ఏఎన్‌యూ
(పెదకాకాని): ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మహిళ, పురుష అభ్యర్థులకు ఈ నెల 9వ తేదీ నుంచి ప్రారంభం కానున్న ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీకి యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీని నిర్వహిస్తున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఏర్పాట్లను శనివారం జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. నేరుగా ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో అర్హతగల అభ్యర్థులు పాల్గొనవచ్చును. హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ రిక్రూటింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ ఆధ్వర్యంలో ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహిస్తున్నారన్నారు. రిక్రూటింగ్ అధికారి వింగ్ కమాండర్ షేక్ యాకూబ్ అలీ మార్చి 9, 10 తేదీలలో బాలికలకు, మార్చి 12,13 తేదీలలో ఆంధ్రప్రదేశ్ పురుషు అభ్యర్థులకు, మార్చి 15,16 తేదీలలో తెలంగాణ పురుషు అభ్యర్థులకు ఓపెన్ ర్యాలీ జరుగుతుందన్నారు. గుంటూరు జిల్లా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఎంపిక కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మహిళ అభ్యర్థులు మార్చి 9వ తేదీన, ఆంధ్రప్రదేశ్ పురుష అభ్యర్థులు మార్చి 12వ తేదీన, తెలంగాణ పురుష అభ్యర్థులు మార్చి 15వ తేదీ ఉదయం 6 గంటల నుండి 10 గంటలు వరకు నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో హాజరుకావాలని కోరారు. 1.6 కిలోమీటర్ల పరుగు పోటీ, భౌతిక, శారీరక పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. అలానే ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రాత పరీక్ష ఉంటుందన్నారు.


