సాక్షి, అమరావతి/మంగళగిరి టౌన్: వన్యప్రాణుల సంరక్షణ కోసం హనుమాన్ ఫౌండేషన్ ప్రాజెక్టును ప్రారంభించినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్ ప్రాంగణంలో మంగళవారం ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. ప్రాజెక్ట్ కోసం పూర్తి సాంకేతికతతో కూడిన 100 ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వాహనాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇటీవల వన్యప్రాణుల వల్ల పంట, పశు సంపదకు నష్టంతో పాటు మానవ భద్రతకు ముప్పు కలిగించే సంఘటనలు జరుగుతున్నాయని, వాటిని నివారించేందుకే ఈ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అటవీ సరిహద్దు గ్రామాల ప్రజలకు రక్షణ, వారి జీవనోపాధికి భద్రత కల్పించడం, వన్యప్రాణుల సంరక్షణ చర్యలు కట్టుదిట్టం చేస్తున్నామని పేర్కొన్నారు. జంతువుల దాడిలో మనిషి చనిపోతే ఇచ్చే పరిహారాన్ని రూ.10 లక్షలకు పెంచామన్నారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, అధికారులు పాల్గొన్నారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్


