సన్మార్గదర్శిని దివ్యఖురాన్‌ | - | Sakshi
Sakshi News home page

సన్మార్గదర్శిని దివ్యఖురాన్‌

Mar 7 2026 8:17 AM | Updated on Mar 7 2026 8:17 AM

సన్మార్గదర్శిని దివ్యఖురాన్‌

సాఫల్య జీవితానికి నిర్దేశం చేసిన పవిత్ర గ్రంథం శాంతియుత జీవనానికి సోపానం వేసేలా వివిధ అంశాలు

శాసీ్త్రయమైనది కూడా....

దివ్య కాంతిపుంజం

చిలకలూరిపేట: ప్రపంచంలోని ముస్లింలందరికీ నెలరోజుల పండుగ రంజాన్‌. దివ్యఖురాన్‌ దైవం నుంచి భువికి అవతరించిన మాసం కూడా ఇదే. ఈ పవిత్ర గ్రంథం వెలుగులో ఆత్మప్రక్షాళన చేసుకొనే అవకాశం కల్పిస్తుంది. సాఫల్య జీవితానికి సోపానం ఈ దివ్యగ్రంథం. పవిత్ర ఖురాన్‌ అల్లా నుంచి అవతరించి భూమిపైకి వచ్చిన గ్రంథం కావటంతో దీనికి దివ్యఖురాన్‌ అంటారని మౌల్వీలు పేర్కొంటున్నారు. మానవుడు ఉన్నత జీవితం గడిపేందుకు అవసరమైన అన్ని సూచనలు, నియమాలు ఇందులో పొందుపరిచి ఉన్నాయి. ప్రాపంచిక విషయాల్లో ఎదురయ్యే ఎలాంటి ఇబ్బందులకై నా ఈ గ్రంథంలో పరిష్కార మార్గం ఉంటుంది. మానవ సంబంధాలు, శాంతియుత జీవనం, అహింస, విశ్వసనీయత, సౌభ్రాతృత్వం, ఎవరితో ఎలా మసలుకోవాలి, ఏ సమస్యను ఎలా పరిష్కరించాలి, నిత్య జీవితం ఎలా గడపాలి, పిల్లలతో ఎలా ఉండాలి, పెద్దలతో ఎలా నడుచుకోవాలి, సాటివారితో ఎలా మసలుకోవాలి వంటి ఇహలోక అంశాలతో పాటు పరలోక సౌఖ్యం పొందటానికి అవసరమైన మూలసూత్రాలు ఇందులో పొందుపరిచి ఉన్నాయి.

ప్రవక్త అనుసరించిన గ్రంథం

పవిత్ర ఖురాన్‌లో సూచించిన మార్గాన్ని మహమ్మద్‌ ప్రవక్త అనుసరించారు. ఈ లోకానికి ఆచరించి చూపారు. దివ్యఖురాన్‌ రంజాన్‌ మాసంలో అవతరించటంతో ముస్లింలు ఈ మాసంలో ఖురాన్‌ను పఠిస్తూ దాని పవిత్రతను చాటుతుంటారు. ఖురాన్‌లో 114 సూరాలు, 6,666 ఆయాత్‌లు, 540 రుకూలు ఉంటాయి. సంపూర్ణ గ్రంథాన్ని 30 భాగాలుగా విభజించారు. వాటిని పారాలుగా పేర్కొంటారు. రంజాన్‌ మాసంలో తరావి నమాజు కింద పూర్తి పఠనం గావిస్తారు. అవతరించిన నాటి నుంచి చిన్న మార్పు కూడా లేని గ్రంఽథంగా ప్రాచుర్యం పొందింది.

మంచి మార్గంలో నడిపేలా...

దైవం దివ్య ఖురాన్‌ను ప్రపంచ మానవాళికి మహిమాన్విత వరంగా ప్రసాదించారు. అజ్ఞానపు కారు చీకట్ల నుంచి విజ్ఞానమనే వెలుగు బాటను చూపిన ఈ దివ్య గ్రంథం మానవుడి అవివేకాన్ని తుడిచిపెట్టేందుకు ఉత్తమమైన మార్గంగా నిలుస్తోంది. మామూలు వ్యక్తిని కూడా మహోన్నతునిగా మార్చేందుకు దోహదపడుతుంది. ఈ దివ్యగ్రంథంలో మొత్తం 30 భాగాలు ఉంటాయి. మొదటి భాగం ‘ఎఖ్రా’ (విద్య) సంబంధించినది. దీని ద్వారా ప్రతి ఒక్కరికీ చదువు తప్పని సరి అన్న సూచన అందుతోంది. చదువు విలువను ఈ భాగం ద్వారా తెలుసుకోవచ్చు. మనిషిని ఉత్తముడిగా మార్చేందుకు ఎన్నో సూచనలు ఉన్నాయి. రంజాన్‌ మాసంలో ముస్లింలు అనుసరించాల్సిన విధుల గురించి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా ఈ మాసంలో ధనికులు జకాత్‌, ఫిత్రాలను కచ్చితంగా అందజేస్తే రంజాన్‌ ఈద్‌ ప్రార్థన సమయానికి పేదలనే వారు ఉండరని ఈ గ్రంథం వివరిస్తుంది. మానవుడిలోని మద్యం, వ్యభిచారం, పాపం, ద్రోహం, హింస, చెడుగా మాట్లాడటం, కించపరచాలనుకోవటం వంటి విషయాలను ఈ గ్రంథం తీవ్రంగా నిరసిస్తుంది. నైతిక విలువలతో జీవించాలని ప్రబోధిస్తుంది. ముఖ్యంగా సీ్త్రలను బానిసలుగా చూడకూడదని, పురుషులతో సమానంగా అన్ని హక్కులు కల్పించాలని, వాటి రక్షణ బాధ్యత పురుషుడే వహించాలని సూచిస్తుంది. అనాథలు, వితంతువులకు సహాయకారులుగా ఉండాలని చెబుతుంది.

ఖురాన్‌ గ్రంథం ఎంత పవిత్రమైనదో అంత శాసీ్త్రయమైనది కూడా అని ప్రపంచ మేధావులు కొనియాడుతున్నారు. ప్రకృతిలో చెట్టు ఎంత విలువైనదో ఈ గ్రంథంలో కొన్ని చోట్ల ప్రస్తావించారు. ఖురాన్‌ను చదివి దానిని అమలు పరిచేవారికి స్వర్గలోక ప్రాప్తి లభిస్తుందని మౌల్వీలు చెబుతారు. పఠించే వారికి ప్రశాంతతోపాటు మనశ్శాంతి లభిస్తుందని విశ్వాసుల నమ్మకం.

దివ్యఖురాన్‌ సాధారణ గ్రంథం కాదు. ఇది దైవం మనకు ప్రసాదించిన దివ్యమైన కాంతిపుంజం. దాని పవిత్రతను తెలుసుకొని ఆచరించి ఆరాధిస్తే దైవం ద్వారా మనకు స్వర్గం ప్రాప్తిస్తుంది. ఈ పవిత్ర రంజాన్‌ మాసంలో పఠించటం ముఖ్యమే. అయినా జీవితాంతం క్రమం తప్పకుండా పఠించటం ముక్తిదాయకం. ఖురాన్‌ను నేర్చుకుంటూ, ఇతరులకు నేర్పేవారు అందరికంటే ఉన్నతులు.

– మౌలానా మొహమ్మద్‌ అబ్బాస్‌ఖాన్‌ నద్వి,

ఇస్లామిక్‌ పండితుడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement