౌన్: పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో గ్యాస్ సిలిండర్‌ల కొరత తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో యుద్ధ ప్రభావం అన్ని వర్గాల ప్రజలను భయపెడుతోంది. ఇదే అదనుగా గ్యాస్ కృత్రిమ కొరత సృష్టించి ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని కంపెనీలు కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిపివేశాయి. గృహ వినియోగానికి సంబంధించి బుకింగ్‌లను సైతం తాత్కాలికంగా ఆపేయడంతో వంటింట గుబులు నెలకొంది. గ్యాస్ సిలిండర్‌ల నిల్వలు సరిపడా ఉన్నాయని, కొరత లేదని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెబుతున్నప్పటికీ వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది.
కృత్రిమ కొరత.. హోటళ్ల మూత
ఓ వైపు హోటళ్లు, హాస్టళ్లపై గ్యాస్ కొరత తీవ్ర ప్రభావం చూపుతోంది. కమర్షియల్ గ్యాస్ సిలిండర్‌ల కొరత కారణంగా హోటల్ నిర్వహణ భారంగా మారింది. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో గ్యాస్ అందుబాటులో లేకపోవటంతో ప్రత్యామ్నాయంగా కట్టెల పొయ్యి మీద వంటకాలు చేస్తున్నారు. ఇప్పటికే వంట గ్యాస్ సిలిండర్‌పై రూ.60లు, కమర్షియల్ సిలిండర్లపై ఏకంగా రూ.115 పెంచి ప్రజలపై భారాన్ని మోపారు. అయినప్పటికీ సరఫరా సక్రమంగా లేకపోవటం ఇబ్బందులకు గురి చేస్తోంది.
బ్లాక్‌లో అమ్మకాలు..
గ్యాస్ సిలిండర్‌ల కొరతను ఆసరా చేసుకొన్న కొందరు మధ్యవర్తులు గ్యాస్ ఏజెన్సీల ప్రతినిధులతో కుమ్మకై ్క సిలిండర్‌లను బ్లాక్ మార్కెట్‌లో అధిక ధరలకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. అధికారికంగా గ్యాస్ బుకింగ్ లభించకపోవటంతో హోటల్ యజమానులు అదనపు ధరకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బుకింగ్ కోసం గ్యాస్ కంపెనీలకు ఫోన్ చేస్తే స్పందించటం లేదు. నేరుగా కార్యాలయానికి వెళ్లి సంప్రదిస్తే నెలరోజులు వ్యవధి పడుతోందని చెబుతున్నారు.
అంతా అగమ్యగోచరం...
పరిస్థితులు ఇలానే కొనసాగితే హోటళ్లు, రెస్టారెంట్, హాస్టళ్ల నిర్వాహణ కష్టతరంగా మారి మూత పడే ప్రమాదం ఉంది. నరసరావుపేటలో వేలాది మంది విద్యార్థులు ప్రైవేటు హాస్టళ్లలో ఉంటూ ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. అక్కడ పూర్తిగా వంట కార్యకలాపాలన్ని గ్యాస్ పొయ్యిలపైనే ఆధారపడి ఉంటుంది. ఈ క్రమంలో హాస్టళ్లు మూతపడితే విద్యార్థుల కోచింగ్ పై ప్రభావం పడనుంది. దీంతోపాటు గ్యాస్‌పై అధారపడి పని చేసే బేకరీలు, టీ స్టాల్స్, స్వీట్ తయారీ, క్యాటరింగ్ తదితర చిన్న తరహా వ్యాపారాలు ఈ సమస్యతో నలిగిపోతున్నాయి.
ప్రస్తుతం వివాహ, శుభకార్యాల సీజన్ ప్రారంభమైంది. ఈ సమయంలోనే మాకు కొంచెం ఆర్థిక వెసులుబాటు కలుగుతుంది. అయితే బ్లాక్ మార్కెట్‌లో ఒక్కో సిలిండర్ రూ.2,500లకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పది రోజులు ముందుగానే శుభ కార్యాలకు క్యాటరింగ్ ఒప్పందం కుదుర్చుకుని ఉన్నాం. ఈ సమయంలో గ్యాస్ కొరత ఏర్పడితే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాం.
– ఘట్టా శ్రీనివాసరావు, క్యాటరింగ్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నరసరావుపేట


