సత్తెనపల్లి: అప్పుల బాధలు తాళలేక ఫొటోగ్రాఫర్ ఆత్మహత్య చేసుకుని చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం కట్టమూరు గ్రామంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. సత్తెనపల్లి మండలం కట్టమూరు గ్రామానికి చెందిన మల్లెల రాజు (37) ఫొటోగ్రాఫర్‌గా పని చేస్తూ జీవనం వెళ్లదీస్తున్నాడు. రాజుకు భార్య శ్రీనిధి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమార్తెకు ఫిట్స్ వస్తుండటంతో గత రెండు సంవత్సరాలుగా నెలకు రూ. 5 వేల వరకు ఖర్చు చేస్తున్నాడు. అంతేకాక కుమారుడికి కూడా నిత్యం జ్వరం వస్తుండడంతో కొంత అప్పులు అయ్యాయి. వీటికి తోడు బ్యాంకులో గృహ నిర్మాణ లోన్ రూ. 10 లక్షలు తీసుకోవడంతో ప్రతి నెల ఈఎంఐ చెల్లించాల్సి ఉంది. ఈక్రమంలో రెండు ఈఎంఐలు పెండింగ్‌లో ఉండడంతో ఈ అప్పుల నుంచి బయటపడేందుకు ఆత్మహత్య శరణ్యమంటూ భావించాడు. గత నెల 27న ఊరి చివర పురుగుల మందు సేవించి ఇంటికి వచ్చాక వాంతులు చేసుకోవడంతో భార్య ప్రశ్నించింది. దీంతో అప్పులు ఎలా తీరుతాయో తెలియటం లేదని, దీనికి తోడు కుమార్తె, కుమారుడు అనారోగ్యం అర్ధంకాక గడ్డి మందు సేవించానని భార్య శ్రీనిధికి చెప్పి విలపించాడు. ఆమె హుటాహుటిన చికిత్స నిమిత్తం సత్తెనపల్లి తరలించగా ప్రాథమిక చికిత్స అనంతరం గుంటూరు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. దీనిపై మృతుడి భార్య శ్రీనిధి ఫిర్యాదు మేరకు సత్తెనపల్లి రూరల్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


