పిడుగురాళ్ల: సోషల్ మీడియా పోస్టులపై కేసులకు పీడీ యాక్ట్ ఎలా పెడతారని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో గురువారం మాట్లాడుతూ... పీడీ యాక్ట్ పెట్టిన పోలీసు అధికారులపై రేపు విచారణ జరుగుతుందని, అక్రమంగా పెట్టిన వారిపై కూడా కేసులు నమోదు అవుతాయని హెచ్చరించారు. పల్నాడు జిల్లాల్లో రామకృష్ణారెడ్డిపై అక్రమంగా మర్డర్ కేసులు పెట్టి జైలుకు వెళ్లేలా చేశారన్నారు. పిన్నెల్లి, తురకపాలెం గ్రామాలలో భయభ్రాంతులకు గురి చేసి గ్రామాలు విడిచివెళ్లేలా చేయటం చూశామన్నారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మందా సాల్మన్‌ను హత్య చేసి, ఖననం చేయటానికి కూడా గ్రామాలకు వెళ్లేలేని పరిస్థితిని వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, నాయకులు చూశారన్నారు. సోషల్ మీడియా కార్యకర్తలపై అనేక కేసులు నమోదు చేశారని తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని వెన్నా రాజశేఖర్‌రెడ్డి, ఎస్‌ఎం మాబు, సురేష్‌రెడ్డిలపై అక్రమంగా కేసులు పెట్టారన్నారు. చివరికి ఓ కొత్త రాజకీయం వచ్చిందని, పీడీ యాక్ట్ కూడా మాబుపై పెట్టినట్లు తెలుస్తుందన్నారు. ఈ రోజు నేర్పిన పాఠాలే రేపు టీడీపీ వారికి గుణపాఠాలు అవుతాయని ఆయన హెచ్చరించారు. ఒకరి మీద పీడీ యాక్ట్ పెడితే రేపు పది మందిపై పెట్టడం ఖాయమన్నారు. సోషల్ మీడియా కేసులకు పీడీ యాక్ట్ కేసులు ఎలా పెడతారని ఆయన ప్రశ్నించారు. అక్రమంగా కేసులు పెట్టిన వారికి కూడా శిక్షలు తప్పవని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.


