డిపాజిట్లపై అరశాతం అధిక వడ్డీ అందిస్తున్నాం ఏపీ గ్రామీణ బ్యాంక్ ఆర్‌ఎం సుభాష్
నాదెండ్ల: డిపాజిట్లపై అత్యధికంగా వడ్డీ అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని రీజనల్ మేనేజర్ పి. సుభాష్ చెప్పారు. గణపవరం బొడ్డురాయిసెంటర్ సమీపంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నూతన భవన ప్రారంభోత్సవం శుక్రవారం నిర్వహించారు. బ్యాంక్ జీఎం (విజిలెన్స్) హరీష్‌బేతా, జీఎం (స్ట్రాటజీ) రాజశేఖరమ్ రిబ్బన్ కట్ చేసి బ్యాంకు శాఖను ప్రారంభించారు. స్ట్రాంగ్ రూమ్‌ను గ్రామ మాజీ సర్పంచ్ కెల్లంపల్లి సుందరరావు, లాకర్ రూమ్‌లను ఉపాధ్యాయురాలు కట్టా రమాదేవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సభలో ఆర్‌ఎం సుభాష్ మాట్లాడుతూ తమ బ్యాంకు వ్యాపార, వ్యవసాయ రుణాలతోపాటు విద్య, తనఖా, కారు, గృహ, సోలార్, ముద్ర తదితర రుణాలను అందిస్తున్నట్లు తెలిపారు. డిపాజిట్లపై ఇతర బ్యాంకుల కన్నా తమ బ్యాంకు అరశాతం అధిక వడ్డీ అందిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,351 శాఖల్లో రూ.1.33 లక్షల కోట్ల టర్నోవర్ జరుగుతున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో ప్రతి ఐదుగురిలో ఒకరు తమ బ్యాంకు ఖాతాదారుడేనని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, సబ్సిడీలు తమ బ్యాంకు లక్షల మందికి దరి చేరుస్తోందన్నారు. కార్యక్రమంలో బ్రాంచి మేనేజర్ వి. సురేష్, భవన యజమాని నన్నపనేని శ్రీనివాసరావు, సిబ్బంది పాల్గొన్నారు.


