ఖబరస్తాన్‌ వివాదంపై అంజుమన్‌ ట్రస్ట్‌ బోర్డు మౌనం | - | Sakshi
Sakshi News home page

ఖబరస్తాన్‌ వివాదంపై అంజుమన్‌ ట్రస్ట్‌ బోర్డు మౌనం

Mar 7 2026 8:17 AM | Updated on Mar 7 2026 8:17 AM

మంగళగిరి టౌన్‌ : మంగళగిరి పట్టణంలోని ఖబరస్తాన్‌ వివాదంపై అంజుమన్‌ ట్రస్ట్‌ బోర్డు మౌనం వహిస్తోందని ఖబరస్తాన్‌ పరిరక్షణ కమిటీ సభ్యులు విమర్శించారు. మంగళగిరి పట్టణ పరిధిలోని సిద్ధిక్‌ మజ్జిద్‌ వద్ద కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ అంజుమన్‌ ట్రస్ట్‌బోర్డు పవిత్ర ఖబరస్తాన్‌ స్థలం విషయంలో నిర్లక్ష్యం వహించడం ముస్లిం సమాజంలో తీవ్ర ఆందోళనకు కారణమౌతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మసీదులు, ఖబరస్తాన్‌ల వంటి పవిత్ర వక్ఫ్‌ ఆస్తులను సంరక్షించాలనే మహోన్నత లక్ష్యంతో అంజుమన్‌ సంస్థను పెద్దలు స్థాపించారని గుర్తుచేశారు. పవిత్ర స్థలాలను కాపాడతామని బాధ్యతలు స్వీకరించిన ప్రస్తుత అంజుమన్‌ ట్రస్ట్‌బోర్డు సభ్యులు ఖబరస్తాన్‌ వంటి ధార్మిక విషయాల్లో మౌనం వహించడం అనేక ప్రశ్నలకు తావిస్తోందని విమర్శించారు. ఖబరస్తాన్‌పై ఎలివేటెడ్‌ బ్రిడ్జి ప్రతిపాదనపై మున్సిపల్‌ అధికారులు బహిరంగంగా చర్చిస్తున్నప్పటికీ అంజుమన్‌ నుంచి నేటికీ స్పష్టమైన స్పందన రాకపోవడం ఆందోళనకు దారితీస్తోందని పేర్కొన్నారు. ఖబరస్తాన్‌ పరిరక్షణ వ్యక్తిగత, రాజకీయ అంశం కాదని, ముస్లిం సమాజానికి సంబంధించిన ధార్మిక బాధ్యత అని స్పష్టంచేశారు. అంజుమన్‌ ట్రస్ట్‌బోర్డు తక్షణమే మౌనం వీడి స్పష్టమైన వైఖరి ప్రకటించాలని, దీనిపై చర్చించేందుకు సభ్యులందరితో కలసి జనరల్‌ బాడీ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. స్పష్టమైన స్పందన రాకపోతే తదుపరి ప్రజా కార్యాచరణపై ముస్లిం సమాజంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని కమిటీ సభ్యులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ కన్వీనర్‌ మహమ్మద్‌ యూసఫ్‌, తబ్లీగ్‌ జమాత్‌ అధ్యక్షులు రఫీ, జమాత్‌ ఏ ఇస్లామీ హింద్‌ అధ్యక్షులు అజీమ్‌, అహ్లెసున్నతువల్‌ జమాత్‌ అధ్యక్షులు మునీర్‌, జమీయతే అహ్లే హదీస్‌ అధ్యక్షులు రఫి, ముస్లిం యువతరం గౌరవ అధ్యక్షులు ఇక్బాల్‌ అహ్మద్‌, ముస్లిం యువసేన అధ్యక్షులు ఇస్మాయిల్‌, ముస్లిం ఫ్రంట్‌ అధ్యక్షులు ముహమ్మద్‌ రఫీ తదితరులు పాల్గొన్నారు.

ఆందోళన వ్యక్తం చేసిన

ఖబరస్తాన్‌ పరిరక్షణ కమిటీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement